Telugu Cinema

చిత్ర పరిశ్రమలో తెలుగు సినిమా బామ్మ..  నటి నిర్మలమ్మ..

మీ మొహాలు మండా నిర్మలమ్మ అప్పుడే తెల్లారిందేంట్రా.. జూదానికి..!

ఏరెన్నొంకలు తిరిగినా సముద్రంలోనే కలవాలని…పెళ్ళాం మీద మనసొచ్చింది గావాల..

ఇన్నాళ్ళుగా మాట ఇనని కొడుకు ఒక పిల్లను తీసుకొచ్చి ఇంటో పెట్టాడని సంబర పడనా…హోటల్లో తిరిగే పిల్లని తీసుకొచ్చాడని ఏడవనా!

తెలుగు సినిమా చరిత్రలో ఎంతో విలక్షణమైన నటనతో, పెద్ద తరహా పాత్రలతో తెలుగు సినిమా పరిశ్రమకు ఒక పెద్ద దిక్కుగా, దిక్సూచిగా నిలిచిన విశేష గుణచిత్ర నటీమణులు మన నిర్మలమ్మ గారు. పల్లెటూరిలో పని పాటలు చేసుకుంటూ, తన వాక్చాతుర్యంతో చుట్టూవున్న వారిని హద్దుల్లో పెట్టే పెద్దావిడ లాంటి వేషాలకు నిర్మలమ్మ గారు ఆద్యులు. అచ్చమైన మన జానపదుల తెలుగు ఉచ్చారణ ఆమె నోట పలికినంత బాగా ఇంకెవ్వరి నోటా పలికి ఉండరు.

ఎంత పొగరురా నీకు? వదినతో చాకిరీలు చేయించుకుంటావా? వేణ్ణీళ్ళు తోడాలి.. సబ్బెట్టాలి.. అంటూ ఆమె “గ్యాంగ్‌ లీడర్” సినిమాలో బామ్మ రెచ్చిపోతే, చిరంజీవి సైతం అదే తరహాలో సమాధానం ఇవ్వడం.. రఫ్ఫాడిస్తానంటూ హంగామా చేయడం.. ఆ చిత్ర విజయానికి ఎంతగానో దోహదపడింది. ఒక్క చిరంజీవి గారికి మాత్రమే కాదు. ఏంతో మంది కథానాయకులకు తల్లిగా, బామ్మగా, నాన్నమ్మగా తాను నటించి మెప్పించారు.

పాత్రకు తగిన ఉచ్చారణా, సంభాషణా సరళి, ఏ సమయంలో ఎలా ఉపయోగించాలో బాగా తెలిసిన నటి. ఏ తరహా పాత్ర ధరించినా ఆ పాత్రలో ఒదిగి పూర్తి న్యాయం చేసే క్యారెక్టర్ నటి నిర్మలమ్మ గారు. పాత్ర స్వభావాన్ని బట్టీ, పాత్ర సన్నివేశాన్ని బట్టీ, హాస్యాన్నీ, గయ్యాళితనాన్నీ, సాత్వికతనూ, కరుణనీ సమానంగా పండించగల భావప్రకటనా శక్తి నిర్మలమ్మ గారి సొంతం.

నిర్మలమ్మ గారు సుమారు అరవై రెండేళ్ల నటజీవితంలో దాదాపు 1000 కి పైచిలుకు చిత్రాలలో నటించిన తన పాత్రల గురించి చెప్పాలంటే చాలా కష్టం. తెలుగు సినిమాలలో ఆవిడ చేసినన్ని పాత్రలూ, ఆవిడ చూపినంత వైవిధ్యమూ, ఇంకెవరైనా నటీమణులు చూపారా అంటే అనుమానమే. యెవరూ వున్నట్టు కనపడదు. బహుశా నటి రమాప్రభ గారు వెయ్యి చిత్రాలు చేసి వుండొచ్చు. కానీ రమాప్రభవి అన్నీ దాదాపు  హాస్య పాత్రలే. తమిళంలో మనోరమ గారు కూడా సుమారు వెయ్యికి పైగా చిత్రాలలో నటించారు.

