Telugu Special Stories

భారతీయ చలనచిత్ర వరప్రసాదం.. దర్శకులు ఎల్.వి.ప్రసాద్

ఎల్.వి.ప్రసాద్ (జనవరి 17, 1908 – జూన్ 22, 1994) గా ప్రసిద్ధి చెందిన ప్రముఖులు అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు గారూ. తెలుగు చిత్ర దర్శకులు, నిర్మాత, నటులు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.

భారతీయ సినిమాకి నడకలు నేర్పిన మహనుభావుల్లో ఎల్.వి.ప్రసాద్ గారు ఒకరు. తెలుగు సినిమాకు క్లాసిక్ అనదగ్గ సినిమాలు అందించిన దర్శకులు వీరు. తెలుగు సినిమా టాకీలు మొదలైనప్పటి నుండి సాగిన తన ప్రస్థానం నిడివి దాదాపు 65 సంవత్సరాలు. భారతదేశ చలనచిత్ర చరిత్రలోనే మొట్టమొదటి టాకీ చిత్రంతో ప్రారంభించి చిన్న చిన్న పాత్రలతో నటుడిగా, సహాయ దర్శకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, కలర్ ఫిల్మ్ లేబరేటరీ స్థాపకుడు. తెలుగు చిత్రసీమలో ఎవరికీ లేని , ఎవరూ సాధించలేని రికార్డు వీరి సొంతం. భారతదేశ మొట్టమొదటి టాకీ ఆలం ఆరా, దక్షిణాది టాకీలు కాళిదాసు (తమిళం), భక్త ప్రహ్లాద (తెలుగు) ఈ మూడింటిలో నటించారు.

ఎల్.వి. ప్రసాద్ గారూ దర్శకత్వం వహించిన తెలుగు చిత్రాలు 12 మాత్రమే అయితే, ఎన్టీఆర్ గారి మొదటి పది చిత్రాలలో నాలుగు చిత్రాలకు దర్శకత్వం వహించింది ఎల్.వి. ప్రసాద్ గారే. అభ్యుదయవాద చిత్రాలను కూడా అత్యంత వినోదాత్మకంగా తీయవచ్చు అని తన తొలి చిత్రం గృహప్రవేశంతో నిరూపించిన దర్శకులు ఎల్.వి. ప్రసాద్ గారూ. తమిళ నటులు శివాజీ గణేశన్ గారిని తెలుగు తెరకు పరిచయం చేసిన వారు ఎల్.వి. ప్రసాద్ గారే. వినోదభరిత హాస్యాచిత్రాలు ఐదు, ఆరు చెప్పండి అంటే ఎల్.వి. ప్రసాద్ గారూ దర్శకత్వం వహించిన మిస్సమ్మ అందులో తప్పనిసరిగా ఉంటుంది. మిస్సమ్మ చిత్రాన్ని తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ లో కూడా ఎల్.వి. ప్రసాద్ గారే దర్శకత్వం చేసి విజయవంతం చేశారు.

ఎల్.వి.ప్రసాద్ గారు దర్శకత్వం వహించిన చిత్రాలు మొత్తం 30 మాత్రమే. అందులో తెలుగులో 12, హిందీలో 11, కొన్ని మూడు భాషలలో ఉన్నాయి. నిర్మాతగా అన్ని భాషలలో కలిపి 30 మాత్రమే. నిర్మాతగా నిర్మించినవి 30 సినిమాలు మాత్రమే. అందులో 18 సినిమాలు హిందీ చిత్రాలే. వీటిలో ఎల్.వి. ప్రసాద్ గారూ స్వీయ దర్శకత్వంలో నిర్మించినవే. ఎన్టీఆర్ గారూ, సావిత్రి గారూ, సుసర్ల దక్షిణమూర్తి లాంటి ఎంతో మంది నటీనటుల్ని, సహనటుల్ని, సంగీత దర్శకులని, టెక్నీషియన్ లను ఎందరినో చిత్రసీమకు పరిచయం చేశారు ఎల్.వి. ప్రసాద్ గారూ.

అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు (ఎల్.వి.ప్రసాద్ గారూ) 17 జనవరి 1908 నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని పశ్చమ గోదావరి జిల్లా దెందులూరు మండలంలోని సోమవరప్పాడు గ్రామంలో జన్మించారు. తండ్రి అక్కినేని శ్రీరాములు గారూ, తల్లి బసవమ్మ గారూ. అయిదుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. పెద్దబ్బాయి పేరు బసవయ్య, రెండవ అబ్బాయి ఎల్.వి. ప్రసాద్ గారూ, మూడో అబ్బాయి నారాయణ రావు, నాలుగో అబ్బాయి రామచంద్ర రావు, అయిదవ అబ్బాయి సంజీవ రావు, చివరగా అమ్మాయి పేరు సుబ్బమ్మ గారూ.

సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన వీరు విపరీతమైన తెలివితేటలతో, చురుకుగా ఉండేవారు. చదువు మీద శ్రద్ధ కనబరిచే వారు కాదు. ఎల్.వి.ప్రసాద్ గారి చిన్న తమ్ముడు గారు సంజీవ రావు గారూ అక్కినేని సంజీవి అనే పేరుతో ఎడిటర్ గా పనిచేశారు. ధర్మదాత, సిసింద్రీ చిట్టిబాబు, నాటకాల రాయుడు, అత్తగారు కొత్త కోడలు, విశాలి లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. మరొకరు ఎల్.వి.ప్రసాద్ గారి చెల్లెలు సుబ్బమ్మ గారి కుమారుడు కె.బి.తిలక్ గారూ. వీరిని అనుపమ తిలక్ గారూ అని కూడా అంటారు. అనుపమ పిక్చర్స్ స్థాపించి దర్శకుడిగా, నిర్మాతగా చక్కటి, ఉత్తమ అభిరుచి గల చిత్రాలను నిర్మించారు.

ఎల్.వి.ప్రసాద్ గారూ తన 17 యేండ్ల వయస్సులోనే తన మేనమామ కూతురు సౌందర్య మనోహరమ్మ ను ప్రేమించారు. వాళ్ళ మేనమామ ఊరు కూడా దగ్గరలో ఉన్న లక్ష్మీపురం. ఎల్.వి.ప్రసాద్ గారి నాన్న గారూ వ్యవసాయం చేసి అప్పులయ్యి ఊరంతా తెలిసి, చివరికి ఎల్.వి.ప్రసాద్ గారి మేనమామ కూడా తెలియడంతో తన కూతురును ఎల్.వి.ప్రసాద్ గారికిచ్చి పెళ్లి చేయడానికి నిరాకరించారు. దాంతో ఉండబట్టలేని ఎల్.వి.ప్రసాద్ గారు 1924లో పెద్దలను ఎదిరించి సినీ ఫక్కిలో సౌందర్య మనోహరమ్మను పెళ్లి చేసుకున్నారు.

వెంటనే వారికి ఒక కూతురు జన్మించింది. ఎల్.వి.ప్రసాద్ గారు వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయంలో విపరీతంగా నష్టపోయిన వాళ్ళ నాన్న శ్రీరాములు గారూ గత్యంతరం లేక చెతులెత్తేసి దివాళా తీశానని కోర్టు ద్వారా చెప్పించారు. ఆస్తి పేపర్ల మీద ఎల్.వి.ప్రసాద్ గారు కూడా సంతకం పెట్టేశారు. చదువు పూర్తిగా లేదు. వ్యవసాయంలో నష్టం వస్తుంది. ఉద్యోగం చేసే పరిస్థితి కూడా లేదు. తనకు నాటకాలు, సినిమాలు మీద ఉన్న ఆసక్తితో మూకీ సినిమాలు నిర్మించే బొంబాయి వెళ్లాలని ఏలూరులో రైలెక్కి 1930 జనవరి 1 నాడు చేతిలో 100 రూపాయలతో బొంబాయిలో అడుగుపెట్టారు.

