Telugu News

ఏ దేశంలో చూసినా ఏమున్నది గర్వకారణం – ఎక్కడ చూసినా మానవ హక్కుల హననమే !

1948లో ఐరాక సర్వసభ్య సమావేశం చేసిన తీర్మానం “యూనివర్సల్ డిక్లరేషన్‌ ఆఫ్ హూమన్‌ రైట్స్‌” ప్రకారం ప్రతి ఏట 10 డిసెంబర్‌న “మానవ హక్కుల దినోత్సవం(హూమన్‌ రైట్స్‌ డే)” పాటించుట ఆనవాయితీగా మారింది. మానవ హక్కుల దినం-2024 థీమ్‌గా “మన హక్కులు, మన భవిష్యత్తు, ఈ క్షణమే” అనబడే అంశాన్ని తీసుకొని ప్రచారం, అవగాహన చేస్తున్నారు. పౌర సమాజ సమగ్రాభివృద్ధికి మానవ హక్కుల పరిరక్షణ చర్యలతో ప్రపంచ శాంతి సౌభాగ్యాల స్థాపనకు తోడ్పడతాయి.

అసమానతలను రూపుమాపడానికి మానవ హక్కులను గౌరవించడం మన కనీస ధర్మం. మానవ హక్కుల దినం కేంద్రంగా హక్కుల ఉల్లంఘనలను నివారించడం, సంరక్షణ, సకారాత్మక మార్పులను తీసుకురావడం జరగాలి. మానవ హక్కులను బలోపేతం చేయడం అంటే మరింత శాంతియుత సమాజ స్థాపనకు ఊపిరి పోయడమే అని తెలుసుకోవాలి. 

మానవ హక్కులను గౌరవించడం అంటే ఉజ్వల భవిష్యత్తును కాంక్షించడమే

పేదల శ్రమ దోపిడీ, బాల కార్మిక వ్యవస్థ, మానవ అక్రమ రవాణా, ఆకలి చావులు, యుద్ధాల్లో పిల్లలను వినియోగించడం, భౌతిక హింస, స్వేచ్ఛను హరించడం, మారణహోమాలు, లైంగిక వేధింపులు, మానవీయ చేయూత ఇవ్వకపోవడం, కనీస అవసరాల కొరత, వివక్ష పాలన, లింగ అసమానతలుఅకారం అరెస్టులు, హత్యలు, మత ఘర్షణలు, గొంతు నొక్కడం, పని కల్పించకపోవడం, చట్టాల ఉల్లంఘనలు, మహిళలు/బాలికపై వేధింపులు, నిర్భంధించడం లాంటి పలు అంశాలు మానవ హక్కుల హననంలోకి వస్తాయి.

నేటి ప్రపంచం పలు సంక్షోభాలమయం. యుద్ధాలు, సగం ఘర్షనలు, వాతావరణ మార్పులు, అసమానతలు రాజ్యమేలుతున్న వేళ మానవ హక్కులు అనాధలుగా బిత్తరపోతున్నాయి, కనీస మానవ హక్కులకు విఘాతం కలుగుతున్నది. మానవ హక్కులు మానవాళిని ఏకం చేస్తాయి. మానవ హక్కుల పరిరక్షణతోనే ఆశావహ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది. హక్కుల దుర్వినియోగం, ఉల్లంఘనలు, అమానవీయ పోకడలతో నేటి సమాజం దుఃఖమయంగా, దయనీయంగా మారడం చూస్తూ చలించిపోతున్నాం. 

మానవ హక్కులను కాపాడడం అంటే మనల్ని మనమే గౌరవించుకోవడం అని అర్థం చేసుకోవాలి. అన్ని వర్గాల ప్రజల సమ్మిళిత అభివృద్ధి సాధనకు మానవ హక్కులను గౌరవించడం తప్పనిసరి. మానవ హక్కులతో వ్యక్తులు బలోపేతం కావడం, సమాజంలో శాంతి నెలకొనడం ఫలిస్తాయి. 

Show More
Back to top button