అలనాటి తెలుగు చలనచిత్ర నటీమణి, గాయని. కె.మాలతి. కొందరి జీవితాలు సినిమాల్లా ఉంటాయి, కొన్ని సినిమాలు జీవితాన్ని పోలి ఉంటాయి. సినీ పరిశ్రమలో వెలిగిపోయిన ఎంతోమంది కథనాయికల జీవితాలు వెండితెరపై సంతోషంగా కనిపించినా, నిజ జీవితంలో విషాదాంతంగా మారిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఆంది, దేవదాస్ వంటి పలు చిత్రాల్లో నటించి అంతర్జాతీయ ఫిలింఫేర్ పురస్కారం అందుకున్న తొలి భారతీయ నటిగా గుర్తింపుపొందిన నటి సుచిత్ర సేన్ 36 ఏళ్ల పాటు ఒకే గదిలో బందీగా ఉంటూ అనామకురాలిగా మరణించారు. స్టార్ హీరో పవన్ సింగ్ భార్య, పెళ్లయిన 5 నెలలకే ఆత్మహత్యకు పాల్పడటం చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. అనారోగ్యం, వ్యక్తిగత కారణాలతో శోభ, సౌందర్య వంటి నటీమణులు చిన్న వయసులోనే మరణించడం సినీ చరిత్రలో అతిపెద్ద విషాదాలు. మహానటి సావిత్రి, అందాల తార కాంచనమాల, మధుబాల, దివ్యభారతి, సిల్క్ స్మిత, నటులు ఉదయ్ కిరణ్ మొదలగువారు ఒక వెలుగు వెలిగి, అర్థంతరంగా కన్నుమూశారు. ఆ కోవకే చెందుతారు పాతాళభైరవి (1951) నటి మాలతి.
వాహినీ పిక్చర్స్ నిర్మాణ సంస్థ ద్వారా పరిచయమై బి.యన్. రెడ్డి, కె.వి.రెడ్డి లాంటి అగ్రదర్శకులు వాహినీ వారి సినిమాలు సుమంగళి (1940), భక్త పోతన (1942), గుణసుందరి కథ (1949), పాతాళ భైరవి (1951) తదితర చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించిన నటి మాలతి. వెండితెరకు పరిచయమైన అతి తక్కువ కాలంలో అగ్ర కథనాయకులైన ఎన్టీఆర్, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ సరసన నటించి సౌమ్యురాలిగా, అహంభావం లేని నటిగా, నటనలో తనకు సాటిలేరని నిరూపించుకున్నారు నటి మాలతి. ఆమె తన పాటలను తానే పాడుకునేవారు. వాహినీ వారి “గుణసుందరి కథ” (1949) లో శాంతకుమారితో కలిసి “కలకలా ఆ కోకిలేమో పలుకరించే వింటివా”, “చల్లని దొరవేలే చందమామ” లాంటి పాటలు పాడారు. తొలి రోజులలో కథానాయికగా రాణించి మంచి పాత్రలను దక్కించుకున్న మాలతి, తన సినీ ప్రస్థానం చివరి రోజులలో సహాయక పాత్రలను పోషించారామె. ఈవిడ నటించిన చివరి చిత్రం ఎన్.టి.రామారావు తీసిన శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979). ఆ తరువాత నవంబరు లో భారీ వర్షాలకు ప్రభాత్ అనే థియేటర్ యొక్క ప్రహరీ గోడ కూలిపోయి అనామకంగా మరణించారు నటి మాలతి.
