Telugu Cinema

ఆటగదరా శివ … తనికెళ్ళ భరణి

రచయిత, నటుడు మాత్రమేకాక తనికెళ్ళ భరణి తెలుగు విశేష భాషాభిమాని…

నాటక రంగంలో సంభాషణలు రాస్తున్న క్రమంలోనే సినిమాల్లోకి రావాలనుకున్నారాయన.

తొలుత రచయితగా సినిమాల్లోకి అడుగిడి… 

అనతి కాలంలోనే నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన ఎక్కువగా హాస్య ప్రధాన పాత్రలు పోషించారు. ఆపై విలన్ గా, సహాయ నటుడుగా ఎన్నో వందల చిత్రాల్లో నటించి, మెప్పించారు. వీరి పూర్వీకులు తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసిన కవులు, సాహితీకారులు..  ఆ ప్రభావం వల్లే ఎన్నో రచనలు చేశారు. ఆటగదరా శివ, నాలోన శివుడు కలడు.. నీలోన శివుడు కలడు.. అంటూ శివతత్వం గురించి విశేషంగా పాటల్ని కూర్చిన సాహితీవేత్త, కవి, రచయిత, స్క్రీన్ రైటర్, నటుడు అయిన తనికెళ్ళ భరణి… ఈ నెల 14న పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన సినీ, జీవిత విశేషాలను ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం:  

నేపథ్యం

1956 జూలై 14న సికిందరాబాద్లో జన్మించారు తనికెళ్ళ భరణి. తల్లిదండ్రులు శ్రీ తనికెళ్ళ రామలింగేశ్వరరావు, లక్ష్మీ నరసమ్మలు. వీరి తండ్రి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం దగ్గర ఎండగండి ప్రాంతం. అయితే పని నిమిత్తం 1938లో హైదరాబాద్ కి వచ్చి ఇక్కడే  స్థిరపడ్డారు. దైవభక్తి, దేశభక్తితో పాటు సేవాగుణం ఎక్కువ.  మహాభారతం, భాగతవతాలను ఔపోసన పట్టారు. యోగాసనాల్లో సైతం నిపుణులు. విశిష్ట సాహితీవేత్త. తనికెళ్ల భరణికి ముగ్గురు అన్నయ్యలు, ముగ్గురు తమ్ముళ్ళున్నారు. సికిందరాబాద్ రైల్వే పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేయగా, జూనియర్ కాలేజీల్లో బీ.కామ్. కామర్స్ చదివారు. చిన్ననాటి నుంచి నాటకాల మీద విపరీతమైన ఆసక్తి ఉండేది. 1970లలో నాటకాలు ప్రదర్శితమవుతున్న సమయంలో ప్రముఖ నటుడు రాళ్ళపల్లిగారితో పరిచయం ఏర్పడింది. ఆయన ప్రోత్సాహంతోనే చిన్న చిన్న సంభాషణలు, సన్నివేశాలు రాయడం మొదలు పెట్టారు భరణిగారు. దీంతోపాటు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఏకంగా నాటకరంగంలో డిప్లొమా సాధించారు. నాటకాలు, కవితలు.. వంటి ప్రక్రియల్లో స్వీయ రచన చేసి, పుస్తకాలుగా ముద్రించారు. ఆకాశవాణిలో నాటికలు, పత్రికలకు గాత్రాన్ని అందించారు. దూరదర్శన్ సీరియళ్ళకు సైతం సంభాషణలు అందించారు. 

రచయితగా….

