CINEMATelugu Cinema

తెలుగు సాహితీ వినీలాకాశంలో విరిసిన ఇంద్రధనుస్సు.. తాపీ ధర్మారావు నాయుడు.

కొందరు సేవ చేయించుకోవడం కోసమే పుట్టినట్టుంటారు. మరికొందరు సేవ చేయడంకోసమే జన్మించినట్టుంటారు. ఎ బర్డ్స్ ఐవ్యూ- విహంగ వీక్షణానికి- పిట్ట చూపు అని చక్కని పద సృష్టి చేసిన ఆంధ్ర విశారద తాపీ ధర్మారావు గారు రెండో కోవకు చెందినవారు. తాపీ ధర్మారావు గారు తెలుగు రచయిత, పాత్రికేయులు, హేతువాది మరియు సంఘ సంస్కర్త. అతను తెలుగు పాత్రికేయ రంగంలో వ్యావహారిక భాషకు మార్గదర్శకులుగా మరియు తెలుగు గద్య రచయితలలో ప్రముఖులుగా పరిగణించబడ్డారు. తాను తెలుగు సాహిత్యానికి తన రచనల ద్వారా ఉత్తేజాన్ని కలిగించిన గొప్ప దార్శనికులు. సాహితీవేత్తగా, చరిత్ర పరిశోధకునిగా, ఉపాధ్యాయునిగా, తెలుగు చలనచిత్రాల సంభాషణల రచయితగా ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి. పర్లాకిమిడి కళాశాలలో ఎఫ్.ఏ. చదువుతున్నప్పుడు గిడుగు వెంకటరామ్మూర్తి గారు తాపీకి గురువు కావడం విశేషం. అందువలన గిడుగు గారి ప్రభావం తాపీపై ఎంతోకొంత పడింది.

తెలుగు నాటక కందుకూరి వీరేశలింగం గారు తన చుట్టూ ఉన్న సమాజంలోని అవలక్షణాలను పరిశీలించి, వాటి పునాదులను పరిశోధించి వాటి పైన తిరుగుబాటు ధ్వజమెత్తారు. ఆయనకు సమకాలికుడైన గురజాడ అప్పారావు గారు అదే సమయంలో బహుముఖ సంస్కరణోద్యమ రంగంలో ప్రవేశించారు. విజయనగర రాజస్థాన ఉద్యోగి అయిన ఆయన తన చుట్టూ ఉన్న భూస్వామ్య వ్యవస్థను సునిశితంగా పరిశీలించారు. జీవతరంగాలన్నింటిలో ఈ వ్యవస్థ తెచ్చిపెట్టిన అవలక్షణాలను, నైచ్యాలను, అనుదినం గమనిస్తూ వచ్చారు. వాటిని ఎదిరించి పోరాడ సంకల్పించారు. మనుషుల భావాలలోని కుళ్ళను, గుడ్డి ఆచారాల వెనుక ఉన్న అమానుషత్వాన్ని అతి నిర్దాక్షిణ్యంగా కడిగేస్తూ ముందడుగు వేసిన కందుకూరు ఉద్యమం, దీనికి బాసటగా అంతర్జాతీయతా దృష్టిని కూడా అలవర్చుకొని ప్రజల సమస్యలను, ప్రజల భాషలో, సాహిత్యంలో ప్రతిభంభిస్తూ గురజాడ గారు చేపట్టిన “ప్రజోద్యమం” వీరికి తోడుగా నిలిచి గిడుగు రామ్మూర్తి పంతులు గారు సాగించిన వ్యవహారిక భాషోద్యమం తెలుగునాట ముప్పేట కొనసాగుతూ ప్రజల్లో చైతన్యాన్ని ఉద్దీపింపజేశారు.

ఆ కాలంలో, స్వతహాగా శాస్త్రీయ దృక్పథం ఉన్న తాపీ ధర్మారావు గారు పాత వ్యవస్థ మారబోతున్న సూచనను వేగంగా పసిగట్టగలిగారు. రానున్న లోకాన్ని ఊహించగలిగారు. అందువలన వారిలో బలమైన ఆత్మ విమర్శన ఆరంభమైంది. అంతవరకు పాత వ్యవస్థకు లక్షణమైన గ్రాంథికవాదంపై చూపుతూ వచ్చిన పట్టుదల, పాత సంస్కృతి పై ఉన్న అభిమానము పటాపంచలైపోయాయి. ఆ సాహిత్య, సాంస్కృతిక విలువలను సమూలంగా మార్చాలన్న పట్టుదల తాపీ ధర్మారావు గారికి కలిగింది. దేవాలయాల మీద శిల్పాలను, ఇనుప కచ్చడాలను, పెళ్లి తంతును శాస్త్రీయ దృష్టితో పరిశీలించారు.  కందుకూరి, గురజాడలు వివాహ వ్యవస్థలోని చెడుగుడులను ఎత్తిచూపుతూ సంస్కరణలకు ప్రయత్నిస్తే, తాపీ ధర్మారావు గారు తన నాటికి స్థిరపడ్డ స్వాభిమాన ఉద్యమ దృష్టితో పూజారులను, పురోహితులను, పెళ్లి వ్యవస్థలను నిలేసి, ప్రశ్నించి కూలదోయడానికి యత్నించారు. దేవుని ఉనికినే సవాలు చేశారు. భాషారంగంలో “పాతపాళీ” ని విసర్జించి, కొత్తపాళీని స్వీకరించారు. ఒక విధంగా తన మీద తానే తిరుగుబాటు చేశారు. అది అవసరమని గ్రహించినప్పుడు అందుకు ఏమాత్రం వెనుదీయలేదు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    తాపీ ధర్మారావు నాయుడు