బొంబాయిలో రైలు దిగిన ఎల్.వి.ప్రసాద్ గారూ దాదర్ దగ్గరలోని రామకృష్ణ లాడ్జిలో ఒక గది తీసుకుని అందులో వున్నారు. ఒక దొంగ తన పెట్టేలోనున్న వంద రూపాయలలో ఎనభై రూపాయలు దొంగతనం చేశాడు. ఇది చూసిన ఎల్.వి.ప్రసాద్ గారికి ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. దొంగ మిగిల్చిన ఇరవై రూపాయలతో వెనక్కి వెళ్లే ధైర్యం చేయలేక అయోమయంగా ఉన్న తనను గమనించిన ఒక దర్జీ తాను ఉండడానికి నివాసం ఏర్పరచి తనవద్ధనే పనికి కుదుర్చుకున్నాడు. అక్కడికి వచ్చే వాళ్లలో ఒకతను సినిమాలు తీసే వీనస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతను ఎల్.వి.ప్రసాద్ గారికి అందులో పని కల్పించి నెలకు 15 రూపాయలు జీతంగా ఇచ్చేలా ఖరారు చేయించాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ వీనస్ కంపెనీలో పనిచేయడం సాయంత్రం దర్జీ కొట్టు బయట పడుకోవడం చేస్తూ ఉండేవాడు.

నెల గడిచేసరికి ఆ వీనస్ కంపెనీని ఎత్తేశారు. దాంతో మళ్ళీ ఎల్.వి.ప్రసాద్ గారికి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. నటి మోతి వాళ్ళ అన్నయ్య దారీలాల్ తో పరిచయం అయ్యింది. ఇండియా పిక్చర్స్ వారు తీసే మూకీ సినిమా “స్టార్ అఫ్ ది ఈస్ట్” అనే సినిమాలో చిన్న వేషం ఇచ్చారు. ఇండియా పిక్చర్స్ అధినేత అక్తర్ నవాజ్. దాదర్ కు పదిహేను కిలోమీటర్లు దూరంలో ఒక పాడుబడ్డ బంగాళాలో షూటింగ్ చేసేవారు. మూడు రోజులు షూటింగ్ జరిగాక డబ్బులు సర్దుబాటు అవ్వక అక్తర్ నావాజ్ గారూ చెప్పా పెట్టకుండా జెండా ఎత్తేశారు. దాంతో రెండు మూడు రోజులు తిండి తిప్పలు లేక 15 కిలోమీటర్లు నడుచుకుంటూ ఎట్టకేలకు బొంబాయి చేరుకున్నారు. ఆ సినిమా పూర్తి కాకుండానే ఆగిపోయింది. దాంతో మళ్ళీ రోడ్డున పడ్డారు ఎల్.వి.ప్రసాద్ గారూ.

భారతదేశంలో మొట్టమొదటి టాకీ సినిమా “ఆలం ఆరా”. ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీని నిర్వహించే అర్దేశిర్ ఇరానీ గారూ దర్శకత్వం వహించి నిర్మించారు. నటి మోతి కి ఈ చిత్రంలో నటించడానికి అవకాశం లభించింది. దీంతో ఆమెతో పాటు వాళ్ళ అన్నయ్య దారీలాల్ మరియు ఎల్.వి. ప్రసాద్ గారి పేర్లు కూడా అర్దేశిర్ ఇరానీ గారికి చెప్పడంతో వీరిని కూడా నెలకు 15 రూపాయలు జీతంతో ఆ చిత్రంలో తీసుకున్నారు. 1931 మార్చి 14న మొట్టమొదటి టాకీ చిత్రం ఇంపీరియల్ కంపెనీ వాళ్ళ సొంత థియేటర్ మెజిస్టిక్ థియేటర్ (బొంబాయి)లో విడుదలయ్యింది. ఆ విధంగా మొట్టమొదటి టాకీ చిత్రంగా రికార్డులకెక్కిన “ఆలం ఆరా” చిత్రంలో వేషం వేసే అవకాశం దక్కింది ఎల్.వి.ప్రసాద్ గారికి.

ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు గేటు దగ్గర గుమస్తా వద్ధ ఉదయం, సాయంత్రం సంతకం పెట్టేవారు. అప్పుడు పేరు వ్రాసేటప్పుడు అక్కినేని లక్ష్మీ వర ప్రసాదరావు అనే పేరు పెద్దదిగా ఉందని లక్ష్మీ వర ప్రసాద్ అని వచ్చేలా ఎల్.వి.ప్రసాద్ అని వ్రాసారు. అవిధంగా ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ గుమస్తా పుణ్యమా అని అక్కినేని లక్ష్మీ వర ప్రసాదరావు కాస్త ఎల్.వి.ప్రసాద్ గా మారిపోయింది. “ఆలం ఆరా” సినిమా తీస్తున్నప్పుడు ఎల్.వి. ప్రసాద్ గారితో బాటు తెలుగు తెలిసిన వ్యక్తి ఒకరున్నారు. వారే హెచ్.యం.రెడ్డి గారూ. దక్షిణాది భాషలలో కూడా చిత్రాలు నిర్మించే సదుద్దేశ్యంతో అర్దేశిర్ ఇరానీ గారిని సంప్రదించగా, వారు దక్షిణాది భాషల మీద మంచి పట్టు ఉన్న హెచ్.యం.రెడ్డి గారి పేరును సూచించారు. దాంతో దక్షిణాదిన తమిళంలో “కాళిదాసు” అనే తమిళ మొదటి టాకీకి దర్శకత్వం వహించే అవకాశం హెచ్.యం.రెడ్డి గారికి దక్కింది. ఈ కాళిదాసు చిత్రంలో ఎల్.వి. ప్రసాద్ గారికి ఒక వేషం ఇచ్చారు హెచ్.యం.రెడ్డి గారూ. 31 అక్టోబర్ 1931 లో కాళిదాసు విడుదల అయ్యింది.

అలాగే తెలుగులో మొదటి ధ్వని (టాకీ) చిత్రం “భక్త ప్రహ్లాద” అనే చిత్రానికి కూడా హెచ్.యం.రెడ్డి గారే దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 15 సెప్టెంబర్ 1931 నాడు విడుదలయ్యింది. దాంట్లో ఎల్.వి. ప్రసాద్ గారికి మొద్దబ్బాయి అనే వేషం ఇచ్చారు. అది హాస్య పాత్ర గనుక తెలుగులో మొదటి హాస్య నటులు ఎల్.వి. ప్రసాద్ గారే అని చెప్పుకోవాలి. ఈ మూడు చిత్రాలు పూర్తయిన తరువాత ఎల్.వి.ప్రసాద్ గారు తన స్వగ్రామానికి వెళ్లారు. అప్పుడు తన కూతురు చనిపోయింది అనే ఒక విషాద వార్త విని బాధపడ్డారు. ఆ తరువాత తన భార్యను తీసుకుని బొంబాయి వచ్చేశారు.

Remembering L. V. Prasad, the legendary actor , producer and director

కృష్ణ థియేటర్ లో గేటు కీపర్ గా ఉద్యోగంలో చేరారు. అది అలా నడుస్తుండగా సతీసావిత్రి సినిమా తీస్తున్న హెచ్.యం.రెడ్డి గారిని వెళ్లి కలిశారు ఎల్.వి.ప్రసాద్ గారూ. హెచ్.యం.రెడ్డి గారూ సతీసావిత్రి చిత్రంలో ఎల్.వి.ప్రసాద్ గారికి చిన్న పాత్ర ఇచ్చారు. కార్నివాల్ లో బాయ్ గా, యూనిట్ లో బాయ్ గా, థియేటర్ లో గేటు కీపర్ గా, రిప్రెసెంటేటర్ గా ఎన్నో వైవిధ్య భరితమైన పనులు చేశారు ఎల్.వి.ప్రసాద్ గారూ.