నిర్మలమ్మ గారికి మన తెలుగు సంస్కృతీ, ఆచారాల పట్ల పట్టు యెక్కువ. సాధారణంగా ఇంట్లో వంటంతా తనే చేసేవారు. తన కూతురికీ ,మనవలకీ తెలుగు భాష రావాలని పట్టు పట్టి తానే నేర్పించారు. తనకి కుదరనప్పుడు నటుడు కాకరాలని పిలిపించి చదువు చెప్పించేవారు. తోటి నటీనటులు తెలుగు సరిగా పలకక పోతే బాగా నొచ్చుకునే వారు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    రాజమణి

ఇతర పేర్లు  :    నిర్మలమ్మ 

జననం    :  18 జులై 1920

స్వస్థలం   :    బందరు , ఆంధ్రప్రదేశ్, భారతదేశం 

తండ్రి   :   గంగ‌య్య‌ 

తల్లి     :    కోట‌మ్మ

వృత్తి      :    నటి 

జీవిత భాగస్వామి   :   జీవీ కృష్ణారావు (రంగస్థలం నటుడు)

దత్త పుత్రిక     :    కవిత

అల్లుడు       :   డి.యస్. ప్రసాద్

మరణం    :   19 ఫిబ్రవరి 2009

మరణించిన స్థలం   :   హైదరాబాద్

జననం…

నిర్మలమ్మ గారి అసలు పేరు రాజమణి. తాను ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా లో గల మచిలీపట్నంలో 18 జూలై 1926 లో గంగయ్య, కోటమ్మ దంపుతులకు తొమ్మిదో సంతానంగా జన్మించారు. తనకు ఊహ తెలిసినప్పటి నుండి నాటకాలంటే విపరీతమైన పిచ్చి ఉండేది. తాను మూడో తరగతిలోనే చదువు ఆపేసి నాటకాలు చూస్తూ కాలం గడిపేస్తుండేది. తన కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించేవారు కాదు. తమ బంధువులు ఊర్లో పరువుతీస్తుందని నిర్మలమ్మ గారిని తిట్టేవారు.

కానీ తన పెద్దక్క మాత్రం తనకు అండగా నిలబడేది. అలాగే తన పెదనాన్న మద్దతుతో నాటకాల్లో రాణించింది. అలా ఆమెకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. నిర్మలమ్మ గారు తన మొదటి నాటకం “సతీ సక్కుబాయి”  కృష్ణా జిల్లా గన్నవరంలో వేసినప్పుడు తనకు సుమారు 14 సంవత్సరాలు. నిర్మలమ్మ గారు చూడడానికి శారీరకంగా ధృడంగా లేరని, మరీ బక్కపలచగా ఉన్నారని తాను ఎలా నటించగలదో అని వచ్చిన విమర్శలన్నీ తిప్పి కొడుతూ తాను నాటకాలలో బాగా రాణిస్తూ రాటుదేలిపోయారు.

సినీ నేపథ్యం…

చిన్ననాటి నుంచి నిర్మలమ్మ గారికి నాటకాలంటే విపరీతమైన అభిమానం మరియు ప్రాణం కూడా. ఆ నాటకాలే ఆమెను సినీరంగ ప్రవేశానికి దారులు పరిచింది. తాను వివాహం చేసుకున్నాక తన భర్తతో కలిసి ఉద‌యం అనే నాట‌క సంస్థ‌ను ఏర్పాటుచేసి, అనేక నాటకాలు ప్రదర్శించి గుర్తింపు పొందారు. కొంద‌రు సినీ ప్ర‌ముఖుల సలహాల మేరకు భార్యభ‌ర్త‌లు సినిమాల వైపు అడుగుపెట్టారు.1943 వ సంవత్సరంలో తన పదహారేళ్ల వయస్సు లో “గరుడ గర్వభంగం” సినిమాలో చెలికత్తె పాత్రలో తొలిసారి నటించారు. కొన్నాళ్ల త‌రువాత 1961లో “కృష్ణ‌ప్రేమ” అనే చిత్రంలో నిర్మ‌ల‌మ్మ రుక్మిణి పాత్ర లో అభినయించారు. ఆ త‌రువాత కాలంలో తనకు మంచి అవ‌కాశాలు లభించాయి. సుమారు వెయ్యి సినిమాల్లో నటించారు.

అరవై ఏళ్ల పైచిలుకు అనుభవం.. 