నేపథ్యం…
కె.మాలతి అసలు పేరు సూర్యకుమారి. ఆమె ఆంధ్రప్రదేశ్ జిల్లా గుంటూరు పట్టణంలో జన్మించారు. మాలతీ నాన్న పేరు గొల్లపూడి సూర్యనారాయణ. ఆమె తన ఐదు సంవత్సరాల వయస్సులో ఉండగానే నాన్న గొల్లపూడి సూర్యనారాయణ దివంగతులయ్యారు. ఆయన మరణించిన తరువాత ఐదు సంవత్సరాల వయసున్న సూర్యకుమారిని తీసుకుని తన పుట్టిల్లు అయిన ఏలూరుకు వచ్చేశారు. మాలతీ పాఠశాల విద్య ఏలూరులోనే సాగింది. ఆమె అక్కడే చదువుకుంటూ సంగీతం కూడా నేర్చుకున్నారు. ఆమెకు వీలు చిక్కినప్పుడల్లా నాటకాలలో నటిస్తూ ఉండేవారు. ఆ కాలంలో బాల్య వివాహాలు ఎక్కువగా ఉండేవి. దాంతో మాలతికి కూడా చిన్న వయస్సులోనే వివాహం చేశారు. ఆమె భర్త పేరు వీరాచారి. ఆమె మామగారు (వీరాచారి తండ్రి) ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండేవారు. వీరాచారికి నాటకాలు అంటే విపరీతమైన ఆసక్తి. మోతే వారి కంపెనీ వేసే నాటకాలకు ఆయన నిర్వాహకుడి (మేనేజర్) గా పనిచేస్తుండేవారు. వనారస గోవిందరావు వ్యవస్థాపించిన ప్రపంచ ప్రఖ్యాత సురభి నాటక సమాజం (1885) కంపెనీకి కూడా నిర్వాహకుడిగా ఉండేవారు. చిన్నప్పటినుండే మాలతికి సంగీతం, పాటలు పాడడం అంటే ఆసక్తి, ఉండటం గమనించిన భర్త వీరాచారి ఆమె ఆసక్తిని ప్రోత్సహిస్తూ వచ్చారు.
గ్రామ్ ఫోన్ రికార్డులలో పాడుతూ…
నాటకాలలో నటించే గాయనీమణులకు నాటకంలో నటించేటప్పుడు పాటలు పాడే అవకాశం వస్తుంది. వారు ఆ రోజుల్లో గ్రామఫోన్ రికార్డులు ఇస్తుండేవారు. ఆ విధంగా వీరాచారి తన భార్య మాలతిని వెంటబెట్టుకుని మద్రాసు వెళ్లి, అక్కడ గ్రామఫోర్ రికార్డులలో ఆమెతో పాటలు పాడించారు. అలా ఆమె కచదేవయాని అనే డ్రామాను గ్రామ్ ఫోన్ రికార్డులలో విడుదల చేస్తే అందులో ఆమె పాటలు పాడారు. “నీలాల రంగుల వాడు”, “ఊగాలి ఊయల” అనే లలిత గీతాలను గ్రామ్ ఫోన్ రికార్డులలో పాడారు మాలతి. ఆ పాటలు అయిపోగానే భర్త వీరాచారి, భార్య మాలతి కలిసి తిరిగి ఏలూరు వచ్చేసారు. ఏలూరు వచ్చిన కొద్ది రోజులకే మాలతికి సంగీతం నేర్పించిన గురువు నల్లా చక్రవర్తుల కృష్ణమాచార్యులు ఆమె ఇంటికి వచ్చి నేను ఒక సినిమాకు సంగీత విభాగంలో పని చేస్తున్నాను. అందులో మాలతికి ఒక చిన్న వేషం ఉంది. నీకు ఆసక్తి ఉంటే మాలతిని పంపించు అని భర్త వీరాచారిని అడిగారు. మాలతి ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ కూడా అందుకు అంగీకరించలేదు. కానీ భార్యను ప్రోత్సహించే వీరాచారి అందుకు అంగీకరించారు. ఆయన ఇంట్లో వాళ్ళను ఒప్పించి భార్య మాలతిని తీసుకొని మద్రాసు వచ్చేసారు.
“ఉషా పరిణయం” (1939) తో చిత్రరంగ ప్రవేశం…
గురువు నల్లా చక్రవర్తుల కృష్ణమాచార్యులు సిఫారసు మేరకు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన మాలతి మొట్టమొదటిగా నటించిన సినిమా పేరు “ఉషా పరిణయం” (1939). జి. వెంకటేశ్వర రావు దర్శకత్వంలో త్రిపురారిబొట్ల వీరరాఘవ స్వామి సంభాషణలు వ్రాసిన ఈ చిత్రం నిర్మాణం మద్రాసులోని సూర్యం స్టూడియోలో జరిగింది. ఉషా పరిణయం చిత్రంలో పార్వతిగా నటించారు మాలతి. ఆ సినిమా పెద్దగా విజయం సాధించలేదు, పెద్దగా ప్రజాదరణ కూడా పొందలేదు. దాంతో ఉషా పరిణయం సినిమా తీసిన నిర్మాణ సంస్థ చిత్ర నిర్మాణాన్ని పూర్తిగా ఆపేశారు. ఆ సినిమాలో నటించడం పూర్తయిపోయిన తరువాత మాలతి దంపతులు తిరిగి ఏలూరుకు వచ్చేసారు.
బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (బి.ఎన్.రెడ్డి) మంగళ సూత్రం అనే స్వీయ అముద్రిత నవల ఆధారంగా ఆయన తీసిన తొలి చిత్రం వందేమాతరం (1939). నిరుద్యోగ, వరకట్న సమస్యలను అద్భుతంగా చిత్రించడమే కాక వాటికి చక్కటి పరిష్కారాన్ని చూపిన ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ చిత్ర విజయోత్సవం కోసం ఏలూరు వచ్చినప్పుడు మాలతిని చూసిన బి.ఎన్.రెడ్డి తన తరువాత సినిమా సుమంగళి (1940) లో రెండు ప్రధాన పాత్రలలో ఒక పాత్రకు మాలతిని తీసుకున్నారు. అందులో ఒక పాత్ర మాలతిని, రెండో పాత్రకు నగరాజకుమారిని తీసుకున్నారు. ఇందులో మాలతి పోషించిన పాత్రకు బాగా పేరొచ్చింది. ఈ సినిమాలో “వస్తాడే మా బావ వస్తాడే రేపో మాపో వస్తాడే” అనే పాటను మాలతి ఆలపించారు. ఆ పాట ఆరోజుల్లో బాగా ప్రాచుర్యం పొందింది.
గుణసుందరి కథ (1949)…
సుమంగళి (1940) సినిమా తరువాత వాహినీ సంస్థ మరో సినిమాను ప్రారంభించలేదు. అదే సమయంలో కృష్ణస్వామి సుబ్రహ్మణ్యం తెరకెక్కించిన “భక్త చేత” (1940) సినిమాలో మాలతికి అవకాశం వచ్చింది. అందువలన వాహినీ వారి దేవత (1941) సినిమాలో మాలతికి అవకాశం రాలేదు. భక్త చేత సినిమా సుమారు సంవత్సరం వరకు మొదలు కాలేదు. ఆ తరువాత కె.వి.రెడ్డి దర్శకత్వంలో భక్త పోతన (1943) అనే సినిమాను తెరకెక్కించారు. అందులో శ్రీనాథుని కుమార్తెగా కె.మాలతి నటించారు. ఆ సినిమా మొత్తం లో ఆడ పాత్ర ఉన్నది కేవలం మాలతికి మాత్రమే. ఆ తరువాత పోలుదాసు పుల్లయ్య దర్శకత్వంలో శ్రీ రేణుక ఫిల్మ్స్ పతాకంపై చిత్తూరు నాగయ్య నిర్మించిన భాగ్యలక్ష్మి (1943) చిత్రంలో భాగ్యలక్ష్మి పాత్రకు ఎంపికయ్యారు.
ఆ తరువాత స్టార్ కంబైన్స్ పతాకంపై పి.పుల్లయ్య దర్శకత్వంలో రామయ్య నిర్మించిన మాయా మచ్ఛీంద్ర (1945) సినిమాలో యువరాణి పాత్ర ధరించారు మాలతి. ఈ విధంగా ఆమె 1939 నుండి 1942 వరకు నాలుగు చిత్రాలలో కథానాయకి పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు మాలతి. 1942 – 1943 ప్రాంతాలలో మాలతికి తమిళ భాషా చిత్రాలలో అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. మోడరన్ థియేటర్స్ వారి సుభద్ర, మురుగన్, రాజకుమారి లాంటి చిత్రాలలో నటించడం వలన ఆమె తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. అయితే ఆమె తన భర్త వీరాచారితో కలిసి 1947లో ఒక బ్రహ్మాండమైన సినిమా తీయాలని ప్రణాళిక వేశారు. కాకపోతే ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. ఆ తరువాత వాహిని పిక్చర్స్ పతాకంపై కె.వి.రెడ్డి తీసిన “గుణసుందరి కథ” సినిమాలో హేమ సుందరి అనే పాత్రలో మాలతి నటించారు.