1940 ప్రాంతం లో హెచ్.యం.రెడ్డి గారి పిలుపు మేరకు ఎల్.వి.ప్రసాద్ గారూ మద్రాసుకు వెళ్లారు. 1941లో హెచ్.యం.రెడ్డి గారూ “తెనాలి రామకృష్ణ” అనే చిత్రంలో ఎల్.వి.ప్రసాద్ గారూ రెండు పాత్రలు చేశారు. అలాగే తెరవెనుక సహాయ దర్శకుడిగా, స్క్రీన్ ప్లే సహాయకుడిగా నాలుగు పాత్రలు నిర్వహించేసరికి హెచ్.యం.రెడ్డి గారికి ఎల్.వి.ప్రసాద్ గారి సృజనాత్మకత మీద బాగా గురి కుదిరింది. హెచ్.యం.రెడ్డి గారూ ఎల్.వి.ప్రసాద్ గారు కథనాయకుడిగా “ఘరానాదొంగ” అనే చిత్రం తెరకెక్కించారు. ఈ చిత్రం పూర్తవ్వడంతో ఎల్.వి.ప్రసాద్ గారు తిరిగి బొంబాయి వచ్చేశారు. తెలుగు వారు తాండ్ర సుబ్రహ్మణ్యం గారూ ఎల్.వి.ప్రసాద్ గారిని దర్శకుడిగాపెట్టి కష్టజీవి అనే సినిమా మొదలుపెట్టి మధ్యలోనే చేతులెత్తేశారు.

దర్శకునిగా తొలిసారి.. గృహప్రవేశం చిత్రంతో..

1944లో పృథ్వి రాజ్ కపూర్ అనే వ్యక్తి నాటకాలు వేస్తూ ఉండేవారు. ఎల్.వి.ప్రసాద్ గారిని నాటకాలలోకి తీసుకున్నారు. సుమారు 14 సంవత్సరాలు రకరకాల పనులు చేస్తూ అనుభవాన్ని గడించారు. 1946లో సారథి ఫిలిమ్స్ నిర్మాణ సారథ్యంలో,

చల్లపల్లి రాజా, కె.ఎస్.ప్రకాశరావులు నిర్మాతలుగా మొట్టమొదటిసారిగా ఎల్.వి.ప్రసాద్ గారు పూర్తిస్థాయి దర్శకత్వంలో గృహప్రవేశం అనే చిత్రాన్ని తీశారు. అందులో కథనాయకుడు ఎల్.వి.ప్రసాద్ గారు, కథానాయికగా భానుమతి గారూ నటించారు. 1946 ఏప్రిల్ 10 నాడు విడుదలయ్యింది. అత్యంత వినోదాత్మకంగా చిత్రించిన ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. దాంతో ఎల్.వి.ప్రసాద్ గారి కష్టాలు పూర్తిగా సమసిపోయాయి.

Remembering L. V. Prasad, the legendary actor , producer and director

ఘంటసాల గారూ రెండవ సారి పాట పాడిన చిత్రం ఈ గృహప్రవేశం. అలాగే పెండ్యాల నాగేశ్వరావు గారిని సంగీత దర్శకుడిగా పరిచయం చేసిన చిత్రం కూడా గృహప్రవేశం.

పల్నాటియుద్ధం గూడవల్లి గారి స్థానంలో..

గూడవల్లి రామబ్రహ్మం గారు ఎప్పటినుండో తీయాలనుకునే చిత్రం “పల్నాటి యుద్ధం”. గూడవల్లి రామబ్రహ్మం గారి దర్శకత్వంలో మొదలైన ఈ చిత్రం ఆయన గారి అనారోగ్యం కారణంగా చిత్రం పూర్తికావడంలో ఇబ్బందులు ఎదురుకాగా దానికి ఎల్.వి.ప్రసాద్ గారు దర్శకత్వ భాద్యతలు చేపట్టి దానిని పూర్తి చేసారు. 1946 సెప్టెంబర్ 30 వ తేదీన గూడవల్లి రామబ్రహ్మం గారూ హఠాత్తుగా మరణించారు. వారు మరణించిన కొద్దిరోజులకే వారి భార్య గారూ కూడా మరణించారు.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన నెల రోజుల తరువాత అంటే 1947 సెప్టెంబరులో విడుదలైన ఈ “పల్నాటి యుద్ధం” చిత్రం అఖండ విజయం సాధించింది. దురదృష్టం ఏమిటంటే ఈ చిత్రం చూడడానికి గూడవల్లి రామబ్రహ్మం గారు గానీ, శారదా అనే పేరు మీద  స్థాపించిన శారదా ఫిలిమ్స్ గూడవల్లి రామబ్రహ్మం గారి భార్య గారూ గానీ లేకపోవడం విషాదకరం. చిత్రం విడుదలయ్యినప్పుడు పోస్టర్ లోనూ, పబ్లిసిటీ లోనూ కీ.శే గూడవల్లి రామబ్రహ్మం గారి కళాసృష్టి అని ఓ ట్యాగ్ లైన్ లో వ్రాశారు.

