Telugu Cinema

అలనాటి వెండితెర పాలవెల్లి.. నటి పుష్పవల్లి…

జీవితం ఎల్లప్పుడూ సార్లు పూల పాన్పు కాదు. మనం తీసుకునే నిర్ణయాలను బట్టి కొన్ని సార్లు ముల్లకంచెల మీద కూడా ప్రయాణించాల్సి రావచ్చు. ఆ నిర్ణయాలు జీవితం మొత్తాన్ని అగాథం లోనికి నెట్టేయవచ్చు. సినీ నటి పుష్పవల్లి విషయంలో కూడా ఇలానే జరిగింది..

సినీ తారలు సెకండ్ హ్యాండ్ మొగుళ్లను పెళ్లి చేసుకునే ఆనవాయితీ బాలీవుడ్ లోనే కాదు, దక్షిణాది సినీ రంగానికి కూడా పాకేసింది. అలనాటి మేటి నటి సావిత్రితో ప్రారంభమైన ఈ ధోరణి హీరోయిన్ నయనతార దాకా వ్యాపించింది. సావిత్రి అప్పటికే పెళ్లయిన జెమినీ గణేషన్‌తో ప్రేమలో పడి ఆయనను పెళ్లి చేసుకుంది. వారికి పిల్లలు కూడా కలిగారు. తెలుగు చిత్ర పరిశ్రమనే కాదు, హిందీ చిత్ర పరిశ్రమను కూడా తన అందాలతో ఉర్రూతలూగించిన శ్రీదేవి అప్పటికే పెళ్లయి, పిల్లలున్న దర్శక, నిర్మాత బోనీ కపూర్‌ను వివాహమాడింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా.

ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్‌తో గౌతమి సహజీవనం చేస్తోంది. ప్రముఖ నటి రాధిక అప్పటికే పెళ్లయి పిల్లలున్న నటుడు శరత్ కుమార్‌ను పెళ్లి చేసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ, ప్రముఖ దర్శకురాలు విజయనిర్మల జంట గురించి తెలిసిందే. వీరిద్దరు కలిసి పలు చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో కృష్ణ విజయనిర్మలను రెండో పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరికి అప్పటికే వారి వారి జీవిత భాగస్వాములతో పిల్లలు కూడా ఉన్నారు.

నటి పుష్పవల్లి గారు కూడా అప్పటికే పెళ్లి అయిన జెమినీ గణేశన్ ను పెళ్లి చేసుకుంది. పిల్లల్ని కన్నది. పిల్లల ఆలనా పాలనా జెమినీ పట్టించుకోకపోయినా, ఐదుగురు సంతానం. బాబ్జీ, భానురేఖ (బాలీవుడ్ నిన్నటి తరాల హీరోయిన్ రేఖ), రమ, రాధ, ధనలక్ష్మిలను తీర్చిదిద్దింది. ప్రేమకోసం సినిమా కెరీర్ ని, పిల్లల కోసం జీవితాన్ని ఫణంగా పెట్టింది.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    వెంకట పుష్పవల్లి తయారు 

ఇతర పేర్లు  :   చిట్టి 

జననం    :   03 జనవరి 1926

స్వస్థలం   :   పెంటపాడు గ్రామం, తాడేపల్లిగూడెం (ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్)

తండ్రి   :  కందాళ తాతాచారి 

తల్లి    :   రామకోటమ్మ 

వృత్తి      :    సినిమా నటి, గాయని

క్రియాశీల సంవత్సరాలు   :  1936–1969

భాగస్వామి  :  రంగాచారి, జెమినీ గణేశన్..

పిల్లలు  :    బాబ్జి, రామ, భానురేఖ, రాధ..

మరణం   :  28 ఏప్రిల్ 1991 (వయస్సు 65)

మద్రాసు , తమిళనాడు , భారతదేశం

జననం..

