
వేదవ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని తెలుగు పద్యకావ్యంగా అనువదించిన ముగ్గురు కవులు తెలుగు సాహితీ చరిత్రలో కవిత్రయం అని మన్ననలందుకొన్నారు. ఆ ముగ్గురు తెలుగు కవులు నన్నయ, తిక్కన, ఎర్రన. కవిత్రయం తర్వాత తెలుగు సాహిత్యంలో విశిష్టమైన స్థానం కలిగిన కవి శ్రీనాథుడు. 15వ శతాబ్దంలో తన సాహిత్య సృష్టితో వాగ్దేవిని వినూత్నమైన కాంతితో విరాజిల్లజేసి, నాటి నుంచి నేటి వరకు సాహిత్యాభిమానులచే కైమోడ్పులందుకున్న మహాకవి శ్రీనాథుడు. ఆయన 15 వ శతాబ్దికి చెందిన తెలుగు కవి, దివ్యప్రబంధన శైలికి ఆదరణ కల్పించినవారు. “చిన్నారి పొన్నారి చిఱుత కూకటినాఁడు రచియించితి మరుత్తరాట్చరిత్ర” అని బాల్యములోనే బృహత్కావ్యాన్ని రచించిన ప్రౌఢ కవి శ్రీనాథుడు. ఆయన 15వ శతాబ్దము కాలపు కొండవీటి ప్రభువు పెదకోమటి వేమారెడ్డి యొక్క ఆస్థాన కవి, వారి ఆస్థాన విద్యాధికారి. ఈ కాలమందు ఎందరో కవిపండితులకు రాజాశ్రయం కల్పించారు శ్రీనాథు కవి సార్వభౌములు.
శ్రీనాథుడు విశాల లోక సంచారి, వెల్చేరు ప్రతిపాదన ప్రకారం ఐక్యాంధ్ర సామ్రాజ్యపు సరిహద్దులేమిటో తొలిగా చూపినవారు, సౌందర్యారాధకులు. ఆయన మహా రసికులు, సరసులు, భోజనప్రియులు, సర్వ స్వతంత్రులు. శ్రీనాథ సార్వభౌములు దేవుణ్ణైనా లెక్కచెయ్యని వారు, మహా విలాసి, జీవితాన్ని విపరీతంగా ప్రేమించి అనుభవించిన వారు, బాహ్యప్రేరణలకు వెంటనే స్పందించే వారు, అసౌకర్యాలను భరించలేని వారు. ఆయన కులమత విభేదాలు లేనివాడు, కులమత విభేదాలు చూపనివాడు, సున్నిత మనస్కుడు, గొప్ప చమత్కారి కూడా. ఈయన పోతనకు సమకాలీనులు, పోతన రచించిన శ్రీమదాంధ్రభాగవతాన్ని సర్వజ్ఞసింగభూపాలునికి అంకితమిప్పించడానికి ఒప్పింప చూశారు. శ్రీనాథ మహాకవి చాటువు పద్యాలకు ప్రసిద్ధి. గౌడ డిండిమభట్టు అనే పండితుని వాగ్యుధ్ధంలో ఓడించి అతని కంచుఢంకను పగుల గొట్టించారు శ్రీనాథుడు. అతనికి కవిసార్వభౌముడు అనే బిరుదు ఉంది.
శ్రీనాథుడు తన గ్రంథాలతో ఎంతగా లబ్ధప్రతిష్ఠుడయ్యారో, చాటువుల ద్వారా కూడా అంతే లబ్ధప్రతిష్ఠుడయ్యారు. శ్రీనాథుడు ఎంతో ఆధునిక భావాలున్నవారు. ఈ కాలపు సమాజంలో హాయిగా ఇమిడిపోగలవారు. ఆనాటి సమాజానికి ఆయన జీవనశైలి మింగుడుపడనిదై ఉంది. అందుకే అంతటి మహానుభావుడూ చివరిదశలో ఎన్నో ఇక్కట్లకు గురయ్యారు. బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, ఎవ్వరూ ఆయన్ని ఆదుకోవటానికి రాలేదంటే తన బంధుమిత్రులకు తాను ఎంత దూరమయ్యారో తెలుస్తుంది. సర్వస్వతంత్రుడిగా, నిరంకుశుడిగా జీవితాన్ని తన మనసుకు నచ్చిన రీతిలో సాగించిన వారు శ్రీనాథుడు. తన అంతిమ దినాలు బహు దుర్బరంగా గడిచాయి.