తన సినీ జీవితాన్ని, చిత్ర రంగంలో ఉన్న అనుభవం సుమారు అరవై యేండ్ల పై చిలుకుగా అభివర్ణించవచ్చు. రికార్డులను బట్టి చూస్తే వెయ్యికి పైగా చిత్రాల్లో నటించిన చరిత్ర నిర్మలమ్మ గారిది. 1943 లో తన పదహారో యేట “గరుడ గర్వ భంగం” చిత్రం ద్వారా తాను తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమయ్యారు. ఆ సినిమాలో ఆమె అలనాటి మేటి నటీమణి భానుమతి రామకృష్ణ గారి సరసన చెలికత్తె పాత్రలో కనిపించారు. నిజానికి తాను చెలికత్తె పాత్రలో నటించినా పాత్ర నిడివి బాగా పెద్దది. ఆ తరువాత “పాదుకా పట్టాభిషేకం” సినిమాలో నటించారు.

అందులో తన అభినయం పట్ల బాగా నమ్మకం పెంచుకున్న నిర్మలమ్మ గారు విజయవాడలో ఆ సినిమా చూసి కంగు తిన్నారు. చిత్ర ప్రదర్శన పూర్తయింది. కానీ తన పాత్ర ఎక్కడా కనిపించకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. దాంతో ఇకమీదట సినిమాలో కొనసాగడం సరికాదనే కృత నిశ్చయంతో తిరిగి తనకు మిక్కిలి ప్రీతిపాత్రమైన రంగస్థల నాటక కళాకారిణిగా అనేక నాటకాలు వేసి పేరు తెచ్చుకున్నారు. అడపా దడపా చిత్రపరిశ్రమ నుంచి పిలుపు వస్తూ ఉండడంతో వెళ్లాలా, వద్దా? అనే సంశయంతో వెనకా ముందు ఆడుతున్న నిర్మలమ్మ గారిని వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సన్నిహితులు సూచించడంతో తిరిగి చెన్నె వెళ్లి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

ఈసారి తన ప్రయత్నాలకు నిర్మాతల, దర్శకుల మద్దతు ఎక్కువగా లభించిన నిర్మలమ్మ గారు చిత్ర సీమలో నిలదొక్కుకున్నారు. కాలక్రమేణా ఆమె తల్లిగా, బామ్మగా స్థిరపడి ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నారు. తనకంటే పెద్దవారయిన నందమూరి, అక్కినేని, ఎస్వీ రంగారావు గార్లు మొదలుకుని చిత్ర రంగంలోని ఎంతోమంది నటీనటులకి తల్లి పాత్రల్లో కనిపించారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి నటీనటులు ఎందరికో బామ్మగా, నాన్నమ్మగా కనిపించారు.

నిర్మలమ్మ గారు చినరాయుడు సినిమాలో వెంకటేష్ గారికి అమ్మగా నటించారు. ఆ సినిమాలో తాను కామెడి చేయడమే కాకుండా విజయశాంతిని తాను పిలిచిన పిలుపులు అన్నీ కూడా ఇప్పటికి మనకు వినపడుతూనే ఉంటాయి. దేవత సినిమాలో మోహన్ బాబు గారికి నిర్మలమ్మ గారు బామ్మగా నటించారు. తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా తన అభినయం లో హుందాతనం చూపించారు. అలాగే గ్యాంగ్ లీడర్ చిత్రంలో చిరంజీవికి గారికి ఆమె బామ్మ గా నటించారు. తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం నిర్మలమ్మ గారు నటిస్తుంటే అలా చూస్తుండిపోయేవారు.

