
మేషరాశి ఈ సంవత్సరంలో 2026 మే 14 వరకు గురుడు వృషభ రాశిలో ఉండటంతో మీ జీవితంలో అనేక మంచిపరిణామాలు చోటుచేసుకుంటాయి. కీర్తి పెరుగుతుంది, ధనలాభం కలుగుతుంది, కొత్త అవకాశాలు దొరుకుతాయి. పుత్ర, పుత్రికల వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. శుభకార్యాలకు ఖర్చులు చేయాల్సి వస్తుంది. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. అయితే, 2026 మే 15 నుంచి గురుడు మిథున రాశిలోకి ప్రవేశించడంతో కొంత సమస్యలు ఎదురుకావచ్చు. మితిమీరిన శ్రమ, బంధువులతో వివాదాలు, ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు లభించవచ్చు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులకు ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. వివాహ ప్రయత్నాలు కొంత ఆలస్యమవుతాయి.
శని మీన రాశిలో ఉండటంతో మానసిక ఒత్తిడి పెరిగే అవకాశముంది. అనవసరంగా భయాలు, ఆర్థిక, ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. వ్యవసాయదారులకు మధ్యస్థ స్థాయిలో లాభాలు ఉంటాయి. అయితే, శని ప్రభావాన్ని తగ్గించేందుకు శని దోష నివారణ పూజలు చేయడం మంచిది.
నివారణలు
గురువారం గోగ్రాసం పెట్టడం, పసుపు వస్త్రం దానం చేయడం శుభఫలితాలను అందిస్తుంది. శనివారాలు నల్లనువ్వుల దానం, రుద్రాభిషేకం చేయడం మంచిది. శివాలయ దర్శనం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం శుభప్రదం. గురువుల సేవ, మాతా-పితృ సేవ ద్వారా గ్రహదోషాలు తగ్గుతాయి.
* వృషభరాశి
ఈ సంవత్సరం మీ రాశికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. 2025 మే 14 వరకు గురు గ్రహం వృషభరాశిలో ఉండటంతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా, ఆర్థిక పరంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆస్తుల కొనుగోలు లేదా విక్రయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కోపం ఎక్కువగా ఉండే అవకాశముంది, దాంతో కుటుంబంలో విభేదాలు, ఉద్యోగ ఒత్తిడులు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు ఈ సమయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి.
మే 15 నుంచి గురు మీ రాశిలో 2వ స్థానానికి మారడం వల్ల ఆర్థికంగా కొంత స్థిరత వస్తుంది. కళాకారులు, కవులు, ఉపాధ్యాయులు, మేధావులకు మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు ఇది అనుకూల సమయం. దేశవిదేశాల నుండి మంచి అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, అనవసరమైన వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది.
శని గ్రహం ఉగాది నుండి మీనరాశిలో 11వ స్థానంలో సంచరించనుంది. దీని వల్ల ఉద్యోగ మార్పులకు అవకాశాలు ఉన్నాయి. వలసలు, కొత్త వ్యాపార అవకాశాలు రావొచ్చు. కుటుంబంలో సంతోషం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కూడా స్థిరత కనిపిస్తుంది. భార్య, పిల్లల వల్ల ఆనందంగా ఉండే అవకాశం ఉంది. అయితే, శనిగ్రహాన్ని శాంతిపరచేందుకు శివాలయ దర్శనం, శని భగవానుని ఆరాధన చేయడం మంచిది.
నివారణలు
శివాలయ దర్శనం, మహాన్యాస రుద్రాభిషేకం చేయడం శుభప్రదం. శనిగ్రహ శాంతి కోసం శని మంత్ర పారాయణ, తైల అభిషేకం చేయడం మంచిది. “ఓం బృం బృహస్పతయే నమ:” నిత్యం ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. విష్ణు సహస్రనామ పారాయణ, శివ సహస్రనామ పఠనం చేయడం అనుకూలం. సత్యనారాయణ వ్రతం, కులదేవత పూజ, అన్నదానం చేయడం మంగళకరం.