కొండవీటి ప్రాభవంతో పాటు శ్రీనాథుని ప్రభ మసకబారి, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టేయి. కృష్ణాతీరాన ఉన్న బొడ్డుపల్లి గ్రామాన్ని గుత్తకు తీసుకొని శిస్తు కట్టని కారణంగా ఆయన భుజంపై ఊరిబయటనున్న శిలను ఉంచి ఊరంతా తిప్పారు. తన వైభవం నడిచిన నాడు పట్టువస్త్రాలు తప్ప మరో దుస్తులు ధరించని శ్రీనాథుడు, మెడకు బంగారు నగలను ధరించి, చేతులకు బంగారు కంకణాలు తొడిగిన శ్రీనాథుడిని విధి చిన్నచూపు చూసింది. దాని పర్యావసానం చిరిగిన బట్టలతో, చింపిరి జుట్టుతో తలవంచుకొని నేరస్తుడిగా అడుగులు వేయాల్సిన పరిస్థితి దాపురించింది. చివరికి శ్రీశైలం శివయ్య సన్నిధికి చేరి “శివరాత్రి మహత్యం” రచించి, ఆఖరు గడియలలో కృష్ణమ్మ ఒడిలో కలిసిపోయారు.
నేపథ్యం…
శ్రీనాథుడు నేటి నెల్లూరు నుండి కృష్ణా జిల్లా వరకు ఉన్న తీర ప్రాంతంలో ఏదో ఒక ఊరిని ఆయన మహా జన్మస్థలంగా ఎవరికి తోచిన విధంగా వారు పేర్కొన్నారు. కొన్నింటికి సరైన ఆధారాలు లేవు. ఉన్న ఆధారాలను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం జరిగింది. ఏదేమైనా శ్రీనాథుడు సీమాంధ్రుడు. ఆయన పుట్టింది ఒక రేవు పట్టణం. బహుశా అది నేటి ప్రకాశం జిల్లాలోని పాకాల అయ్యే అవకాశం ఎక్కువ అని అంటుంటారు. కానీ శ్రీనాథుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాలో గల గూడూరు మండలంలో కలపటం గ్రామంలో 1355 లో భరద్వాజ గోత్రానికి చెందిన పాకనాటి నియోగి తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు అనేది మరొకవిధంగా ప్రాచుర్యంలో ఉన్న విషయం. వారి తల్లి భీమాంబ మరియు తండ్రి మారయ్య.
శ్రీనాథుడి తాత కమలానాభామాత్యుడు రేవుకు అధికారి. ఈయన పద్మ పురాణమును తెలుగులోకి అనువాదం చేశారు. కాకతీయ రెండో ప్రతాపరుద్రుని కాలంలో ఆయన ఆ బాధ్యత నిర్వహించాడు. శ్రీనాథామాత్యుని తాతగారు కమలనాభామాత్యుడు తన మనుమని ముద్దు పలికులలో ఇట్లు వర్ణించినాడు “కనకక్ష్మాధర ధీరు, వారిధి తటీ కాల్ పట్టణాధీశ్వరున్ అనుగుందాత, కమనాభామాత్య చూడామణిన్”. సాగర తటమునందున్న కాల్ పట్టణమునకు అధిపతి కమలలాభామాత్యుడు. నేటి ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ నదికి దక్షిణ తటమున, బంగాళాఖాతమునకు పడమరగా, సుమారు ఇరువది కిలోమీటర్ల దూరములోనున్న నేటి ఊరు కొలచనకోట. ఈ కొలచనకోట యే కొలసనకోట (కాల్ సనకోట) అదే శ్రీనాధుని జన్మస్థలమని పలువురి చరిత్రకారుల అభిప్రాయము. ఈ కాల్పట్టణం ఆ సమీపంలోని పాదర్తి అని మరికొందరు అందురు. ఏది ఎమైనా శ్రీనాధుడు ప్రకాశం సీమలోనివాడని, జన్మస్థలము ఈ ప్రాంతములోనే జరిగినదని తెలియుచున్నది.
పెదకోమటి వేమారెడ్డి అస్థాన కవిగా…
శ్రీనాథుడు గురువులు ఎవరు? ఎవరి దగ్గర ఈయన కవిత్వం నేర్చుకున్నారు? కుటుంబ వారసత్వంగా తనకు కవిత్వం వచ్చిందా? లేక వాగ్దేవి ప్రసాదంగా ఆయనకు కవిత్వం అబ్బిందో తెలియదు గానీ తెలుగు భాషకు మాత్రం తిరుగులేని ఒక కవి దక్కారు. శ్రీనాథునికి చిన్ననాటి స్నేహితుడు ఒకడు ఉండేవాడు, ఆయన పేరు అవచి తిప్పయ్య. కొండవీడు నుండి తెలుగు తీరంలోని రేవు పట్టణాలన్నింటిలో అవచి తిప్పయ్య కుటుంబం వ్యాపారం చేసి కోట్లకు పడగలెత్తింది. తాను వ్రాసిన “హరవిలాసము” ను అవచి తిప్పయ్యకు అంకితం ఇచ్చారు శ్రీనాథుడు. దీనిని బట్టి, అవచి తిప్పయ్య కుటుంబం శ్రీనాథుడుకి ఎంత అండగా ఉండేవారో మనకు అర్థం అవుతుంది.