ఇలా రాస్తున్న క్రమంలోనే రాళ్ళపల్లిగారి ద్వారా దర్శకులు వంశీగారికి పరిచయమయ్యారు. అప్పుడు వంశీగారు ‘కామెడీ రాస్తావా’ అని అడిగారట. ఇందుకు భరణిగారు వెంటనే రాస్తానన్నారు. అప్పుడు భరణిగారికి ఒక సీన్ సిచ్యువేషన్ చెప్పి, వారం సమయం ఇచ్చి, ఏడు సీన్ లు రాసుకొని రమ్మని అన్నారట. కానీ, భరణిగారు సాయంత్రానికల్లా ఏడు సీన్లు రాసేశారు. వంశీగారికి ఒక్కొక్క సీన్ చెప్తుంటే పగలబడి నవ్వారట. దీంతో ‘మీరే నా తర్వాత సినిమా రచయిత’ అని వంశీగారు ఆయన్ను ప్రశంసించి, ప్రోత్సహించారు. అప్పటికే ఆయన చేస్తున్న ప్రేమించు పెళ్లాడు షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాలో ఏదైనా చేయించాలనే ఉద్దేశంతో, పట్టుబట్టి మరీ టైటిల్స్ కి ముందు ఒక కామెడీ ట్రాక్ రాయించుకున్నారట. దీంతో పూర్తిస్థాయి సినిమాల్లో లీనమయ్యారు భరణిగారు. రచయితగానే కాక నటుడిగానూ అరంగేట్రం చేశారు. అదే కంచు కవచం. ఈ సినిమాకు మాటలు అందించారు. తర్వాత వంశీగారితో వరసగా సినిమాలు చేస్తూ వచ్చారు. అలా వంశీగారికి లేడీస్ టైలర్ కథ వినిపించారట. ఈ సినిమాతోనే వంశీ- తనికెళ్ళ భరణిగారి కాంబినేషన్ సెన్సేషన్ అయిపోయింది. కనకమాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్, చెట్టుకింద ప్లీడర్, లింగబాబు లవ్ సోరీ వంటి సినిమాలు వీరి కాంబోలో వచ్చినవే.

నటుడిగా

కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్… ఈ సినిమాలో భరణిగారికి దొరబాబు అనే పాత్రలో నటుడిగా చేసే అవకాశం ఇచ్చారు వంశీగారు. అత్యంత పేరు తెచ్చిన సినిమా ‘శివ’. ఈ సినిమా దర్శకులు ఆర్జీవీ(రాంగోపాల్ వర్మ). తొలుత ఈ సినిమాకు డైలాగులు అందించే బాధ్యతను ఆర్జీవీ భరణిగారి మీద పెట్టారు. అప్పటికి వంశీగారితో చాలా సినిమాలు చేసిన ప్రభావం ఆయన మీద బాగా ఉండటంతో, ఆ సంబాషణలన్నీ కూడా కామెడీతో నింపేశారు. ఆ స్క్రిప్ట్ చదివిన ఆర్జీవీ గారు షాక్ అయ్యి, ‘ఇదేంటి కామెడీ సినిమా చేశారు. నాది సీరియస్ సినిమా, ఒక్క కామెడీ డైలాగ్ కూడా ఉండటానికి వీల్లేదు’ అన్నారట. దీంతో స్క్రిప్ట్ మార్చి రాసి ఇచ్చారట. ఆ సినిమా ఫలితం అందరికి తెలిసిందే. 

ఈ చిత్రం తర్వాత చెవిలో పువ్వు, జగదేకవీరుడు అతిలోక సుందరి, అప్పుల అప్పారావు వంటి సినిమాలు చేయగా, అవి సూపర్ హిట్ గా నిలిచాయి. నటుడిగా తెలుగు సినీ పరిశ్రమకు సుపరిచితులయ్యారు. ఒక పక్క సినిమాల్లో నటన చేస్తూనే, మరోపక్క కథా సహకారం అందించడంలో ముఖ్యులుగా ఉన్నారు. అలా రచనా సహకారం అందించిన చిత్రాలు.. మనీ మనీ, యమలీల, ఘటోత్కచుడులు ప్రధానమైనవి. రైటర్ గా మంచి గుర్తింపు దక్కించుకున్నారు.

నటుడిగా కంటే కూడా విలన్ పాత్రలు చేయడంలో నూటికి నూరుపాళ్లు న్యాయం చేశారనే చెప్పుకోవాలి. అందులో ప్రధానమైనవి.. అమ్మో ఒకటో తారీఖు, ఆమె.

యమలీలతో అవకాశాలు తలుపు తట్టాయి….  

1994లో వచ్చిన యమలీల.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఎస్.వి. కృష్ణారెడ్డి దర్శకులు… ఇందులో భరణిగారిది తోట రాముడు పాత్ర. ఈ పాత్ర వల్ల ఆయనకు జనాలలో మంచి స్పందనే వచ్చింది. ఈ సినిమా తర్వాత దాదాపుగా 27 సినిమావకాశాలు ఆయన ముందుకు వచ్చాయి.

‘మైనే తేరే ప్యార్ మే పాగల్’ అనే హిందీ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు తనికెళ్ళ భరణి. చిత్రం, నువ్వు నేను, మన్మధుడు, ఒకరికొకరు, సాంబ, మల్లేశ్వరి…  మొదలైన చిత్రాల్లో మంచి పేరు వచ్చింది. త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో వచ్చిన ‘అతడు’ సినిమాలోని నాయుడు పాత్ర ఆయనని బాగా ఫేమస్ చేసింది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా. ఆ తర్వాత చేసిన గోదావరి, జల్సా, బృందావనం, జులాయి వంటి సినిమాల్లో తండ్రి పాత్రలో నటించి మెప్పించారు.

