CINEMATelugu Cinema

తెలుగు చిత్ర పరిశ్రమ దర్శకులలో నీలకంఠుడు.. కృష్ణ వంశీ..

సినిమా పరిశ్రమకు దర్శకుడు అక్షయపాత్రలాంటి వాడు. దర్శకుడు మంచి కథను అద్భుతంగా తెరకెక్కించి ప్రేక్షకులను అబ్బురపరిస్తే సినిమా అద్భుతమైన విజయం సాధించినట్టే. దాంతో నిర్మాత రెట్టించిన ఉత్సాహంతో ఇంకొన్ని సినిమాలను నిర్మిస్తూంటాడు. దర్శకునికి సినిమా చిత్రీకరణలో పూర్తి స్వేచ్చ ఉన్నా కొన్నిసార్లు నిర్మాతల ఒత్తిళ్లకు, కథనాయకుల డిమాండ్ ల మేరకు తలొగ్గి రాజీపడాల్సి వస్తుంది. అలా రాజీపడిన సందర్భంలో దర్శకులు కొన్నిసార్లు సినిమా అనుకున్నరీతిలో తెరకెక్కించలేక పరాజయం మూటగట్టుకున్న చిత్రాలు కోకొల్లలు.

అత్యధిక శాతం దర్శకులు ఎల్లపుడూ వాణిజ్యాంశాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే సినిమాలు తీస్తారు. అతి తక్కువ మంది దర్శకులు తమ సృజనాత్మకతకు అనుగుణంగా సినిమాలు తీస్తారు. ఆ కోవకు చెందిన వారు ప్రముఖ దర్శకులు కృష్ణ వంశీ. ఆయన తెలుగుచిత్ర సీమకు ఆణిముత్యాలను అందించారు. అజరామర చిత్రాలను తెరకెక్కించారు. కుటుంబ కథలకు గ్లామర్ మేళవించి అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకుల విస్తరిలో వడ్డించారాయన. 

గులాబీ రూపంలో సున్నితమైన సహజమైన ప్రేమకథను ప్రేక్షకులకు రుచి చూపించి తెలుగు యువత హృదయాన్ని కొల్లగొట్టిన కృష్ణవంశీ , అందమైన కథతో, అపురూపమైన అనుబంధాలతో కుటుంబ కథా చిత్రాలను ఇంత అందంగా కూడా తీయవచ్చు అని నిన్నే పెళ్లాడుతా తో నిరూపించారు. వాణిజ్యాంశాలను దృష్టిలో పెట్టుకుని ఏనాడూ సినిమాలు తెరకెక్కించని కృష్ణవంశీ గుణచిత్ర నటులు బ్రహ్మాజీ, రవితేజ లను కథనాయకులుగా పెట్టి స్వీయనిర్మాణం లో సింధూరం తెరకెక్కించడం ఒక సంచలనం.

లక్షల పారితోషికం ఆశచూపుతూ పదుల సంఖ్యలో నిర్మాతలు తన చుట్టూ తిరుగుతూ ఉన్నా తాను అనుకున్నదానికే కట్టుబడి ఉండి పరాజయాన్ని సైతం ముద్దాడగలిగిన దర్శకులు కృష్ణవంశీ మాత్రమే. బృందావనంలో అందమైన కృష్ణుడు పాత్రధారి, సత్యభామ రుక్మిణి కలగలిసిన అల్లరి పిల్లను ఆటపట్టిస్తూ అందంగా సాగే ఒక ఆణిముత్యాన్ని తెరకెక్కించిన కృష్ణవంశీ, సమస్యల సుడిగుండాలలో చిక్కుకుని చిన్న చిన్న ఆనందాలను కోల్పోతున్న మనుషుల కోసం ప్రయోగాత్మక చిత్రంగా “చక్రం” ను తీర్చిదిద్దిన విధానం అద్భుతమనే చెప్పాలి.

ఒక అంత:పురం, ఒక ఖడ్గం, ఒక రాఖీ, ఒక చందమామ, ఒక మహాత్మ , ఒక శశిరేఖా పరిణయం, ఒక మొగుడు, ఒక నక్షత్రం, ఒక రంగమార్తాండ ఇలా అందమైన ఆణిముత్యాలను అద్భుతంగా చెక్కిన “జక్కన” దర్శకులు కృష్ణవంశీ. చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా 29 సంవత్సరాలు, 21 సినిమాలు. అజరామరాలు, ఆణిముత్యాలు. పరాజయాలు, అయినా కల్ట్ క్లాసిక్ లు. ఇది కృష్ణవంశీ సినిమా జీవిత చక్రం. ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించి, సినిమాల మీద ఇష్టంతో మద్రాసు చేరుకొని అనేక కష్టాలు అనుభవించి, ఆకలికి తట్టుకుని, బాధలను ఓర్చుకుని, అవమానాలను దిగమింగి, చేసే వృత్తిలో రాజీపడకుండా పడుతూ లేస్తూ తెలుగు చిత్రపరిశ్రమలో దర్శకుడిగా హిమగిరి శిఖరాన్ని చుంబించిన దర్శక ధీరుడు కృష్ణవంశీ.

