CINEMATelugu Cinema

ఉవ్వెత్తున లేచి పడ్డ సినీ సముద్రపు అల.. నటి సిల్క్ స్మిత..

అందమైన జీవితము సిల్క్ స్మిత అద్దాల సౌధము, చిన్న రాయి వేసినా పగిలిపోను, ఒక తప్పు చేసినా ముక్కలే మిగులను అన్నారు” ఆచార్య ఆత్రేయ గారు. సినీ తారల విషయంలో ఈ మాటలు అక్షర సత్యం. సినీ తారలు తెర మీద ఆడతారు, పాడతారు. అభిమానులకు మాత్రం ఏ దివ్యలోకాల నుండో దిగివచ్చిన దేవతల్లా అగుపిస్తారు. మన సమాజంలో సినీ తారలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. వాళ్లు కూడా ఇటు నుండి అటు వెళ్లిన ఒకప్పటి మనషులే. వాళ్లకు కూడా భావోద్వేగాలు, వ్యక్తిగత జీవితాలు ఉంటాయి. ఒక్కసారి వెండితెర మీద కనిపించడం ప్రారంభించాక వాళ్ళ జీవితాలు మరింత సున్నితమైన అద్దాల సౌధాలవుతాయి. వాళ్ళు ఏ పనిచేసినా కూడా అభిమానులకు భూతద్దంలో కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఒక స్థాయిని చేరిన తారలు  తమ వ్యక్తిగత జీవితాన్ని, వెండితెర జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి ఎంతో నేర్పు, ఓర్పు, లౌక్యం ఉండాలి.

ఇదే మహిళా తారల విషయంలో అయితే మరింత సున్నితమైన అంశం. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, సినిమా రంగం పురుషాధిక్య రంగం. పురుషుల ప్రభావం, అధికారం ఎక్కువగా ఉన్న సినిమా రంగంలో మహిళా తారలు నిలదొక్కుకోవడం, నిలబడి ఉండడం కత్తి మీద సాము వంటిది. అందుకే మహిళా తారలు ఎదిగే క్రమంలోనూ, ఒక స్థాయికి చేరే క్రమంలోను వాళ్ళు నిలదొక్కుకోవడానికి, నిలబడడానికి వాళ్లకి బలమైన, స్థిరమైన ఆసరా కావాలి, నమ్మకమైన భరోసా ఉండాలి. అది భర్త కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, తోడబుట్టిన వాడు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు. మహిళా తారల కాల్షీట్లు, వ్యవహారాలు, వ్యక్తిగత ఒడిదుడుకులు వీటన్నింటిని సమర్థవంతంగా నిర్వహిస్తూ వాళ్లను కూడా వ్యక్తులుగా గౌరవిస్తూ, వాళ్ల వ్యక్తిత్వాన్ని గుర్తిస్తూ మంచి చెడుల విభజన రేఖని ప్రతిక్షణం గుర్తుచేస్తూ వాళ్ళని సంరక్షించే వ్యక్తులు ఉన్నప్పుడు, వాళ్ల వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితము సవ్యంగా, సక్రమంగా సాగుతుంది.

అలా కానప్పుడు, నమ్మకమైన వ్యక్తుల తోడు లేనప్పుడు మహిళా తారల జీవితాలు అపసవ్యం అవ్వడమే కాకుండా, పలుమార్లు చిందర వందరం అయిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. వెండితెర మీద వెలిగి జీవితాన్ని ఒక స్థిరమైన మార్గంలో పెట్టుకున్న మహిళలు ఉన్నారు, అలాగే ఎత్తైన శిఖరాలను అధిరోహించి వివిధ కారణాల వల్ల లోయలోకి జారిపోయిన, నెట్టివేయబడ్డ దురదృష్టకర మహిళా తారలు కూడా ఉన్నారు. భానుమతి గారు, జమున గారు, అంజలి దేవి గారి లాంటి వారు విభజన రేఖకు ఒకవైపు ఉంటే, కాంచనమాల గారు, గిరిజ గారు, సావిత్రి గారు, మీనా కుమారి గారు విభజన రేఖకు రెండో వైపు ఉన్నారు. వెండితెర మీద దేవతలల్లే ఓ వెలిగి జీవితంలో ఓడిపోయిన విషాదాంత మహిళా తారల గురించి తెలుసుకున్నప్పుడు మనకు అయ్యో అనిపిస్తుంది. సుమారు ముప్పై ఐదు సంవత్సరాల క్రిందట పదిహేను సంవత్సరాల పాటు వెండితెర మీద తారాజువ్వ లాగా వెలిగి, కోట్లాది మంది అభిమానుల గుండెల్లో సౌందర్యాగ్ని కీలలు రగిలించిన ఒక ముఖ్య తారగా, నాట్య తారగా, ముఖ్యంగా శృంగార నాట్య తారగా వెలిగారు “సిల్క్ స్మిత” గారు. ఆమె వెండితెర జీవితంలో మొట్టమొదటి నాలుగు సంవత్సరాలలో 200 చిత్రాలలో నటించారు.

