Telugu Cinema

నట యశస్వి, నటసామ్రాట్ , విశ్వనట చక్రవర్తి.. యస్.వి. రంగారావు.

“జాతస్య మరణం ధృవం రంగారావు”.. పుట్టిన  ప్రతి  జీవికి మరణం తప్పదు. ఈ మరణాన్ని మహనీయులు మాత్రమే జయిస్తారు. “మనం ఎలా పుట్టామన్నది కాదు ముఖ్యం , ఎలా  చనిపోయామనేది” అని ఒక తెలుగు సినిమాలో ఒక మహానటుడు అంటాడు. నిజమే మనుషులు పుడుతుంటారు, మరణిస్తుంటారు. కానీ చనిపోయే నాటికి వారు సాధించిన విజయాలు వారిని చిరస్థాయిగా నిలబెడతాయి.

మరణం అనేది మనిషికి అనివార్యం. దాన్ని తప్పించుకోవడం ఎవరి వల్లా కాదు. కానీ సినిమా కళాకారులు ఎంతో అదృష్టవంతులు. ముఖ్యంగా మహా నటులు భౌతికంగా మరణించినా తెరపై ఎప్పుడూ వెలుగుతూనే ఉంటారు. ఈ కోవకి చెందిన నటులు సామర్ల వెంకట రంగారావు (యస్వీ రంగారావు). ఇలాంటి నటులు ప్రతీ తరాన్ని తమ నటనతో వినోద పరుస్తూనే వుంటారు, ప్రభావితం చేస్తూనే వుంటారు.

నవతరం ప్రేక్షకులను సైతం బుల్లితెరపై యస్వీఆర్ పాత్రలు ఆకర్షిస్తూనే ఉండడం విశేషం. ముఖ్యంగా “పాతాళభైరవి, పెళ్ళిచేసిచూడు, మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మకథ, నర్తనశాల, నాదీ ఆడజన్మే, ఆత్మబంధువు, బాలభారతం, యశోదకృష్ణ, దేవుడు చేసిన మనుషులు” వంటి చిత్రాల్లోని రంగారావు గారి నటన ఇప్పటికీ తెలుగువారిని కట్టి పడేస్తుంటుంది.

“నర్తనశాల”లో అద్దం ముందు తనను తాను చూసుకుంటూ తన సోయగానికి తానే మురిసిపోయే “కీచకుడి” పాత్రలో రంగారావు గారు చేసిన నటన మహాద్భుతం. “పెళ్లిచేసి చూడు” లో ధూపాటి వియ్యన్న, “చదరంగం”లో అంధుడైన ఒక మాజీ సైనికాధికారి, “తోడికోడళ్లు”లో మతిమరుపు లాయరు కుటుంబరావు, “కత్తుల రత్తయ్య” లో రౌడీ, “అనార్కలి”లో అక్బర్, “పాండవ వనవాసం”లో దుర్యోధనుడు మొదలైన పాత్రలు తెలుగువారి గుండెల్లో కలకాలం నిలిచిపోయాయి.

పాతాళభైరవి సినిమాలో “మహాజనానికి మరదలు పిల్ల”, “శృంగారం శాయవే బుల్‌బుల్”, “సాహసం శాయరా డింభకా”.. ఇలా తన నోట పలికిన ప్రతీ మాటా ప్రసిద్ధమే. “భక్తప్రహ్లాద”, “చెంచులక్ష్మి”, “దీపావళి” ఇలా ఒకటేమిటి తాను నటించిన ప్రతీ చిత్రమూ ఒక మహాద్భుత రససాగరమే. నటసార్వభౌమ, నటసింహ, విశ్వనటచక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు ఆయన్ను గౌరవించారు.

అప్పటి ఇండోనేషియా అధ్యక్షుడు “సుకర్ణో” చేతుల మీదుగా అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకుని తిరిగి వస్తున్న నట యశస్వి యస్‌.వి.రంగారావు గారు విమానాశ్రయం ముఖద్వారం దగ్గరకు రాగానే జనకోలాహలంతో ఆ ప్రాంతం అంతా మార్మోగిపోయింది. జేజేలు పలుకుతున్న గొంతుల్లో తెలుగువారికన్నా తమిళ గొంతులే ఎక్కువగా వినిపించాయంటే, ఎస్వీ రంగారావు గారు తమిళ భాషలో కూడా ఎంతటి ప్రశస్తిపొందారో అర్థం అవుతుంది.