నటి పుష్పవల్లి గా ప్రసిద్ధురాలైన కందాళ వెంకట పుష్పవల్లి తాయారు గారు ఆంధ్రప్రదేశ్ లోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా  తాడేపల్లిగూడెం దగ్గరలో ఉన్న పెంటపాడు గ్రామంలో 3వ జనవరి 1926 నాడు జ‌న్మించారు. ఆమె తండ్రి కందాళ తాతాచారి, తల్లి రామ‌కోట‌మ్మ‌. ఆవిడ గారి కంటే ముందు జన్మించిన సంతానం అంతా పురిటిలోనే చనిపోతుండడంతో వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు. ఆ మొక్కులు ఫలించి ఆ తరువాత పుట్టిన బిడ్డ పుష్పవల్లి గారు బ్రతికి బట్టకట్టడంతో ఆ కృతఙ్ఞతా భావంతో ఆమెకు వెంకట పుష్పవల్లి తయారు అనే పేరు పెట్టారు. అయితే ఆవిడను ఇంట్లో అందరూ చిట్టి అని పిలిచేవారు. ఇక నటి పుష్ప‌వ‌ల్లి చెల్లి సూర్య‌ప్ర‌భ గారు కూడా చిత్రసీమలో కథానాయికగా నటించింది. ఆమె ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు వేదాంతం రాఘ‌వ‌య్య‌ గారిని పెళ్లాడింది.

బాల్యం..

చిన్నతనం నుండి సినిమాలంటే ఆసక్తి ఉన్న నటి పుష్పవల్లి గారు అయిదవ తరగతి వరకు చదువుకున్నారు. వాళ్ళ వూరికి రెండు మైళ్ళ దూరంలో టూరింగు టాకీసు ఉండేది. అక్కడ ఆడే సినిమా పోస్టర్లు బడి గోడల మీద అంటించేవారు. బడికి వస్తూ, పోతూ ఆ పోస్టర్లను ఆసక్తిగా తిలకించేది. టాకీలు అప్పుడే పుట్టి అప్పుడే ఎదుగుతున్న రోజులవి. కన్నాంబ, శ్రీరంజని, రామతిలకం పోస్టర్లు ఎంతసేపు చూసినా కూడా నటి పుష్పవల్లి గారికి తనివి తీరేది కాదు.

ఒకరోజు కాదు. దాదాపు ప్రతిరోజు ఇదేవరుస. ఈ విషయం రామకోటమ్మ చెవినబడడంతో ఆవిడ భయపడింది. తన కూతురి సినిమా పిచ్చి ఎలాంటి ఉపద్రవం తీసుకొస్తుందో అన్నది ఆమె భయం. సినిమాలలో నటించేవారు తొందరగా చచ్చిపోతారేమో అనే భయం ఆ రోజుల్లో జనాల్లో విపరీతంగా ఉండేది. అందువల్ల పుష్పవల్లి తల్లిదండ్రులకు సినిమాలు అంటే భయం. సినిమాకు తీసుకెళ్లాలంటే సినిమా పోస్టర్లు చూడడం మానెయ్యాలి అని రామకోటమ్మ గారు నటి పుష్పవల్లి గారికి షరతులు పెట్టారు.

దాంతో పుష్పవల్లి సరేనని తల ఊపింది. ఆ రోజు నుండి పోస్టర్లు చూడడం మానేసి సినిమాలు చూడడం మొదలుపెట్టింది. తన అల్లరి పడలేక తరచూ సినిమాలకు తీసుకెళుతుండేవారు రామకోటమ్మ గారు. తాను సినిమాలో చూసిన పాటలను ఉన్నది ఉన్నట్లుగా పాడేవారు పుష్పవల్లి గారూ.