ఆ తర్వాత తన పూర్తి నట జీవితంలో 500 చిత్రాల్లో నటించారు. సిల్క్ స్మిత గారు స్వతహాగా అచ్చమైన తెలుగు అమ్మాయి అయినప్పటికీ, ముందస్తుగా తమిళ చిత్ర రంగంలో పేరొంది, తర్వాత తెలుగు, మలయాళ, కన్నడ చిత్ర సినిమాలోనే కాకుండా హిందీ చిత్రసీమలో కూడా పదిహేను సంవత్సరాలు ఆమె తన హవాని కొనసాగించారు. ఆ రోజులలో ఆమె కలిసి నటించని కథానాయకుడు లేడు అంటే అతిశయోక్తి లేదు. సిల్క్ స్మిత గారు తన నాట్య కౌశలం ద్వారానే కాకుండా విలక్షణమైన అందంలోనూ, కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆమె అందం గురించి మాట్లాడేటప్పుడు ఆమె కళ్ళ గురించి, ఆమె చూపుల గురించి చెబుతుంటారు. 1980 ల ప్రాంతంలో సినీరంగ ప్రవేశం చేసిన స్మిత గారు 1990 ల ప్రాంతంలో వేగం తగ్గినప్పటికీ, 1994 సంవత్సరంలో వేగం పుంజుకుంటున్న తరుణంలో అర్థాంతరంగా తన జీవితాన్ని ముగించి 36 సంవత్సరాల వయస్సు లోనే ఆత్మహత్య చేసుకున్నారు. తాను మరణించి సుమారు నేటికి 27 సంవత్సరాలు దాటింది.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    విజయలక్ష్మి

ఇతర పేర్లు  :    సిల్క్ స్మిత 

జననం    :      2 డిసెంబర్ 1960  

స్వస్థలం   :    ఏలూరు, ఆంధ్రప్రదేశ్

వృత్తి      :    నటి

తల్లి     :     నరసమ్మ

తండ్రి     :     శ్రీరామమూర్తి 

జీవిత భాగస్వామి    : అవివాహితురాలు

పిల్లలు      :    లేరు 

మరణ కారణం  :  ఉరి వేసుకుని ఆత్మహత్య 

మరణం    :   23 సెప్టెంబర్ 1996 (వయసు 35)

మరణించిన స్థలం   :   చెన్నై, భారతదేశం

జననం..

సిల్క్ స్మిత గారి అసలు పేరు వడ్లపట్ల విజయలక్ష్మి. 02 డిసెంబరు 1960 నాడు ఏలూరు తాలూకా దెందులూరు మండలం కొవ్వలిలో విజయలక్ష్మి గారు జన్మించారు. విజయలక్ష్మి గారి అమ్మ పేరు నరసమ్మ, నాన్న పేరు శ్రీరామమూర్తి. వారిది చాలా నిరుపేద కుటుంబం. విజయలక్ష్మి నాలుగో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. చిన్నప్పటినుంచి తనకు సినిమాలంటే పిచ్చి. ఎలాగైనా తాను సినిమాల్లో చేరాలని కలలుగనేవారు. నాల్గవ తరగతి దాకా చదువుకున్న విజయలక్ష్మి గారు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మానేశారు. పదిహేనేళ్ళకే తనకు పెళ్ళి చేసేశారు.