దుర్యోధనుడు, కీచకుడు, రావణుడు, మైరావణుడు, ఘటోత్కచుడు, కంసుడు, భీష్ముడు ఎలా ఉంటారో మన పూర్వీకులకు తెలీదు. వారు ఎలా వుంటారో మన తరానికి ఎస్.వి. రంగారావు గారు  కళ్లకుకట్టేలా చూపించారు. “రంగారావు గారు తెలుగువాడు కావటం తెలుగువారి అదృష్టం. కానీ, ఆయనకు మాత్రం దురదృష్టమే” అని గుమ్మడి గారు వ్యాఖ్యానించారు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    సామర్ల వెంకట రంగారావు

ఇతర పేర్లు  :    ఎస్వీయార్, నట యశస్వి, నటసామ్రాట్ , విశ్వనట చక్రవర్తి

జననం    :   03 జూలై 1918 

స్వస్థలం   :     నూజివీడు, కృష్ణా జిల్లా

నివాసం   :    మద్రాసు 

తండ్రి   :   కోటేశ్వరరావు 

తల్లి     :    లక్ష్మీ నరసాయమ్మ

వృత్తి      :    అగ్నిమాపక శాఖ ఉన్నతోద్యోగి, నటుడు, దర్శకుడు, రచయిత

భార్య     :     లీలావతి

పిల్లలు    :    విజయ, ప్రమీల, కోటేశ్వరరావు

మతం    :    హిందూ మతం

మరణం    :  18  జూలై 1974 మద్రాసు

నేపథ్యం…

సామర్ల వెంకట రంగారావు గారు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా నూజివీడు లో 03 జులై 1918 నాడు జన్మించారు. వీళ్ళ నాన్న గారి పేరు కోటేశ్వరరావు, అమ్మ పేరు లక్ష్మీ నరసాయమ్మ. తాను అశ్వినీ నక్షత్రంలో జన్మించారు. అశ్వినీ నక్షత్రంలో జన్మించిన వారు అద్భుతమైన ప్రతిభతో ఉన్నత స్థాయికి వెళతారని జ్యోతిష్యులు చెబుతుంటారు. రంగారావు గారి నాన్నగారు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం చేసేవారు. కోటేశ్వరరావు గారి నాన్న గారు కోటయ్య నాయుడు వైద్యుడు. కోటయ్య నాయుడు గారు తాను నూజివీడులో పెద్ద సర్జన్ గా పేరు తెచ్చుకున్నారు.

కోటేశ్వర రావు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అయినందు వలన రకరకాల ఊర్లు తిరుగుతుండేవారు. ఎస్వీ రంగారావు గారి ప్రాథమిక విద్యాభ్యాసం నూజివీడు లోనే సాగింది. రంగారావు గారిని వాళ్ళ నాయనమ్మ గంగా రత్నమ్మ గారి సంరక్షణలో ఉంచారు. ఎస్వి రంగారావు గారి తోబుట్టువులు నలుగురు మగ పిల్లలు, ఎనిమిది మంది ఆడపిల్లలు. వీళ్ళందరి చదువులు నానమ్మ గంగారత్నమ్మ గారే చూసుకునేవారు. ఆకస్మికంగా ఒక రోజు ఎస్వీ రంగారావు గారి తాతగారు మరణించడంతో, వాళ్ల నాన్నమ్మ గంగా రత్నమ్మ గారు ఈ పిల్లలందరినీ చదువు చెప్పించడానికని మద్రాసు కు తీసుకెళ్లారు.