దూరం నుండి చూసేవాళ్లకు ఆయనొక పొగరుబోతు, మొండివాడు. దగ్గరనుండి చూసే వాళ్లకు ఆయనొక అసామాన్యుడు, అసాధ్యుడు, నిరాడంబరుడు, నిగర్వి. విజయాన్ని ఆస్వాదించగలడు, పరాజయాన్ని నవ్వుతూ స్వీకరించగలడు. చిత్ర పరిశ్రమలో ఆయనొక నీలకంఠుడు. విజయానికి పొంగిపోడు, పరాజయానికి కృంగిపోడు. తానొక స్థితప్రజ్ఞుడు. తాను పొందిన సహాయానికి ఋణం తీర్చుకోగల దినేశ్వరాత్మజుడు. ఈ రోజు ఆయన జన్మదినం సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, సినీ ప్రస్థానం మీకోసం..

జీవిత విశేషాలు…

జన్మ నామం :    పసుపులేటి వెంకట బంగార్రాజు 

ఇతర పేర్లు  :  కృష్ణ వంశీ 

జననం    :     28 జూలై 1962    

స్వస్థలం   :   తాడేపల్లిగూడెం , పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ 

వృత్తి      :     చిత్ర దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్, నృత్య దర్శకుడు.

జీవిత భాగస్వామి  :   రమ్యకృష్ణన్ 

తండ్రి    :     రామచంద్ర మూర్తి 

పిల్లలు   :  రిత్విక్ 

పురస్కారాలు    :   జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2, ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 3, నంది అవార్డులు 9..

నేపథ్యం…

కృష్ణవంశీ అసలు పేరు వెంకట బంగార్రాజు. ఆయన 28 జూలై 1962 నాడు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జన్మించారు. వారి తండ్రి రామచంద్ర మూర్తి. ఆయన పి.డబ్ల్యు.డి. లో సూపర్వైజర్ గా చేరి సహాయక ఇంజనీరుగా పదోన్నతి పొందారు. కృష్ణవంశీ ని చిన్నప్పుడు అందరూ బంగారం అని ఏడిపిస్తూ ఉండేవారు. ఆయనకన్నా ముందు ఒక అబ్బాయి పుట్టి చనిపోయాడు. అందువలన కృష్ణవంశీ కి వాళ్ళ నానమ్మ బంగారమ్మ పేరు కలిసేలా బంగార్రాజు అని పెట్టేశారు. చిన్నప్పటి నుంచి ఆయనకు బంగార్రాజు పేరంటే ఇష్టం ఉండేది కాదు. దాంతో ఆయన విశాఖపట్నంలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు తన పేరును వంశీకృష్ణగా మార్చుకొని గెజిట్ లో వేయించారు. వాళ్ళ నాన్నగారు ఉద్యోగరీత్యా అనేక ఊర్లు తిరిగారు. ఆయన ఆరవ తరగతి, ఏడవ తరగతి కర్నూల్ జిల్లాలోని నందికొట్కూరులో చదివారు. ఆయన బడికి వెళ్లే దారిలోనే రెండు సినిమా ప్రదర్శన శాలలు (సినిమా థియేటర్లు) వుండేవి. బడికి వెళ్లాలంటే వాటిని దాటుకుంటూ వెళ్ళాల్సిందే. వాటి ముందు అతికించిన సినిమా పోస్టర్లు కృష్ణవంశీని విపరీతంగా ఆకర్షించేవి. 