స్మిత గారి భర్త, అత్తమామలు వేధిస్తూ ఉండడంతో స్మిత గారు ఇల్లు వదలి పారిపోయారు. అలా  స్మిత గారు పారిపోయిన విషయం పెద్దమ్మ అన్నపూర్ణమ్మ గారికి తెలిసింది. స్మిత గారు సినిమాలలో నటించాలానే అభిలాష తీర్చడానికి గుంటూరు జిల్లా తాడికొండ లో జరిగే షూటింగ్ దగ్గరికి స్మిత గారిని తీసుకెళ్లారు. 1977 వ సంవత్సరంలో “భూదేవి” అనే ఒక తెలుగు సినిమా చిత్రీకరణ జరుగుతుంది. నటీనటులు అందరూ కొత్తవాళ్లే. ఆ సినిమాకి దర్శకులు సుగం బాబు. స్మిత గారిని తీసుకొని వెళ్లిన పెద్దమ్మ అన్నపూర్ణమ్మ గారు తన కూతురు విజయలక్ష్మి కి ఒక వేషం ఇవ్వవలసిందిగా దర్శకులు సుగం బాబును కోరారు.

సినీ నేపథ్యం…

స్మిత గారు సినిమాల్లో నటించాలన్న తన అభిలాషను విన్న దర్శకులు సుగంబాబు ముందు తనను తిరస్కరించారు. స్మిత గారు చూడడానికి నల్లగా ఉన్నారు. పెద్దగా అందంగా కూడా లేరు. నటన అస్సలే రాదు. ఎలా తీసుకునేదనే ఆలోచనలో పడ్డారు సుగంబాబు గారు. దాంతో స్మిత గారి పెద్దమ్మ అన్నపూర్ణమ్మ గారు నిరాశ చెందకుండా మూడు, నాలుగు రోజులు అక్కడే ఉన్నారు. దాంతో దర్శకులు అప్పటికప్పుడు ఒక వేశ్య పాత్ర సృష్టించి మూడు రోజులు తనపై సన్నివేశాలను చిత్రీకరించారు. తన పాత్ర చిత్రీకరణ పూర్తవ్వడంతో స్మిత గారు తిరిగి తన పెద్దమ్మతో కలిసి వెళ్లిపోయారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా మూడు సంవత్సరాలు విడుదల కాకుండా ఆపివేశారు.

1978 ప్రాంతలో పూర్తయిన ఆ “భూదేవి” సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు 1981 – 82 ప్రాంతంలో తిరిగి మొదలుపెట్టారు. అప్పటికే స్మిత గారు తెలుగు తిరుగులేని స్టార్ అయ్యారు. సుగం బాబు గారు తీసిన “భూదేవి” సినిమాలో తన పాత్రకు సంబంధించి కొంత చిత్రీకరణ అవసరం ఉండగా చిత్ర దర్శకులు స్మిత గారిని కలిసి చిత్రీకరణకు రావాల్సిందిగా కోరగా, కన్నడ సినిమా చిత్రీకరణకు వెళుతున్నాను, వారం రోజులు సమయం కావాలిసిందిగా కోరారు. అప్పటికే బాగా ఆలస్యం అయ్యి వారం రోజులు ఆగే పరిస్థితి లేకపోవడంతో చిత్ర నిర్మాత గారు స్మిత గారిని చిత్రీకరణకు రావాల్సిందిగా అభ్యర్థించారు. దాంతో సిల్క్ స్మిత గారు అప్పటికప్పుడు రాత్రి పది గంటల సమయంలో షూటింగ్ కి వెళ్లి చిత్రీకరణ పూర్తి చేశారు.

సిల్క్ స్మిత గారు 1978లో సినిమా అవకాశాల కోసం మద్రసుకు పయనమయ్యారు. ఆ సమయంలో నటి ఛాయాదేవి గారి ఇంట్లో అద్దెకు దిగారు. తాను సినిమాలలో వేషాల కోసం వెతుకుతూ ఉండేవారు. అలా సినిమాలలో వేషాల కోసం వెతుకుతుండగా వారు ఒక రోజు త్రిపురనేని మహారధి గారు ఆడదంటే అలుసా అనే సినిమాకు రచయితగా పనిచేస్తన్న సినిమాలో ఫటాఫట్ జయలక్ష్మి గారి పక్కన ఇద్దరు స్నేహితురాళ్లు కావాలని ఛాయాదేవి గారిని అడిగారు. ఛాయాదేవి గారు వెంటనే వారికి ఆ ఇద్దరు అమ్మాయిలు చూపించారు. వారిలో ఒక స్మిత గారు, మరొకరు శ్రీదేవి. ఆ తరువాత “తాయారమ్మ బంగారయ్య” చిత్రంలో మాధవి క్లబ్ కి వెళ్ళు సన్నివేశంలో ఉన్న కొందరు అమ్మాయిలతో పాటు స్మిత కూడా ఉంటుంది.

