
మారుత్తూర్ గోపాలన్ రామచంద్రన్ (యం.జి.ఆర్) రాజకీయ వారసురాలిగా తమిళనాట అమ్మగా ప్రసిద్ధి చెందిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఒక భారతీయ నటిగా, వక్తగా, దాతగా, రాజకీయ నాయకురాలుగా ఉండి, ఆమె మరణించే వరకు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. స్వాతంత్ర్యానంతర భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకురాళ్లలో ఒకరిగా పరిగణించబడ్డ ఆమె, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి యం.జి రామచంద్రన్ (యం.జి.ఆర్) స్థాపించిన ద్రవిడ పార్టీ అయిన ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏ.ఐ.ఏ.డి.యం.కె) పార్టీకి ఎక్కువ కాలం పనిచేసిన మాజీ ప్రధాన కార్యదర్శి జయలలిత. 1977 వ సంవత్సరం నుండి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న యం.జి.ఆర్, ఆమెను తమిళ రాజకీయాలకు పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆమెను 1984 లో రాజ్యసభ సభ్యురాలిగా చేయాలని యం.జి.ఆర్ అభిలాషించారు. అనుకున్నట్లుగానే రాజ్యసభ ఎన్నికల్లో డి.యం.కె పార్టీ సీనియర్ నాయకురాలు ఆర్కాట్ ఎన్.వీరస్వామిని పై గెలుపొంది రాజ్యసభ సభ్యురాలిగా జయలలిత ఎన్నికయ్యారు.
జయలలిత తమిళం , తెలుగు , కన్నడ, మలయాళం, హిందీ మరియు ఆంగ్లం సహా అనేక భాషలలో నిష్ణాతులుగా ఉండడం, ప్రతీ విషయంపై కూడా క్షుణ్ణంగా విషయ పరిజ్ఞానం ఉండడం, అద్భుతమైన వాగ్ధాటి ఆమెను రాజకీయంలో తిరుగులేని నాయకురాలిగా నిలిపింది. ఆమె తరచుగా కర్ణాటక ముఖ్యమంత్రులతో కన్నడలో సంభాషించేవారు. “కన్నడ యాసపై ఆమెకు అద్భుతమైన పట్టు ఉన్నదని, కన్నడ యాసలో ఆమె నిష్ణాతులుగా ఉండడం నన్ను ఆశ్చర్యపరిచింది” అని మాజీ నీటిపారుదల మంత్రి మరియు తరువాత కర్ణాటక ముఖ్యమంత్రి అయిన బసవరాజ్ బొమ్మై ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. మద్రాసులో (ఇప్పుడు చెన్నై ) జయలలిత కర్ణాటక సంగీతం , పాశ్చాత్య శాస్త్రీయ పియానో మరియు భరతనాట్యం , కూచిపూడి , మోహినియాట్టం , మణిపురి , కథక్ వంటి వివిధ రకాల శాస్త్రీయ నృత్యాలలో శిక్షణ పొందారు. 24 ఫిబ్రవరి 1948 లో ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లా మేలుకోటే లో జన్మించిన జయలలిత పాశ్చాత్య శాస్త్రీయ పియానో, కర్ణాటక సంగీతం, భరతనాట్యం, కూచిపూడి, మోహినియాట్టం, మణిపురి, కథక్ వంటి వివిధ రకాల శాస్త్రీయ నృత్యాలలో శిక్షణ పొందిన ఆమె కె.జె.సరస వద్ద భరతనాట్యం మరియు నృత్య రూపాలను నేర్చుకున్నారు.
