Telugu Politics

ఏపీ అసెంబ్లీ: రెండు కీలక బిల్లులకు శాసనసభ ఆమోదం

రాష్ట్ర  ప్రభుత్వం బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రెండు కీలక బిల్లులను శాసనసభ ముందుకు తీసుకొచ్చింది. వైసీపీ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌, గతంలో ఆరోగ్య వర్సిటీ పేరు మార్చిన అంశంపై చర్చ జరిగింది. ఈ రెండు అంశాలపై అనగా.. ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని (ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌-2022) రద్దు చేయడంతోపాటు తర్వాత ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు బిల్లులపై చర్చించనున్నారు. 

ఈ మేరకు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు సభలో ప్రతిపాదనలు తీసుకొచ్చారు. దీనికి సభ్యులు ఒప్పుకోవడంతో బిల్లులను ప్రవేశపెట్టడానికి స్పీకర్‌ ఆమోదించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుతో 2022-2023లో విద్యార్థులు పడిన ఇబ్బందులను తెలిపారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో పాలన అందించిన మహానేత ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ సంస్కరణలతో అన్ని వర్గాలు ఆనాడు సంతోషంగా ఉన్నాయని చెప్పారు. 

గత ప్రభుత్వానికి పేర్ల పిచ్చిపట్టిందని విమర్శించారు. కడప జిల్లాను వైఎస్సార్ జిల్లాగా మార్చారని సత్యకుమార్ అన్నారు. దాని వల్ల వైఎస్సార్ ప్రతిష్ఠ ఏమైనా పెరిగిందా అని అడిగారు. లేదంటే కడప ప్రాముఖ్యత ఏమైనా తగ్గిందా అని అన్నారు. ఎన్టీఆర్ తెలుగుజాతి బ్రాండ్ అని, తెలుగుజాతి కోసం పాటుపడిన కృషీవలుడని సత్యకుమార్ చెప్పారు. కాగా, 2022లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా అప్పటి వైసీపీ ప్రభుత్వం మార్చింది. దీంతో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేసింది.

Show More
Back to top button