సినీ రంగ ప్రవేశం…

సినిమాలు చూసి అందులోని పాటలు ఉన్నది ఉన్నట్టుగా పాడే నటి పుష్పవల్లి గారి పాటలు విని వారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన అచ్యుత రామయ్య గారు పుష్పవల్లి గారిని సినిమాల్లో నటిస్తావా అని అడిగారు. మా అమ్మ సరే అంటే నాకు అభ్యంతరం లేదు అన్నది పుష్పవల్లి గారు గడుసుగా. ఆ మాటతో అవాక్కయ్యింది రామకోటమ్మ. అది గమనించిన  అచ్యుత రామయ్య గారు ఈ రోజు మీరంతా రాజమండ్రి కి రండి సినిమాలు ఎలా తీస్తారో చూడవచ్చు. దాంతో మీ భయం పోతుందని నచ్చచెప్పి తీసుకెళ్లారు. ఆ సమయంలో నిడమర్తి దుర్గయ్య, సూరయ్య సోదరులు రాజమండ్రిలో దుర్గా సినీ టోన్ అనే స్టూడియో నెలకొల్పి “సంపూర్ణ రామాయణం” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆరోజు వీళ్ళు వెళ్లేటప్పటికి పాట చిత్రీకరణ జరుగుతుంది. ఎంతో శ్రద్ధగా ఆ పాట చిత్రీకరణ గమనించిన పుష్పవల్లి గారు, మర్నాడు మళ్ళీ షూటింగ్ స్పాట్ కి వెళ్ళినప్పుడు చిత్ర నిర్మాత నటి పుష్పవల్లి గారిని “ఏవమ్మా నీకేమైనా పాట వచ్చా” అని అడిగారు.

అంతకుముందు రోజున విన్న పాటను పాడి వినిపించారు పుష్పవల్లి గారు. ఆమె జ్ఞాపకశక్తికి ఆశ్చర్యపోయి మీ అమ్మాయి పెద్ద స్టార్ అవుతుంది అని ఆమె బుక్ చేశారాయన. కూతురు ఉత్సాహాన్ని గమనించిన ఆమె తల్లిదండ్రులు కూడా అభ్యంతరం చెప్పలేదు. అలా పన్నెండేళ్ల ఏళ్ల వయసులో తొలిసారిగా కెమెరా ముందు నిలబడిన పుష్పవల్లి గారు “సంపూర్ణ రామాయణం” చిత్రంలో కళ్యాణ సీత వేషం వేసిందామె. అంతేకాదు అశోకవనంలో వచ్చే శోక గీతాన్ని కూడా ఆమె పాడారు. మొదట్లో ఆమెకు పాట పెట్టలేదు. అయితే షూటింగ్ స్పాట్ లో పాటలు ఏదో పాడుతుంటే గమనించి పాట వ్రాయించి ఆమెతో పాడించి చిత్రీకరించారు. మూడు రోజుల్లో పుష్పవల్లి వేషం పూర్తయింది. ఆ రోజుల్లో 300 రూపాయలు పారితోషికం ముట్టిందామెకు. ఆమెకున్న పొడుగాటి పేరుని కత్తిరించి “పుష్పవల్లి” అనే పేరుని ఖాయం చేశారు శ్రీ పుల్లయ్య పూర్ణ మంగరాజు.

మోహిని గా రెండుసార్లు…

సంపూర్ణ రామాయణం చిత్రంలో నటి పుష్పవల్లి గారి నటన చూసి ముగ్దులైన మంగరాజు గారు తాను నిర్మించే “దశావతారం” చిత్రంలో మోహినీ పాత్రకు పుష్పవల్లి గారిని ఎంపిక చేశారు. ఈ చిత్ర చిత్రికరణ నిమిత్తం పూణే వెళ్లిన పుష్పవల్లి ఏడు నెలల పాటు అక్కడే ఉన్నారు. ఆ చిత్రంలో మోహినిగా ప్రేక్షకులను సమ్మోహనం చేయడంతో ఎన్నో అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. అదే సమయంలో “శ్రీ సత్యనారాయణ”, “చల్ మోహన్ రంగ”,  “కాసులపేరు” చిత్ర నిర్మాణం ప్రారంభించారు. దీనిలో “శ్రీ సత్యనారాయణ” పెద్ద సినిమా కాగా, మిగిలినవి రెండు లఘు చిత్రాలు. చల్ మోహనరంగా సినిమాలో మొదట వేరే నటిని ఎంపిక చేసిన పుల్లయ్య గారు తర్వాత ఆమెను తీసేసి ఆవిడ స్థానంలో పుష్పవల్లి ని ఎంపిక చేశారు. ఆ తర్వాత కాలంలో కళాదర్శకుడిగా ప్రసిద్ధి పొందిన వాలి సుబ్బారావు గారు ఇందులో కథనాయకుడు. పల్లెపడుచుగా పుష్పవల్లి గారు నటించారు.

