మెజారిటీ లేక కాదు..గ్యారెంటీ లేకే! డీలిమిటేషన్ బిల్లును ముంచేసిన ‘దక్షిణాది’ భయం
భారత రాజకీయ యవనికపై నిన్నటి రోజు ఒక చారిత్రాత్మక మలుపుగా నిలిచిపోయింది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో మెజారిటీ లేక కుప్పకూలిపోవడం, కేవలం ఒక బిల్లు ఓటమి మాత్రమే కాదు, అది అభివృద్ధి చెందిన రాష్ట్రాల ఆవేదనకు ప్రతిబింబం. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజిస్తే, దశాబ్దాలుగా జనాభా నియంత్రణ పాటించి ప్రగతి పథంలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా అట్టడుగున పడిపోతాయన్న భయం నేడు నిజమైంది. కేంద్రం ఇచ్చిన అరకొర హామీలు, చట్టబద్ధత లేని మాటలు దక్షిణాది గొంతుకను శాంతింపజేయలేకపోయాయి. ఈ నేపథ్యంలో, అసలు దక్షిణాది రాష్ట్రాల భయం ఏమిటి? కేంద్రం ఇచ్చిన గ్యారెంటీలను నాయకులు ఎందుకు నమ్మలేదు? ఈ బిల్లు వీగిపోవడానికి దారితీసిన అసలు కారణాలను ఏంటి? వంటి విషయాలపై ఓ లుక్ వేద్దాం.
దక్షిణాది రాష్ట్రాల భయం ఏమిటి?
ప్రాతినిధ్యం తగ్గిపోవడం: లోక్‌సభ సీట్లు జనాభా ప్రాతిపదికన కేటాయిస్తారు. దక్షిణాది రాష్ట్రాలు గత 50 ఏళ్లుగా జనాభా నియంత్రణను అద్భుతంగా అమలు చేశాయి. దీనివల్ల ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ జనాభా పెరుగుదల తక్కువగా ఉంది. కేవలం జనాభా లెక్కల ప్రకారం సీట్లు కేటాయిస్తే.. పార్లమెంట్‌లో దక్షిణాది ఎంపీల సంఖ్య శాతం పరంగా తగ్గిపోతుంది.
ఉత్తరాది ఆధిపత్యం: నిపుణుల అంచనా ప్రకారం, డీలిమిటేషన్ తర్వాత ఉత్తర ప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలకు కలిపి దాదాపు 200 పైగా సీట్లు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు కేవలం ఉత్తరాది రాష్ట్రాల మద్దతుతోనే ఒక పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. దీనివల్ల దేశ రాజకీయాల్లో దక్షిణాది గొంతుకకు విలువ లేకుండా పోతుందనేది ప్రధాన భయం.
అభివృద్ధికి శిక్ష: “మేము దేశం చెప్పినట్లు జనాభాను నియంత్రించాం, అక్షరాస్యత పెంచాం. మంచి పనులు చేసినందుకు మాకు సీట్లు తగ్గించి శిక్షిస్తారా?” అనేది దక్షిణాది నాయకుల ప్రశ్న.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీ ఏమిటి?
ఈ భయాలను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం (ముఖ్యంగా హోం మంత్రి పార్లమెంట్‌లో) కొన్ని కీలక హామీలు ఇచ్చింది.
ఏ రాష్ట్రానికీ సీట్లు తగ్గవు: కొత్త డీలిమిటేషన్ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి కూడా ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్య తగ్గదని కేంద్రం హామీ ఇచ్చింది.
50% సీట్ల పెంపు ఫార్ములా: లోక్‌సభలోని మొత్తం సీట్ల సంఖ్యను (ప్రస్తుతం 543) సుమారు 850కి పెంచుతామని ప్రభుత్వం చెప్పింది. అంటే ప్రతి రాష్ట్రంలోనూ ఉన్న సీట్లను దాదాపు 50% పెంచుతారు.
నిధుల రక్షణ: 16వ ఆర్థిక సంఘం (Finance Commission) నిధుల పంపిణీలో జనాభా ఒక్కటే ప్రాతిపదిక కాకుండా.. రాష్ట్రాల అభివృద్ధిని కూడా పరిగణనలోకి తీసుకునేలా చూస్తామని హామీ ఇచ్చింది.
హామీని ఎందుకు నమ్మడం లేదు?
శాతం ముఖ్యం: మా సీట్ల సంఖ్య పెరిగినా, మొత్తం సభలో మా శాతం (Percentage) తగ్గిపోతుంది కదా అనేది వారి వాదన. 543లో 25 సీట్లకు ఉన్న విలువ, 850లో 38 సీట్లకు ఉండదు.
చట్టబద్ధమైన గ్యారెంటీ: ఈ హామీలు కేవలం మాటల రూపంలోనే ఉన్నాయి కానీ.. రాజ్యాంగ సవరణ బిల్లులో “దక్షిణాది రాష్ట్రాల సీట్ల శాతం తగ్గదు” అని స్పష్టమైన నిబంధన చేర్చలేదు. ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకోలేకపోవడంతో ఈ బిల్లు నిన్న లోక్‌సభలో వీగిపోయింది.
ఇతర కథనాలు:
డీలిమిటేషన్ 2026: పెరగనున్న సీట్లు మారనున్న రాజకీయ ముఖచిత్రం!
దక్షిణ భారత మెడపై డీలిమిటేషన్ కత్తి !