విజయవంతమైన చిత్రాలు…

నిర్మలమ్మ గారు ఎన్నో చిరస్మరణీయమైన చిత్రాల్లో తెర కనువిందు చేశారు. కె.విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం “శంకరాభరణం” లో వైవిధ్యమైన పాత్రను పోషించి విమర్శకుల చేత ప్రశంసలు అందుకున్నారు. “శుభలేఖ”, “స్వాతిముత్యం”, “శుభ సంకల్పం”, “ఆపద్భాంధవుడు” లాంటి కె. విశ్వనాథ్ చిత్రాల్లో నిర్మలమ్మ గారు చెప్పుకోదగ్గ పాత్రలు ధరించారు. తన నటనపై మొదట్లో అభ్యంతరాలు ఉన్నా, తరువాత కాలంలో తాను నటించిన చిత్రాల్లో కొన్ని నిర్మలమ్మ గారి ప్రతిభకు అద్దం పట్టేవి చాలా చిత్రాలు ఉన్నాయి. “భాగ్యదేవత”, “ఇరుగుపొరుగు”, “భార్యాభర్తలు”, “ఇదెక్కడి న్యాయం”, “కులగోత్రాలు”,  “దేవత”, “శివరంజని”, “అర్ధరాత్రి”, “ఇరుగుపొరుగు”, “పదహారేళ్ళ వయసు”, “కోతలరాయుడు”, “మోసగాడు”, “అగ్నిపూలు”.. ఇలా అనేక చిత్రాల్లో నిర్మలమ్మ గారు అద్భుతమైన అభినయం ప్రదర్శించారు.

“పట్నం వచ్చిన పతివ్రతలు”, “బాబాయ్‌ అబ్బాయ్‌”, “మగమహారాజు”, “మంత్రిగారి వియ్యంకుడు”, “సంఘర్షణ”,  “హీరో”, “మహానగరంలో మాయగాడు”, “రుస్తుం”, “మయూరి”, “ముచ్చటగా ముగ్గురు”, “ఒక రాధా ఇద్దరు కృష్ణులు”, “శ్రీ కనకమాలష్మి రికార్డింగ్‌ డాన్స్‌ ట్రూప్‌”, “నాకూ పెళ్ళాం కావాలి”, “సీతా రామరాజు”, “వారసుడొచ్చాడు”, “చిన్నోడు పెద్దోడు”, “ఆఖరిపోరాటం”, “మాయలోడు”, “ష్‌.. గప్‌ చుప్‌”, “ఆ ఒక్కటీ అడక్కు”, “అలీబాబా అరడజను దొంగలు”, “బిగ్‌ బాస్‌”, “మావి చిగురు”, “రాయుడు”, “స్నేహం కోసం” చిత్రాలు నిర్మలమ్మలోని నటిని వెలికి తీశాయి. “స్నేహం కోసం” చిత్రం తరువాత ఆమె నటించడం మానేశారు. ఎస్వీ కృష్ణారెడ్డి గారి బలవంతం మీద “ప్రేమకు ఆహ్వానం” చిత్రంలో ఆమె చివరిసారిగా కనిపించారు.

నిర్మలమ్మ గారు చేసిన పాత్రలు చాలా మంది నటులు చేయలేదు. తాను చేసిన సినిమాలు ఎవ్వరూ కూడా చేయలేకపోయారు అనేది నిజం. ఎలాంటి పాత్రోచిత సన్నివేశం అయినా నిర్మలమ్మ గారు ఉంటే చాలు ఆ సన్నివేశం బాగా పండుతుంది అని దర్శకులు భావించేవారు. అగ్ర హీరోలుగా ఉన్న ఎన్టీఆర్, చిరంజీవి, మోహన్ బాబు, వెంకటేష్, బాలకృష్ణ గార్లు ఇలా అందరి పక్కన ఆమె గుణ చిత్ర నటిగా నటించారు. వారి సినిమాల్లో తన పాత్రనే సినిమా కు ప్రధాన ఆస్తి. తాను సినిమాలో ఉందంటే చాలు కుటుంబ కథా చిత్రాల ప్రేక్షకులు తన సినిమాలు ఎగబడి చూసే వాళ్ళు. నిర్మలమ్మ గారి మాటలు మన ఇంట్లో అమ్మమ్మ, నానమ్మ మాటల మాదిరిగా ఉంటాయని అనే వాళ్ళు అభిమానులు. అలా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు.

ఇక చిత్ర పరిశ్రమ విషయానికొస్తే, పరిశ్రమలో ప్రవేశించిన తొలి రోజులలో, అందరూ తనది “మగగొంతు” అని వెక్కిరిస్తుంటే, సినీనటి అంజలీ దేవి గారు మాత్రం “నీలాగా  సరైన మాడ్యులేషన్ తో డైలాగ్ చెప్పెవారు పరిశ్రమలో లేరు” అని ధైర్యం చెప్పటమే కాక, అప్పట్లో అంజలీదేవి గారి సంస్థ నిర్మిస్తున్న “ఋణానుబంధం” లో వేషమిచ్చి ప్రోత్సహించారు. నిర్మలమ్మ గారు “మనుషులు మారాలి” లో శోభన్ బాబు గారికి అమ్మ గా తాను వేసిన వేషం నిర్మలమ్మ గారికి చాలా మంచి  పేరు తెచ్చిపెట్టింది. అక్కడ నుండి తాను వెనుతిరిగి చూసుకోలేదు.

