Telugu Cinema

తెలుగు తెరపై గ్లామర్ పాత్రలకు పెట్టింది పేరు… నటి రాధ..

సినిమాలలో నటించడానికి అందమే ముఖ్యం నటి రాధ అనుకుంటారు చాలా మంది. ఎత్తు, పొడుగూ ఉంటే గానీ రాణించలేము అనుకుంటారు. అది నిజం కాదని నిరూపించారు ఎందరో నటీమణులు. ఆకర్షణీయంగా లేకున్నా, నల్లగా ఉన్నా నటనకు అడ్డు కాదని వీరిని చూస్తే అవగతమవుతుంది. ఎన్నో గొప్ప చిత్రాలలో నటించి మెప్పించిన వారు ఉన్నారు. వీరు నటించిన చిత్రలతో ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయారు. వెండితెర పై చెరగని ముద్ర వేశారు. వారిలో ప్రముఖ నటీమణి రాధ ఒకరు..

రాధ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన “ఉదయ చంద్రిక” 80 వ దశకంలో తెలుగు, తమిళ రంగంలో ప్రసిద్ధి చెందిన తాను సుమారు 250 పైచిలుకు చిత్రాల్లో తాను నటించారు. తమిళం లో శివాజీ గణేశన్ , శివకుమార్ , రజనీకాంత్ , కమల్ హాసన్ , కె. భాగ్యరాజ్ , విజయకాంత్ , సత్యరాజ్ , తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణంరాజు , శోభన్ బాబు వంటి ప్రముఖులతో  కన్నడ లో విష్ణువర్ధన్, రవిచంద్రన్‌, శరత్ బాబు, మలయాళం లో భరత్ గోపీ , మోహన్ లాల్ మొదలగు నటులతో అభినయించారు.

1981 లో దర్శకుడు భారతీరాజా దర్శకత్వం లో తమిళ చిత్రం “అలైగల్ ఒవాతిల్లై” తో తొలిసారి కథానాయికగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రాధ గారు సీరియస్ పాత్రల జోలికి వెళ్లకుండా గ్లామర్ పాత్రలతో, నృత్యం తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యం గా మెగాస్టార్ చిరంజీవి తో కలిసి తాను వేసిన స్టెప్పులతో కుర్రకారు మదిని దోచుకున్నారు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    ఉదయచంద్రిక 

ఇతర పేర్లు  :    రాధ 

జననం    :    3 జూన్ 1966

స్వస్థలం   :    తిరువనంతపురం, కేరళ, భారతదేశం

తండ్రి   :   కరుణాకరన్ నాయర్ 

తల్లి     :      సరసమ్మ 

వృత్తి      :    నటి 

జీవిత భాగస్వామి   :    రాజశేఖరన్ నాయర్

పిల్లలు       :       కార్తికా నాయర్, విఘ్నేష్, తులసి నాయర్

బంధువులు :   అంబిక (అక్క)

పురస్కారాలు    :    కళైమామణి, సినిమా ఎక్స్‌ప్రెస్, ఫిల్మ్ క్రిటిక్స్

నేపథ్యం..

రాధ గారి అసలు పేరు ఉదయ చంద్రిక. తాను కేరళ లోని తిరువనంతపురం జిల్లా కిలిమనూరు సమీపంలోని కల్లారా గ్రామానికి చెందినవారు. తాను 3 జూన్ 1965 లో  జన్మించారు. వీరి తండ్రి కరుణాకరన్ నాయర్, తల్లి సరసమ్మ. తాను అమ్మ నాన్న లకు మూడవ కుమార్తె. తన తోబుట్టువులు అంబిక , మల్లిక, సురేష్ మరియు అర్జున్. తన అక్క అంబిక కూడా భారతీయ వెండితెరకు చెందిన ప్రముఖ నటి. రాధ గారి నాన్నగారు శ్రీశైలంలో ఇంజనీర్ గా పనిచేసేవారు. తాను తన సొంత ఊరు కల్లార గ్రామంలో టెన్త్ వరకు చదివి, ప్రైవేట్ గా బీకాం చేశారు.