తొలి ప్రయత్నంలో కొండవీటి ఆస్థానంలో ప్రవేశం లభించక, చందోలు చేరి అక్కడ పెద్ద కోమటి వేమారెడ్డి దగ్గర ఆశ్రయం పొందారు. శ్రీనాథుడు 15వ శతాబ్దము కాలంలో కొండవీటి ప్రభువు పెదకోమటి వేమారెడ్డి యొక్క ఆస్థాన కవిగా ఉండేవారు. ఆయన అస్థానంలో శ్రీనాథుడు విద్యాధికారి కూడా. ఆయన విద్యాధికారి పనిచేసిన కాలమందు ఎందరో కవిపండితులకు రాజాశ్రయం కల్పించారు. అద్దంకి రెడ్డిరాజులు క్రమముగా కొండవీడు, రాజమహేంద్రవరములలో రాజ్యమేలినారు. శ్రీనాథ కవిసార్వభౌముని జీవితం ఆయన ప్రమేయం లేకుండానే రాజ పాలకుల రాజకీయ ఎత్తుగళ్లలో ఇరుక్కుంది. శ్రీనాథుడికి మంత్రాంగం తెలియదు, కానీ పాలకుల తరుపున రాయబారం నడపాల్సి వస్తే నడిపేవాడు. కవిగా ఆయనకున్న ప్రతిభతో ఎవరినైనా మెప్పించి, ఒప్పించగల నేర్పు శ్రీనాథుడికి ఉంది. అందువలన కాబోలు 15వ శతాబ్దపు ఆంధ్ర దేశ రాజకీయ చరిత్ర మహాకవి జీవిత చరిత్ర అయ్యింది.
రాచకార్యాలు నిర్వహించిన శ్రీనాథుడు…
శ్రీనాథుడు “శివరాత్రి మహత్యం”, “హరవిలాసము”, “భీమఖండం”, “కాశీఖండము”, “శృంగార నైషధం”, “పలనాటి వీరచరిత్ర”, “ధనంజయ విజయం”, “మర్రుతరాట్చరిత్ర”, “శృంగారదీపిక” మరియు “క్రీడాభిరామం చరిత్ర” లతో పాటుగా పౌరాణిక విషయాలపై రచనలు చేశారు. అదేవిధంగా శ్రీనాథుడు శాలివాహన గాథా సప్తశతిని ప్రాకృతం నుండి తెలుగులోకి అనువదించారు. శ్రీనాథుడు తెలుగులో “చాటువులు” అనే వందలాది అద్భుతమైన కవితలను కూడా రచించారు. ఆయన తన శృంగార నైషధము ప్రబంధ రూపానికి ఒక ప్రసిద్ధ ఉదాహరణ. ప్రకృష్టమైన పదబంధమున్న కావ్యం ప్రబంధము. ప్రబంధాన్ని పద్య రూపంలోని కథగా, గట్టి గణాంక నిర్మాణంతో వర్ణించవచ్చు. తెలుగు కవిత్వంలో 15వ శతాబ్ది నాటికి అభివృద్ధి చెందిన ప్రక్రియా భేదం ప్రబంధం.
శ్రీనాథ మహాకవి సుఖః ప్రాణి. రాజుల అస్థాన కవిగా పనిచేసినా కూడా అయన తనకంటూ ఒక సొంత అగ్రహారం కూడా తీసుకోలేదు. అదేవిధంగా తన కుటుంబం కోసం విలాస భవనాలను కూడా ఏర్పాటు చేసుకోలేదు. ఏరోజుకు ఆరోజున సాగే తన సుఖజీవనం కొరకు మాత్రమే పరిమితమయ్యారు. తనలాంటి గొప్ప కవిని ఎవరైనా ఆదరించి తీరుతారని నమ్మకం వలన తాను ఇలాంటివి ఏవీ కూడా ఆశించి ఉండకపోవచ్చు.