పద్మభూషణ్ గురువు బిరుదాంకితులు డాక్టర్ వెంపటి చిన్న సత్యం వద్ద ఆమె కూచిపూడి నాట్యం నేర్చుకున్నారు. నిష్ణాతులైన నృత్యకారిణిగా తొలిసారిగా మైలాపూర్‌లోని రసిక రంజని సభలో 1960 మే నెలలో ఆరంగేట్రం చేసి తన తొలి నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఆ నృత్య ప్రదర్శనకు ముఖ్య అతిథిగా పాల్గొన్న శివాజీ గణేశన్, ఆమెను “తంగ సిలై ” (బంగారు విగ్రహం) అని పిలవడమే కాకుండా, జయలలిత భవిష్యత్తులో సినీ నటి అవుతుందని జోష్యం చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే జయలలిత సినిమాలలోకి రావడం, యం.జి.ఆర్ తో పరిచయం, వారిద్దరి జీవితాలకు దగ్గరి పోలికలు ఉండడం, ఆమె నటన, వాగ్ధాటి, తెలివి అన్ని కలగలసి ఆమెను రాజకీయ రంగంవైపు అడుగులు పడేలా చేశాయి. అయితే యం.జి.ఆర్ తో పరిచయం ఎలా జరిగింది? తన తల్లి మరణానంతరం తన బంధువులు ఎలా ఆమెకు దగ్గరయ్యారు? తన జీవితంలో 25 శాతం యం.జి.ఆర్ తోడ్పాటు అందించారని ఎలా ఆమె చెప్పుకొచ్చారు. ఇత్యాది విషయాల గురించి సంక్షిప్త వివరణ..
“వెన్నిర ఆడై” సెట్స్ లో తొలిసారి యం.జి.ఆర్ ను కలిసి…
టి.పి. సుందరం దర్శకత్వంలో యం.జి.రామచంద్రన్, వైజయంతిమాల జంటగా నటించిన బాగ్దాద్ తిరుడాన్ (1960) చిత్రంలో జయలలిత తల్లి సంధ్య గుణచిత్ర నటిగా గుల్షాద్ అనే పాత్ర పోషించారు. ఆ చలనచిత్ర చిత్రీకరణలో తన తల్లితో పాటు షూటింగ్ చూడడానికి వచ్చిన జయలలిత తొలిసారిగా యం.జి.ఆర్ ను దూరంగా ఉండి చూశారు. అప్పటికి ఆమె వయస్సు 12 సంవత్సరాలు. అప్పటికే యం.జి.ఆర్ అగ్రనటులు, జయలలిత మాత్రం ఒక సహాయ నటి కూతురు. ఆ తరువాత మద్రాసులో లయోలా కళాశాలలో ఆమె నృత్యప్రదర్శన చేసిన సందర్భంలో ఆ నృత్యోత్సవానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఎం.జీఆ.ర్ ముందుగా అనుకరణ (మిమిక్రీ) చేసిన ఒక కుర్రాడికి ఎంజీఆర్ తన చేతికున్న గడియరాన్ని తీసి అతడికి బహుకరించారు. ఆ తరువాత జయలలిత నృత్య ప్రదర్శన చూసి పరవశించి అప్పటికప్పుడు ఒక వ్యక్తిని పుస్తకాల దుకాణానికి పంపించి ఒక పుస్తకం తెప్పించి ఆమెకు బహుకరించారు. ఇలా చిన్న చిన్న ఎం.జీఆ.ర్ ను కలుస్తూ ఉన్న జయలలిత తరువాత రోజులలో సినిమాలలో నటించడం మొదలుపెట్టిన తరువాత కలుసుకున్నారు.