విద్యాభ్యాసం…

నూజివీడులో ప్రాథమిక విద్యాభ్యాసం అయిపోయాక హైస్కూల్ చదువుల కోసం రంగారావు గారు మద్రాస్ వెళ్లారు. మద్రాసు హిందూ హైస్కూల్లో చదువుకోవడం మొదలుపెట్టారు. తాను పదిహేను సంవత్సరాల వయసున్నప్పుడు ఆ పాఠశాలలో ఒక నాటక ప్రదర్శనలో భాగంగా వేదిక మీద మాంత్రికుని సహాయ పాత్ర వేశారు. కాలక్రమం లో అదే పాత్ర తనను నటుడిగా నిలబెట్టి 25 ఏళ్ల సినీ ప్రస్థానంలో తనను “విశ్వనట చక్రవర్తి” గా వెలుగొందేలా చేస్తుందని తన ఊహించి ఉండరు. 1936 లో (తన 18 సంవత్సరాల వయస్సులో) ఆంధ్ర నాటక కళాపరిషత్తు అనే నాటక సంఘం ఆధ్వర్యంలో నాటకాలు వేయడం మొదలుపెట్టారు.

బళ్లారి రాఘవాచార్యులు, గోవిందరాజుల సుబ్బారావు గారు, నరసింహారావు గారు లాంటి వాళ్ళందరూ ప్రదర్శిస్తున్న నాటకాలను చూసిన రంగారావు గారు తను కూడా నాటకాలలో పేరు తెచ్చుకోవాలనే కోరిక అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. తాను చూసిన మొట్టమొదటి హిందీ సినిమా “అచ్యుత్ కన్య”, తాను చూసిన మొట్టమొదటి తమిళ సినిమా “అంబికా పతి”, తాను చూసిన మొట్టమొదటి తెలుగు సినిమా “లవకుశ” (1934). నాటకాలంటే విపరీతమైన ఆసక్తి ఉన్న రంగారావు గారికి వాచకం ముఖ్యం కాబట్టి వక్తృత్వ పోటీల్లో పాల్గొనడం, శరీరారోగ్యం కోసం ఆటలలో పాల్గొనేవారు.

నాటక రంగం…

యస్వీ రంగారావు గారు తన ఇంటర్మీడియట్ చదువు కోసం విశాఖపట్నంలోని మిస్సెస్ ఏ.బీ.ఎన్ కళాశాలలో చేరారు. చదువు లో కూడా మంచి ప్రావీణ్యం ఉన్న రంగారావు గారు ఇంటర్మీడియట్ మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. 45 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయగా వారిలో కేవలం రంగారావు గారు మాత్రమే పాసైనారు. ఆ తరువాత బీఎస్సీ చదవడం కోసం కాకినాడ వెళ్లారు. కాకినాడలో నాటకాలు ఎక్కువగా ప్రదర్శించబడేవి. నలుగురు కుర్రాళ్ళు కలిసి1916లో  “యంగ్ మెన్ హ్యాపీ క్లబ్” అనే నాటక సంస్థను సంస్థను ప్రారంభించారు.

“యంగ్ మెన్ హ్యాపీ క్లబ్” లోనే చిత్తజల్లు పుల్లయ్య గారు, జగపతి పిక్చర్స్ వి.బి.రాజేంద్రప్రసాద్ గారు, పూర్ణోదయ క్రియేషన్స్ ఏడిద నాగేశ్వరావు గారు లాంటి వారు నాటకాల్లో పునాదులు వేశారు. భుగత అప్పల సుబ్బారావు గారు, బి.ఏ.సుబ్బారావు గారు, యస్వీ రంగారావు గారు, పి.ఆదినారాయణ రావు గారు, అంజలి దేవి గారు వీరంతా నాటకాలు వేసేవారు. కొన్నాళ్ళకు రంగారావు గారికి అగ్నిమాపక శాఖలో అధికారిగా బందరు లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. కొద్ది రోజులకు విజయనగరం బదిలీ అయ్యింది. విజయనగరం కళలకు ప్రసిద్ధి. ఒక ప్రక్కన ఉద్యోగం చేస్తూనే  ఇంకో ప్రక్కన నాటకాలు వేసేవారు.