తాను ఎంత బిజీ నటి అయిపోయిందంటే ఒకానొక దశలో సూపర్ స్టార్ కృష్ణ గారితో సమానంగా యేడాదికి 18 సినిమాలలో నటించిన రోజులు కూడా వున్నాయి.

తనకు ఎక్కువగా వేషాలు ఇచ్చి ప్రోత్సహించిన వారిలో బి.ఏ.సుబ్బారావు, తాపీ చాణక్య, దాసరి నారాయణరావు, కె.విశ్వనాథ్ , యస్వీకృష్ణారెడ్డి గార్లు మొదలైన వారు ఉన్నారు.

నిర్మలమ్మ కెరీర్‌లో ఆమెకు బాగా పేరు తెచ్చిన సినిమాలు మయూరి, సీతారామారాజు.

మయూరి చిత్రంలో డ్యాన్స్‌ చేయాలని తపించే మనవరాలికి అండగా నిలిచే బామ్మ పాత్రలో జీవించారు

నిర్మలమ్మ గారు. ఇక సీతారామరాజు సినిమాలో అయితే ఏకంగా ప్రతినాయక లక్షణాలతో మెప్పించారు.

ఈ రెండు సినిమాల్లో తన నటనకు నంది అవార్డులు లభించాయి. చిరంజీవి “స్నేహం కోసం” సినిమా తర్వాత తాను నటించడం మానేశారు.

వైవాహిక జీవితం…

నిర్మలమ్మ గారికి రంగస్థలం అంటే మక్కువ ఎక్కువ. తాను పది సంవత్సరాల వయస్సు లోనే నాటక రంగం లోకి అడుగుపెట్టారు.

మొదట్లో తన గొంతు సన్నగా ఉండడంతో “సతీ సక్కుబాయి” నాటకంలో నటిస్తున్నప్పుడు సన్నగా వినిపిస్తున్న సంభాషణలకు ప్రేక్షకులు అల్లరి చేసేవారు.

ఇక ఆ తర్వాత గొంతు పెద్దగా చేసి తన స్వరాన్ని మెరుగు పరుచుకుంది.

రంగస్థల నటుడిగా, నాటక ప్రదర్శకులు గా గుర్తింపు పొందిన జి.వి.కృష్ణారావు తో నిర్మలమ్మ ని చూసి ప్రేమలో పడ్డారు.

అయితే నిర్మలమ్మ ని వివాహం చేసుకోవడానికి పెళ్లి చూపులకు తన ఇంటికి వెళ్లారు.

అప్పుడు నిర్మలమ్మ గారు జీవీ కృష్ణారావు తో వివాహం అనంతరం నాటకాలలో నటించకూడదని ఆంక్షలు విధించకూడదని చెప్పింది.

ఇక నిర్మలమ్మ పెట్టిన ఆంక్షలు విన్న రెండు కుటుంబాల పెద్దలు నిర్ఘాంతపోయారు. అయితే నిర్మలమ్మ గారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ తాను వినలేదు.

ఇక జీవీ కృష్ణారావు గారు ఆమె షరతులు ఒప్పుకొని వివాహం చేసుకున్నారు.

వివాహం తరువాత వీరిద్దరూ ఉదయిని అనే నాటక సంస్థను నెలకొల్పి నాటకాలు ప్రదర్శించేవారు.

కొంతకాలం తర్వాత ప్రొఫెషనల్ మేనేజర్ గా అనేక భారీ చిత్రాలకు పని చేస్తూ చిత్ర నిర్మాణ రంగంలో అందరితో ప్రశంసలు పొందారు.

నిర్మాతలకు నటీనటులకు తగాదాలు రాకుండా చూసుకునేవారు.