“అల్లూరి సీతారామరాజు”, “ప్రేమ్ నగర్”, “లోకం చుట్టిన వీరుడు” , “పిల్లాపిడుగా”, “తాత మనవడు” మొదలగు సినిమాల పోస్టర్లన్నీ కూడా ఆయన ఆలోచనలు సినిమాల వైపు మళ్ళింపజేశాయి. ఆయనకు ఒక సైకిల్ ఉండేది. తన మిత్రులెవరైనా ఆ సైకిల్ తొక్కాలంటే వారు ఆయనను సినిమా థియేటర్ లో కూర్చోబెట్టి తీరాల్సిందే, ఆ సినిమా చూపించాల్సిందే. ఆవిధమైన షరతులతో ఆయన సినిమా చూసేవారు, మిత్రులేమో ఆయన సినిమా చూస్తున్నంతసేపు ఆ సైకిల్ తొక్కేవారు. సినిమాలు చూసేందుకు కృష్ణవంశీ పుస్తకాలు అమ్ముకునేవారు. ఇంట్లో పోపు డబ్బాలో అమ్మ దాచుకున్న డబ్బులను దొంగతనంగా తీసుకొనేవారు, అందుకు పర్యవసానంగా దెబ్బలు కూడా తినేవారు. ఆయన తనకు పదవ తరగతి వచ్చేసరికి దర్శకుడు, ఛాయాగ్రాహకుడు, కూర్పు (ఎడిటింగ్), ఇలా ఒక్కొక్కటిగా సినిమా పరిభాష కొంచెం కొంచెం అర్థం అవ్వసాగింది. ఈవిధంగా చిన్నప్పటి నుండే ఆయనకు “విశ్వనాథ్”, “బాపు” ల గురించి థియేటర్లలో తెలిసుకోవాల్సి వచ్చింది.

విద్యాభ్యాసం…

తెలుగు సాహిత్యాన్ని అమితంగా ఇష్టపడే కృష్ణవంశీ యండమూరి వీరేంద్రనాథ్, మల్లాది రామకృష్ణ శాస్త్రి, యద్దనపూడి సులోచనారాణి నవలలు బాగా చదివేవారు. మధుబాబు, కొమ్మూరు వేణుగోపాలరావు మొదలగు వారు వ్రాసిన అపరాధ పరిశోధక (డిటెక్టివ్) నవలా సాహిత్యాన్ని కూడా చదివేసేవారు. అమ్మకు దైవభక్తి ఎక్కువ. ఆమె దగ్గర రామాయణం, మహాభారతం చదివేవారు. వీటితో పాటు ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ, రీడర్స్ డైజెస్ట్, సన్ మొదలగు ఆంగ్ల పత్రికలు కూడా చదువుతూ ఉండేవారు. తన మనసెప్పుడూ రెండు రకాల ఆలోచనల మధ్య కొట్టుమిట్టాడేది. తన తండ్రి చూపిన దారిలో వెళ్లి చదువుకొని ఉద్యోగం చేయడం మొదటిదైతే, తనకిష్టమైన సినిమా రంగాన్ని ఎంచుకునే మార్గంలో పయనించడం రెండోది. రాజీపడేవాడు మొదటిదానికే మొగ్గుచూపుతాడు. కానీ కృష్ణవంశీ రెండోదానికి ఓటు వేశారు. పదవ తరగతి నుండి ఆయనకు చదువుకంటే సినిమాలే ముఖ్యమైపోయాయి. ఇంటర్మీడియట్ చదివే రోజులలో రాజమహేంద్రవరం వెళ్లి హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూసేవారు. 

నచ్చిన సినిమాలు మళ్ళీ మళ్ళీ చూసే అలవాటున్న ఆయన రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన “అడవి రాముడు”, “వేటగాడు”  వంటి సినిమాలు సినిమాలు తక్కువలో తక్కువ 30 సార్లు పైగా చూసుంటారు. ఇక తాను అమితంగా అభిమానించే “అల్లూరి సీతారామ రాజు” సినిమానైతే కొన్ని వందల సార్లు చూసుంటారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇంటర్మీడియట్ అయిపోయాక పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరాలనుకున్నారు. కానీ వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. పై చదువులు చదివిన తరువాతనే ఏదైనా అనేవారు. గుంటూరులోని రవి కళాశాలలో “ఎంసెట్ కోచింగ్” తీసుకున్నారు. ప్రవేశ పరీక్షలో ర్యాంకు రాలేదు. దాంతో బి.ఎస్సీ తాడేపల్లిగూడెం లోనే పూర్తిచేశారు. పి.జి చేయడానికి ఆగ్రా యూనివర్సిటీ వెళ్లారు. అక్కడ  తన జీవితంలో రెండో మలుపుకు కారణమైన నోబుల్ నాయుడు (పరచూరు గోపాలకృష్ణ గారి శిష్యుడు) పరిచయం అయ్యారు. ఆయన కృష్ణవంశీకి సీనియర్. అతడికి నాటకాలతో పరిచయం ఉంది. అతడితో కృష్ణవంశీ ఎక్కువగా సినిమాల గురించి, స్క్రీన్ ప్లే గురించి విస్తృతంగా చర్చించేవారు.