బుడగురు రామకృష్ణయ్య పంతులు (బిఆర్ పంతులు) దర్శకత్వంలో “చిన్నడ గొంబే” (1964) అనే కన్నడ చిత్రంలో కళ్యాణ్ కుమార్ సరసన జయలలిత నటించారు. ఈ సినిమాలో ఆమె నటన చూసి తన్మయం చెందిన చిత్ర దర్శకులు సివి శ్రీధర్ ఆమెను తమిళ చిత్ర రంగ ప్రవేశం చేయించడానికి సంప్రదించారు. అలా సివి శ్రీధర్ దర్శకత్వం వహించిన “వెన్నిర ఆడై” (1965) చిత్రంతో జయలలిత తమిళ చిత్రసీమలో ప్రధాన పాత్ర పోషించారు. “వెన్నిర ఆడై” చిత్రీకరణ జరుగుతున్న స్టూడియోలోనే ఎం.జి.ఆర్ నటిస్తున్న “పనం పడైతవన్” చిత్రీకరణ కూడా జరుగుతుంది. ఆ చలనచిత్ర చిత్రీకరణ ఖాళీ సమయాలలో “వెన్నిర ఆడై” చిత్ర సెట్స్ లోకి వచ్చిన ఎం.జి.ఆర్ ను చూసి పెద్దాయన కదా అని పలకరించలేకపోయింది. కానీ దర్శకులు సివి శ్రీధర్ సూచనమేరకు జయలలిత వెళ్లి ఎంజీఆర్ కు “వణక్కం” అని తమిళంలో నమస్కారం చేశారు. ఈ విషయాన్ని కుముదం అనే పత్రికకు 1978 ప్రాంతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలియపరిచారు.
యం.జి.ఆర్ తో తొలిచిత్రం “ఆయిరథిల్ ఒరువన్” (1965)…
“చిన్నడ గొంబే” (1964) అనే కన్నడ చిత్రాన్ని ప్రత్యేక ప్రదర్శన వేయించుకుని చూసిన ఎంజిఆర్, అందులో జయలలిత నటన చూసి తన ప్రక్కన నటించిన బిఆర్ పంతులు దర్శకత్వంలో తెరకెక్కనున్న “ఆయిరథిల్ ఒరువన్” (1965) చిత్రానికి ఆమెను ఎంపికచేసుకున్నారు. ఆ చిత్రంలో చిత్రీకరణ మొట్టమొదటి సన్నివేశంలో జయలలిత గంభీరమైన సంభాషణలు చెప్పాల్సి వచ్చింది. విలన్ బారినుండి తనను తాను రక్షించుకోవడానికి ఎం.జీ.ఆర్ తో “నన్ను ఖరీదైన సేవకురాలుగా ఉపయోగించుకోవడానికి తీసుకు వచ్చారా ఏంటి”? అని అడిగే సంభాషణ అది. ఆ సన్నివేశం పూర్తవగానే ఎంజీఆర్ ఆమెను అభినందిస్తూ మళ్ళీ నువ్వు నాకు భానుమతి మేడంను గుర్తుచేశావు, నీ గొంతులో ఆ రాజసం, పొగరు గంభీరత జ్వలిస్తున్నాయి అన్నారు. అప్పటికికింకా జయలలిత వయస్సు 17 సంవత్సరాలు మాత్రమే. అంటే ఆమె ఎం.జీ.ఆర్ కన్నా 31 సంవత్సరాలు చిన్న వయస్కురాలు. చిన్నప్పటి నుండి కూడా ఆమె మహా సిగ్గరి. ఇతరులతో కలిసిపోవడం ఆమెకు ఇష్టం ఉండేది కాదు. తాను పుస్తకాలు మాత్రమే చదువుతూ ఉండేవారు. కేవలం తన తల్లి బలవంతం వలన సినిమాలకు వచ్చారు, సినిమా చిత్రీకరణలో కూడా అందరితో జాగ్రత్తగా ఉండేవారు.