ప్రొడక్షన్ మేనేజర్ గా జి.వి.కృష్ణారావు గారు, నటిగా నిర్మలమ్మ గారు సినిమాలలో అవకాశాలు రావడం వల్ల అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

ఇక నిర్మలమ్మ దంపతులకు పిల్లలు లేరు. వారు కవిత అనే ఒక అమ్మాయి ని దత్తత తీసుకున్నారు.

ఇక ఆ అమ్మాయికి పుట్టిన కొడుకు నిర్మలమ్మ మనవడు విజయ్ మాదాల.

మనవడు విజయ్ మాదాల పుట్టినప్పటినుండి అమెరికాలోనే ఉండడం వలన విజయ్ కి తెలుగు మాట్లాడడం రాదు.

ఇతడికి శోభ అనే అమ్మాయితో వివాహం కాగా ప్రియా అనే కూతురుకు జన్మనిచ్చారు.

పాక్షిక చిత్ర హారం…

స్నేహం కోసం (1999) రాయుడు (1998) ఆరో ప్రాణం (1997) మావిచిగురు (1996) బిగ్ బాస్ (1995)

శుభ సంకల్పం (1995) ఆలీబాబా అరడజను దొంగలు (1994) ఆ ఒక్కటి అడక్కు (1993)

ష్ గప్‌చుప్ (1993) మాయలోడు (1993) పేకాట పాపారావు (1993) చిన్నరాయుడు (1992)

ఆపద్బాంధవుడు (1992) రాత్రి (సినిమా) (1992) సుందరకాండ (1992) గాంగ్ లీడర్ (1991)

కర్తవ్యం (1991) మామగారు (1991) చలాకీ మొగుడు చాదస్తపు పెళ్లాం (1989) విజయ్ (1989)

ఖైదీ నెం. 786 (1988) ఆఖరి పోరాటం (1988) ఊరేగింపు (1988) చిన్నోడు పెద్దోడు (1988)

వారసుడొచ్చాడు (1988) నాకు పెళ్ళాం కావాలి (1987) శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ (1987)

కృష్ణ గారడీ (1986) ఒక రాధ ఇద్దరు కృష్ణులు (1985) ముచ్చటగా ముగ్గురు (1985)

స్వాతిముత్యం (1985) రుస్తుం (1984) మయూరి (1984) మహానగరంలో మాయగాడు (1984)

హీరో (1984) బాబాయ్ అబ్బాయ్ (1984) సంఘర్షణ (1983) మంత్రిగారి వియ్యంకుడు (1983)

మగ మహారాజు (1983) ముగ్గురు మొనగాళ్ళు (1983) పట్నం వచ్చిన పతివ్రతలు (1982)

శుభలేఖ (1982) అగ్నిపూలు (1981) మోసగాడు (1980) కోతల రాయుడు (1979) శంకరాభరణం (1979)

నాయుడుబావ (1978) పదహారేళ్ళ వయసు (1978) శివరంజని (1978) ఇదెక్కడి న్యాయం (1977)

చిల్లరకొట్టు చిట్టెమ్మ (1977) యమగోల (1975) మేమూ మనుషులమే (1973) విధివిలాసం (1970)

అర్ధరాత్రి (1968) దేవత (1965) ఇరుగు పొరుగు (1963) కులగోత్రాలు (1962) భార్యాభర్తలు (1961)

భాగ్యదేవత (1959)

మరణం…

నిర్మలమ్మ గారు 19 ఫిబ్రవరి 2009,   గురువారం ఉదయం భువిని వీడి స్వర్గానికి పయనమయ్యారు. తనకు 89 ఏళ్లు.

ఆమె గురువారం ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో హైదరాబాదులోని తన ఇంటిలో సహజ మరణం పొందారు. ఆమె నిద్రలోనే కన్నుమూశారు.

సినీ పరిశ్రమ ఆమె మృతికి సంతాపం ప్రకటించారు. ఇంటిలో మనువడు, మనవరాలు మాత్రమే ఉంటారు.

నిర్మలమ్మ గారు అమ్మ పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచారు. తాను సుమారుగా వేయికి పైగా చిత్రాల్లో నటించారు.

అందురు హీరోలు, హీరోయిన్లు నటించిన చిత్రాల్లో గుణ చిత్ర నటిగా నటించారు.