శ్రీనాథుడు “శృంగార నైషధం”, “హరవిలాసము”, “భీమఖండం”, “కాశీఖండము”, “శివరాత్రి మహత్యం” లాంటి కావ్యాలను భిన్న సందర్భాలలో ఎవరో ఒకరు ప్రోత్సాహించగా వ్రాసి, వ్రాసేందుకు ప్రోత్సాహించిన వారికే అంకితం ఇచ్చారు. కొండవీటి రెడ్డి రాజుల వైభవం కారణంగా శ్రీనాథుడు వారి వద్ద విద్యాధికారిగా పనిచేశారు. పెద కోమటి వేమారెడ్డి శ్రీనాథుని ప్రతిభాపాఠవాలకు ముగ్దుడయ్యారు. అతనకు శ్రీనాథుడు అనేక రాచకార్యాలు నిర్వహించి పెట్టారు. వారికి అవసరమైనప్పుడు విజయనగర పాలకుడైన ప్రౌఢదేవరాయల రాజ్యానికి వెళ్లి అక్కడ జరిగిన వాద ప్రతివాదల్లో గౌడ డిండిమభట్టు అంతటి వాడిని ఓడించి రాచకార్యం నెరవేర్చుకువచ్చారు శ్రీనాథుడు.
వైభవం తగ్గి సామాన్యుడిగా..
శ్రీనాథుడు కొన్నాళ్ళు విస్తృతముగా ఆంధ్రదేశముననే కాక, కర్ణాటక ప్రాంతమునందు కూడ సారస్వత యాత్రలు నెరపి తన భాషకు ఎనలేని సేవ చేసినాడు. శ్రీనాథుడు రాజుల వద్ద ఉంటూ, రాచకార్యాలు నిర్వహిస్తూ, విద్యాధికారిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ, తన పాండిత్యం మరియు రచనలతో వారిని అలరిస్తూ కాలం వెళ్ళబుస్తున్నారు. కానీ కాలం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు, ఒకేలా సాగదు. దేశంలో కాలంతో వస్తున్న మార్పులకు, పాలకులకు కూడా మారిపోయారు. ఒక చోట రాజ వంశం పతనమవుతుంటే, మరోచోట కొత్త రాజ్యం ఏర్పడుతున్నది. కాలంలో మార్పులు, రాజ్యంలో వేగంగా వస్తున్న మార్పుల ప్రభావం శ్రీనాథ కవి సార్వభౌముడి మీద పడింది.
కొండవీటి రెడ్డి రాజుల వైభవం నశించడంతో, శ్రీనాథ కవిసార్వభౌముడికి కష్టాలు మొదలయ్యాయి. తన పాండిత్య ప్రదర్శనతో రాజ్య ఆస్థానపు సకల సౌకర్యాలు అనుభవించిన శ్రీనాథుడు సామాన్యుడయ్యారు. తనను ఆదరించి, తనకు ఆస్థానం ఇచ్చేవారిని వారిని వెతుక్కుంటూ తానే వెళ్లాల్సి వచ్చింది. తాను కవి సార్వభౌముడిని అనే సాహిత్య గర్వం ఉండడం వలననో, లేక కవి సార్వభౌముడంతటి పెద్దవాడిని ఆహ్వానించగలిగిన సమర్థ పాలకులు కరువయ్యారో ఏమో తెలియదు. కొంతకాలం కందుకూరు పరగణాల పాలకులు అందించిన దినవెచ్చాల మీద ఆధారపడ్డారు శ్రీనాథుడు. తాను అహం వదులుకొని, కడుపు చేతపట్టుకుని శ్రీనాథుడు గోదారి తీరం వైపు వెళ్ళారు.
కవిత్వం వ్రాసిన చేతులతో వ్యవసాయం చేసి…
శ్రీనాథుడు 1430 సంవత్సరం నాటికి ద్రాక్షారామం ఏలే తెలుగు రాయుడు దగ్గరికి చేరిపోయారు. కానీ అక్కడ కూడా తాను ఎక్కువ కాలం ఉండలేదు. శ్రీనాథుని ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా క్షీణించింది. ఆయనకు ఎవరు ఆశ్రయం ఇస్తారని వెతుక్కుంటూ, వెతుక్కుంటూ, తిరిగి తిరిగీ ఒక రకంగా దేశదిమ్మిరి అయ్యారు. శ్రీనాథుని అంతిమ దినాలు బహు దుర్భరంగా గడిచాయి. నిజానికి ఆయనకు బంధు వర్గం లేదా? శిష్యులు లేరా? సమకాలీనులు లేరా? ఉంటే వారెందుకు శ్రీనాథుడిని ఆదరించలేదు? ఎందుకు ఆయన అలా ఒంటరిగా ఎవ్వరికీ కానివాడుయ్యారు? ఇలాంటి విషయాలపై స్పష్టత లేదు.