స్కూల్లో గురువు శశి మాస్టర్ వద్ద భరతనాట్యం నేర్చుకుని ఎన్నో ప్రదర్శనలు ఇచ్చేవారు. ఫాన్సీ డ్రెస్ పోటీల్లో, డ్రామాలలో పాల్గొని నటించేవారు. ఆవిధంగా చదువుకునే రోజులలోనే తనకు గుర్తింపు లభించింది. తన అమ్మ గారు తనను బాల్యం నుండి ప్రోత్సహించేవారు. ఉద్యోగరీత్యా తన నాన్న గారు పట్టించుకోక పోయినా వద్దు అని మాత్రం చెప్పేవారు కాదు. రాధ గారు సినిమాలు బాగా చూసేవారు. తన అక్క అంబికా గారు సినిమా రంగంలో ఉండటం వలన తనకు సినిమాలలో నటించాలనే కోరిక బలీయంగా ఉండేది.

తన అక్క వల్ల అవకాశం కూడా తొందరగానే లభించింది. అనుకోకుండా ఒక్కసారి తన అక్కతో షూటింగ్ కి వెళ్ళినప్పుడు తనని చూసిన భారతీరాజా గారు రాధ గారి అమ్మగారిని సంప్రదించారు. వాళ్ళ అక్క ఎలాగూ ఉన్నది, అందుకే రాధ గారు కూడా నటించడానికి వాళ్ళ అమ్మ ఒప్పుకుంది. భారతీరాజా గారు పరిశ్రమకు ఎవరిని పరిచయం చేసినా వారి పేరును “ఆర్” తో ప్రారంభిస్తారు. రాధిక, రేవతి, రేఖ ఇలా ఆయన లక్కీ అక్షరం ఆర్. అందుకే ఉదయ్ చంద్రికగా ఉన్న తన పేరును “రాధ”గా మార్చారు భారతీరాజా గారు.

సినీ రంగ ప్రవేశం…

తొలి సినిమా “అలైగల్ ఒవాతిల్లై” తో రంగ ప్రవేశం..

రాధ గారు 1981 లో దర్శకుడు భారతీరాజా గారు దర్శకత్వం వహించిన తమిళ చిత్రం “అలైగల్ ఒవాతిల్లై” లో కథానాయికగా నటించి  తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇందులో కార్తీక్‌ తో కలిసి నటించారు. ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. కార్తీక్‌ తో నటించిన ఈ చిత్రం విజయం తో “ఇళంజోడిగల్” , “పక్కతు వీటు రోజా” , “వాలిబామే వా వా” మరియు “నల్ల తంబి” వంటి అనేక చిత్రాలలో నటించడానికి మార్గం సుగమం చేసింది. ప్రముఖ తమిళ నటులు కమల్ హాసన్ గారితో నటించిన “టిక్ టిక్ టిక్” చిత్రంలో రాధ గారు ఒక చిన్న పాత్రను పోషించారు. టిక్ టిక్ టిక్ లో ఆమె ముఖ్యమైన పాత్ర పోషించారు.

ఆ తరువాత తాను కమలహాసన్‌ తో కలిసి “తూంగదే తంబి తూంగధే” (1983), “ఒరు కైధియిన్ డైరీ” (1985), “జపనీల్ కళ్యాణరామన్” (1985) మరియు “కాదల్ పరిసు” (1987) వంటి అనేక చిత్రాలలో నటించారు. ఆమె 1985 లో “ముతల్ మరియాతై” తమిళం చిత్రానికి గానూ ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు. తన అక్క గారైన అంబిక తో తాను “ఎంకెయో కెట్టా కురల్” (1982), “వెల్లై రోజా” (1983), “ఇదయ కోవిల్” (1985), “మనకనక్కు” (1986), “కాదల్ పరిసు” (1987) మరియు “అన్నానగర్ ముదల్ తేరు” (1988) వంటి చిత్రాలలో కలిసి నటించారు.