కుర్చీలో కాళ్ళ మీద కాలేసుకుని పుస్తకాలు చదువుకుంటూ…
“ఆయిరథిల్ ఒరువన్” (1965) చిత్రీకరణలో ఎంజీఆర్ తో కలిసి నటించడం మొదలయ్యాక జయలలిత అందరికన్నా ముందుగానే చిత్రీకరణకు వచ్చి ఎంజీఆర్ ప్రక్కనే కుర్చీలో కాళ్ళ మీద కాలేసుకుని తన పుస్తకాలు చదువుకుంటూ ఉండేవారు. ఆమె ఎవ్వరినీ పట్టించుకునే వారు కాదు. ఎంజీఆర్ వద్ద కూడా అదే విధంగా ప్రవర్తించేసరికి ఆయన దర్శకులు బి.ఆర్ పంతులును పిలిచి పెద్ద వారికి గౌరవం ఎలా ఇవ్వాలో ఆ అమ్మాయికి కాస్త చెప్పండి అన్నారు ఎంజీఆర్. అప్పుడు బి.ఆర్.పంతులు ఇదే విషయాన్ని జయలలిత తల్లితో చెప్పారు. ఆమె తన కూతురు జయలలితకు సర్ధిచెప్పబోయారు. అప్పుడు “నా ఇష్టం వచ్చినట్టు నేను కూర్చుంటాను, ఇలాంటివి వుంటాయనే నేను సినిమాలో నటించను, నాకు ఇష్టం లేదు అంటే తీసుకొచ్చావు, నేను మళ్ళీ కళాశాలకు వెళ్ళిపోతాను” అన్నారు జయలలిత. మరునాడు చిత్రీకరణను రానని మొండికేశారు. అప్పుడు బి.ఆర్.పంతులు స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి బ్రతిమాలి తీసుకొచ్చారు. దాంతో ఆమె వచ్చీరాగానే ఎంజిఆర్ దగ్గరికి వెళ్లి నమస్కారం పెట్టేశారు. ఆ రోజు నుంచి జయలలిత తన పాత్ర లేకపోయినా ఎం.జి.ఆర్ సెట్ లో ఉంటే ఎలాగైనా సరే ఆయన దృష్టిలో పడి ఒక నమస్కారం పెట్టి వస్తుండేవారు. ఈ విషయాన్ని కూడా ఆమె స్వయంగా తన దినచర్యలో వ్రాసుకున్నారు.
ఇద్దరి కలయికలో చివరి చిత్రం “పత్తికాట్టు పొన్నయ్య” (1973)..
ఆయిరథిల్ ఒరువన్ (1965) తో మొదలైన ఎంజీఆర్, జయలలితల కలయిక ఆ తర్వాత ఏడు సంవత్సరాల పాటు సుమారు 28 సినిమాలు వరకు కొనసాగింది. వారిద్దరూ కలిసి నటించిన చివరి చిత్రం బి.యస్. రంగా దర్శకత్వం వహించిన “పత్తికాట్టు పొన్నయ్య” (1973). అయితే జయలలిత ఒక సందర్భంలో ఇలా చెప్పుకొచ్చారు “జీవితంలో నన్ను 1/3 వ వంతు అమ్మ చూసుకొంది, 1/3 వ వంతు యం.జి.ఆర్ చూసుకున్నారు, మిగిలిన మూడో వంతు మాత్రమే నేను జీవిస్తున్నాను” అని జిమ్మీ షెర్గిల్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సినిమాల్లోకి రా అని అమ్మ అంటే వెళ్లాను, ఆ తరువాత రాజకీయాల్లోకి రమ్మని ఎంజీఆర్ పిలిస్తే వెళ్లాను. ఒకసారి ఒక రంగంలోకి ప్రవేశించాక ఇంకా ప్రథమ స్థానంలో ఎలా కొనసాగాలి అన్నదే నా ధ్యేయం. ఎం.జి.ఆర్ నా గురువు, స్నేహితుడు, ఆయన ఆకర్షణ నుండి ఎవరు తప్పించుకోలేరు. సెట్స్ లో ఖాళీ సమయంలో ఎన్నో విషయాల గురించి చర్చించుకునే వాళ్ళం. ఎం.జి.ఆర్ కి వివిధ రంగాలలో ఉన్న విషయ పరిజ్ఞానం అమోఘమైనది. మా ఇద్దరి బాల్యానికి సరిపడే చాలా పోలికలు ఉన్నాయి. ఇద్దరం కూడా ఊహ తెలియకముందే తండ్రులను కోల్పోయాము, అప్పుడు నాటకాలకు వెళ్లి ఆయన తల్లికి దూరంగా బ్రతికారు, ఇప్పుడు మా అమ్మ సినిమాల్లోకి వెళ్లేసరికి నేను తల్లికి దూరంగా బ్రతికాను అని చెప్పుకుంటూ వచ్చారు జయలలిత.