చిత్రరంగ ప్రవేశం…

పి.జి అయిపోయింది. నోబుల్ నాయుడు, కృష్ణవంశీ ఇద్దరు కలిసి మద్రాసులో ఉన్న పరుచూరి గోపాలకృష్ణ వద్దకు వెళ్లాలనుకున్నారు. విషయం తెలిసుకున్న కృష్ణవంశీ  నాన్నగారు మండిపడ్డారు. మద్రాసు మాట ఎత్తితే చిర్రుబుర్రులాడేవారు. చేసేదిలేక తాడేపల్లిగూడెంలోనే ఉంటూ పంపిణీదారుల నుండి కొన్ని సినిమాలను కొనుగోలు చేసి తన మిత్రులతో కలిసి వ్యాపారం చేసేవారు. ఆ విధంగా ఖైదీ సినిమా కొని పంపిణీచేశారు. ఆ థియేటర్ వద్ద టికెట్లు అమ్మారు కూడా. ఆ సినిమా ప్రదర్శన శాల (థియేటర్) ప్రక్కనే రాజా ఫోటో స్టూడియో ఉండేది. దాని యజమాని మద్రాసుకి వెళ్లి సినిమా తారలతో ఫోటోలు దిగివస్తుండేవారు. ఆయన వద్ద నెగిటివ్ ప్రాసెసింగ్ చేయడం లాంటి పనులు నేర్చుకున్నారు కృష్ణవంశీ. ఆయనకు సినిమా పట్ల రోజు రోజుకు ఆకర్షణ ఎక్కువైపోతోంది. దాంతో ఉన్నట్టుండి ఒకరోజు గ్రూప్-1 పరీక్షలకి చదువుకోవాలనే సాకుచెప్పి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మద్రాసుకి బయలుదేరి వెళ్లారు. అలా వెళ్లిన ఆయన ఇంటికి తిరిగిరాకుండా మద్రాసులో మకాం పెట్టేశారు.

వాళ్ళ దూరపు బంధువు ఒకతను ట్రిప్లికేన్ లో చదువుకుంటుండేవాడు. ఆయనతో బాటే తన రూములో ఉంటూనే అక్కడ నుండి చాలా దూరంలో వున్న టీ.నగర్, కోడంబాకం, వడపళని వెళ్లి సినిమా ప్రయత్నాలు చేసేవారు. తన ప్రయత్నం ఫలించి తన జీవితానికి మొదటి మలుపుగా రవి ప్రసాద్ అవుట్ డోర్ యూనిట్ లో సహాయ ఛాయాగ్రాహకులు (అసిస్టెంట్ కెమెరా మెన్) గా అవకాశం లభించింది. కెమెరామెన్ భోజనానికి వెళ్ళినప్పుడు కెమెరా దగ్గర కాపలా కాయడం, లెన్స్ శుభ్రం చేయడం, లెన్స్ మోయడం, ఫిల్మ్ లోడ్ చేయడం ఇవి తన విధులు. ఆ క్రమంలోనే పోరాట సన్నివేశాలు, నృత్య సన్నివేశాల చిత్రీకరణ గురించి తెలుసుకుంటూ ఉండేవారు. ఉన్నట్టుండి నెత్తిన పిడుగుపడ్డట్టు ఆయనను వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళ నాన్న గారు తనని చెడామడా తిట్టేసి తన ఊరికి తీసుకెళ్లారు. నెలరోజుల పాటు ఇంట్లోనే. నెలరోజుల గృహనిర్భందం నుండి బయటపడి మరోసారి ఇంట్లో నుంచి పారిపోయి తిరిగి మద్రాసుకు చేరుకున్నారు.

బ్రహ్మాజీ కి అతి ఖరీదైన భోజనం…

ఇంటి నుండి డబ్బులు తెచ్చుకోకూడదు, అడుక్కోకూడదు, సినిమా రంగం నుంచి బయటకు వెళ్లకూడదు. ఇది కృష్ణవంశీ లక్ష్యం. కోరుకున్న దర్శకత్వ శాఖలో పని దొరికింది. సినిమా నిర్మాణంలో జాప్యం జరుగుతూ ఉండడంతో తనకు ఖాళీ సమయం దొరికేది. ఆ సమయంలో తనకు పూట గడవడానికి రకరకాల పనులు చేసేవారు. అప్పట్లో ప్రముఖ హీరో అర్జున్ అభిమానులకు ఆయన పేరు మీద ఉత్తరాలు వ్రాసేవారు. ఒక్కో ఉత్తరానికి కృష్ణవంశీకి రెండు రూపాయలు ఇచ్చేవారు. సినిమాలకు సెన్సార్ స్క్రిప్టులు వ్రాసేవారు. నలభై రూపాయల కోసం ఒక మలయాళ సినిమాలోని క్లబ్ పాటకు జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా కనిపించారు.