ఇతర పేర్లు  :    తాతాజీ 

జననం    :    19 సెప్టెంబరు 1887 

స్వస్థలం   :    ఒరిస్సాలో ఉన్న బెర్హంపూరు

ఉద్యోగం    :    కల్లికోట రాజావారి కళాశాలలో గణిత ఉపాధ్యాయులు

వృత్తి      :     తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, హేతువాది, నాస్తికుడు

తండ్రి     :   డాక్టర్ అప్పన్న 

తల్లి      :    నరసమ్మ 

జీవిత భాగస్వామి :   అన్నపూర్ణమ్మ

పిల్లలు    :     కుమార్తెలు (లక్ష్మమ్మ, బంగారమ్మ), తర్వాత కవలలు పుట్టి చనిపోయారు. కుమారులు (మోహనరావు, కీ॥అహోబలరావు, చాణక్య)

మరణ కారణం    :  అనారోగ్య కారణం 

మరణం    :   08 మే 1973

నేపథ్యం…

తాపీ ధర్మారావు నాయుడు గారు ప్రస్తుతం ఒడిస్సాలో ఉన్న “బరంపురం” లో తాపీ అప్పన్న, నరసమ్మ దంపతులకు ద్వితీయ సంతానంగా 19 సెప్టెంబరు 1887 నాడు జన్మించారు. వీరి అన్న నరసింహారావు, తమ్ముడు తులసిరావు, చెల్లెళ్లు వెంకట నరసమ్మ, తిరుపతమ్మ. నిజానికి వీరి ఇంటి పేరు మొదట్లో బండివారు. వీరు పూర్వం సైన్యంలో సిపాయిలుగా ఉండేవారు. సైన్యం నుండి వచ్చాక ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేవారు. బండివారు అప్పన్న గారి తాత లక్ష్మయ్య సైన్యం నుండి తిరిగివచ్చాకనో లేక సైన్యంలో చేరకుండానే తాపీ పనిలో ప్రవేశించాడట. ఆ పని బాగా పేరు తీసుకురావడంతో తాపీ లక్ష్మయ్య అన్న వాడుక వాళ్ళ ఊరు శ్రీకాకుళంలో ఉండేదట. లక్ష్మయ్యకు ఒక్కడే కొడుకు. అతనికి కూడా ఒక్కడే కొడుకు అప్పన్న. అప్పన్న పుట్టిన కొద్ది రోజులకే తల్లి, తండ్రి చనిపోయారు. దాంతో అప్పన్న తాత లక్ష్మయ్య దగ్గర శ్రీకాకుళంలో పెరుగుతుండేవారు. శ్రీకాకుళంలో అప్పన్నను బడిలో వేసినప్పుడు ఆయన పేరు తాపీ లక్ష్మయ్య మనవడు అప్పన్న అని వ్రాశారు. అప్పటినుండి వీరు తాపీ వారయ్యారు.

అప్పన్న శ్రీకాకుళంలో మెట్రిక్యులేషన్ పూర్తి చేసి మద్రాసులో వైద్య పరీక్షకు చదివారు. ఆ సందర్భంలో కానీ, ఆ తరువాత చాలా కాలం వరకు గానీ దానిని ఎల్.ఎం.పి అనేవారు. అప్పన్న ఉత్తమశ్రేణిలో పరీక్షలో ఉత్తీర్ణులై శ్రీకాకుళానికి వైద్యులుగా వచ్చారు. వేష, భాషలన్నీ ఆంగ్లంలోనే ఉండేవి. ఆచారాలు, అలవాట్ల ఫలితంగా తెలుగు చదువుతుంటే చులకన భావం ఏర్పడింది. వారిది అమృత హస్తమని ప్రతీతి. ఆయన చేయి వేస్తే చాలు చావబోతున్న వాడు కూడా లేచి కూర్చుంటాడు అనే నమ్మకం ఉండేది. తాపీ అప్పన్న గారు మంచి జల్సా పురుషులు. అందువలన ఎంత సంపాదన ఉన్నా కూడా ఆర్థికంగా ఎన్నెన్నో ఒడిదుడుకుల పాలయ్యారు. భార్య, పిల్లలు అనవసరంగా అష్టకష్టాల పాలయ్యారు. అటువంటి పరిస్థితుల్లో కూడా పిల్లల చదువులకు భంగం రాకుండా తల్లి నరసమ్మ కాపాడుకుంటూ వచ్చారు.

