
ప్రపంచవ్యాప్తంగా మీలియన్ల స్వచ్ఛంద సేవకులు, అనేక వాలంటీరీ ఆర్గనైజేషన్లు తమ అమూల్య సమయాన్ని, అనుభవాన్ని, అపార ఆధునిక జ్ఞానాన్ని వెచ్చించి, నిస్వార్థ సేవాగుణాలను ప్రదర్శిస్తూ సమాజాభివృది, సంక్షోభ కూపాల్లో చిక్కిన జనాలకు చేయూతనిస్తూ తమ జీవితాలను సుసంపన్నం చేసుకోవడం హర్షదాయకమే కాదు, సదా అనుసరణీయం కూడా.
ప్రపంచవ్యాప్త వాలంటీర్ల సేవలను గుర్తించిన ఐరాస 1985 నుంచి ప్రతి ఏట 05 డిసెంబర్ రోజున “ అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకుల లేదా వాలంటీర్ల దినం” పాటించడం ఆనవాయితీగా మారింది. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-2030ని సాకారం చేయడంలో వాలంటీర్ల పాత్రను కొనియాడడం, ప్రోత్సహించడం, ప్రపంచ శాంతి స్థాపనలో వారి కృషిని ప్రస్తుతించడం, మానవీయ చేతులకు దండం మపెట్టడం లాంటి అంశాలను చర్చించడానికి ఈ వేదికలు ఉపయోగపడుతున్నాయి.
చీకట్లను చిదిమే చిరు దివ్వెలు – వాలంటీర్లు:
స్థానిక, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయిల్లో నిరంతరం చొరవ తీసుకొని పరహితం కోరి సుస్థిరాభివృద్ధికి బాటలు వేస్తున్న వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థలు (ఎన్‌జిఓ) ఎనలేని సేవలను అందించి అవసరార్థుల కన్నీళ్లను ఆప్యాయంగా తుడవడం అనాదిగా జరుగుతున్నది. యుద్ధాలు, సంక్షోభాలు, ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు, వాతావరణ మార్పులు, అసమానతలు విశ్వవ్యాప్తమైన నేటి ప్రపంచంలో స్వచ్ఛంద కార్యకర్తలు నలుదిశల్లో తమ వంతు సేవలను అందించడం కొనసాగుతోంది. ఐరాస గొడుగు కింద పలు దేశాల వాలంటీర్లు “పీస్‌కీపింగ్ ఫోర్స్” పేరున ఈ కార్యాలను నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 109 మిలియన్ల వాలంటీర్లు, 183 పౌర సంస్థల 13,186 మంది కార్యకర్తలు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ సేవలను అందిస్తున్నారు. ఐరాస శాంతి స్థాపన దళంలో 51 శాతం మహిళలు, 29 శాతం యువత ఉండడం విశేషం.
ప్రపంచ స్థాయి సేవా సంస్థలు:
ప్రపంచ స్థాయిలో లయన్స్ ఇంటర్నేషనల్ ద్వారా దాదాపు 14 లక్షల వాలంటీర్లు, రోటరీ ఇంటర్నేషనల్ వేదికగా 14 లక్షల స్వచ్ఛంద సేవకులు ప్రపంచవ్యాప్తంగా అవసరార్థులకు సేవలు అందించడంలో ముందున్నారు. భారతీయ యువతలో సేవాగుణాన్ని నూరిపోయడానికి విద్యాలయాల్లో ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్ లాంటి సంస్థలు స్థాపించడం ముదావహం. విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం తోడు కావడానికి సేవా ప్రవృత్తి పెంపొందించవలసిన అవసరం ఉన్నదని గమనించాలి.
మానవీయతే పరమ ధర్మమని, పరహితమే శక్తివంతమైన గుణమని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే మానవ లక్షణమని తెలుసుకొని ఇతరుల జీవితాల్లో చీకట్లను తరమడానికి మనం ఓ చిరు దీపమై నిలుద్దాం, శాంతి స్థాపన మహా యజ్ఞంలో మనందరం పాలుపంచుకుందాం.