ఎన్ని ఇబ్బందులు వచ్చినా సినిమా పరిశ్రమలోనే తేల్చుకోవాలని ధృడంగా నిశ్చయించుకున్నారు. అందువలననే సినిమాకు సంబంధించి అన్ని పనులు చేసే వారు. ఒక్కోసారి నాలుగైదు రోజులు పస్తులు ఉండి భోజనం చేయని సందర్భాలు ఉన్నాయి. ఒకరోజు శోష వచ్చి పడిపోతే నటులు బ్రహ్మాజీ వచ్చి భోజనం పెట్టించారు. అందుకు కృతజ్ఞతగా కృష్ణవంశీ దర్శకులైన తరువాత తన స్వీయ నిర్మాణంలో బ్రహ్మాజీని కథానాయకుడిగా పెట్టి సింధూరం నిర్మించారు. నిజానికి ఆ సినిమా నిర్మాతగా ఆయనకు భారీ నష్టాన్ని మిగిల్చింది. తనకు భోజనం పెట్టించినందుకు బ్రహ్మాజీకి అతి ఖరీదైన భోజనం పెట్టించి తన ఋణం ఆవిధంగా తీర్చుకున్నారు.

రామ్ గోపాల్ వర్మ వద్ద సహాయకుడిగా…

కె.రాఘవేంద్ర రావు, కోదండ రామిరెడ్డి, కోడి రామకృష్ణ, రవిరాజా పినిశెట్టి, బాపయ్య లాంటి ప్రముఖ దర్శకుల ఇంటి చుట్టూ అవకాశాల కోసం కాళ్ళు అరిగిపోయేలా తిరిగేవారు. తిరిగి తిరిగి అలిసిపోయేవారు. కానీ ఎడిటర్ గౌతమ్ రాజు తనకు ఆశ్రయం ఇచ్చారు. దాంతో కృష్ణవంశీ ఖాళీ సమయంలో ఎడిటర్ గౌతమ్ రాజు గారి వద్ద పని నేర్చుకుంటూ ఉండేవారు. గౌతమ్ రాజు దగ్గరికి ఎడిటింగ్ పని మీద చాలా మంది సహాయ దర్శకులు, సహా దర్శకులు   వస్తుండేవారు. అలా ఒకరోజు ఆయన వద్దకు ఏదో పని మీద శివ నాగేశ్వరరావు వచ్చారు. రాంగోపాల్ వర్మ అనే కొత్త దర్శకుడు తీయబోయే సినిమాకు ఒక కొత్త సహాయ దర్శకుడి కోసం వెతుకుతున్నానని చెప్పారు. ఆ సినిమాకు శివ నాగేశ్వరావు కో-డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.

అప్పుడు గౌతమ్ రాజు కృష్ణవంశీని చూపించి ఆయనతో పాటు పంపించారు. డెనిమ్ జీన్స్, టీ షర్ట్ వేసుకుని చేతిలో ఆంగ్ల నవలతో కనిపించిన దర్శకులు రామ్ గోపాల్ వర్మను చూసిన కృష్ణవంశీ బిత్తరపోయారు. ఎందుకంటే అప్పటివరకు దర్శకులు వైట్ అండ్ వైట్ దుస్తులు ధరించేవారు. మొట్టమొదటిసారిగా ఒక దర్శకుడిని అలా చూశారు. ఆయనను అస్సలు దర్శకుడు అనుకోలేదు. రామ్ గోపాల్ వర్మ దగ్గరికి వచ్చిన తరువాత కృష్ణవంశీకి ప్రపంచం కొత్తగా అనిపించింది. రామ్ గోపాల్ వర్మ పరిచయం ఆయన జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది.