ఉద్యోగం..

పర్లాకిమిడి కళాశాలలో ఎఫ్.ఏ చదువు పూర్తి అయ్యింది. ఆ ప్రాంతాలకు పరీక్ష కేంద్రమైన విజయనగరం కళాశాలలో 1960 లో పరీక్షలు వ్రాసిన ధర్మారావు గారు  ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణులయ్యారు. అంతలోనే వారికి జ్వరం వచ్చింది. ఆ జ్వరంలో స్థిమితంగా ఆలోచించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు మరింత దారుణంగా ఉండడంతో ఒక సంవత్సరం చదువు ఆపి ఏదైనా ఉద్యోగం చేసి కుటుంబాన్ని కొంతవరకు ఆదుకోవడం అవసరం అనిపించింది. ఉద్యోగం కోసం వెతుకుతున్న సమయంలో ఒకనాడు పాఠశాలల మీద ఉండే ఇన్స్పెక్టర్ పాలిట్ దొర కనిపించారు. చాలా తెలివైన విద్యార్థిగా ధర్మారావు గారు ఆయనకు తెలుసు. ధర్మారావు గారు తన పరిస్థితిని అంతా ఆయనకు వివరించారు. టెక్కలి మిడిల్ స్కూల్ లో ఒక మాస్టరు పని ఖాళీగా ఉండడంతో 15 రూపాయల జీతానికి తాపీ గారిని చేర్పించారు. మాస్టారు ఉద్యోగం అనగానే మిక్కిలి సంతోషంతో చేరిపోయారు. టెక్కలిలో చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని భార్య అన్నపూర్ణమ్మతో సహా అక్కడ కాపురం పెట్టారు. ఐదుగురు పిల్లలకు ప్రైవేటు స్కూల్ కూడా చెబుతూ తాపీ వారు కాలక్షేపం చేస్తూ ఉండేవారు.

అక్కడ ధర్మారావు గారు కొద్దిరోజులే పని చేశారు. ఆ తరువాత పాలిట్ దొర ఆయనకు బరంపురం లోని కలికోట కళాశాలలో లోవర్ సెకండరీ సెక్షన్ లో మాస్టరు ఉద్యోగం ఇప్పించారు. 25 రూపాయలు జీతం. తాపీ వారు పాటలు బాగా చెబుతారన్న పేరు కొద్ది రోజుల్లోనే కళాశాల అంతటా వ్యాపించింది. ఆనాడు తాపీ వారి దగ్గర విద్యను అభ్యసించిన వారిలో ప్రముఖ రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు అయిన ఉప్పల లక్ష్మణరావు గారు కూడా ఉన్నారు. వి.వి.గిరి అప్పుడక్కడ నాలుగో ఫారం చదువుతున్నారు. తాపీ ధర్మారావు గారు పుట్టింది బరంపురం లోనే. అక్కడ ధర్మారావు గారి తండ్రి అప్పన్న వైద్యులు. ఆయన ఎంతో కీర్తిని, ఐశ్వర్యాన్నీ ఆర్జించారు. ఇప్పుడు అక్కడికే ధర్మారావు గారు మాస్టారుగా వచ్చారు. ఈసారి వారి వెంట భార్య అన్నపూర్ణమ్మతో బాటు ధర్మారావు గారి తల్లి, తండ్రి అందరూ విజయనగరం నుంచి బరంపురం వచ్చేసారు. అప్పన్న గారు అక్కడికి వైద్యులు గా ప్రాక్టీసు ప్రారంభించారు. ధర్మారావు గారు ట్యూషన్ కూడా చెప్పి కాలేజీ జీతం 25 రూపాయలకు తోడు మరొక 30 రూపాయలు సంపాదిస్తుండేవారు.