* మిథున రాశి
గురువు వృషభరాశిలో ఉండటం వల్ల అన్ని రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఎదుర్కొంటారు. వివాహం, శుభకార్యాల్లో ఆటంకాలు, విద్యార్థులకు శ్రమ పడాల్సి వస్తుంది. ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాల్లో అడ్డంకులు. నిరుద్యోగులకు స్థిర ఉద్యోగ అవకాశాలు తగ్గే అవకాశం. ఆర్థిక ఇబ్బందుల వల్ల విలువైన వస్తువులను అమ్ముకోవాల్సి రావచ్చు. కీర్తి, ప్రతిష్ఠలకు భంగం, బంధువులతో మనస్పర్థలు. గురుపూజ, భగవద్గీతా పారాయణం మానసిక శాంతిని అందించగలవు.
మే 15, 2025 నుంచి గురువు మిథునరాశిలోకి మారడం వల్ల కోపం, ఆర్థిక నష్టం, ధనలేమి, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగంలో ఒత్తిడులు పెరిగే అవకాశం ఉంది. మనస్ఫూర్తిగా శ్రమించాలి, ప్రాణప్రదమైన వస్తువులను అమ్మకానికి పెట్టొద్దు. శాంతి కోసం దైవచింతన, గురువారం ఉపవాసం మంచిది.
శని మీనరాశిలో దశమస్థానంలో సంచరించడంతో వ్యాకులత, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ స్థానంలో చలనాలు ఉండవచ్చు. వాహనదుర్ఘటనల విషయంలో జాగ్రత్త అవసరం. వ్యవసాయదారులకు మొదటి పంట అనుకూలం. శని శాంతి దానాలు చేయడం మేలు.
నివారణలు: శనివారం నాడు శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం పెట్టడం మంచిది. గురువారం ఉపవాసం పాటించి, పసుపు వస్త్రాలు దానం చేయాలి. శివాలయంలో రుద్రాభిషేకం చేయడం శుభప్రదం. భగవద్గీత పారాయణం, సత్యనారాయణ వ్రతం చేయడం శుభఫలితాలు ఇస్తుంది. మాతా, పితృ సేవ వల్ల అనేక సమస్యలు తొలగుతా
* కర్కాటక రాశి:
వీరికి 14 మే 2025 వరకు వృషభరాశిలో గురువు ఏకాదశ స్థానములో ఉండటం వలన శుభములు కలుగును. చేపట్టిన కార్యములు సఫలమవుతాయి. రైతులకు, వ్యాపారస్తులకు లాభములు ఉండును. కళాకారులకు, పండితులకు సన్మానములు కలుగును.
మే 15 నుండి మిథున రాశిలో గురువు ద్వాదశ స్థానములో సంచరించినపుడు అన్ని రంగముల వారికి పనులు వాయిదా పడుతాయి. యువకులకు వివాహ కార్యములలో ఆటంకాలు, విఘ్నాలు కలుగుతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు. ధన వ్యయం, గృహ ప్రాప్తి, ఆర్థిక ఇబ్బందులు పెరిగే అవకాశముంది. విలువైన వస్తువులను అమ్ముట కలుగును. కీర్తి, ప్రతిష్ఠలు తగ్గును.
శని వలన జరిగే దుష్ప్రభావాలు:
ఉగాది నుండి మీనరాశిలో నవమ స్థానములో శనిసంచారము వలన మనశ్శాంతి ఉండదు. అనారోగ్యానికి గురవుతారు. విదేశీ ప్రయాణాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కుటుంబంలో చిన్న చిన్న తగువులు వస్తుంటాయి.
నివారణలు:
పురాణ పఠనం వలన మానసిక ప్రశాంతత చేకూరును. ప్రతి పౌర్ణమినాడు శనగలు, బెల్లం, పసుపు వస్త్ర దానం చేసిన శుభం కలుగును. శనిశాంతి జరిపించడం, ప్రతి శనివారము ఉపవాసం ఉండటం మంచిది. శని జపం చేయడం వలన కొన్ని ఆటంకాలు తొలగును.
* సింహ రాశి:
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ రాశి వారికి 14 మే 2025 వరకు వృషభరాశిలో గురువు దశమ స్థానంలో ఉండడం వలన పనులు సకాలంలో జరగవు. వృథా ప్రయాణాలు, ఎక్కువ డబ్బు ఖర్చు అవడం, అనారోగ్యానికి గురవడం వంటివి జరుగుతాయి.
అయితే, 15 మే నుంచి ఈ రాశివారికి మిథున రాశిలో గురువు ఏకాదశ స్థానంలో సంచరించడం వలన శుభములు కలుగుతాయి. కీర్తి పెరుగుతుంది. వస్తు, వాహన, ఆభరణ, గృహ ప్రాప్తి కలుగును. వ్యవసాయదారులకు, వ్యాపారస్థులకు లాభాలు వస్తాయి.