ఆయనే స్వీయ దర్శకత్వం వహించిన విన్నూత్న సినిమా మిథునం. ఆరుపదుల వయసులో కూడా నూతన దంపతుల్లా కాలం గడిపే జంట కథే ఇది. శ్రీరమణగారు కథ అందించగా, ఎస్పీ. బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో వీరి నటన మెప్పిస్తుంది. జీవన వేదాతం ఇమిడిఉంటుంది.

ఆ తర్వాత.. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, టెంపర్ వరకు… అలనాటి గొప్ప దర్శకుల నుంచి ఇప్పటి కొత్త దర్శకుల వరకు భరణిగారు అందరి సినిమాల్లో ఆయనదైన శైలిలో నటించారు. ఇప్పటిదాకా 750కి పైగా సినిమాలు చేశారు. అలాగే 50కి పైగా చిత్రాలకి రచయితగా పని చేశారు.

రచనలు

సాహితీ ప్రపంచంలోనూ అవిరళ కృషి జరుపుతున్న భరణిని ‘పుంభావ సరస్వతి’గా అభివర్ణిస్తారు. పరికిణీ, నక్షత్ర దర్శనం, మాత్రలు తదితర రచనలు చేశారు. ‘ఎందరో మహానుభావులు’ పేరిట అనేక వ్యాసాలు రాసి, పుస్తకంగా తీసుకోచ్చారు. అందరికి అర్థమయ్యేలా శివతత్త్వాలను రచించి స్వయంగా గానం చేస్తూ పలు సి.డి ఆల్బమ్ లను వెలువరించారు.

‘ఆట కదరా శివా’, ‘సెబ్బాష్ రా శివా’, ‘శివ చిలుకలు’ వంటి పుస్తకాలు రచించారు. దేశ విదేశాల్లో జరిగిన పలు సాహితీ కార్యక్రమాల్లో స్వీయ కవితా పఠనం చేశారాయన. పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్నారు.

తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, కుటుంబ విలువలు, మానవీయ విలువలకు భరణిగారు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. 

పుస్తక పఠనం, పచ్చటి ప్రకృతి, ఆవకాయ పచ్చడి ఆయనకి చాలా ఇష్టం… రైతుల కష్టాల పట్ల ఆయనకున్న బాధని ‘ది లాస్ట్ ఫార్మర్’ చిత్రం తెలియజెప్తుంది.

1988లో దుర్గభవాని గారిని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకి తేజ, సౌందర్య, లహరి ముగ్గురు సంతానం.

గుర్తింపు

సముద్రం సినిమాలో నటనకి ఉత్తమ విలన్ గా ‘నంది అవార్డు వచ్చింది.

‘నువ్వు-నేను’ చిత్రంలో తండ్రిగా ఆయన చేసిన నటనకిగానూ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మరొక ‘నంది’ లభించింది.

స్వీయ దర్శకత్వంలో వచ్చిన మిథునం సినిమాకి ఉత్తమ మాటల రచయితగా నంది అవార్డు వరించింది.

ఇదే సినిమాకి బెస్ట్ డైరెక్టర్ గా స్పెషల్ జ్యూరీ కేటగిరిలో సినిమా అవార్డును అందుకున్నారు. వీటితో పాటు ఆయన రచించిన రచనలు, నాటకాలకు కూడా ఎన్నో అవార్డులు అందుకున్నారు. 

ఆటగదరా శివ పాట..

ఆటగదరా శివ… ఆటగద కేశవ…

ఆటగదరా శివ ఆటగద కేశవ

ఆటగదరా నీకు అమ్మతోడు

ఆటగదరా శివ… ఆటగద కేశవ…

ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆటగద నీకు…

ఆటగద సొంతాలు ఆటగద పంతాలు

ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ఆటగద అంతాలు ఆట నీకు..

ఆటగదరా శివ… ఆటగద కేశవ…

ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మతోడు

ఆటగదరా శివ ఆటగద కేశవ

ఆటగదరా నలుపు ఆటగదరా తెలుపు నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు

ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను

ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను మిధ్యలో ఉంచి ఆడేవు నన్ను

ఆటగదరా శివ… ఆటగద కేశవ…

ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగద నీకు అమ్మతోడు

ఆటగదరా శివ… ఆటగద కేశవ…

ఆటగదరా శివ… ఆటగద కేశవ…

Show More
Back to top button