సినిమా రంగం…

తాపీ ధర్మారావు గారు మొట్టమొదటగా మోహినీ రుక్మాంగద (1937 సినిమా) కు కథ, సంభాషణలు వ్రాశారు. ఆ తరువాత గూడవల్లి రామబ్రహ్మం గారి దర్శకత్వంలో 1938లో రూపొందిన సంచలనాత్మక చిత్రం “మాలపిల్ల”. ఆ సినిమాలో తాపీ ధర్మారావు గారు వ్రాసిన సంభాషణలు ఆ రోజులలో ప్రజల నాలుకలపై నాట్యం చేశాయనే చెప్పాలి. గుడిపాటి వెంకట చలం ప్రచురించని నవల ఆధారంగా పల్లెటూరి అమ్మాయి సంపలత పాత్రలో కాంచనమాల కథనాయికగా నటించిన “మాలపిల్ల” సినిమాకు తాపీ ధర్మారావు మాలపిల్లకు స్క్రీన్ ప్లే వ్రాశారు. గూడవల్లి రామబ్రహ్మం గారి దర్శకత్వంలోనే తెరకెక్కిన మరో సంచలన చిత్రం “రైతుబిడ్డ” లోనూ తాపీ వారి మాటలు జనాన్ని అబ్బురపరిచాయి. తాపీ ధర్మారావు గారు సంభాషణలతో పాటు కొన్ని పాటలు కూడా పలికించిన చిత్రం “ఇల్లాలు”. 1940లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. 

హనుమప్ప విశ్వనాథ్ బాబు గారి దర్శకత్వంలో 1943లో రూపొందిన చిత్రం “కృష్ణప్రేమ”. ఆ సినిమాలో అలనాటి మేటి నటి టంగుటూరి సూర్యకుమారి గారు నారద పాత్ర పోషించారు. అందులో తాపీ వారి పాట ఆమె నోట పలికి పరవశింప చేసింది. “జేజేలయ్యా జోహారు కృష్ణా”, “గోపాలుడే వేణుగోపాలుడే”,  “నీ మహిమలెన్న తరమా” వంటి కృష్ణభక్తిని చాటే పాటలకు తాపీ ధర్మారావు గారు కలం పలికించగా, సూర్యకుమారి గారు నేపథ్య గానం చేశారు. కె.ఎస్.ప్రకాశరావు గారు నిర్మాతగా ఎల్.వి.ప్రసాద్ గారి దర్శకత్వంలో రూపొందించిన “ద్రోహి” చిత్రం లోనూ తాపీ ధర్మారావు గారి పలుకు, పాట రెండూ మురిపించాయి. ఇందులోని “ఎందుకీ బ్రతుకు”, “చక్కలి గింతలు లేవా చక్కని ఊహలు రావా”, “ఇదేనా నీ న్యాయం” వంటి పాటలు తాపీవారి అద్భుతమైన కలం నుండి జాలువారినవే.

అక్కినేని నాగేశ్వరావు గారు కథనాయకుడుగా రూపొందిన “కీలుగుర్రం” చిత్రానికి తాపీ ధర్మారావు గారు మాటలు, పాటలు సమకూర్చారు. “ఆహా అహో ఆనందమూ”, “కాదు సుమా కలకాదు సుమా”, “ఎంత కృపామతివే”, “తెలియవశమా పలుక తరమా” వంటి పాటలు ఈ నాటికీ జనాల మనసుల్ని పులకింప చేస్తూనే ఉన్నాయి. అలాగే నందమూరి తారకరామారావు గారి తొలి జానపద చిత్రం “పల్లెటూరి పిల్ల” కు కూడా తాపీ ధర్మారావు గారే మాటలు వ్రాశారు. ఆ తరువాత అక్కినేని గారు నటించిన “పరమానందయ్య శిష్యుల కథ”, “రోజులు మారాయి” చిత్రాలకు కూడా తాపీ ధర్మారావు గారే రచనలు చేశారు. “రోజులు మారాయి” చిత్రంలో వారు వ్రాసిన “ఎల్లిపోతుంది ఎల్లి”, “చిరునవ్వులు విరిసే”, “ఇదియే హాయి కలుపుము”, “మారాజు వినవయ్యా” పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