సినీ నేపథ్యం…

యస్వీ రంగారావు గారికి సమీప బంధువు బి.వి.రామానందం గారు “వరూధిని” అనే సినిమా తీయతలపెట్టి “ప్రవరాఖ్యుని” పాత్ర కోసం ఎస్వీ రంగారావు గారికి ఎన్నుకుని తనకు అవకాశం ఇచ్చారు. అప్పట్లో సినిమాలు సేలం, కొల్హాపూర్, కలకత్తా లలో నిర్మించేవారు. వరూధిని సినిమా నిర్మించడానికి ఎస్వీ రంగారావు గారిని సేలం తీసుకెళ్లారు. “వరూధిని” సినిమాలో కథానాయకుడిగా నటించడానికి గానూ నెలకు 200 రూపాయలు పారితోషికం ఇస్తూ రంగారావు గారిని సినిమాలోకి తీసుకున్నారు. “దాసరి తిలకం” గారు ఆ సినిమాలో కథానాయిక.

యస్వీ రంగారావు గారు తన మిత్రులు పి.ఆదినారాయణ రావు గారికి “వరూధిని” చిత్రంలో సంగీత దర్శకులుగా అవకాశం ఇప్పించారు. కానీ చిత్తజల్లు పుల్లయ్య గారి సినిమాలో అంజలీదేవి గారికి అవకాశం వచ్చేసరికి పి.ఆదినారాయణ రావు గారు “వరూధిని” సినిమాను వదిలి వెళ్ళిపోయారు. “వరూధిని” సినిమా పూర్తి అయ్యి 11 జనవరి 1947లో కాకినాడ ఎలిఫెంట్ టాకీస్ లో విడుదలైంది. అందులో నటుడిగా రంగారావు గారి పేరును యస్వీ.ఆర్.రావు అని వేశారు. ఆ సినిమా పరాజయం పాలైంది. దాంతో రంగారావు గారికి మళ్ళీ అవకాశాలు రాలేదు. అయితే మళ్ళీ జంషెడ్ పూర్ లో “టాటా స్టీల్స్” లో ఉద్యోగం వచ్చింది.

బి.ఏ.సుబ్బారావు గారు “పల్లెటూరి పిల్ల” సినిమా తీస్తూ అందులో విలన్ పాత్ర కోసం రంగారావు గారికి కబురు చేశారు. తాను వెళదామని అనుకుంటుండగా ధవలేశ్వరం నుంచి రంగారావు గారి నాన్నగారు చనిపోయారని టెలిగ్రామ్ వచ్చింది. తన నాన్న గారికి అంత్యక్రియలు జరిపించి మద్రాసు కు వెళ్లేసరికి, “పల్లెటూరి పిల్ల” సినిమాలో విలన్ పాత్రకు వేరే వాళ్లని ఎంచుకున్నారు. అందువలన రంగారావు గారు అంజలీదేవి గారికి తండ్రి పాత్రలో నటించాల్సి వచ్చింది. బి.ఏ.సుబ్బారావు గారు రంగారావు గారిని ఎల్.వి.ప్రసాద్ గారికి పరిచయం చేశారు. దాంతో ఎల్వీప్రసాద్ గారు తీస్తున్న “మన దేశం” సినిమాలో ఎస్వీఆర్ గారికి ఒక ఇన్స్పెక్టర్ పాత్ర ఇచ్చారు.

ఎన్టీఆర్ గారి మొదట సినీ రంగ ప్రవేశం చేసిన సినిమా “మనదేశం” లో రామారావు గారు కూడా ఇన్స్పెక్టర్ పాత్రనే ధరించారు. “పల్లెటూరి పిల్ల” లో కూడా రంగారావు గారిది కూడా చిన్న పాత్రనే. ఆ సినిమా కూడా విడుదల అయ్యింది. ఎల్వీప్రసాద్ గారి సిఫారసు మేరకు పి.పుల్లయ్య గారి దర్శకత్వం వహించిన “తిరుగుబాటు” చిత్రంలో రంగారావు గారికి అవకాశం ఇవ్వాల్సింది గా కోరగా అందులో పాత్రలన్నీ ఎంపికైపోయాయి.