యం.జీ.ఆర్ సహాయం చేయకపోతే ఏమైపోయేదాన్నో..
1971 వ సంవత్సరంలో తన తల్లి సంధ్య మరణించడంతో జయలలిత చుట్టూ ఒక్కసారిగా భరించలేనంత శూన్యం ఏర్పడింది. ఆమెకు అప్పుడు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. అప్పటివరకు సినిమా చిత్రీకరణ, పారితోషికం, ఒప్పందం (అగ్రిమెంట్), ఆదాయపు పన్ను అన్నీ వాళ్ళ అమ్మ చూసుకునేవారు. అవన్నీ ఈమెకు తెలియదు. ఇంట్లో ఎంతమంది నౌకరులు ఉన్నారు? వారి జీతం ఎంత? ఇత్యాది విషయాలు జయలలిత దృష్టికి వచ్చేది కాదు. అమ్మ సంధ్య ఉన్నంతకాలం వాళ్ళ అమ్మమ్మ కూడా వాళ్లతోనే ఉండేవారు. ఆమె బాగోగులు జయలలిత తల్లి చూసుకుంటూ ఉండేవారు. తల్లి మరణించాక అమ్మమ్మ బాధ్యతలు కూడా జయలలిత పైనే పడింది. ఆమెకున్న తీరికలేని సినిమా జీవితం వలన ఆమె పిన్ని, మరికొందరు బంధువులు ఆమెతో కలిసి జీవించేవారు. అమ్మ చనిపోయాక ఒకసారి జయలలితకు విపరీతమైన జ్వరం వచ్చింది. దాంతో కొన్ని రోజులు మంచం పైనుండి లేవలేదు.
దాదాపుగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ ఆమెను పట్టించుకోలేదు. దాంతో ఆమె మేనేజర్ గా ఉన్న వ్యక్తి ఎం.జీ.ఆర్ కు ఫోన్ చేయడంతో, ఎంజీఆర్ ఒక డాక్టరును వెంటపెట్టుకొని వెళ్లారు. ఆమెను అపస్మారక స్థితిలో చూసిన డాక్టర్ ఆమెను దవాఖానకు తీసుకెళ్లాలని సూచించారు. పెద్దవాళ్ళని పిలిస్తే దవాఖానకు తీసుకెళ్దామని మేనేజర్ కు చెప్పారు ఎంజిఆర్. ఎంతసేపటికి బంధువులు మేడ దిగి రావడం లేదు. ఎంజీఆర్ గబగబా పైకెళ్ళి చూసేసరికి బీరువా తాళాలు ఎవరి వద్ద ఉంచుకోవాలా అని బంధువులు వాదులాడుకుంటున్నారు. వాళ్ళ దగ్గర నుండి తాళాలు విసురుగా లాక్కొని జయలలితను దవాఖానకు తీసుకెళ్లారు ఎం.జీ.ఆర్. ఆమె కోలుకున్నదాకా మూడు రోజులు ఆమె పక్కనే ఉండి, ఆమె తేరుకున్నాక బీరువా తాళాలు ఆమెకిచ్చి వచ్చేసారు ఎంజీఆర్. ఈ సంఘటనను కూడా తన దినచర్యలో వ్రాసుకుంటూ ఆరోజు ఎం.జీ.ఆర్ సహాయం చేయకపోతే ఏమైపోయేదాన్నో అన్నారు జయలలిత.