స్వంతంత్ర ఫిల్మ్స్ సంస్థ తరుపున యార్లగడ్డ శివరామప్రసాద్, కె.ఎస్.ప్రకాశరావులు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “ద్రోహి”. ఈ చిత్రానికి ఎల్.వి.ప్రసాద్ గారూ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సంగీతం దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావును తొలిసారి సంగీత దర్శకునిగా అవకాశం ఇచ్చారు ఎల్.వి.ప్రసాద్ గారూ. ఈ చిత్రం 1948 డిసెంబర్ 10 న విడుదలయ్యింది. ఓ మాదిరిగా అడినా కూడా ఈ చిత్రంతో దర్శకుడిగా ఎల్.వి.ప్రసాద్ గారికి మంచి పేరు వచ్చింది.

ఎం.ఆర్.ఏ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నటి కృష్ణవేణి గారు మరియు ఆమె భర్త మీర్జాపురం రాజా వారు కలిసి నిర్మించిన చిత్రం “మనదేశం” కు కూడా ఎల్.వి.ప్రసాద్ గారు దర్శకత్వం వహించారు. నటి కృష్ణవేణి, చిత్తూరు వి నాగయ్య గారూ కలిసి నటించిన ఈ చిత్రంతో నందమూరి తారక రామారావు గారూ చిత్రరంగానికి పరిచయం అయ్యారు. ఈ చిత్రం 1949లో విడుదలయ్యింది.

విజయా వారి చిత్ర నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నాగిరెడ్డి, చక్రపాణి నిర్మాణంలో, ఎల్.వి.ప్రసాద్ గారి దర్శకత్వంలో షావుకారు జానకి, నందమూరి తారక రామారావు నాయిక, నాయకులుగా “షావుకారు” చిత్రం నిర్మించారు. 1950 లో విడుదల అయిన ఈ చిత్రం ఓ మోస్తరు విజయం సాధిచింది. ఈ చిత్రంతోనే జానకి గారూ తొలిసారిగా చిత్రసీమకు పరిచయమయ్యారు. తొలి సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు.

సాధనా పిక్చర్స్ నిర్మాణ సంస్థ సి.వి.రంగనాథదాసు గారూ, కె.వి.కృష్ణ గారూ నిర్మాణం చేసిన చిత్రం “సంసారం”. దీనికి కూడా ఎల్.వి.ప్రసాద్ గారూ దర్శకత్వం వహించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ చిత్రం మధ్యలో ఆగిపోయే పరిస్థితి వుంటే లక్ష్మీరాజ్యం గారి ఆర్థిక సహాయంతో పూర్తి చేసిన ఈ చిత్రం 29 డిసెంబరు 1950 న విడుదలయ్యిన ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. సుసర్ల దక్షిణామూర్తి ని సంగీత దర్శకునిగా పరిచయం చేశారు ఎల్.వి.ప్రసాద్ గారూ.

విజయా ప్రొడక్షన్స్ బ్యానర్ లో నాగి రెడ్డి, చక్రపాణి గార్లు నిర్మాణంలో ఎల్.వి.ప్రసాద్ గారూ దర్శకత్వం వహించిన చిత్రం “పెళ్లిచేసి చూడు”. నందమూరి తారకరామారావు, జి.వరలక్ష్మి, సావిత్రి, యస్.వి.రంగారావు గార్లు నటించిన ఈ చిత్రం 29 ఫిబ్రవరి 1952 నాడు విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించింది. ఈ చిత్రంతో సావిత్రి గారిని చిత్రరంగానికి పరిచయం చేశారు ఎల్.వి.ప్రసాద్ గారూ.