తండ్రికి తగ్గ తనయులు…

“రోజులు మారాయి” చిత్రానికి దర్శకత్వం వహించిన తాపీ చాణక్య గారు తాపీ ధర్మారావు గారి తనయుడే. ఆ తరువాతి రోజులలో చాణక్య “ఎత్తుకు పైఎత్తు, భాగ్యదేవత, పెద్దరికాలు,  గంగ మంగ” వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. నందమూరి తారకరామారావు గారు కథనాయకుడుగా రూపొందిన “రాముడు – భీముడు, కలసివుంటే కలదు సుఖం, వారసత్వం, సి.ఐ.డి.” వంటి విజయవంతమైన చిత్రాలు కూడా తాపీ చాణక్య గారి దర్శకత్వంలో రూపొందినవే. అలాగే హిందీలో “మన్ మందిర్”, “జాన్వర్ ఔర్ ఇన్సాన్”, “రామ్ ఔర్ శ్యామ్”, “బిఖ్రే మోతీ” వంటి సినిమాలకూ చాణక్య గారే దర్శకులు. తమిళంలో “ఎంగవీట్టు పెన్, “పుదియ పదై” వంటి విజయవంతమైన సినిమాలతో పాటు ఎమ్జీఆర్ కథనాయకులుగా నటించిన “ఒలి విలక్కు, పుదియ భూమి, ఎంగవీట్టు పిళ్ళై, నాన్ ఆనయిట్టాల్” వంటి విజయవంతమైన చిత్రాలు రూపొందించారు చాణక్య. దర్శకత్వంతో పాటు కొన్ని చిత్రాలకు స్క్రీన్ ప్లే కూడా వ్రాసుకున్న తాపీ చాణక్య గారు తండ్రికి తగ్గ తనయులు అనిపించుకున్నారు.

పెళ్లి దాని పుట్టుపూర్వోత్తరాలు..

పరిశోధనాత్మకమైన రచనలలో మరొకటి “పెళ్లి దాని పుట్టుపూర్వోత్తరాలు”. సామాజిక పరిణామ క్రమంలో వ్యక్తిగత ఆస్తి ఏర్పడినప్పుడు, పని పాటల్లో సాయానికి పురుషునికి ఒక ఆడది అవసరమైనప్పుడు, పెళ్లి అనేది మానవుని జీవితంలో ఎలా చోటుచేసుకుంటుందో ధర్మారావు గారు ఆయా దశలవారీగా వివరించారు. పెళ్లి అనేది జరిగిన తరువాత కూడా అంతకు ముందు స్వేచ్ఛా విహారం దశలో తక్కిన మగవారికి ఆ ఆడదానిమీద ఉండిన హక్కును  వదిలించుకోవడానికి అమలులో ఉండిన మొదటి రాత్రి తంతును ధర్మారావు గారు మొదటి రాత్రి హక్కు దక్కలేదని ఈనాడు కేవలం తోడు పెళ్ళికొడుకు రూపంలో ఆ ఆచారం నేటికీ మిగిలి ఉన్నదని ధర్మారావు గారు వివరించారు.

“మా పిల్లను ఆ ఊరు ఇచ్చాము”, “ఇంటి కోడలు”, “అక్క మొగుడే దిక్కు” మొదలైన మాటల్లోనూ “బావ మరదలు”, “మేనమామ కోడళ్ళ” హాస్యాల్లోనూ ధ్వనించే ప్రాచిన కాలపు సామాజిక పరిస్థితులను ధర్మ రావు గారి వివరించారు. ఆదిలో కేవలం మగ పెళ్లి వారు, ఆడ పెళ్లి వారు తప్ప మరొకరితో నిమిత్తం లేకుండా ఒకరికొకరు తమలపాకులు ఇచ్చుకోవడం, అంటే అతి సామాన్యమైన పెళ్లి జరిగేది. తంతులకు పిలవని పేరటంగా పురోహితుడు ప్రవేశించి ఏవేవో సూత్రాలు, మంత్రాలు వల్లి నానారకాల కర్మ కాండలను కల్పించి, దానిని నేటి పెద్ద భూతంగా ఎలా మార్చారో ధర్మారావు గారు వివరించారు. ఆ పురోహితులు సత్పురుషుడు, పతే దైవం లాంటి సూత్రాలను కల్పించి స్త్రీని ఎలా అనగదొక్కాడో తెలిపారు. ఇకనైనా ఈ అనవసర పద్ధతిని విడిచిపెట్టి ఋణాల పాలు కాకుండా వివాహాలు చేసుకోవడం మంచిది కదా అనే హితవు చెప్పేవారు ధర్మారావు గారు.

సంస్కరణ వివాహాలపై మక్కువ.. 