తొలుత టచప్ ఆర్టిస్ట్ గా పనిచేసిన స్మితగారు, కొంతమంది హీరయిన్లకు టచప్ చేస్తున్న సమయంలోనే బిట్ రోల్స్ లో నటించే అవకాశం దక్కించుకున్నారు. మళయాళ దర్శకుడు అంథోనీ ఈస్ట్ మన్ గారు దర్శకత్వం వహించిన “ఇనయె తేడీ” చిత్రంలో స్మిత గారికి తొలిసారి నాయిక పాత్ర లభించింది. ఈ సినిమాకు ముందు తమిళంలో “వండిచక్రం” అనే చిత్రంలో స్మిత కీలక పాత్ర పోషించారు. ఈ రెండు చిత్రాలతో తమిళ, మళయాళ చిత్రసీమల్లో స్మిత గారికి మంచి గుర్తింపు లభించింది.

“వండి చక్రం” తెలుగులో “ఘరానా గంగులు” గా పునర్నిర్మించగా, అందులో స్మిత గారు నటించి తెలుగు తెరకు పరిచయం అయ్యారు. మాతృభాష తెలుగులో స్మిత గారికి వచ్చీ రాగానే మంచి అవకాశాలు లభించాయి. “సీతాకోకచిలుక” లో శరత్ బాబు భార్యగా నటించారు. “రోషగాడు” సినిమాలో సిఐడీ పాత్రలో కనిపించారు. యన్టీఆర్ గారి “నా దేశం” చిత్రంలో “నేనొక నెత్తురు దీపం”.. పాటలో నర్తించారు స్మిత గారు. ఆ పాట తరువాత నుంచీ ఐటమ్ గాళ్ గా తాను కొనసాగిపోయారు. అప్పటి టాప్ హీరోస్ అందరి చిత్రాలలోనూ సిల్క్ స్మిత గారి డాన్సులు భలేగా కనువిందు చేశాయి.

ఒకవైపు ఐటమ్ గాళ్ గా సాగుతూనే సిల్క్ స్మిత గారు తనకంటూ ఓ ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకున్నారు. ఆమె ప్రధాన నాయికగా “మాయలేడి” అనే చిత్రం రూపొంది జనాన్ని ఆకట్టుకుంది. ఇక “బావ బావమరిది” లో వేశ్య గా సిల్క్ గారి అభినయం భలేగా అలరించింది. “లేడీ జేమ్స్ బాండ్” లోనూ, చిరంజీవి “గూండా”, “ఛాలెంజ్”, బాలకృష్ణ “ఆదిత్య 369” చిత్రాలలోనూ కీలక పాత్రల్లో కనిపించారు సిల్క్ స్మిత గారు. తన దరికి చేరిన ప్రతీ ఐటమ్ సాంగ్స్ లోనూ, తగిన పాత్రల్లోనూ స్మిత గారు అకట్టుకున్నారు. మాతృభాష తెలుగుతో పాటు తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలలోనూ సిల్క్ స్మిత గారు తనదైన బాణీ పలికించారు.

నిర్మాత గా సిల్క్ స్మిత…

1990 ల ప్రాంతంలో కథానాయికలకు, నాట్య తారలకు మధ్య అంతరాయం తగ్గుతూ వచ్చింది. వారి మధ్య విభజన రేఖ పెరుగుతూ వచ్చింది. దాంతో స్మిత గారు సినిమా నిర్మాణం వైపు తన దృష్టిని మరల్చారు. తొలిసారిగా నిర్మాణ రంగంలోకి వచ్చిన స్మిత గారు రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్ గార్లు హీరోలుగా “ప్రేమించి చూడు” సినిమా నిర్మించారు. దానికి దర్శకులు త్రిపురనేని వరప్రసాద్ గారు. నిర్మాణ వ్యవహారం అంతా స్మిత గారి సెక్రటరీ డాక్టర్ రాధాకృష్ణ చూసుకునేవారు. చిత్రీకరణ అయిపోగానే ఎవరి డబ్బులు వాళ్లకు చెల్లించాలి. స్మిత గారు సెక్రెటరీ కోసం ఎదురుచూస్తున్నారు.