అక్కాచెల్లెళ్లు తమ కెరీర్‌ను చాలా జాగ్రత్తగా నిర్మించుకుంటూ వచ్చారు. “అమ్మన్ కోవిల్ కిజకలే” (1986), “మెల్ల తిరంధాతు కధవు” (1986), “నినైవే ఒరు సంగీతం” (1987), “జల్లికట్టు” (1987), “సత్తం ఒరు విలయాట్టు” (1987), “ఉజ్వన్ మగన్” (1987) మరియు “రాజాధి రాజా” (1989) వంటి వాణిజ్య చిత్రాలలో నటించిన రాధ గారు అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నారు. తమిళం లో తాను శివాజీ గణేశన్ , శివకుమార్ , రజనీకాంత్ , కమల్ హాసన్ , కె. భాగ్యరాజ్ , విజయకాంత్ , సత్యరాజ్ , మోహన్ , ప్రభు, కార్తీక్ , టి.రాజేందర్ మరియు అర్జున్ వంటి కథనాయకులతో నటించారు.

తెలుగు లో తొలిసారి శోభన్ బాబు తో…

రాధ గారు తెలుగులో తొలిసారిగా శోభన్ బాబు తో జత కట్టారు. కోదండరామిరెడ్డి దర్శకత్వం లో శోభన్ బాబు కథనాయకుడు గా  మిస్టర్ విజయ్ అనే చిత్రం లో నటించారు.

తన రెండో చిత్రం  అక్కినేని నాగేశ్వరావు గారి తో కలిసి నటించిన “వసంతగీతం”. కానీ తన రెండో చిత్రం “వసంతగీతం” ముందుగా విడుదల కావడం విశేషం. “వసంతగీతం” చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు గారు దర్శకులు. ఇలా 1984 లో ఈ రెండు చిత్రాలు విడుదలయ్యాయి. ఇక తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి.

తెలుగులో ఆమె చెప్పుకోదగ్గ చిత్రాలు శక్తి (1983), ఇద్దరు దొంగలు (1984), అగ్ని పర్వతం (1985), పల్నాటి సింహం (1985) , రావణ బ్రహ్మ (1986), సింహాసనం (1986), యముడికి మొగుడు (1988), రాముడు భీముడు (1988) ) మరియు స్టేట్ రౌడీ (1989). ఆమె సూపర్ స్టార్ కృష్ణతో కలిసి 19 సినిమాలు , చిరంజీవితో 16 సినిమాలు , బాలకృష్ణతో 6 సినిమాలు మరియు ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ , కృష్ణంరాజు , శోభన్ బాబు వంటి ప్రముఖ తెలుగు హీరోలందరితో కలిసి పనిచేశారు.

మెగాస్టార్ తో 16 చిత్రాలు..

మెగాస్టార్ చిరంజీవి గారితో 16 చిత్రాల్లో కథనాయికగా నటించారు. కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన “కొండవీటి దొంగ”, “జేబుదొంగ”, “రక్తసింధూరం”, “మరణ మృదంగం”, “రాక్షసుడు”, “దొంగ”, “గుండా”, రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో “అడవి దొంగ”, బి.గోపాల్ దర్శకత్వంలో “స్టేట్ రౌడీ”, రవి రాజా పెనిశెట్టి దర్శకత్వంలో “యముడికి మొగుడు”, దాసరి గారి “లంకేశ్వరుడు”, తాతినేని ప్రసాద్ గారి “నాగు”, ఇలా చిరంజీవి గారితో రాధ గారు నటించారు. తన అదృష్టం కాబోలు అవన్నీ దాదాపు శత దినోత్సవ చిత్రాలే..

సూపర్ స్టార్ కృష్ణతో

రాధ మరియు సూపర్ స్టార్ కృష్ణ గార్ల ది కూడా మంచి విజయవంతమైన జోడీ అనే చెప్పాలి. తాను కృష్ణ గారితో కూడా పలు చిత్రాలలో నటించారు.

రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో “అగ్నిపర్వతం” భారతీరాజా గారి దర్శకత్వంలో “జమదగ్ని” చిత్రాల్లో కృష్ణ గారితో నటించడం తన నట జీవితంలో ఒక మలుపు.

అదే విధంగా బాలకృష్ణతో “నిప్పులాంటిమనిషి”, “ముద్దుల కృష్ణయ్య”, “రాముడు భీముడు”, కృష్ణంరాజు గారితో “రావణబ్రహ్మ” మోహన్ బాబు గారితో “వింత మొగుడు” చిత్రాలు తన నటజీవితంలో మైలురాళ్లు.

ఇలా రాధ గారు తెలుగులో ఎందరో అగ్రనటులతో నటించారు.