తాపీ ధర్మారావు గారి కుమారులలో ఒకరైన చాణక్య గారు హైదరాబాదు లోని ఖైరతాబాదులో సొంత ఇల్లు కట్టుకున్నారు. కుటుంబంతో సహా ధర్మారావు గారు 1969లో చిక్కడపల్లిలోని అద్దె ఇంటి నుంచి ఆ ఇంటిలోకి మారారు. చాణక్య గారి కుమార్తె జోయాను, ధర్మారావు గారి రెండో కూతురు విశాలాక్షి కుమారుడు లక్ష్మణరావు కిచ్చి ఆ ఇంటిలోనే వివాహం జరిపించారు. పూలదండలను మార్చుకునే పూర్తి సంస్కరణ పద్ధతిలో ధర్మారావు గారు ఆ పెళ్లి జరిపించారు. హైదరాబాదులో అటువంటి సంస్కరణల వివాహాలు చాలా వాటికి వారు ఆధ్వర్యం వహించారు. తరిమెల నాగిరెడ్డి గారి కుమార్తె వివాహం, కె.కె.రంగనాధా చార్యుల వివాహం, నిర్మల – త్రిపురనేని సుబ్బారావుల వివాహం, ఛాయాగ్రాహకులు చంద్రం గారి కుమార్తె వివాహం వీటిలో కొన్ని. తన అన్నగారికి దత్తతిచ్చిన అహోబలరావు పెద్దకొడుకు ఇద్దరు కుమార్తెల వివాహాలు ఒకేసారి వీరి ఆధ్వర్యం క్రిందనే సంస్కరణ పద్ధతిలో జరిగాయి. అంతకుముందు ధర్మారావు గారు మద్రాసులో ఉన్న రోజుల్లో కూడా ఇటువంటి సంస్కరణల వివాహాలను కొన్నిటిని జరిపించారు. పత్రిక రచయిత వి.హనుమంతరావు, సరళ వివాహం వాటిలో ఒకటి.

దేవాలయాల పై బూతు బొమ్మలు ఎందుకు?

దేనినీ కూడా గుడ్డిగా స్వీకరించకుండా ఎందుకు ఇలా ఉంది అని ప్రశ్నించుకోవడం ధర్మారావు గారికి చిన్నప్పటి నుంచి ఉన్న లక్షణం. పరమ పవిత్రమైనవిగా భావించే దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు అనే ప్రశ్న వారికి అలాగ పుట్టిందే. ఆ ప్రశ్నకు సమాధానం కోసం వారు మన దేశ ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను ఇతర దేశాల వాటిని పరిశోధించారు. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా కొన్ని వేల సంవత్సరాలు నాడు కోవెలలన్నీ బహిరంగ సంభోగాల కోసం నిర్మించినవేనని ధర్మ రావు గారు కొనుగొన్నారు. తన జీవనానికి అవసరమైనవన్నీ భూమి అనే దేవత, ఆకాశం అనే దేవుడు, కలిసి సంగమించడం వల్లనే లభిస్తున్నాయని ఆదిమ మానవుడు నమ్మాడు. ఆ దేవతను, దేవుని స్త్రీ పురుష జననేంద్రియాలుగా భావించారు. ఆ రెంటిని కలిపి శివలింగాన్ని రూపొందించారు. ఆ భావంతో వారి దైవారాధన కూడా అదే రూపంలో ఉండేదని ధర్మారావు గారు వివరించారు. ఆరాధనలు బహిరంగంగా దేవుని సమక్షంలో జరిగేవి. ఈ రూపంలో నిత్యారాధనలు లేకపోతే దేవునికి గల సృష్టించేశక్తి సన్నగిల్లి తాము బాధల పాలు కావలసి వస్తుందని వారికి భయం.

ఈ ఆరాధన ఆనాటి మానవుని దృష్టిలో పరమ పవిత్రమైనది, గౌరవప్రదమైనది. అందులో పాల్గొనక పోవడం పాపం. దేవాలయాలన్నీ ఈ సంగమాలకు ప్రోత్సాహకాలుగా ఉండేవి. అందుకే వాటి మీద రకరకాల బంధనాలను తెలిపే బూతు బొమ్మలు వెలిశాయని ధర్మారావు గారు అన్నారు. ఈ దృష్టితో జరిగే పౌండరీకం, అశ్వమేథం వంటి యజ్ఞంలోని కర్మకాండలను సంతానం కోసం కోవెల్లో మూడు రాత్రులు నిద్రపోవడం, ఇరుకురాళ్ల మధ్య దూరి వెళ్లడం లాంటివి నేటికి కొనసాగుతున్న ఆచారాలని ధర్మారావు గారు వివరించారు. నాగరికత పెరుగుతున్న కొద్దీ సంగమరూపంలో నిత్యారాధనలు పోయి ఏడాదికొకరోజుకు తగ్గాయని, అదీ ఇష్టం లేనివారు దేవునికి తల వెంట్రుకలు సమర్పించే ఆచారం వచ్చిందని ధర్మ రావు గారు వివరించారు. ఆనాటి పరిస్థితులు ఈనాడు లేకపోయినా, ఆనాడు రూపొందించిన సూత్రాలు ఏదో ఒక రూపంలో ఆనాటి ఆచారాలు నేటికీ మిగిలి ఉండడం ప్రగతికి అవరోధమని ధర్మారావు గారు హెచ్చరించారు.

సంపాదకీయాల తీరు..

లేవు

కరకర పొడిచే పొద్దున ఆపే 

శక్తులు లేవు

లేవు

లేవు ఉదయమాపు జైలు..