ఘోస్ట్ డైరెక్టర్ గా మనీ మనీ…

ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరావు గారికి వీరాభిమానిగా ఊర్లో బ్యానర్లు కట్టి, తెరపై పూలు, కాగితాలు చల్లడం వంటివి చేసే కృష్ణవంశీ, ఒక్కసారైనా అక్కినేని నాగేశ్వరావును చూడాలని అన్నపూర్ణ స్టూడియోకు వచ్చి గేటు బయట రోజంతా పడిగాపులు కాసిన కృష్ణవంశీ, ఇప్పుడు అదే అన్నపూర్ణ స్టూడియో, హైదరాబాదులో సహాయ దర్శకుడిగా అడుగుపెట్టారు. రాంగోపాల్ వర్మకు తేజ, జె.డి.చక్రవర్తి, ఉత్తేజ్ లు సహాయకులు. వర్మ చకచకా “శివ” సినిమా తీస్తూ ఉన్నారు, కృష్ణవంశీ టకటకా నేర్చుకుంటూ వెళుతున్నారు. షాట్ ఎందుకు పెట్టాలి? ఎలా పెట్టాలి? అలా పెడితే అలానే ఎందుకు పెట్టాలి? ఇలా పెట్టకుంటే ఇలా ఎందుకు పెట్టకూడదు? అంటూ తన సందేహాలను నివృత్తి చేసుకుంటూ, దర్శకత్వ శాఖలోని మెలకువలను తెలుసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. శివ అద్భుతమైన విజయం సాధించింది.

ఆ తరువాత క్షణక్షణం, గాయం, మని, రాత్రి, రంగీలా సహాయ దర్శకుడిగా కృష్ణవంశీ దూసుకుపోతున్నారు. ఆయన మీద నమ్మకం పెరిగిన తరువాత “పాప” అనే సినిమాతో ఆయనను దర్శకుని చేయాలనుకున్నారు వర్మ, కానీ కుదరలేదు. మనీ మనీ సినిమాకు దర్శకత్వం చేయమన్నారు వర్మ, కానీ సీక్వెల్ తీయడం కృష్ణవంశీకి నచ్చలేదు. అందుకే ఆ సినిమాకు ఘోస్ట్ డైరెక్టర్ గా పనిచేశారు. అనగనగా ఒకరోజు సినిమా కృష్ణవంశీ దర్శకత్వంలో మొదలైంది. కొన్ని రాజకీయాలు జరిగాయి. అనుభవా రాహిత్యం, ఆజ్ఞానం మరియు బడ్జెట్ పెరిగిపోవడంతో ఆ సినిమా నుండి ఆయనను తప్పించారు. చేసేది లేక రామ్ గోపాల్ వర్మ వద్దే సహాయ దర్శకుడిగా కొనసాగారు.

దర్శకుడిగా తొలి చిత్రం “గులాబి”…

అనగనగా ఒకరోజు సినిమానుండి తప్పించిన తరువాత రామ్ గోపాల్ వర్మ దగ్గరే సహాయ దర్శకుడిగా కొనసాగిన కృష్ణవంశీ మళ్ళీ డైలామాలో పడ్డారు. తనని తాను నిరూపించుకోవడానికి ఒక మంచి సినిమా కావాలి. ఆ ఆలోచనల నుండి పుట్టుకొచ్చిన కథనే “గులాబి”. ఒకవైపు సహాయకుడిగా పనిచేస్తూనే మరోవైపు అక్కినేని నాగార్జునకు ఒక కథ చెప్పారు. అది విన్న ఆయన ఇది రామ్ గోపాల్ వర్మ కథలానే ఉంది. ఇది తీయడానికి నువ్వెందుకు? రాము ఉన్నాడు కదా! అన్నారు. దాంతో కృష్ణవంశీకి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ మాటలు తన సినీ ప్రస్థానానికి మేలిమలుపుగా పనిచేశాయి. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ప్రభావం చూపే సినిమాలు తీయాలనుకున్నారు. తన గురువు ప్రభావం తనపై ఉండకూడదు అని నిర్ణయించుకున్నారు. అప్పట్లో చిత్రపరిశ్రమ పేరుకే హైదరాబాదులో ఉంది, కానీ నటీనటులు, సాంకేతిక నిపుణులు అంతా మద్రాసునుండి వచ్చేవారు.