అనంతరం పుల్లయ్య గారి దర్శకత్వంలో రూపేంద్ర మోహిని భస్మాసుర చిత్రంలో మరోసారి మోహిని చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో ఏ.వి.సుబ్బారావు గారు భస్మాసురుడుగా నటించారు. పెరుగుతున్న ఆదరణ గమనించిన పుల్లయ్య గారు తన సినిమాల్లో తప్ప బయట చిత్రాలలో నటించకూడదని మూడేళ్ల కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. నెలకు 200 రూపాయలు జీతం ఇచ్చేవారు ఆవిడ గారికి. ఈ కాంట్రాక్టు సమయంలో “వరవిక్రయం”, “మాలతిమాధవం” సినిమాలో నటించారు పుష్పవల్లి గారు. ఆ రెండు చిత్రాల చిత్రికరణ కనకత్తాలో జరిగాయి. “వరవిక్రయం” చిత్రం భానుమతి గారి తొలి సినిమా కావడం గమనార్హం. ఈ చిత్రంలో నటిస్తున్నప్పుడే “మోహిని రుక్మాంగద”,  “నారద నారది” చిత్రాలలో అవకాశం వచ్చినా కాంట్రాక్టు గడుపు పూర్తి కానందున ఆ చిత్రాలలో నటించలేకపోయారు.

చాలా రోజుల తర్వాత మళ్లీ…

సాఫీగా సాగుతున్న పుష్పావల్లి నటి జీవితం అనుకోని పరిస్థితుల్లో కొన్ని కుదుపులకు లోనైంది. వృత్తి జీవితంలో పోటీ పెరిగింది. అటువంటి వాతావరణంలో అవాంఛనీయ పరిస్థితుల్లో ఇమడలేక స్వంత ఊరికి తిరిగి వెళ్ళిపోయారు. అయితే నిర్మాతలు మాత్రం పుష్పవల్లి గారిని వదిలిపెట్టలేదు. “బాలనాగమ్మ” చిత్రం తీయాలనే సంకల్పంతో నటి పుష్పవల్లి గారిని మళ్లీ మద్రాసుకు పిలిపించారు హెచ్.ఎం.రెడ్డి గారు. అయితే ఎందువలననో ఆ చిత్ర నిర్మాణం ప్రారంభం అవ్వలేదు. మళ్లీ ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్న తరుణంలో ఆర్.ఎస్.ప్రకాష్ “తారా శశాంకం” సినిమా నిర్మిస్తూ నటి పుష్పవల్లి గారిని అందులో కథానాయికగా ఎంపిక చేశారు. ఆ చిత్ర విజయంతో పుష్పవల్లి గారికి పూర్వ వైభవం వచ్చింది.

జెమినీ సంస్థలో శాశ్వత కళాకారిణిగా…

కలకత్తాలో సినిమాలలో నటిస్తున్నప్పుడే షూటింగ్ స్పాట్ లో ఉన్న పుష్పవల్లి నటనను చూసి ముగ్దుడైన రాజా శాండో గారు ఆమెతో సినిమా తీయాలని ఎంతో ఉవ్విళ్లూరారు.  పుష్పవల్లి గారు కథానాయికగా “చూడమణి” చిత్రాన్ని నిర్మించారు రాజా శాండో గారు. వై.వి.రావు గారు నిర్మించిన “సత్యభామ” చిత్రంలో సత్యభామ పాత్ర పోషించారు నటి పుష్పవల్లి గారు. ఈ రెండు చిత్రాలు నటిగా ఆమె ఎదుగుదలకు ఎంతగానో ఉపకరించాయి. ప్రతిభ ఉన్న కళాకారులను వల వేసి వెదికి పట్టుకునే గుణం కలిగిన జెమినీ వాసన్ గారు పుష్పవల్లి గారిని శాశ్వత కళాకారిణిగా తీసుకున్నారు.