ఎన్టీఆర్ తో..

రాధ గారు నందమూరి తారకరామారావు గారి స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో “చంఢశాసనుడు” చిత్రంలో శారద, జయమాలిని, అన్నపూర్ణ, సత్యనారాయణ, రావుగోపాలరావు గార్లు తదితరులతో నటించారు. అదేవిధంగా అక్కినేని గారితో రెండు చిత్రాలు చేశారు.

ఒకటి “వసంత గీతం”కాగా, రెండోది కోడిరామకృష్ణ గారి దర్శకత్వంలో అక్కినేని, రాధ గార్లు జంటగా నటించిన ఆదర్శవంతుడు.

అలాగే ఎన్టీఆర్, ఏఎన్నార్ గార్ల కుమారులు బాలకృష్ణ, నాగార్జున లతోనూ నటించారు.

హిందీ చిత్రం లో..

పద్మాలయా స్టూడియోస్ బ్యానర్ పై జి. హనుమంత రావు నిర్మాణంలో, సూపర్ స్టార్ కృష్ణ గారి సమర్పణలో   కె. రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించిన చిత్రం కామ్యాబ్. జీతేంద్ర , షబానా అజ్మీ , రాధ లు నటించారు. దీనికి బప్పి లహరి సంగీతం సమకూర్చారు.

ఈ చిత్రం తెలుగు సినిమా శక్తి (1983) ని హిందీ లో కామ్యాబ్ గా పునర్నిర్మించారు.

శక్తి (1983) తెలుగులో కృష్ణ, జయ సుధ , రాధ లు కీలక పాత్రల్లో నటించారు. హిందీలో ఇదే రాధ గారికి తొలి చిత్రం.

అనిల్ కపూర్, మాధురి దీక్షిత్ లు నటించిన తేజాబ్ చిత్రాన్ని తెలుగులో “టూటౌన్ రౌడీ” గా దాసరి నారాయణ రావు గారు పునర్నిర్మించారు.

రాధ, వెంకటేష్ గారు చేసిన “డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్” అనే పాట సన్నివేశంలో రాధ గారు వేసిన స్టెప్పులకు అద్భుతమైన స్పందన వచ్చింది.

తాను ఎక్కడికి వెళ్ళినా ఆ పాట తాలూకు జ్ఞాపకాలను తనకు అభిమానులు గుర్తు చేస్తూ ఉంటారు.

కన్నడ సినిమా…

రాధ గారు ఆరు కన్నడ చిత్రాలలో నటించారు. హిందీ చిత్రం “మాంగ్ భరో సజన” ను కన్నడ లో “సౌభాగ్య లక్ష్మి” (1986) గా పునర్నిర్మించారు.

అందులో ప్రముఖ నటుడు విష్ణువర్ధన్ మరియు నటి లక్ష్మితో రాధ గారు కలిసి నటించారు. ఇది తెలుగు చిత్రం “కార్తీక దీపం” యొక్క రీమేక్.

తాను రవిచంద్రన్‌ గారితో కూడా సినిమాలు చేశారు. తాను రాణాచండి (1991) అనే యాక్షన్ చిత్రం చేశారు.

ఇందులో తనకు శరత్ బాబు భర్తగా నటించారు.

తాను పోలీసు పాత్ర పోషించిన ఈ చిత్రం కన్నడలో భారీ విజయాన్ని సాధించి, ఇప్పటికీ కూడా కన్నడ సినీ ప్రేక్షకులకు గుర్తుండిపోయింది.

మలయాళం లో…

నటి రాధ గారు కేరళకు చెందినప్పటికీ, మలయాళంలో కేవలం ఆరు చిత్రాలలో మాత్రమే నటించారు. 1985లో KG జార్జ్ దర్శకత్వం లో “ఇరకల్‌” చిత్రంలో తాను అత్యంత ప్రాధాన్యమున్న పాత్రను పోషించారు.