ఎంత సేపటికి సెక్రటరీ గారు రాలేదు. దాంతో డబ్బులు మరుసటి రోజు ఇస్తానని ఒప్పించిన స్మిత గారు మరునాడు తన నగలను తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చి ఎవరి డబ్బు వారికి ఇచ్చేశారు. వ్యక్తిగతంగా అంత నిజాయితీగా, నిక్కచ్చిగా ఉండేవారు స్మిత గారు. “ప్రేమించి చూడు” సినిమా ఘోర పరాజయం పాలయ్యింది. ఆర్థికంగా స్మిత గారికి నష్టాలను మిగిల్చింది. ఆ తర్వాత “బ్రహ్మ నీ రాత తారుమారు” అనే ఇంకో సినిమా నిర్మించారు. అది కూడా పరాజయం పాలయ్యింది. దాంతో స్మిత గారికి ఆర్థికంగా నష్టాలు పెరుగుతూ వచ్చాయి. సినిమా తెచ్చిన ఆర్థిక కష్టాలు, వ్యక్తిగత సమస్యలు తనను అగాథం లోకి నెట్టివేశాయి. వాటిని పరిష్కరించుకోలేని దిశగా వాటిని అధిగమించే ప్రయత్నంలో ఉన్న తనకు మళ్ళీ అదృష్టం కలిసొచ్చింది.

1993 ప్రాంతంలో తన రెండవ ఇన్నింగ్స్ మొదలైంది. విపరీతంగా అవకాశాలు రావడం ప్రారంభించాయి. వాటితో స్మిత గారికి అప్పులు తీరడం మొదలయ్యాయి. అలా తాను కుదురుకుంటున్న సమయంలోనే తన జీవితం అగాథంలోకి నెట్టివేయబడింది. 1994 ప్రాంతంలో  “గోవింద గోవింద” సినిమాకి అసిస్టెంట్ గా ఉన్న వై.వి.యస్ చౌదరి గారితో, స్మిత గారు “నేను ఇన్ని సినిమాలలో నటించాను, ఇంత వైభవంగా ఉన్నానని అనుకుంటున్నారు. కానీ నా పేరున చిల్లి గవ్వ కూడా ఆస్తి లేదు” అని అన్నారట. అప్పుల బాధ అయితే ఎలాగైనా తీర్చుకోగలను. కానీ ఇతరత్రా సమస్యలతో సతమవుతున్నానని, నాకు బ్రతకాలని లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పారు.

నిష్క్రమణం…

సిల్క్ స్మిత గారు 1995లో తాను మరణించడానికి ఒక సంవత్సరానికి ముందు దర్శకులు సుగంబాబు గారు, కొందరు సినీ నిర్మాతలు కలిసి పోలీసు అధికారి పాత్రలో సిల్క్ స్మిత గారిని నటింపజేయడానికి ఒక కథ సిద్ధం చేసుకుని తనను కలవడానికి మద్రాసు వెళ్లారు. తన తొలి దర్శకులు సుగంబాబు గారిని బాగా గుర్తుపెట్టుకున్నారు స్మిత గారు. స్మిత గారు ఇంతటి ప్రేక్షకాభిమానులను సంపాదించడానికి రహదారి పరిచినవారు సుగంబాబు గారు. తాను కృతజ్ఞురాలిని అని మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు చిత్రీకరణకు తాను సిద్ధమేనని స్మిత గారు చెప్పారు.

సరిగ్గా సంవత్సరం తరువాత 22 సెప్టెంబర్ 1996 నాడు పగలు కన్నడ నటులు రవిచంద్రన్ గారికి రెండు మూడు సార్లు ఫోన్ చేశారు స్మిత గారు. తాను ఎక్కడో సినిమా షూటింగ్లో ఉన్నారు. ఒకసారి ఫోన్ తీశారు కానీ కనెక్షన్ సరిగ్గా లేక మాట్లాడలేకపోయారు. ఆ తర్వాత మాట్లాడుదాం అనుకున్నారు. సాయంత్రం స్మిత గారు తన సహా నాట్యతార అనురాధ గారికి ఫోన్ చేసి ఇంటికి రాగలవా మాట్లాడదామని అడిగారు. కానీ తాను కూడా ఇబ్బందుల్లో ఉన్నాను మర్నాడు వస్తానని చెప్పారు. సెప్టెంబర్ 22 రాత్రి ఏం జరిగిందో తెలియదు. కానీ 23 నాడు ఉదయం 9 గంటలకు ప్రెస్ వాళ్లకు తెలిసింది. ఆ తర్వాత సినిమా వాళ్లకు తెలిసింది. ఏమిటంటే సిల్క్ స్మిత గారు ఉరి వేసుకున్నారు అని.