18 ఏళ్ళ పాటు ఆ సంస్థ నిర్మించిన తెలుగు, తమిళ, హిందీ సినిమాలలో ఆమె ప్రాధాన్యత కలిగిన పాత్రలు పోషించారు. వీటిలో “బాల నాగమ్మ” చిత్రాన్ని ప్రముఖంగా పేర్కొనాలి. పుష్పవల్లి పోషించిన సంగు అనే పాత్ర అభినందనీయం. అలానే “మిస్ మాలిని” చిత్రంలో నటిస్తున్నప్పుడు ఆమె సోదరి “సూర్యప్రభ” తరుచూ వస్తుండేది. దాంతో ఆమె నలుగురి దృష్టిలో పడి కొన్ని సినిమాలలో అవకాశాలు చేజిక్కించుకుంది. తర్వాత కాలంలో “వేదాంతం రాఘవయ్య” గారు “సూర్యప్రభ” గారిని వివాహం చేసుకున్నారు.

జెమినీ గణేశన్ తో పరిణయం..

నటి పుష్పవల్లి గారు సంస్థలో పని చేస్తున్నప్పుడే జెమినీ గణేశన్ గారితో పరిచయం ఏర్పడింది.

అప్పటికే జెమినీ గణేశన్ గారికి పెళ్లి అయ్యింది.

ఆ పెళ్లి జెమినీ గణేశన్, పుష్పవల్లి గార్ల పెళ్ళికి అడ్డంకి కాలేదు. ఆ సమయానికే పుష్పవల్లి గారికి రంగాచారి గారితో పెళ్లి అయ్యింది.

కానీ అది మూన్నాళ్ళ ముచ్చటే అయ్యింది. ఆ తరువాత జెమినీ గణేశన్ గారిని వివాహమాడినారు.

ఈ దంపతులకు అయిదుగురు సంతానం. బాబ్జి, భానురేఖ, రమ, రాధ, ధనలక్ష్మి. బాబ్జి, భానురేఖలు కొన్ని చిత్రాలలో బాల తారలుగా నటించారు.

ఆ తరువాత భానురేఖ హిందీ చిత్ర రంగానికి వెళ్లి “రేఖ” గా స్థిరపడింది.

జెమినీ గణేశన్ గారిని పెళ్లాడిన సావిత్రి గారి జీవితం ఎలా అతలాకుతలం అయ్యిందో అందరికీ తెలిసిందే.

నటి పుష్పవల్లి విషయంలోనూ అలాగే జరిగింది.

మీ వైవాహిక జీవితం ఎలా ఉంది అని ఓ సారి ఓ పాత్రికేయుడు అడిగితే, “అందరిలాగే నేను కూడా ఓ విధి వంచితురాలినయ్యాను. 

దాంపత్య జీవితం గురించి నేను చెప్పడం కన్నా నా గురించి తెలిసిన వారు చెప్పడమే బావుంటుంది.

నా వైవాహిక జీవితం ఒక గాథ, అది ఒక నిట్టూర్పు.

నా మదిలో కరుడుగట్టుకు పోయిన బాధ. ఆ బాధలో నిజం తెలుసుకున్నాక నా ప్రేమను నా పిల్లల మీద, నటన మీద కేంద్రికరించాను.

నేనంటే జాలిపడిన కొందరు నిర్మాతలు వేషాలు ఇచ్చి ఆదరిస్తున్నారు” అని చెప్పారు.

చిత్ర సమాహారం…

పెంపుడు కొడుకు..

వరవిక్రయం..

సంపూర్ణ రామాయణం (1936 సినిమా)..

విశ్వమోహిని..

వింధ్యరాణి..

చూడామణి..

పాదుకా పట్టాభిషేకం ( జెమిని)..

చల్ మోహనరంగా..

మోహినీ భస్మాసుర..

మాలతీమాధవం..

సత్యభామ..

బాలనాగమ్మ..

సుడిగుండాలు..

మరణం…

జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని, వాటి ప్రభావం తన నటన జీవితం మీద పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు.

ముఖ్యంగా సుప్రసిద్ధ నటి రేఖ గారు హిందీ చిత్ర పరిశ్రమలో బిజీ అయిన తర్వాత కష్టాలన్నీ తీరాయని చెప్పాలి.

మంచి నటిగా పేరు తెచ్చుకుని సంతృప్తికరమైన జీవితాన్ని గడిపిన పుష్పవల్లి గారు 28 ఏప్రిల్ 1992 లో ఈ లోకాన్ని వదిలి వెళ్లారు.

Show More
Back to top button