శని వలన జరిగే దుష్ప్రభావాలు:
శని ఉగాది నుండి మీనరాశిలో అష్టమ స్థానంలో సంచరించడం వలన కార్యములు చెడును. ఉద్యోగ భంగం వాటిల్లును. నిరంతరం ఏదో ఒక ఆలోచన వలన ప్రశాంతత కరువగును. విదేశీ ప్రయాణాలకు ఆటంకములు కలుగును. వాహనము నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
నివారణలు:
శనిని ప్రీతి చేసుకునేందుకు శని జపం, హోమ శాంతి, ప్రతి అమావాస్యకు నల్ల నువ్వులు, నలుపు వస్త్రాలు దానం చేయవలెను. సత్యనారాయణ వ్రతం, అన్నదానం వంటివి చేయడం వలన కొంత ఉపశమనము కలిగి, శుభకార్యములు నెరవేరును. “ఓం శం శనైశ్చర్యాయ నమః” అని జపం చేయుట మంచిది.
* కన్యా రాశి:
వీరికి 14 మే 2025 వరకు వృషభరాశిలో గురువు నవమ స్థానంలో ఉండటం వలన ధనలాభం, గృహలాభం కలుగును. చేపట్టిన కార్యములు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూలంగా సాగును. బంధు, మిత్రుల సహకారం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి.
మే 15 నుండి మిథున రాశిలో గురువు దశమ స్థానంలో సంచారం వలన శుభాలు కలిగి, కార్యములు సిద్ధించును. పుత్రిక, పుత్రుల వివాహాలకు ఆటంకాలు, అనుకోని ప్రయాణాలు, భయాలు కలుగుతాయి. రైతులకు, వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు ఉంటాయి.
శని వలన జరిగే దుష్ప్రభావాలు:
ఉగాది నుండి మీనరాశిలో సప్తమ స్థానంలో శని సంచారం వలన భయాలు కలుగుతాయి. తరచూ అనారోగ్యం పాలవుతారు. వాహన విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
నివారణలు:
ప్రతి అమావాస్య రోజున నల్ల నువ్వులు, నలుపు వస్త్రాలు దానం చేయవలెను. శివాలయ దర్శనం చేసుకోవలెను. శనగలు, నువ్వులు, ఉలువల దానం చేయవలెను. సహస్ర లింగార్చన, రుద్రాభిషేకాలు చేయుట వలన అన్నీ గ్రహాలు అనుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. “ఓం బృం బృహస్పతయే నమః” అని జపం చేయుట మంచిది.
* తులా రాశి:
ఈ రాశి వారికి 14 మే 2025 వరకు వృషభరాశిలో గురువు అష్టమ స్థానంలో ఉండటం వలన కోపం పెరుగుట, శత్రువుల బెడద, దొంగల భయం కలుగును. అన్ని రంగాలలో వృత్తి, వ్యాపారపరమైన పనులు వాయిదా పడుతుంటాయి. నిరుద్యోగులకు శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి.
మే 15 నుండి మిథున రాశిలో గురువు నవమ స్థానంలో సంచరించడం వలన అన్ని రంగాలలో లాభాలు కలుగును. పనుల్లో ఎటువంటి ఆటంకాలు ఏర్పడవు. విరోధాలు తగ్గును. ఆరోగ్య సమస్యలు మెరుగవుతాయి. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు ఉంటాయి. తీర్థయాత్రలు, దేశ విదేశ ప్రయాణాలు ఉంటాయి. కుటుంబ ఖర్చులకు తగిన రాబడి ఉండును. మీకు ఇది అనువైన కాలం.
శని వలన జరిగే సత్ఫలితాలు:
ఉగాది నుండి శని మీనరాశిలో 6వ స్థానంలో ఉండడం వలన సంవత్సరమంతటా శుభాలు కలుగును. వాహన లాభం, రైతులకు మొదటి పంటలు అనుకూలిస్తాయి. స్నేహితుల సహాయ సహకారం లభిస్తుంది. దీర్ఘకాల సమస్యల నుంచి బయటపడతారు.
నివారణలు:
శివాలయ దర్శనం మంచిది. ఉలవలు దానం, సహస్ర లింగార్చన, రుద్రాభిషేకాలు వలన శాంతి కలుగును.