నాగిరెడ్డి, చక్రపాణి గార్ల నిర్మాణంలో, ఎల్.వి.ప్రసాద్ గారి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మిస్సమ్మ. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, ఎస్వీ రంగారావు, జమున, రేలంగి వెంకటరామయ్య వంటి తారాగణం నటించిన పూర్తి హాస్యభరిత చిత్రం “మిస్సమ్మ”. ఈ చిత్రం 12 జనవరి 1955 న విడుదలై అద్భుతమైన విజయం సాధించింది. ఏవీఎం ప్రొడక్షన్స్ వారు 1957లో మిస్సమ్మ సినిమాని హిందీలోకి మిస్ మేరీ గా నిర్మించారు. ఎల్‌.వి.ప్రసాద్‌ గారికి “మిస్ మేరీ” చిత్రం బాలీవుడ్‌లో దర్శకుడిగా మొట్టమొదటి సినిమాగా నిలిచింది.

నాగిరెడ్డి, చక్రపాణి గార్ల నిర్మాణంలో, ఎల్.వి.ప్రసాద్ గారి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “అప్పుచేసి పప్పు కూడు”. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, ఎస్వీ రంగారావు, జమున, రేలంగి వెంకటరామయ్య, కొంగర జగ్గయ్య వంటి తారాగణం నటించిన పూర్తి హాస్యభరిత చిత్రం “అప్పుచేసి పప్పు కూడు”. ఈ చిత్రం 14 జనవరి 1959 న విడుదలై అద్భుతమైన విజయం సాధించింది.

పరదేశి (1953), పెంపుడు కొడుకు (1953) లాంటి చిత్రాలు కూడా ఎల్.వి ప్రసాద్ గారు దర్శకత్వం వహించినవే. నాటి తెలుగు చిత్రం మూగమనసులు (1964) చిత్రాన్ని “మిలన్” పేరిట హిందీలో ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో ఎల్.వి.ప్రసాద్ గారు పునర్నిర్మించగా, ప్రేక్షకాదరణ పొంది 175 రోజులు విజయవంతంగా ఆడింది.

‘సంసారం’ చిత్ర నిర్మాత రంగనాథదాస్‌ గారూ 1955 లో మద్రాసులో ఒక సినిమా స్టూడియో నిర్మాణాన్ని తలపెట్టి, మొదలుపెట్టి, డబ్బులు సర్దుబాటు అవ్వక, ఆర్థిక ఇబ్బందులతో ఆ నిర్మాణాన్ని మధ్యలో వదిలేశారు. దాన్ని ఎల్‌.వి.ప్రసాద్‌ కొనుగోలు చేసి ప్రసాద్‌ స్టూడియోని నిర్మించారు. అమెరికాలో చదువు పూర్తిచేసుకుని వచ్చిన ఎల్.వి.ప్రసాద్‌ గారి రెండవ కుమారుడు రమేష్‌ గారూ ఆ స్టూడియో బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

హైదరాబాదులో ప్రసాద్ ఫిలిం లేబొరేటరీ (ప్రాసెసింగ్‌ యూనిట్‌) స్థాపించి విదేశాలలో వున్న అత్యాధునిక సదుపాయాలతో సినిమా ప్రింట్లు వేయించుకునే అవకాశం కల్పించారు. ఫిలిం అండ్‌ టెలివిజన్‌ అకాడమీ కూడా స్థాపించారు. వివిధ నగరాలు, పట్టణాలలో ప్రసాద్ మల్టిప్లెక్స్‌ పేరిట సినిమా హాళ్లు, మాల్‌ లు నిర్మిస్తున్నారు.

1979 వ సంవత్సరంలో నాటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జి. రామచంద్రన్ గారి చేతులమీదుగా ‘రాజా శాండో మెమోరియల్‌ అవార్డు’ ను అందుకున్నారు.

నాటి భారత ఉపరాష్ట్రపతి ఎమ్.హిదయతుల్లా చేతులమీదుగా 1980లో ‘ఉద్యోగ పత్ర’ అవార్డును తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ పభుత్వం వారిచే 1980వ సంవత్సరంలో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని స్వీకరించారు.

భారతీయ సినిమాకు గణనీయమైన సేవలు చేసినందుకు గానూ 1982 వ సంవత్సరంలో ఎల్.వి. ప్రసాద్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది.