పోలీసులు పురుషులను పూర్తిగా దిగంబరులను చేసి స్త్రీల ఎదుట ఊరేగించినప్పుడు తాపీ వారు వ్రాసిన సంపాదకీయం. కృష్ణా జిల్లా యలమర్రు, కాటూరులో 1949 జూలై 14, 16 తేదీలలో పోలీసులు పురుషులను పూర్తిగా దిగంబరులను చేసి స్త్రీల ఎదుట ఊరేగించారు. ఆ దిగంబర ఊరేగింపును గాంధీ విగ్రహం చుట్టూ తిప్పారు. ఇట్టి విషయాన్ని తాపీ ధర్మారావు గారు తన సంపాదకీయంలో చాలా ఘాటుగా ఖండించారు. తెలంగాణ సాయుధ పోరాటం సందర్భంగా నాటి ప్రభుత్వం చాలా మందికి ఉరిశిక్ష విధించింది. ఆ శిక్షలను ఖండిస్తూ ధర్మారావు గారు ఒక సంపాదకీయం వ్రాశారు. ప్రజారక్షణ కోసం రజాకార్ల ప్రతిఘటన కోసం ప్రాణాలొడ్డిన కొందరు ఉద్రేకించారు. తెలంగాణ పోరాటాన్ని సమర్థిస్తూ “ఈ ఉరిశిక్షను రద్దు చేయించి తమ నాగరికతను ప్రపంచానికి ప్రకటించవలసిందని కోరుతున్నాము” అని సంపాదకీయంలో అభ్యర్థించారు. ఆ ఉరిశిక్ష సందర్భంలోనే చంపవద్దు అంటూ మరొక సంపాదకీయం, ప్రాణ దీక్ష పెట్టండి అని ఇంకొక సంపాదకీయం కూడా వ్రాశారు. ఆ ఉరిశిక్షలను రాజేంద్రప్రసాద్ గారు యావజ్జీవ శిక్షలుగా మార్చినప్పుడు “సుఖీభవ” అని సంపాదకీయం వ్రాస్తూ “ఆ యువకుల రక్తం కడగరాని మచ్చలాగా భారత ప్రభుత్వం చేతులకు అంటుకొని ఉండేది” అని అన్నారు. 

నరలోకపు గుండెల్లో

సిరసిరలాడుతోంది బాధ, ఉరికంభం

కదులుతోంది ఉచ్చు గాలికి ఎగురుతోంది..

ఈ కవిత కూడా అందులో ఒక భాగం. 

కాటూరు, యలమర్రు ఘటన గురించి తెలుగునాడులో పోలీసు దురాగతాలు, ఇలాంటి నైచ్యాలు ఈ శతాబ్దంలో జరగరానిదని శ్రీశ్రీ, కొడవగంటి కుటుంబరావు, తాపీ ధర్మారావు, మల్లాది రామకృష్ణ శాస్త్రి, గోపీచంద్, మాదవపెద్ది గోకలే, ఆరుద్ర శెట్టి, ఈశ్వర రావులు చాలా తీవ్రంగా ఖండిస్తూ ఒక సంయుక్త ప్రకటన చేశారు. దానిని 10 ఆగస్టు 1949 తేదీ “జనవాణి” సంచికలో ప్రచురించారు.

ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని తాపీ ధర్మారావు గారు తన సంపాదకీయాల్లోనూ, వ్యాఖ్యల్లోనూ దీక్షతో బలపరుస్తూ వచ్చారు. రాష్ట్ర సాధనకై ఆమరణ నిరాహార దీక్షబూని పొట్టి శ్రీరాములు గారు చనిపోయినప్పుడు తాపీ వారు సంపాదకీయం వ్రాస్తూ ఇలా అన్నారు. “బాగా ఆలోచించినట్లయితే శ్రీరాములు నిరాహారదీక్షకాహుతి అయ్యారు అనుకోవడం పొరపాటు. కొన్ని సంవత్సరాలుగా ఆందోళన జరుగుతున్నా కాంగ్రెసు వారు భాషా రాష్ట్ర నిర్మాణానికి కంకణం కట్టుకున్నా కూడా, స్వాతంత్రం వచ్చి ఐదేళ్లయినా, కమిటీ తర్వాత కమిటీ నివేదికను పంపించినా, ఈనాటి వరకు రాష్ట్ర నిర్మాణాన్ని ఒక మూలన పడవేసి ఉంచిన ప్రస్తుత ప్రభుత్వ నిరాదరణకి ఆహుతి అయ్యారని ఏక అభిప్రాయానికి రావడం అంతా అనవసరమని తెలిసికూడా మన నాయకులు చూపిస్తూ వచ్చిన ప్రాంతీయ దురాభిమానాలకు వ్యక్తి దురహంకారాలకు శ్రీరాములు గారు బలి అయ్యారు అనడం ఎంతవరకు సమంజసం” అని సంపాదకీయన్ని ముగిస్తూ విశాలాంధ్రను సాధించుకోవడానికి పూనుకోవాలి అదే శ్రీరాములు గారి త్యాగానికి మనం చూపే గౌరవం అని అన్నారు.