క‌న్న‌డ స్టార్ హీరో రవిచంద్ర‌న్ గారు, సిల్క్ స్మిత గారు మంచి స్నేహితులు. వీరిద్ద‌రూ క‌లిసి మొద‌టిసారి “హ‌ల్లి మేస్త్రు” అనే సినిమాలో న‌టించారు. షూటింగ్ స‌మ‌యంలో ఏర్ప‌డిన ప‌రిచ‌యం తో ఇద్ద‌రూ మంచి మిత్రులు అయ్యారు. సిల్క్ త‌న జీవితంలోని అన్ని విష‌యాల‌ను త‌న‌తో పంచుకునేద‌ని రవిచంద్ర‌న్ గారు ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. చనిపోయే ముందురోజు సిల్క్ స్మిత గారు త‌న‌కు ఫోన్ చేశారని ర‌విచంద్ర‌న్ గారు తెలిపారు. కానీ తాను సినిమా షూటింగ్ లో బిజీగా ఉండ‌టం వ‌ల్ల ఫోన్ ఎత్తలేకపోయానని చెప్పారు. మామూలు కాల్ అనుకుని తాను తిరిగి ఫోన్ కూడా చేయ‌లేద‌ని అన్నారు. ఒకవేళ తాను ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటే సిల్క్ స్మిత గారు బ్ర‌తికి ఉండేవారేమో అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

స్మిత గారి మరణం పై తన సెక్రటరీ వివరణ.

స్మిత సెక్రటరీగా పోలీసులకు పరిచయం చేసుకున్న రాధాకృష్ణ జ్యోతి చిత్ర పత్రికకు ఇచ్చిన వివరణ ఇలా వుంది.

స్మిత గారికి నేను చాలా రోజులుగా వ్యక్తిగత కార్యదర్శి గా పనిచేస్తున్నాను.

ఆమె మరణం నాకు షాక్ లాంటిది. నా మనమరాలు ఆమెతో పాటు బెడ్ రూమ్ లో ఉంటుంది.

ఉదయం 9 గంటలకు పాప అరుస్తూ తలుపులు కొట్టడంతో, తలుపు బద్దలు కొట్టి చూడగా స్మిత గారు ఫ్యాన్ కు వేలాడుతున్నారు. వెంటనే అంబులెన్స్ ని పిలిపించి వడపళని లోని ఆసుపత్రికి తీసుకెళ్లాను.

స్మిత గారు చనిపోయిందన్నారు. దాంతో మీకు ఫిర్యాదు చేశాను అన్నారు.

నా భార్య పిల్లలతో తనకు చాలా ఇంటమసి ఉంది అని రాధాకృష్ణ చెప్పారు. ఇది జ్యోతి చిత్ర పత్రికలో వచ్చిన వార్త.

ఆ మర్నాడు పొద్దున్నే స్మిత గారి మిత్రురాలు అనురాధ గారు ఆసుపత్రిలో స్మిత గారిని చూశారు. కోట్లాదిమందిని ఆకర్షించిన శరీరం నిర్జీవంగా మృతదేహంగా పడి ఉంది.

ఎక్కడో బయలుదేరినటువంటి విజయలక్ష్మి సిల్క్ స్మితగా ఆమె జీవితం ముగింపు దశకు చేరుకుంది. ఆ తర్వాత పోస్ట్ మార్టన్ చేశారు. మృతదేహంలో విష పదార్థాలు ఏమీ లేవు. కేసు కొంతకాలం సాగింది. ఆత్మహత్యగా నిర్ధారించిన పోలీసులు ఆ కేసును మూసేశారు. స్మిత గారు ఉరి వేసుకోలేదని కొంతమంది అంటారు. విషం మ్రింగిందని కొంతమంది అంటారు. బలవంతంగా ఈ స్థితికి తీసుకెళ్లాలరు అని కొంతమంది అంటారు. నిజానిజాలు మాత్రం వాళ్లకే తెలియాలి. సిల్క్ స్మిత గారు తీపి జ్ఞాపకంగా మిగిలిపోయారు. కోట్లాదిమంది హృదయాలను కొల్లగొట్టిన సిల్క్ స్మిత గారు జీవితంలో ఘోరంగా ఓడిపోయారు అని చెప్పుకోవాలి. ఆమె భావాలు చనిపోయే ముందు ఎలా ఉన్నాయో చెప్పాలంటే తాను వ్రాసిన ఆఖరి లేఖ లోని మరణ వాంగ్మూలం లేఖను చదవాల్సిందే. పోలీసులు ఆ లేఖను పత్రిక వాళ్లకు ఇచ్చారు.