హెచ్.ఎం.రెడ్డి గారు దర్శకత్వం వహించిన “నిర్దోషి” చిత్రానికి ఎస్వీఆర్ గారిని ఎల్వీప్రసాద్ గారు సిఫారసు చేయగా అందులో కూడా పాత్రలన్నీటికీ నటీనటులు ఎంపికయ్యారని చెప్పేశారు. ఇన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో “విజయా పిక్చర్స్” వారు నిర్మిస్తున్న “షావుకారు” చిత్రంలో అవకాశం ఇచ్చారు. “షావుకారు” చిత్రం సరిగ్గా ఆడకపోయినా రంగారావు గారు నటించిన పాత్రకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత వచ్చిన “పాతాళ భైరవి” చిత్రం రంగారావు గారిని “విశ్వనట చక్రవర్తి” గా నిలబెట్టే స్థాయికి తీసుకెళ్ళింది.  ఇక్కడ నుండి మొదలైన తన ప్రస్థానం సుమారు 300 చిత్రాలకు పైగా కొనసాగింది.

రంగారావు గారు 1951లో విజయావారి “పాతాళ భైరవి” చిత్రంలో నేపాల మాంత్రికుడిగా ఉన్నత శిఖరం మీద కుర్చోపెట్టిన తన నట జీవితం పరుగు ప్రారంభించి బ్రతుకుతెరువు, పెళ్లిచేసి చూడు, దేవదాసు, పరదేశి, బంగారుపాప, రాజు పేద, అనార్కలి, గుణసుందరి, మిస్సమ్మ, చింతామణి, అల్లావుద్దీన్ అద్భుతదీపం, మాయాబజార్, సతీసావిత్రి, తోడికోడళ్లు, అప్పుచేసి పప్పుకూడు, భూకైలాష్, చెంచులక్ష్మి, పెళ్లినాటి ప్రమాణాలు, జయభేరి, నమ్మినబంటు, దీపావళి, కలసివుంటే కలదు సుఖం, సతీ సులోచన, ఆత్మ బంధువు, గుండమ్మ కథ, మంచి మనసులు, బొబ్బిలి యుద్ధం, రాముడు భీముడు, వెలుగు నీడలు, పాండవ వనవాసం, భక్త ప్రహ్లాద, రహస్యం, చదరంగం, భాదవ్యాలు, బందిపోటు దొంగలు, చిన్నారి పాపలు, దసరా బుల్లోడు, ప్రేమ్ నగర్, సంపూర్ణ రామాయణం, బాలభారతం, తాత మనవడు, దేవుడు చేసిన మనుషులు, పండంటి కాపురం, యశోదా కృష్ణ  లాంటి అద్భుతమైన చిత్రాల వరకు కొనసాగింది.

ప్రేక్షకులకు సినిమా పాటలు గుర్తుంటాయి. వాటితో పాటుగా రంగారావు గారి సంభాషణలు ఈ నాటికీ ప్రజల మనసుల్లో నిలిచివున్నాయి. “డబ్బుకులోకం దాసోహం” లాంటి సినిమాల్లో ఆయన నటించిన కఠినాత్ముడి పాత్రలు తరువాతి తరం ప్రతినాయక పాత్రలు పోషించే విలన్ పాత్రదారులకు పాఠ్య గ్రంథాలుగా ఉపయోగపడతాయి.

ముఖ్యంగా “గుండమ్మకథ”, “దేవుడు చేసిన మనుషులు”, “దసరాబుల్లోడు” చిత్రాల్లో తన నటన అనితరసాధ్యం అనిపిస్తుంది.

రంగారావు గారు 150 తెలుగు సినిమాలలోనూ, 87 తమిళ , 2 కన్నడ , 3 మళయాళ, 3 హిందీ సినిమాలలోనూ నటించారు.

వ్యక్తిగత జీవితం…

యస్వీ గారు తన మొదటి సినిమా వైఫల్యం తర్వాత మళ్ళీ అవకాశాలు దొరక్కపోవడంతో సినీ రంగం మీద ఆశలు వదిలేసుకుని జంషెడ్ పూర్ లో “టాటా కంపెనీ” లో ఉద్యోగంలో చేరారు. ఇదే సమయంలో తన మేనమామ బడేటి వెంకటరామయ్య, కోటేశ్వరమ్మ దంపతుల కుమార్తె లీలావతిని 27 డిసెంబరు 1947 వివాహం చేసుకున్నారు. తనకు సినిమా అవకాశాలు అంతగా లేని రోజుల్లో రంగారావు గారి భార్య తన మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయేవారు. అలాంటి సందర్భంలో ఆమెకు ఇష్టమొచ్చినప్పుడు తిరిగి రమ్మనీ, తనకు రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చేవారు.