పేరు తెచ్చిన పాతాళభైరవి (1951)…
“గుణసుందరి కథ” సినిమా తరువాత మాలతికి బాగా గుర్తింపు తెచ్చిన సినిమా పాతాళ భైరవి. 1951 లో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన జానపద చిత్ర రాజము పాతాళ భైరవి. రాజము. యన్.టి.ఆర్ యుక్తవయస్సు, ప్రతిభ, నేపాళ మాంత్రికునిగా యస్.వి. రంగారావు నటనా చాతుర్యము, కె.వి. రెడ్డి దర్శకత్వం, పింగళి నాగేంద్రరావు సంభాషణలు, ఘంటసాల పాటలు ఈ సినిమాను చరిత్రలో చిరస్థాయిగా నిలిపాయి. ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా జానపద చిత్రంలో నటించిన సినిమా పాతాళభైరవి. ఇందులో మాలతి కథానాయికగా నటించడమే కాకుండా, ఎన్టీఆర్ తో ధీటుగా నటించి, ఎన్టీఆర్ తో సమానమైన అందంతో ప్రేక్షకులను అలరించారు. అప్పట్లో 28 కేంద్రాలలో శతదినోత్సవం పూర్తి చేసుకొన్న సినిమా ఇది. ఆ తరువాత ఆమె భానుమతితో కలిసి రత్నకుమార్ (1949) అనే సినిమాలో నటించారు మాలతి. పాతాళభైరవి చిత్రాన్ని హిందీలో డబ్బింగ్ చేసినప్పుడు తమ సంభాషణలు తామే డబ్బింగ్ చెప్పుకున్నారు ఎస్వి రంగారావు మాలతి. ఇదే సమయంలో అగ్నిపరీక్ష, పేరంటాలు లాంటి తదితర చిత్రాల్లో ఆమె నటించారు. ఆ తరువాత మూడు సంవత్సరాల వరకు ఆమెకు సినిమాలలో వేషాలు రాలేదు.
మరణం…
1954 లో కన్నడ నటుడు రాజ్ కుమార్ కథానాయకుడిగా నటించిన చిత్రం శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం. రాజ్ కుమార్ నటించిన ఏకైక కన్నడేతర చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమాను కన్నడ నుండి రాజ్ కుమార్ తెలుగులో పునర్నిర్మించారు. కన్నడ రాజ్ కుమార్ నటించిన ఏకైక తెలుగు చిత్రం శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం. అందులో మాలతి కథానాయికగా (తిన్నయ్య భార్య నీల) నటించారు. ఈ సినిమా తరువాత మాలతికి ప్రధాన పాత్రలు పూర్తిగా తగ్గిపోయాయి. ఆమె కేవలం చిన్న చిన్న పాత్రలకే పరిమితం అయ్యారు. ఆ తరువాత “నాగుల చవితి”, “అల్లావుద్దీన్ అద్భుతదీపం”, “దైవబలం”, “పెళ్ళికానుక”, “ఇంటికి దీపం ఇల్లాలే” ఇలా చిన్నచిన్న పాత్రలు పోషిస్తూ వచ్చారు. “దేశద్రోహులు”, “వీరాభిమన్యు”, “శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న కథ”, “జగత్ కిలాడీలు” లాంటి సినిమాలలో కూడా ఆమె పాత్రలు పోషిస్తూ వచ్చారు.
అలా ఆమె 1969 లో హైదరాబాద్ కు తన మకాం మార్చేసి కాచిగూడ లోని ఒక చిన్న రేకుల ఇంటిలో ఉండేవారు. 1979లో ఎన్టీఆర్ సినిమా “శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం” లో కూడా పాత్ర పోషించారు. అదే ఆమె ఆఖరి సినిమా. నవంబరు 1979 లో హైదరాబాదులో ఒకవైపు కర్ఫ్యూ మరోవైపు భారీ వర్షాలు నెలకొన్నాయి. ఆ భారీ వర్షాలకి ప్రభాత్ సినిమా టాకీస్ ప్రహరీ గోడ విరిగిపడి మాలతి నివాసం ఉంటున్న చిన్న రేకుల షెడ్డుపై పడి ఆ ఇల్లు కూలిపోయింది. విషాదంత సినిమాల్లో పతాక సన్నివేశం లాగా ఆ కూలిన రేకుల షెడ్డులోనే నివాసం ఉన్న మాలతి అక్కడికక్కడే మరణించారు. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లిన తరువాత ఆమె నటి మాలతి అని గుర్తించారు.
ఇతర కథనాలు:
తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకులు యం.యస్.రామారావు
ఆడది భయపడేంత వరకే మగాడికి ధైర్యం రచయిత చలం
రాజనీతిజ్ఞుడు,పరిపాలనాదక్షుడు,సృజనశీలి శ్రీకృష్ణ దేవరాయలు