స్మిత గారి మరణ లేఖలోని వాంగ్మూలం…

స్మిత గారు మరణానికి ముందు తన భావాలను ఒక లేఖలో వ్రాశారు. ఆ భావాలున్న లేఖను పోలీసులు వారు పత్రికల వాళ్లకు ఇచ్చారు. అందులో ఇలా వ్రాసి ఉంది.

అభాగ్యురాలు (22 – 09 – 1996)..

“నాకు నా వారంటూ ఎవ్వరూ లేరు. నేను నమ్మిన వారు నన్ను మోసం చేశారు. నా మీద ఎవ్వరికీ ప్రేమ లేదు. నా చుట్టూ ఉన్నవారు నాకు మనశ్శాంతి లేకుండా చచ్చిపోయేటట్టు చేశారు. ఇంత సాధించినా నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. నాకున్న ఏ కొంచెం అయినా కానీ కుటుంబంలోని వాళ్లకి, బాబు కుటుంబంలోని వాళ్లకు కూడా పంచవలెను. నేను ఆశలన్నీ కూడా ఒకరి పైన పెట్టుకున్నాను. అతడు నన్ను మోసం చేశాడు. దేవుడు అంటూ ఉంటే వాడిని చూసుకుంటాడు. రోజు టార్చర్ చేస్తుంటే నేను భరించలేకపోయాను. ఆయన ఏది న్యాయం అనుకుంటే అది చేయించాడు నాతోటి. నగలు కొనుక్కుంటే పెట్టుకోనివ్వలేదు. దేవుడు నన్ను దేశం కోసం పుట్టించాడు. నా కష్టం తినని వారు లేరు. అయినా ఎవ్వరికీ విశ్వాసం లేదు. నాకు ఐదు సంవత్సరాల క్రితం ఒకతను జీవితం ఇస్తానన్నాడు. ఇప్పుడు ఇవ్వను అన్నాడు. నా జీవితంలో అన్ని భరిస్తూ వచ్చాను. ఇక నావల్ల కాదు. ఇది వ్రాయడానికి ఎంత కష్టపడ్డానో నాకే తెలియదు”. ఇవి ఆ ఉత్తరం లోని కొన్ని వ్యాఖ్యలు..

స్మిత మరణం పై గొల్లపూడి గారి విశ్లేషణ…

సిల్క్ స్మిత చాలా చిన్నదశ నుండి తనను తాను నిలదొక్కుకోవడానికి కష్టపడిన, నష్టపడిన రోజులు చాలా ఉన్నాయి. ఆ రోజుల్లో చాలామంది తనను దుర్వినియోగం చేసుంటారు, ఇబ్బంది పెట్టి ఉంటారు. తనని అవమానపరిచి ఉంటారు. వాటన్నిటిని కొన్ని సంవత్సరాలపాటు తట్టుకొని తనదైన పాపులారిటీ సాధించింది. మానసికంగా వారందరినీ తట్టుకొని తనకు తెలియకుండానే తన చుట్టూ ఒక ఇనుప పంజరాన్ని తయారు చేసుకుంది. “నా పేరు దుర్గ” అనే సినిమాలో తనతో కలిసి పనిచేశాను. వ్యక్తిగతంగా దగ్గరగా చూసే నాలాంటి వాళ్లకు తాను చాలా సంస్కారవంతంగా, చాలా ఉదారమైన, చాలా అందమైన, చాలా సరళమైన వ్యక్తిత్వం గల మనిషిగా అనిపిస్తుంది.