ఒక వ్యక్తిగా సహృదయులు, చమత్కారి కూడా. సినిమా చిత్రీకరణ సమయంలో సెట్స్ మీద గంభీరంగా ఉండేవారు. తన వ్యక్తిగత విషయాలను తన సహనటులతో చర్చించడానికి ఇష్టపడేవాడు కారు. తన మనసు బాగాలేనప్పుడు తన ఫాం హౌస్ లోకి వెళ్ళిపోయేవారు. దర్శక, నిర్మాతలే తనను వెతుక్కుంటూ వెళ్ళేవారు. “శివుడు” ని అమితంగా ఇష్టపడే రంగారావు గారు ప్రతిరోజూ శివపూజ చేయనిదే దినచర్య ప్రారంభించేవారు కారు. తనకు ఇద్దరు కుమార్తెలు విజయ, ప్రమీల, ఒక కుమారుడు కోటేశ్వరరావు. రంగారావు గారు తన కొడుకును సినిమాల్లోకి తీసుకురావాలని ఒక సినిమా కొంత చిత్రీకరణ కూడా జరిపారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఈ సినిమా కార్యరూపం దాల్చలేదు.

సన్మానాలు, బిరుదులు…

యస్వీ గారికి ఆంధ్రప్రదేశ్ లో ఏలూరు, అనకాపల్లి, తిరుపతి, రాజమండ్రి, విజయవాడ, పాలకొల్లు, సామర్లకోట, పెనుగొండ లాంటి ఊర్లలో తనకు సన్మానాలు జరిగాయి. జకార్తాలో పురస్కారం అందుకుని మద్రాసు వచ్చిన తర్వాత రంగారావు గారిని మద్రాసు సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ వారు, ఆంధ్రా ఫిల్మ్ జర్నలిస్టు సంఘం వారు, దక్షిణ భారత ఫిల్మ్ వాణిజ్య మండలి, మద్రాసు సినిమా ప్రేక్షక సంఘాల వారు ఘనంగా సన్మానించారు.

అన్నై, శారద, నానుం ఒరుపెణ్, కర్పగం, నర్తనశాల సినిమాలకు భారత రాష్ట్రపతి చేతులమీదుగా పారితోషికం అందుకున్నారు.

ప్రముఖ నటులు గుమ్మడి గారు రంగారావు గారిని ప్రశంసిస్తూ ఇలా అన్నారు.

మన దేశంలో పుట్టడం మన అదృష్టం. కానీ తనకు దురదృష్టం. ఆయన ఏ పశ్చిమ దేశాల్లోనో జన్మించి ఉంటే ప్రపంచంలోని ఐదుమంది ఉత్తమ నటుల్లో ఒకడయ్యుండే వారు.

తెలుగు చలనచిత్రంలో గొప్ప నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నా అతను చనిపోయినప్పుడు కనీసం ఒక్క రోజైనా సంతాపం తెలియజేస్తూ థియేటర్లు మూసివేయడమో, మరేదైనా గౌరవమో ఇవ్వలేదంటూ అభిమానులు బాధపడ్డారు.

బహుమతులు…

రంగారావు గారు దర్శకత్వం వహించిన మొదటిచిత్రం “చదరంగం” ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది పురస్కారాన్ని, రెండవ చిత్రం “బాంధవ్యాలు” తొలి ఉత్తమ చిత్రంగా నంది బాహుమతి ని దక్కించుకున్నాయి. “నర్తనశాల” చిత్రంలో నటనకు ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటుడి పురస్కారం, అదే పాత్రకు రాష్ట్రపతి అవార్డు కూడా పొందారు.  2013 లో భారత సినీ పరిశ్రమ వందేళ్ళ సందర్భంగా విడుదలయిన తపాళాబిళ్ళలలో ఒకటి యస్వీ గారి మీద విడుదలయ్యింది.