* వృశ్చిక రాశి: ఈ రాశి వారికి 14 మే 2025 వరకు వృషభ రాశిలో గురువు సప్తమ స్థానంలో ఉండడం వల్ల అన్ని రంగాల వారికి కీర్తిప్రతిష్టలు పెరగడం, స్వల్ప ప్రయత్నంతో లాభాలు, కార్య సిద్ధి కలుగుతాయి.
మే 15వ తేదీ తర్వాత మిథున రాశిలో గురువు అష్టమ స్థానంలో సంచరించడం వల్ల అగ్నిభయం, శరీర సౌందర్యం తగ్గడం, కోపం పెరగడం, కార్యాలకు ఆటంకములు కలుగుతుంటాయి. శత్రు బాధలు ఉంటాయి. క్రయ విక్రయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. భార్యబంధు, పుత్ర సఖ్యత ఉంటాయి.
ఉగాది నుంచి శని మీనరాశిలో 5వ స్థానంలో ఉండడం వల్ల కార్యములలో అడ్డంకులు, మనస్థాపం, నీచస్త్రీల వల్ల నష్టం, ధననష్టము, ఆరోగ్యం నిలకడగా లేకపోవడం, అధిక ఆలోచించడం చేస్తారు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త తప్పనిసరి.
నివారణలు: 23 వేల సార్లు శని జపం చేయాలి. నల్ల నువ్వులు, నల్ల బట్ట దానం చేయండి. సత్యనారాయణ వ్రతం, అన్నదానం చేయడం వల్ల శని బాధ నుంచి తప్పించుకోవచ్చు. వ్యవసాయదారులకు మొదటి పంట అనుకూలత. సహస్ర లింగార్చన, రుద్రాభిషేకం చేయడం వల్ల శని, రాహు బాధలు తగ్గుతాయి. కులదేవత పూజ, గురువుల దర్శనం శుభం కలిగిస్తాయి.
* * ధనుస్సురాశి
ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి 14 మే 2025 వరకు గురుడు 6వ స్థానంలో ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. కొన్ని విషయాల్లో ముందుకు సాగినా, కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. కుటుంబంలో భార్య, పిల్లలతో చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు. బంధువులతో కలహాలు ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కొన్ని చిన్న సమస్యలు రావచ్చు, శరీర సౌందర్యం తగ్గుతుందని భావించి మానసికంగా ఆందోళన చెందకండి. కోపం, ఆతురత పెరగడం వల్ల నిర్ణయాల్లో తడబాటు ఉండవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో ఊహించినంత లాభాలు ఉండకపోవచ్చు. కాంట్రాక్టులు, కొనుగోలు, అమ్మకాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు మార్పులు ఉండే అవకాశం ఉంది.
15 మే 2025 నుంచి గురుడు 7వ స్థానంలోకి ప్రవేశించడంతో అనుకూల పరిస్థితులు ప్రారంభమవుతాయి. ఇంతవరకు ఉన్న ఆటంకాలు తొలగి, మీ పనులు సజావుగా సాగుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. నూతన అవకాశాలు దక్కుతాయి. ధన, ఐశ్వర్య, ప్రతిష్ట పెరుగుతాయి. వ్యాపారవృద్ధి, కళాకారులకు గుర్తింపు, విద్యార్థులకు మంచి ఫలితాలు దక్కే అవకాశముంది. దేశ, విదేశీ ప్రయాణాలకు అవకాశాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం, కొత్త సంబంధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి.
నివారణలు
ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి శని జపం, శనిగ్రహ తర్పణ, అన్నదానం, సత్యనారాయణ వ్రతం, నల్ల నువ్వుల దానం, పేదలకు సహాయం చేయడం మంచిది.
* మకర రాశి: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ రాశి వారికి 14 మే 2025 వరకు వృషభరాశిలో గురువు 5వ స్థానంలో ఉండడం వల్ల ధనలాభం, ఐశ్వర్యప్రాప్తి పనులల్లో అనుకూలత, ఆరోగ్యాభివృద్ధి, బంధు మిత్ర సుఖ ధనలాభం. చేతి వృత్తి పనివారికి లాభం కలుగుతుంది.
మే 15వ తేదీ తర్వాత మిథున రాశిలో గురువు 6వ స్థానంలోకి సంచరించడం వల్ల భార్యా, పుత్రులతో విరోధాలు ఏర్పడతాయి. బంధువులతో కలహాలు, అగ్నిభయం, శరీర సౌందర్యం తగ్గడం జరుగుతుంటాయి. క్రయ విక్రయాలలో జాగ్రత్త అవసరం.