భార్య వియోగం…

చిత్రకూట ఇంటిలో ఉన్న రోజుల్లోనే ధర్మారావు గారి భార్య అన్నపూర్ణమ్మ గారు ఒకనాడు స్నానాలు గదిలో జారిపడ్డారు. ఆవిడ తుంటి ఎముక విరిగింది. అప్పటి నుండి ఆమె తిరిగి కోలుకోలేదు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ క్రమం క్రమంగా క్షీణించ ఆరంభించారు. చివరకు 04 ఏప్రిల్ 1961 తెల్లవారుఝామున దవాఖానలో కన్నుమూశారు. అప్పటికి ఆమె వయస్సు 68 సంవత్సరాలు. తాపీ ధర్మారావు గారికి కష్టాల కొలిమిలో తనకు తోడుగా నిలిచిన జీవిత భాగస్వామి రాలిపోయింది. జీవితంలోని ఆనందమయ ఘట్టాలను తనతో పంచుకున్న జోడు తనను విడిచిపోయింది. అర్థ శతాబ్దానికి పైగా ఎంతో అన్యోన్యతతో సాగిన వారి దాంపత్య జీవితం ఆనాటితో అంతమైంది. అది ధర్మారావు గారికి ఒక ఆశనిపాతమే అయ్యింది. తాపీ ధర్మారావు గారు గొప్ప మనోబలం కలవారు. కాబట్టి త్వరలోనే ఆ దెబ్బ నుండి తేరుకున్నారు. మిత్రుల చేయూత కూడా తోడ్పడింది. 1962లో వారి కుటుంబం చిక్కడపల్లిలోని ఒక ఇంటికి మారింది. అన్నపూర్ణమ్మ గారి పేరిట ధర్మారావు గారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఒక స్కాలర్షిప్ ను 1961లో ఏర్పాటు చేశారు.

నిష్క్రమణం…

ధర్మారావు గారికి కాలు విరగడం వలన తన నడకలో కుంటు వచ్చింది. ప్రతీ దానికి ఇతరులపై పూర్తిగా ఆధారపడే బ్రతుకు తనది కాకూడదు అనుకుని తన కాళ్ళ మీద తాను నిలబడాలనుకున్నారు.  ఒక కాలు విరిగి నడకలో కొంత ఇబ్బంది వచ్చిన తరువాత కూడా వారు దేనికి ఇతరులపై ఆధారపడేవారు కాదు. చివరికి మెట్లు ఎక్కేటప్పుడు కూడా ఎవరైనా చేయూత ఇవ్వబోతే ఆ చేతులను తోసేవారు. దాంతో వారి వైద్యం విషయంలోనూ, ఆహారం విషయంలోనూ సహకరించేవారు కాదు. వైద్యుల సూచనలు గానీ కుటుంబ సభ్యుల అభ్యర్థనలను గానీ లెక్కచేసేవారు కాదు. 

ఏది ఏమైతేనేమి “వెయ్యి ముఖాలతో వెలిగిన జీవితం. పూలబాటలు, ముండ్ల పుంతలు, అగాధమైన పల్లాలు, ఆకాశం అంటే మెరకలు, అన్నీ తొక్కుకుపోయిన జీవితం” అని తాపీ ధర్మారావు గారే తన “రాలు – రప్పలు” లో వర్ణించిన ఆ 86 సంవత్సరాల జీవితం చివరకు అలసిపోయి శాశ్వత విశ్రాంతి తీసుకుంది. 08 మే 1973 నాడు తెల్లవారుఝామున 3 – 4 గంటల ప్రాంతంలో తాపీ ధర్మారావు గారు కన్నుమూశారు. సాహిత్యం, పత్రికా రంగం, సినిమా రంగంలో మహోన్నత శిఖరాలను అందుకుని తనదంటూ చెరగని ముద్రలు వేసిన ధర్మారావు గారు వెళ్లిపోయారు. పురోగామి సాహితీకారులకు, సంఘసంస్కరణ అభిలాషులకు, యువ రచయితలకూ ఏనాటికి పట్టుగొమ్మగా ఉండగల సాహితీ సంపదను తెలుగు ప్రజలకు రెండు చేతులా వారసత్వంగా అప్పగించి అస్తమించారు తాపీ ధర్మారావు గారు. వారు ఎప్పటికీ ధన్యజీవులు.

Show More
Back to top button