
రోజురోజుకి క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. ఇందుకు గల కారణాలేంటి? అని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన పరిశోధకులు 2లక్షల మందిపై సర్వే చేశారు. వారిలో ప్రాసెస్ చేసిన పదార్థాలు తిన్నవారికి క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు సర్వేలో తేలింది. ప్యాకింగ్ చేసిన పదార్థాల్లో రంగు, రుచి కోసం వాడే ఇంగ్రీడియంట్స్ క్యాన్సర్‌కు కారణమవుతున్నాయట. ముఖ్యంగా వీటిలో ఉప్పు, పంచదార, ఫ్యాట్స్ వంటివి ఎక్కువ ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్యాకింగ్‌కు వాడే మైక్రోప్లాస్టిక్ రసాయనాలు కూడా క్యాన్సర్‌కు దారితీస్తాయట.
కృత్రిమంగా తయారు చేసిన షుగర్‌తో వండిన పదార్థాలు తింటే రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్ వస్తున్నట్టు గుర్తించారు. ఎక్కువగా ఉండికించిన పదార్థాలు తింటే అండాశయ, ఎండోమెట్రియల్ క్యాన్సర్ వస్తున్నట్లు పరిశోధకులు చెప్పారు. మొత్తం మీద ఎక్కువగా వండిన(ఉడికించిన) పదార్థాలు తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాన్ని అధికంగా తీసుకుంటే హృద్రోగాలు, మానసిక సమస్యలతో పాటు అకాల మరణం ముప్పు అధికమని పరిశోధకులు పేర్కొంటున్నారు.
ప్యాకేజ్డ్ బేక్డ్ ఫుడ్స్, స్నాక్స్, ఫిజ్జీ డ్రింక్స్, తీపితో కూడిన సిరిల్స్, రెడీ టు ఈట్ మీల్స్ వంటి అధిక ప్రాసెస్ చేయబడిన ఆహారాల్లో అధిక షుగర్, కొవ్వు, సాల్ట్ ఉండటంతో పాటు విటమిన్స్, ఫైబర్ తక్కువగా ఉంటుంది. అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలు తీసుకుంటే ఊబకాయం ముప్పు 55 శాతం పెరిగే అవకాశం ఉండగా, నిద్రలేమి తలెత్తే చాన్స్ 41 శాతం, మధుమేహ ముప్పు 40 శాతం, కుంగుబాటు ముప్పు 20 శాతం పెరుగుతుందని పరిశోధకులు తేల్చిచెప్పారు.