ఎప్పుడైతే తాను సంపాదించడం మొదలుపెట్టిందో సంపాదనకు మాత్రమే ఉపయోగపడే స్థాయిలో ఆపి, వ్యక్తిగత జీవితాన్ని, వ్యక్తిగత జీవనాన్ని ఆ అమ్మాయి ఒక సెక్యూరిటీ ఏర్పరచుకునే స్థితిని, ఆ దశలో ఆమె మీద ఆధారపడ్డ వాళ్ళని క్రియేట్ చేయలేకపోవడం, ఆ సమయంలో ఆమెను ఐసోలేట్ చేయడంతో తాను ఒంటరి అయిపోయింది. ఎక్కువ డబ్బులు సంపాదిస్తూ ఒంటరిగా బ్రతకాల్సిన పరిస్థితి తనది. తాను ఎంతటి పాపులర్ అంటే తమిళనాడులో ఒకచోట సిల్క్ స్మిత కొరికిన ఆపిల్ పండుని పాతికవేల రూపాయలకు వేలంపాట వేయడం జరిగింది. పోను పోను తన పాపులారిటీ పెరిగింది. ఆమె మీద ఆధారపడ్డ వ్యక్తుల స్వార్థమూ పెరిగింది. ఆ అమ్మాయిని చాలామంది నుంచి దూరంగా ఉంచే ప్రయత్నం పెరిగింది. ఆ అమ్మాయి తనలో తాను ఒంటరిగా అయిపోయింది. ఆ ఒంటరితనంలో రేపు అనే రోజులో ఉన్న రుచి పోను పోనూ తగ్గిపోవడంతో తాను ఆత్మహత్య చేసుకుంది.

ముగింపు…

ఎక్కడో ఏలూరు దగ్గర పల్లెటూరు లో పిల్ల కాలువలా మొదలైన సిల్క్ స్మిత గారి జీవితం, నదిలా మారి ఎన్నో మలుపులు తిరిగి ప్రవాహంలో కొండలు, గుట్టలు చుట్టినట్లు ఆమె చేదు అనుభవాలకు, అవమానాలకు  లోనైనారు. సినిమా రంగపు పాకుడు రాళ్లపై పరిగెత్తే క్రమంలో అవకాశాల కోసం చేసిన అభ్యర్థనలు, పురుష పుంగవుల అస్తిత్వానికి లొంగి సినీ సాగరంలో చేరి ఓ పగడాల ద్వీపంలా తనను తాను మార్చుకొని తనదైన దిగ్విజయ పతాకాన్ని ఎగురవేసిన అభినయం సిల్క్ స్మిత గారి సొంతం. దశాబ్దం పైగా దగద్దగాయమానంగా వెలిగి తన షరతులతో పరిశ్రమను శాసించే స్థాయికి చేరి, ఆ రోజుల్లో శ్రేయోభిలాషిలా దరిచేరిన వ్యక్తి తనకు తాను రక్షణ ఇస్తారనుకొని నమ్మి తన చుట్టూ కంచె కోట నిర్మించబోతున్న వాస్తవాన్ని గ్రహించలేకపోయారు. ఒంటిస్తంభం మేడలో ఖైదీనయ్యానన్న విషయాన్ని తెలుసుకొని జీర్ణించుకోలేక, అన్నీ ఉండి ఏమీలేనిదై చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బందులు, చెప్పుకోలేని వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతూ వచ్చారు. తన జీవితం చెప్పలేని సుడిగుండంలా మారింది అని గ్రహించి బలవన్మరణానికి పాల్పడి లోకం నుండి నిస్సహాయంగా నిష్క్రమించిన ఓ మామూలు అమ్మాయి సగటు మహిళ సిల్క్ స్మిత గారు.

సినిమా అవకాశాల కోసం ఏలూరు నుండి అమాయకంగా బయలుదేరినప్పుడు విజయలక్ష్మి ఒక అనామిక. కాలక్రమంలో కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకున్నప్పటికీ బలవన్మరణానికి లోనైన సందర్భంలో సిల్క్ స్మిత గారు ఒక అభాగ్యురాలు. కొందరి జీవితాలు పాఠాలు చెబుతాయి. మరి కొందరి జీవిత పాఠాలు నేర్పుతాయి. సిల్క్ స్మిత ఊరఫ్ వి.విజయలక్ష్మి. ఆమె జీవితం ఒక గుణపాఠం. ఉవ్వెత్తున లేచి పడ్డ సినీ సముద్రపు అల సిల్క్ స్మిత, తుఫానులా చెలరేగి శూన్యంలో పరిమళాల గాలి తెర సిల్క్ స్మిత.

Show More
Back to top button