ఆమె మొదటి సినిమా గరుడ భంగం కాగా చివరి సినిమా “ప్రేమకు స్వాగతం”.

విశేషాలు…

★ నాటకాలతో మెప్పు పొందాలని ప్రయత్నించిన నిర్మలమ్మ గారికి విజయవాడ రేడియో స్టేషన్ ప్రోగ్రామ్స్ ఊరటనిచ్చాయి.ఆ రోజుల్లో రేడియో కార్యక్రమాల గురించి ముందుగానే ప్రకటనలు ఇచ్చేవారు. నిర్మలమ్మ గారి చిత్రాంగి ఏక పాత్రభినయం కోసం ప్రత్యేక శ్రోతలు ఉండేవారు..

★ బందరుకు పగటి వేశగాళ్ళొచ్చినా భోగం మేళ్ళం వచ్చినా అందరికన్నా ముందుగానే పరుగులు తీసేవారు.

★ చిన్నతనంలో తన తోటివారిని కూడబెట్టుకుని తనే చిన్న నాటకాలు రచించి, అందరిచేత ఆ నాటకాలు వేయించి ప్రధాన పాత్రధారిగా మిగిలేవారు..

★ 19 వ యేట జి.వి. కృష్ణారావు తో పెళ్లి ఖాయమైనా నాటకాలు వేయనిస్తేనే పెళ్లి అని వాగ్దానం తీసుకుని మరీ మూడు ముళ్ళు వేయించుకునేవారు..

★ కాకినాడ లో కరువు రోజులు నాటికను చూసిన “పృథ్విరాజ్ కపూర్” గొప్ప నటివవుతావు అని చెప్పారట. ఆ సంఘటన ను పలు సందర్భాలలో గుర్తుచేసుకునే వారు నిర్మలమ్మ గారు…

★ ఏక వీర నాటకంలో గిరిక పాత్రను వేసిన నిర్మలమ్మ గారిని ను చూసిన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు పిచ్చిమొద్దూ.. నీలో ఇంత నటన ఉందని అనుకోలేదు అనగా అమాయకంగా నవ్వారట నిర్మలమ్మ గారు..

★ నిర్మలమ్మ గారు నిజానికి ముందుగా ఆడపెత్తనంలో హీరోయిన్ గా చేయాల్సి వుంది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత ఆమె “గరుడ గర్వభంగం”లో హీరోయిన్ గా చేశారు. కానీ అది అంతగా ప్రాచుర్యం పొందలేదు. కానీ తనకు నటిగా మంచి పేరు తెచ్చింది మాత్రం “మనుషులు మారాలి” అనే చిత్రం…

★ “మనుషులు మారాలి” సినిమా శతదినోత్సవాలకు వెళ్ళిన హిందీ నటుడు ప్రాణ్, నువ్వు శోభన్ బాబు గారికి మాత్రమే అమ్మ కాదు. “భారత్ కీ మా” అని అన్నారు. ఆ సమయంలో ఆయనతో నాలుగు ముక్కలు హిందీలో మాట్లాడలేకపోయానని ఆమె విచారిస్తుండేవారు..

★ నిర్మలమ్మ గారు “చలాకీ మొగుడు-చాదస్తపు పెళ్లాం” (తన సొంత బానర్ )లో రాజేంద్రప్రసాద్ గారిని ఒక ఊపు ఊపారు. మంచి హాస్యచిత్రం, నిర్మలమ్మ గారే నిర్మాత.

★ నిర్మలమ్మ గారు “దేవత” సినిమాలో (హాస్యనటుడు పద్మనాభం సొంత చిత్రం యన్ .టి.ఆర్, సావిత్రి గార్లు హీరో హీరోయిన్లు ) తనకంటే పెద్దదో, సమ వయస్కురాలో అయిన సావిత్రి గారికి అత్తగారుగా నటించి సినిమా ను రక్తి కట్టించారు.

★ నిర్మలమ్మ గారు “ఆడపెత్తనం” సినిమాలో అక్కినేని గారి పక్కన హీరోయిన్ గా ఆ చిత్ర దర్శకులు ఆదుర్తి సుబ్బారావు గారు అవకాశం ఇచ్చినా సినిమా రంగంలో నిలదొక్కుకోలేమనే అనుమానంతో నిర్మలమ్మ గారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు.

Show More
Back to top button