CINEMATelugu Cinema

అల్లరి అల్లుడు మూవీ ఆ రోజుల్లోనే 101 అడుగుల కటౌట్

కింగ్ నాగార్జున నటించిన ఎన్నో హిట్ సినిమాలలో “అల్లరి అల్లుడు” మూవీ ఒకటి. పక్కా మాస్ తరహాలో సాగుతూ థియేటర్లలో అదరగొట్టేసింది. నాగార్జున కెరీర్‌లో టాప్ టెన్ కమర్షియల్ మూవీస్‌లో ఒకటిగా నిల్చింది. ఆ చిత్రం విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. శివ తర్వాత విభిన్న తరహాలలో చిత్రాలు చేసిన నాగ్‌కి నిర్ణయం, కిల్లర్ మూవీస్ తప్ప మిగిలినవేవి హిట్ ఇవ్వలేదు. అయితే, ఆ సమయంలో పక్కా మాస్ మూవీగా ప్రెసిడెంట్ గారి పెళ్ళాం హిట్ ఇచ్చింది. దాంతో అలాంటి మాస్ కథలనే రాయాలని నిర్మాతలకు చెప్పారు.

నిర్మాత డి.శివప్రసాదరెడ్డి ఇక ఆలస్యం చేయకుండా ప్రెసిడెంట్ గారి పెళ్ళాం కథ రాసిన తోటపల్లి మధుకి మద్రాసులో ఓ రూమ్ తీసి, నాగ్‌కి మంచి మాస్ కథ రాయమని చెప్పారు. అప్పుడు మధు.. అత్త, అల్లుడు మధ్య సరదా సీన్స్ తో కథ రెడీ చేయగా.. కథ నిర్మాతకు, నాగ్‌కి నచ్చేసింది. ఈ సినిమాకు డైరెక్టర్‌గా కోదండరామిరెడ్డి పని చేశారు. నాగ్ సరసన హీరోయిన్లుగా నగ్మా, మీనాలను ఎంపిక చేశారు. పొగరుబోతు అత్తగా బ్రాండ్ అంబాసిడర్‌గా నిల్చిన వాణిశ్రీ, మురళీమోహన్, రావు గోపాలరావు, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, చలపతిరావు ప్రధాన పాత్రలను పోషించారు. 

1993 ఏప్రిల్‌లో షూటింగ్ స్టార్ట్ చేశారు. చెన్నై ఏవిఎం స్టూడియో, ముదుమలై పార్క్, ఊటీ, హైదరాబాద్ అన్నపూర్ణ, పద్మాలయ స్టూడియోస్, రాజమండ్రిలలో షూటింగ్ చేసారు. చాలా టైటిల్స్ అనుకున్నా చివరకు “అల్లరి అల్లుడు” పేరుతో నాగ్ పుట్టినరోజు ఆగస్టు 29న పోస్టర్ రిలీజ్ చేశారు. కీరవాణి అందించిన సంగీతం కారణంగా ఆడియో ఆల్బమ్ హిట్. పాటలన్నీ మారుమోగాయి. ఈ మూవీ అక్టోబర్ 6న 72 ప్రింట్లతో 142 థియేటర్లలో విడుదలైంది.

నాగ్ అభిమానులు ఈ సినిమాకు రాజమండ్రిలో 101 అడుగుల కటౌట్ పెట్టడం సంచలనంగా మారింది. కటౌట్ చూడ్డానికే థియేటర్‌కి చాలామంది వచ్చారు. మొదటి వారం 1కోటి 10లక్షల షేర్ కలెక్ట్ చేసింది. అంతేకాకుండా, 22 సెంటర్స్‌లో 100 డేస్ ఆడింది. టోటల్ గా ఈ చిత్రం 7 కోట్ల 20 లక్షల షేర్ కలెక్ట్ చేసింది. 1993 టాప్ గ్రాసర్‌గా ఆల్‌టైం టాప్ 4 మూవీగా నిల్చింది.

Show More
Back to top button