అందుకని తెలుగు రాష్ట్రాలలోనే ఉన్న నటీనటులతో, ఇక్కడ సాంకేతిక నిపుణులతో తీయాలని నిశ్చయించుకున్నారు కృష్ణవంశీ. గులాబీ సినిమాలో కథానాయిక మహేశ్వరి తప్ప అందరూ ఇక్కడివాళ్లే. రాంగోపాల్ వర్మ నిర్మాణంలో కృష్ణవంశీ తెరకెక్కించిన “గులాబి” సినిమా విషయానికి వస్తే దర్శకుని ప్రజ్ఞను ఎంత కొనియాడినా తక్కువే అని చెప్పాలి. ఈ సినిమాతో అసలు సిసలైన సున్నితమైన ప్రేమకథను ఆవిష్కరించి కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. గులాబి సినిమా కథ చిన్నదే, కానీ కథనం పెద్దది. ఇంతవరకూ ఎవ్వరూ చూడని టెక్నిక్ ను ప్రేక్షకులకు చూపించారు కృష్ణవంశీ. హాస్యం పండించారు. భావోద్వేగాలను మనసుకు హత్తుకునేలా తీశారు. ఇది తన మొదటి సినిమా కావడం, తన గురువు ఛాయలోంచి బయటకు రావాలనే తపనతో ప్రేక్షకులకు, ప్రేమికులకు కమ్మనైన విందు భోజనం రుచి చూపించారు. అరకులోయలో చిత్రీకరించిన పాట “మేఘాలలో తేలిపొమ్మన్నది” మొత్తం బైక్ మీదనే తీశారు. అద్భుతమైన సృజనాత్మకత గల దర్శకుడిగా పేరు మారుమ్రోగిపోయింది. అద్భుతమైన తొలి విజయంతో చిత్రపరిశ్రమలో విజయబావుటా ఎగురవేశారు.

నిన్నేపెళ్లాడుతా తో ద్వితీయ విఘ్నం దాటేసి…

మేలిమి రకం తేయాకు మార్కెట్ లోకి వస్తే వేడి చల్లారకుండా ముందుగా చటుక్కున మొదటి కప్పు అందుకేనే వ్యక్తి అక్కినేని నాగార్జున. ఆయన కృష్ణవంశీని టక్కున పసిగట్టేశారు. గులాబీ చిత్రం నిర్మాణంలో ఉండగానే నాగార్జున ఒకరోజు కృష్ణవంశీని పిలిచి నాతో సినిమా చేస్తావా? అని అడిగారు. రొట్టె విరిగి నేరుగా నేతిలో పడ్డట్టయ్యింది. సరేనన్నారు కృష్ణవంశీ. రెండవ సినిమా ప్రకటన చేశారు. నిన్నే పెళ్ళాడుతా కథ కన్నా ముందు నాగార్జునకు చెప్పిన యాక్షన్ కథ సినిమా లొకేషన్ చూడడానికి విశాఖపట్నం వెళ్లారు కృష్ణవంశీ. ఆయనను అక్కడ ఒక వ్యక్తి గుర్తుపట్టి “గులాబీ” సినిమాను  రాంగోపాల్ వర్మ లాగా బాగా తీశారు అన్నారు. ఆ మాటలు కృష్ణవంశీని బాధించాయి. ఆయన పునరాలోచనలో పడ్డారు. వెంటనే నాగార్జునకి ఫోన్ చేసి “సార్ మీకు ముందు చెప్పిన కథ కాకుండా వేరే కథ చెబుతాను” అన్నారు. దానికి నాగార్జున అసహనానికి గురయ్యారు. కృష్ణవంశీ హైదరాబాద్ కు వచ్చిన తరువాత నాగార్జున సిగరెట్ త్రాగుతున్నప్పుడు మొదలుపెట్టి పడేసే సమయానికి “నిన్నే పెళ్లాడుతా” సినిమా కథ చెప్పేశారు. ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.

నిజానికి ప్రతీ ఒక్క దర్శకుడి రెండవ సినిమా నిరాశపరుస్తూనే పరాజయాన్ని మూటగట్టుకునేవి. తేజ “ఫ్యామిలీ సర్కస్”, పూరీ జగన్నాథ్ “బాచి” ఇలా ద్వితీయ విఘ్నం దాటలేకపోయారు. కానీ కృష్ణవంశీ ద్వితీయ విఘ్నాన్ని ఘనవిజయంతో దాటేశారు. ఆ తరువాత ఇలాంటి సినిమానే తీయమని సుమారు 15 మందికి పైగా నిర్మాతలు ఆయన చుట్టూ తిరిగారు. కానీ ఆయన ఒప్పులేదు.  ఒప్పుకుంటే ఆయన కృష్ణవంశీ ఎందుకవుతాడు? ఆయన ఎడారిలో వికసించిన మొగలిపువ్వు. పట్టపగలు చుట్టు ఎంతో మంది జనాలు చూస్తుండగా హైదరాబాదులో ఐపీఎస్ వ్యాస్ హత్య జరగడం కృష్ణవంశీని షాక్ కు గురిచేసింది. ఆ షాక్ లో నుంచి వచ్చిన కథనే “సింధూరం”. మొట్టమొదటిసారి నక్షలిజం ఉద్యమం గురించి లోతుగా అడవుల్లోకి వెళ్ళి పరిశోధన చేసి అనేకమందిని కలిసి ఇంటర్వ్యూలు చేశారు. గద్దర్ తో మాట్లాడి ఆరు నెలలు కష్టపడి సమాచారాన్ని సేకరించాక తన సొంత నిర్మాణంలోనే కృష్ణవంశీ “సింధూరం” సినిమాను తెరకెక్కించారు. ఆశించిన ఫలితం రాలేదు, సింధూరం విడుదలై పరాజయం పాలైంది.