బిరుదులు..

విశ్వనటచక్రవర్తి..

నటసార్వభౌమ..

నటసింహ..

నటశేఖర…

నిష్క్రమణం…

1974 వ సంవత్సరం ఫిబ్రవరిలో హైదరాబాదులో హృద్రోగానికి గురైన గారు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొంది ఆరోగ్యవంతుడై తిరిగి వచ్చారు.

వైద్యులు తనకు విశ్రాంతి అవసరమని సూచించినా కూడా తాను మాత్రం నటించడం మానలేదు. నటుడిగా తన చివరి చిత్రాలు చక్రవాకం (1974), యశోద కృష్ణ (1975).

యశోద కృష్ణ సినిమా చిత్రీకరణ తర్వాత బైపాస్ సర్జరీ కోసం అమెరికా వెళ్ళాలనుకున్నారు.

కానీ ఈ లోపే 18 జూలై 1974 తేదీన మద్రాసులో మళ్ళీ గుండెపోటు రావడంతో చికిత్సకు అవకాశం లేకుండానే కన్నుమూశారు.

సామర్ల వెంకట గారి శతజయంతి ఉత్సవాలు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అధ్యక్షతన 03 జూలై 2018 నాడు హైదరాబాదులో జరిగాయి.

ఈ ఉత్సవాలను 03 జూలై 2018 నుండి 08 జూలై  2018 వరకు హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్, సారథి స్టూడియోస్ కలిపి సంయుక్తంగా నిర్వహించాయి. 03 జూలై 2018 నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరులో పన్నెండున్నర అడుగుల ఎత్తైన గారి కంచు విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఏలూరులో ఎస్వీఆర్ మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 2013 వ సంవత్సరంలో భారత తపాలాశాఖ భారత చలనచిత్ర పరిశ్రమ శతవార్షికోత్సవాల సందర్భంగా యస్వీ చిత్రంతో తపాలా బిళ్ల విడుదల చేసింది.

విశేషాలు…

★ యస్వీఆర్ గారు ఒక రకమయిన వేదాంతి. అతని ఇంటి గ్రంథాలయంలో వివేకానందునికి సంబంధించిన పుస్తకాలు చాలా ఉండేవి. తానే స్వయంగా కొన్ని రచనలు కూడా చేశారు.

★ సహృదయ భావం కలిగిన రంగారావు గారు ప్రజాహిత సంస్థలకు లెక్కలేనన్ని విరాళాలు ఇచ్చేవారు.

చైనాతో యుద్ధం వచ్చినపుడు ఏర్పాటు చేసిన సభలో పదివేల రూపాయలు విరాళం ఇచ్చారు.

★ పాకిస్తాన్‌తో యుద్ధం వచ్చినపుడు కూడా అనేక సభలు నిర్వహించి, మిగతా నటులతో.

కలసి అనేక ప్రదర్శనలు ఇచ్చి, విరాళాలు సేకరించి, ఆ డబ్బును ప్రధానమంత్రి రక్షణ నిధికి ఇచ్చారు.

★ పెంపుడు జంతువులంటే మిక్కిలి ఇష్టపడే రంగారావు గారికి తన ఇంటిలో “జర్మన్ షెఫర్డ్” జాతికి చెందిన రెండు కుక్కలుండేవి.

★ వేట అంటే కూడా తనకు బాగా ఆసక్తి ఉండేది.

కానీ కొద్దికాలం తర్వాత ఆ అలవాటు కూడా మానేశారు.

★ ఆంగ్ల చిత్రాల్లో నటించాలనే కోరిక తనకు బలంగా ఉన్నా అలాంటి అవకాశం తనకు రాలేదు.

విదేశాల్లో సైతం గుర్తింపు లభించినా స్వదేశంలో మాత్రం తనకు సరైన గుర్తింపు లేదనే కొరతగా తనకు ఉండేది.