ఉగాది నుంచి శని మీనరాశిలో 3వ స్థానంలో శని సంచారం వల్ల స్త్రీ సుఖము, మనశ్శాంతి, బుద్ధితో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆరోగ్యంలో అనుకూలత, కొత్త వ్యాపారాలు అనుకూలిస్తాయి.
నివారణలు: రాహు, కేతు, గురువులకు పూజ, దానధర్మాలు చేయుట, అమావాస్యకు అన్నదానం, శివాలయం దర్శనం, తీర్థయాత్రకు వెళ్లడం, విష్ణు సహస్రం పాటించడం లాంటివి చేయండి.
* కుంభ రాశి: ఈ రాశి వారికి 14 మే 2025 వరకు వృషభరాశిలో గురువు 4వ స్థానంలో ఉండడం వలన చంచల బుద్ధి, శరీరకాంతి తగ్గడం, కలహాలు ఏర్పడడం, ప్రతి పని ఆలస్యం కావడం, మనోబాధలు కలుగుతాయి.
మే 15వ తేదీ నుంచి మిథున రాశిలో గురువు 5వ స్థానంలో సంచరించడం వల్ల ధనలాభం, ఐశ్వర్యప్రాప్తి పనుల్లో అనుకూలత, బంధు మిత్ర సుశ ధనలాభములో కార్యానుకూలతలు కలుగుతాయి.
ఉగాది నుంచి శని మీనరాశిలో 2వ స్థానంలో సంచరించడం వల్ల ఎల్లప్పుడు కష్టాలు, సొంతవారితో గొడవలు, తరచూ ప్రయాణాలు, నమ్మినవారే మోసం చేయడం, కాళ్ల నొప్పులు, ఆరోగ్యంలో ఇబ్బంది ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉండకపోవడం జరుగుతుంది.
నివారణలు: శని ప్రభావం తగ్గించుకోవడానికి చండీ హోమం, ప్రతి అమావాస్యకు అన్నదానం, 23 వేల సార్లు శని అష్టక జపము, శనివారం ఉపవాసం, శని గ్రహ శాంతి, నవగ్రహ ఆరాధన, రావిచెట్టుకు 7 ప్రదక్షిణలు చేయండి.
* * మీనరాశి
ఈ సంవత్సరం మే 14, 2025 వరకు గురుడు వృషభ రాశిలో ఉండటం వల్ల మీ జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొంత శ్రమపడాల్సి వచ్చినా, మనశ్శాంతి దొరుకుతుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరుగుతుందనే సంగతి గమనించాలి. వ్యాపారవేత్తలకు లాభనష్టాల మధ్య సమతుల్యత ఉంటుంది. విద్యార్థులకు చదువులో మధ్యమ స్థాయి ఫలితాలు వస్తాయి.
మే 15, 2025 నుండి గురుడు మిథున రాశిలోకి వెళ్లడం వల్ల మీ ఆరోగ్యం పై కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. పనుల్లో ఆలస్యాలు, ఆర్థిక సమస్యలు ఎదురుకావచ్చు. అయితే, మీ ప్రయత్నం తగ్గకపోతే, విఘ్నాలు తొలగి విజయాన్ని సాధించగలుగుతారు. కుటుంబ సభ్యులతో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది, సహనంతో వ్యవహరించాలి. వ్యాపారవేత్తలు కొత్త పెట్టుబడులు పెట్టే ముందు భద్రతా చర్యలు తీసుకోవాలి.
శని మీ రాశిలో ఉండటం వల్ల మానసిక ఒత్తిడి, కుటుంబ కలహాలు, ఆర్థిక ఒడిదుడుకులు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. రాహు, కేతువు ప్రభావంతో అనవసరంగా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అనేకం పెరిగే అవకాశం ఉంది.
నివారణలు: ప్రతి గురువారం గోగ్రాసం పెట్టడం, పసుపు వస్త్ర దానం చేయడం శుభప్రదం. శనివారం రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. రాహు, కేతు దోషాల నివారణకు శివాలయంలో రుద్రాభిషేకం చేయాలి. పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతం చేయడం మంచిది. మాతా పితల సేవ చేస్తే అనేక సమస్యలు తొలగుతాయి.