కృష్ణాతీరాన ఉన్న బొడ్డుపల్లి గ్రామాన్ని గుత్తకు తీసుకొని వ్యవసాయం చేశారు. శ్రీనాథుడు హాలికుడైనారు, నాగలి పట్టారు. బొడ్డుపల్లి గ్రామంలో రైతుగా శ్రమించారు. తన శారీరక శ్రమ, జవాబుదారి లేని శరీరం, కవితాకుసుమాలు పండించిన నేర్పరి, తాను సాదాసీదా పంట పండించే నేర్పులేక శ్రీనాథుడు వ్యవసాయంలో విఫలమయ్యారు. వరదలు వచ్చి వ్యవసాయ భూములను ముంచెత్తాయి. ప్రభుత్వానికి కట్టాల్సిన కప్పం బకాయి పడ్డారు. నాటి పాలకులైన గణపతులు, కవి శ్రీనాథుడిని కొండవీటి రాజుల మనిషిగా గుర్తుపెట్టుకున్నారు. అందుకే అవకాశం దొరకగానే శ్రీనాథుడి మీద కసి తీర్చుకున్నారు. శ్రీనాథుడికి సంకెళ్లు వేసి బంధించారు.
చేతులకు సంకెళ్లు వేసి, గుదిబండతో వీధులలో తిప్పి…
కృష్ణా నది తీరాన ఉన్న బొడ్డుపల్లి గ్రామాన్ని గుత్తకు తీసుకొని శిస్తు కట్టకపోవడం ఒక కారణం, శ్రీనాథుడు కొండవీటి రెడ్డి రాజుల మనిషి అనే మరొక కారణంతో తాను కవిసార్వభౌముడు అనే గౌరవం కూడా లేకుండా ఆయనను అప్పటి పాలకులు అయిన గణపతిదేవులు ఘోరంగా శిక్షించారు. శ్రీనాథుడి మెడకు, చేతులకు కలిపి కొయ్యను వేసి గుదిబండతో వీధులలో నడిపించారు. తన వైభవం నడిచిన నాడు పట్టువస్త్రాలు తప్ప మరో దుస్తులు ధరించని శ్రీనాథుడు చిరిగిన బట్టలతో, చింపిరి జుట్టుతో తలవంచుకొని నేరస్తుడిగా అడుగులు వేయాల్సిన పరిస్థితి దాపురించింది. విధి చిన్నచూపు చూసిందేమో కాబోలు ఒకనాడు బంగారు నగలను ధరించి మెడకు గుదిబండ, బంగారు కంకణాలు తొడిగిన చేతులకు సంకెళ్లు వేసి వీధి వీధి తిప్పడం శ్రీనాథుని మనస్తాపానికి గురిచేసింది.
శ్రీనాథుని భార్య, కూతురు, అల్లుడు ఏమయ్యారో తెలియదు. ఒంటరి వాడైపోయిన శ్రీనాథుడు గణపతులు చేసిన అవమానం భరించలేక, బ్రతికేందుకు మరో మార్గం లేక, తనను పోషించే ప్రభువులు కానరాక, తాను నెమ్మదిగా శ్రీశైలం వైపు తరలివెళ్లారు. అక్కడ శైవపీఠం సంరక్షించేవారు శ్రీనాథుడిని ఆదరించారు. వారి కోరిక మేరకు ఆయన అక్కడే ఉంటూ “శివరాత్రి మహత్యం” ను రచించారు. అయితే అప్పటికే శ్రీనాథుడి రచనలో ఉన్న పట్టుత్వం తగ్గింది. తన వయస్సు పైబడింది. తాను కష్టాల పాలయ్యారు. తన శరీరక పట్టత్వం తగ్గిపోయింది. స్వతంత్రంగా జీవించే ఏర్పాటు చేసుకోలేక, ఎవరో ఒకరి క్రింద చేరాల్సి రావడం తన మనసును కలచి వేసింది. “అడుగుతున్నాడు శ్రీనాథుడు అమరపురికి” అంటూ ఆయన గతంలో చెప్పిన వాస్తవంలో ఆయన మరణం ఎప్పుడో తెలియకుండా పోయింది. శ్రీనాథుడు సన్యాసదీక్ష వహించి కృష్ణవేణిలో అర్పణమైపోయారు. ఏమైనా ఆ మహాకవి కవి సార్వభౌముని జీవితం, తాను ఊహించని మలుపులు తిరిగి, మరెవ్వరూ ఊహించని రీతిలో అంతమైంది.