దక్షిణ భారత టెక్నీషియన్స్‌ అసోసియేషన్‌ వారు 1982 వ సంవత్సరంలో ‘రామనాథ్‌ అవార్డు’నిచ్చి సత్కరించారు.

 ఈనాడు సంస్థ నిర్వహించిన ‘సితార’ అవార్డుల ఉత్సవంలో భాగంగా 1983 వ సంవత్సరంలో ‘కళాతపస్వి’ బిరుదు ప్రదానం చేశారు.

ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి 1985 వ సంవత్సరంలో గౌరవ డాక్టరేట్ కళాప్రపూర్ణ పురస్కారం దక్కింది.

ఆంధ్రప్రదేశ్‌ కళా వేదిక 1987లో ‘ఆంధ్రరత్న’ పురస్కారం ఇచ్చి గౌరవించింది.

ఫిలింఫేర్ సంస్థ వారు 1992 వ సంవత్సరంలో ఎల్.వి.ప్రసాద్ గారికి జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు.

1991 వ సంవత్సరంలో డాక్టర్‌ పిన్నమనేని అండ్‌ శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్‌ పురస్కారం లభించింది.

‘లైఫ్‌ టైమ్‌ కంట్రిబ్యూషన్‌’ అవార్డును రాష్ట్రపతి జ్ఞాని జైల్‌ సింగ్‌ చేతులమీదుగా ఎల్.వి.ప్రసాద్ గారూ అందుకున్నారు.

2006 సెప్టెంబరు 5న ఎల్.వి. ప్రసాదు గారి స్మారకార్థం భారత తపాలా శాఖ వారు  ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేశారు.

ఎల్.వి.ప్రసాద్ కంటి వైద్యశాల నిర్మాణంలోనూ స్వార్థముందని చెప్పేవారు ఎల్.వి.ప్రసాద్ గారూ. ఎందువలనంటే తమ కంటి వైద్యశాలలో చికిత్స పొందిన వారు కళ్ళు బాగయితే మళ్ళీ సినిమాలు చూస్తారు కదా అన్నది ఎల్.వి.ప్రసాద్ గారి అభిప్రాయం. ‘సర్వేంద్రియాణాం నయనం ప్రదానం’ అనే సూక్తికి అనుగుణంగా 1987లో బజారా హిల్స్‌లో ‘ఎల్‌.వి.ప్రసాద్‌ కంటి వైద్యశాల’ని నెలకొల్పారు. ఇందుకోసం భూనిని, డబ్బును విరాళంగా ఇచ్చారు ఎల్.వి.ప్రసాద్ గారూ. ప్రఖ్యాత నేత్ర వైద్యులు గుళ్ళపల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పేదలకు కంటి వైద్యం అందిస్తున్నారు. అలాగే నేడు “ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల” దేశవ్యాప్తంగా పేరొందింది.

భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన ఎల్.వి. ప్రసాద్ గారు తన 82వ యేట 1994 జూన్ 22న మరణించారు. భారతీయ సినిమా రంగంలో ఎల్.వి.ప్రసాద్ గారు ఓ వటవృక్షం. ఆయన నీడన ఎందరో కళాకారులు, సాంకేతిక నిపుణులు, నటీనటులు, రాణించి, చిత్రసీమలో చోటు సంపాదించగలిగారు. చిత్రసీమలో తాను సంపాదించినది, అందులోనే పెట్టుబడిగా పెట్టి అనేక శాఖలకు విస్తరించారు. తెలుగు చిత్రసీమకే కాదు భారతీయ సినిమా రంగానికే ఎల్.వి.ప్రసాద్ గారు చేసిన సేవలు మరపురానివి, మరువలేనివి. అత్యాధునిక సదుపాయాలు కలిగిన ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి వుండే రోడ్డుకు ‘ఎల్‌.వి.ప్రసాద్‌ మార్గ్‌’ అని పేరు పెట్టారు. జూబిలీ హిల్స్‌ చెక్‌ పోస్ట్‌ వద్ద ఎల్వి ప్రసాద్‌ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించారు.

Show More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button