★ ఎస్వీ రంగారావు గారు నర్తనశాలలో కీచకుని పాత్ర పోషించినందుకు గానూ ఆఫ్రో-ఆసియా చిత్రోత్సవములో ఉత్తమ నటుని బహుమతి అందుకొన్నారు.

★ 1952లో విజయ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన పెళ్ళి చేసి చూడు సినిమాను తమిళంలో “కల్యాణం పణ్ణి పార్” అనే పేరుతో పునర్నిర్మాణం చేశారు.

రంగారావు గారు తెలుగులో తాను పోషించిన పాత్రను తమిళంలో కూడా పోషించారు.

★ అన్నై, శారద, కర్పగం, నానుం ఒరుపెణ్ వంటి తమిళ చిత్రాలలో నటించి తెలుగు, తమిళ భాషలలో ఏక కాలంలో ముఖ్యమైన సహాయనటుడిగా పేరు గాంచారు.

★ తెలుగులో ఘనవిజయం సాధించిన “పాతాళ భైరవి” చిత్రాన్ని జెమిని అధినేత వాసన్ గారు హిందీలో కూడా చిత్రీకరించారు.

అందులో కూడా రంగారావు గారు మాంత్రికుని పాత్ర పోషించారు.

★ హిందీ భాషలో ప్రవేశమున్న రంగారావు గారు తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు.

భానుమతి దర్శక నిర్మాతగా వచ్చిన “నాది ఆడజన్మే” ఆధారంగా హిందీలో తీసిన “మై భీ లడ్కీ హూ” లాంటి హిందీ చిత్రాల్లో నటించారు.

★ భూకైలాస్, మాయాబజార్ లాంటి కన్నడ చిత్రాలలోనూ, విదయాగలే ఎతిలే ఎతిలే, కవిత వంటి మలయాళ చిత్రాలలో కూడా రంగారావు గారు నటించారు.

★ నటసామ్రాట్, విశ్వనట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు రంగారావు గారిని గౌరవించారు.

ఎస్వీయార్ గారు నటించిన “నర్తనశాల” ఇండొనేషియాలోని జకార్తాలో ఆఫ్రో-ఆసియా అంతర్జాతీయ చిత్రోత్సవము‍లో ప్రదర్శించబడడమే.

కాకుండా కీచకపాత్రకు గాను ఎస్వీయార్ గారికి అప్పటి ఎన్నో చిత్రాల కథానాయకులను వెనుకకు నెట్టి భారతదేశం నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడుగా బహుమతి పొందారు.

గారు కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. ముఖ్యంగా తాను దర్శకత్వం వహించిన “చదరంగం” చిత్రానికి రెండో ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం లభించింది.

రెండో చిత్రం “బాంధవ్యాలు” ఉత్తమ చిత్రంగా నంది బహుమతి అందుకున్నది.

నటి లక్ష్మి ఈ చిత్రంతోనే సినీ రంగ ప్రవేశం చేశారు. కానీ ఈ సినిమాలు ఆర్థికంగా విజయం సాధించలేదు.

బాపు గారు గీసిన యస్వీ గారి కార్టూన్ కు ముళ్లపూడి వెంకటరమణ గారు తన కలంతో అద్భుతమైన కవిత ఇలా వ్రాశారు.

“క్లిష్ట పాత్రలలో చతురంగారావు, దుష్ట పాత్రలో క్రూరంగారావు, హడలగొట్టే భయంకరంగారావు,

హాయి గొలిపే టింగురంగారావు, రొమాన్స్ చేస్తే పూలరంగారావు, అక్షరాల మధురంగారావు,

డైలాగుల మదురంగారావు, నిర్మాతల కొంగుబంగారావు, స్వభావానికి ఉంగరంగారావు,

కథనిర్భలమైతే హావాభావాలు, పాత్రరంగారావు, కళ్ళకు కట్టినట్టు కనపడే ఉట్టిరంగారావు”…

ఆయన శైలి, ఠీవి అన్యులకు సులభంగారావు, ఒక్కోసారి సంభాషణల్లో మాత్రం యమకంగారావు…

అని ముల్లపూడి వెంకటరమణ గారు యస్వీ రంగారావు గారి గురించి తన కవితలో వివరించారు.

Show More
Back to top button