సమాకాలీన అంశాలే ఇతివృత్తాలుగా…

నాట్ విత్ అవుట్ మై డాటర్ (1991) అనే అమెరికన్ చిత్రంలోని పాయింట్ ఆధారంగా తీసుకుని అంతఃపురం సినిమా కథను అభివృద్ధి చేశారు. జయసుధ, విజయశాంతి, శ్రీదేవి, కృష్ణారెడ్డి, భరద్వాజ ఇలా చాలామంది దగ్గర ఈ సినిమా ఫైల్ ఉండేది. పరిటాల రవి మీద హత్యాయత్నం జరిగిన సందర్భాన్ని తీసుకొని రాయలసీమ ముఠాగ కక్షల నేపథ్యంలో జగపతిబాబు, సాయి కుమార్, సౌందర్య, ప్రకాష్ రాజ్, శారద మొదలగు నటీనటులతో “అంతఃపురం” సినిమాను తెరకెక్కించారు. నక్సల్ సమస్యను అద్భుతమైన భావోద్వేగాలతో రంగరించి చిత్రీకరంచిన సింధూరం సినిమా ఆర్థికంగా క్రుంగదీయడంతో ఆ సినిమా కోసం చేసిన అప్పులను తీర్చడానికి సముద్రం లాంటి సినిమాను తీశారు.

వారసుని హీరోగా పరిచయం పెద్దగా ఇష్టం లేని కృష్ణవంశీ, ఆ తలనొప్పులు భరించడం కష్టం అనే భయంతోనే మహేష్ బాబుతో తొలి సినిమా చేసే అవకాశాన్ని వదులుకున్నా ఆ తరువాత కృష్ణ గారి అభిలాష మేరకు మహేష్ బాబుతో మురారి సినిమా తెరకెక్కించారు. హైదరాబాద్ పాత బస్తి హిందూ, ముస్లిం గొడవలపై “ఖడ్గం”, ఒక మామూలు ఆత్మ స్వచ్చమైన హృదయంతో పిలిస్తే పరమాత్మ దిగిరావడం ఆయన సాయంతో మామూలు మనిషి ఆ స్థాయికి చేరుకోవడం ఇలాంటి ఇతివృత్తంతో “శ్రీ ఆంజనేయం”, యాక్షన్ సినిమా లు తీసి సంతృప్తి లేని కథనాయకుడు ప్రభాస్ కు సంతృప్తి కలిగించే సినిమాగా “చక్రం”, పాటలు, సెంటిమెంట్, రొమాన్స్ లేకుండా తక్కువ ఖర్చుతో కెమెరామెన్ పూర్తిస్థాయిలో నమ్ముకుని, వాడుకుని “డేంజర్” లాంటి సినిమాలు తీశారు. 

మహిళలపై వేధింపులు, గృహహింస, అత్యాచారాలు లాంటి సంఘటన పెరుగుతున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తో “రాఖీ” లాంటి చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీ ఆంజనేయం, చక్రం, డేంజర్, రాఖీ లాంటి సీరియస్ సినిమాలు చేసి చేసి విసిగిపోయిన దశలో ఒక మంచి ప్రేమ కథ చేయాలనిపించి “చందమామ” తీశారు. అనుకోకుండా కుదిర్చిన పెళ్ళి వద్దని ఇంట్లో వాళ్ళని ఒప్పించలేక ఇంటినుంచి పారిపోతే ఎలా ఉంటుందో “శశిరేఖ పరిణయం” లో చూపించారు. ఇలా అన్నీ సమకాలీన అంశాలనే ఇతివృత్తాలుగా ఎంచుకుని సినిమాలు తీశారు కృష్ణవంశీ. శ్రీకాంత్ 72వ సినిమా చేస్తున్నప్పుడే “అన్నయ్య నా వంద సినిమా నువ్వే తెరకెక్కించాలి” అని చెప్పగా సరేనని ఇచ్చిన మాట ప్రకారం వందో సినిమాగా శ్రీకాంత్ తో “మహాత్మా” చిత్రం తీశారు.

Show More
Back to top button