ఆ చిత్రం కేరళ రాష్ట్ర అవార్డు గెలుచుకుంది. సత్యన్ అంతికాడ్ దర్శకత్వం లో “రేవతిక్కోరు పావకుట్టి” (1986) లో నటించారు. తాను “అయితం” (1987) అనే చిత్రం లో నటించి, నిర్మించారు. “ఇన్నాతే ప్రోగ్రామ్” (1991) అనే మలయాళ చిత్రం లో కూడా నటించారు. ఇది కూడా విజయవంతమైంది. మలయాళంలో ఇదే తన చివరి చిత్రం.

వైవాహిక జీవితం…

80 వ దశకంలో కథనాయికగా ఓ వెలుగు వెలిగిన ప్రముఖ నటి రాధ గారు 10  సెప్టెంబర్ 1991న హోటల్ వ్యాపారి రాజశేఖరన్ నాయర్‌ గారిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కార్తీక నాయర్ , తులసి నాయర్ మరియు ఒక కుమారుడు విఘ్నేష్ నాయర్ ఉన్నారు. తన పెళ్లి తర్వాత, రాధ గారు తన నటన జీవితానికి పూర్తిగా స్వస్తి పలికారు. తనకు ఇద్దరు కుమార్తెలు కార్తీక నాయర్ మరియు తులసి నాయర్‌ మరియు ఒక కుమారుడు విగ్నేష్ నాయర్. తన ఇద్దరు కుమార్తె లను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు.

కానీ వీరిరువురికి నటనపై పెద్దగా ఆసక్తి లేదు. అశేష ప్రేక్షకాభిమానం కలిగి ఉన్న తనను సినిమాలు చేయమని ప్రేక్షకులు అభ్యర్థించినప్పుడు, తాను చెన్నై, కేరళ మరియు ముంబై లలో నిర్వహిస్తున్న వ్యాపారంతో  తీరిక లేక సినిమాల్లో నటించడానికి తనకు సమయం లేదని తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ముగ్గురు పిల్లలకు తల్లి అయినా కూడా తాను తన పెద్ద కూతురు కార్తీకతో పాటుగా ఎనిమిది సంవత్సరాల పాటు శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించి ప్రతీ సంవత్సరము చిదంబరము నటరాజ ఆలయములో 2006 మార్చి లో జరిగిన నాట్యాంజలి ఉత్సవములో నాట్య ప్రదర్శన చేశారు.

గ్లామర్ పాత్రలకే పరిమితం…

నటి రాధ గారు నటనలో ఎప్పుడూ కూడా సీనియర్ గా భావించేవారు కాదు.

సినీ పరిశ్రమలో ప్రవేశించిన తొలినాళ్లలో ఎలా ఉండేవారో, చివరివరకు కూడా అలానే ఉంటూ వచ్చారు.

ఎప్పుడూ కొత్తగా నేర్చుకుంటూనే వున్నారు. ఆ దృష్టితోనే నటనలో ఎన్నో జాగ్రత్తలు, ప్రత్యేక శ్రద్ధలు తీసుకునేవారు.

నృత్యంలో తాను వేసిన స్టెప్స్ చాలా బాగుంటాయి అని అభిమానులు అంటుంటారు.

చిత్రికరణ లో ఖాళీ సమయం దొరికితే సమయం వృధా చేయకుండా తన సహా నటులు ఎలా నటిస్తున్నారో, దర్శకులు వారికి ఎలా తర్పీదునిస్తున్నారనే విషయాన్ని నిశితంగా పరిశీలించేవారు.

వాళ్ళ హావాభావాలు, మేనరిజం గమనించి ఆకలింపుచేసుకునే వారు. తన చిత్రాలన్నీ ఎక్కువ భాగం విజయవంతమైనవే. తాను గ్లామర్ పాత్రలకే పరిమితం అయ్యారు.

కానీ ఏనాడూ సీరియస్ పాత్రలు మాత్రం చేయలేదు. ప్రతీ చిత్రాన్ని అదే తొలిచిత్రంగా భావించి జాగ్రత్తగా నటించేవారు. “వాస్తవంగా చెప్పాలంటే తన తోటి నటీనటులు, దర్శక నిర్మాతలు, అభిమానులు, ప్రేక్షకులే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టారు.

వాళ్ళు నాకు అందించిన సహకారం ఎన్నటికీ మరువలేనిది. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ నేను ఎన్నటికీ మరువలేను” అని పలుమార్లు చెప్పేవారు రాధ గారు.

Show More
Back to top button