Telugu Special Stories

వైవిధ్యభరిత చిత్రాల సృష్టికర్త.. వై.వి.రావు..

యరగుడిపాటి వరదరావు (వై.వి.రావు) (మే 30, 1903 – ఫిబ్రవరి 14, 1973)

యరగుడిపాటి వరదరావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. వై.వి.రావుగా పొడి అక్షరాలతో వినుతికెక్కిన యరగుడిపాటి వరదరావు గారిది తెలుగు సినిమా రంగంలోనే కాదు, భారతీయ సినిమా రంగంలోనే అద్వితీయ స్థానం అని చెప్పవచ్చు. ఒకనాటి అందాల తార రుక్మిణి కి భర్తగా, పాత తరం వారిలో కొంతమందికైనా గుర్తుండి ఉంటారేమో వై.వి.రావు గారూ. అలాగే సీనియర్ నటి లక్ష్మీ తండ్రి అంటే ఇప్పటివారికి తెలిసే అవకాశం ఉంది. అయితే వై.వి.రావు గారూ ఫలానా అని చాటుకోవాల్సిన పరిస్థితి మాత్రం వారికి రాలేదనే చెప్పాలి.

చిత్ర పరిశ్రమకే ఆయన గొప్పతనాన్ని పదిమందికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమ శైశవదశలో ఉన్న తరుణంలో తన సినిమాల ద్వారా ఎదుగుదలకు కృషి చేసిన వై.వి.రావును ఏనాడో విస్మరించింది చిత్ర పరిశ్రమ. భారతీయ సినిమాను అధ్యయనం చేయాలనుకునే ఏ తరం వారికైనా వై.వి.రావు గారి పేరును ప్రస్తావించకపోతే, వారి అధ్యయనం సంపూర్ణంగా లేనట్టేనని చెప్పవచ్చు. దర్శకుడిగా, నిర్మాతగా ఏడు భాషలలో తన ప్రతిభను చాటుకున్న తెలుగుతేజం వై.వి. రావు గారూ.

జననం…

వై.వి.రావు గారూ 30 మే 1903 నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని నెల్లూరులో పదహారణాల తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆర్థికంగా డబ్బుకు ఏ లోటు లేని సాంప్రదాయ కుటుంబానికి చెందిన రావు గారి ఇంట్లో పలువురు న్యాయవాద వృత్తి చేపట్టి న్యాయవాదులుగా రాణించారు. కుటుంబంలో అందరూ న్యాయవాద వృత్తిలోనే రాణిస్తున్నారని రావు గారి తల్లిదండ్రులు, రావు గారిని డాక్టరును చేయాలని ఆశపడ్డారు. రావు గారి ధ్యాసంతా నాటకాలవైపు ఉన్నా కూడా తల్లిదండ్రుల మాటను కాదనలేక నెల్లూరులోనే ఉన్నత విద్యను అభ్యసించి, అనంతరం వైద్య విద్య చదవడం కోసం మద్రాసు యూనివర్సిటీలో చేరారు వై.వి.రావు గారూ. నాటకాలు అంటే మిక్కిలి మక్కువ కలిగిన వై.వి.రావు గారూ వైద్య విద్యను అభ్యసిస్తున్న తరుణంలోనే మూకీల చిత్ర నిర్మాణం ప్రారంభం కావడంతో రావు గారి మనసు సినిమాల వైపు మళ్ళింది.

సినీ ప్రస్థానం..

దాంతో 1925లో చదువుకు స్వస్తి పలికి చిత్ర రంగ ప్రవేశం చేశారు. బొంబాయిలోని “మాణిక్ లాల్ జోషి ఫిలిం కంపెనీ”లో చేరి కొన్ని మూకీ చిత్రాలలో నటించారు. ఆ పిమ్మట ఆర్దేసిర్ ఇరానికి చెందిన “ఇంపీరియల్ ఫిలిం కంపెనీ”లో చేరారు వై.వి. రావు గారూ. అయితే అక్కడి పరిస్థితులు, వాతావరణం ఎందుకనో రావు గారికి నచ్చలేదు. దాంతో మద్రాసుకు తన మకాం మార్చి “జనరల్ పిక్చర్స్ కార్పొరేషన్” లో చేరారు. అయితే ఈసారి కళాకారునిగా కాకుండా ఆర్ట్ డిపార్ట్ మెంట్ లో చేరారు. ఆ రోజులలో ప్రతీ ఒక్కరూ అన్ని పనులు చేయవలసి ఉండటంతో నటుడుగా వేషాలు వేస్తూనే కళా దర్శకత్వ శాఖలో కూడా రాణించారు. కొంతకాలం పనిచేసిన పిదప ఆ పని కూడా రావు గారికి విసుగనిపించింది. ఈసారి రావు గారి దృష్టి కొల్లాపూర్ పై పడడంతో కొల్లాపూర్ వెళ్లి అక్కడ కొంతకాలం గడిపారు.

అదే సమయంలో మన తెలుగువారైన రఘుపతి వెంకయ్య గారూ, మరియు వారి కుమారుడు సూర్యప్రకాష్ గారూ దక్షిణ భారతదేశానికి చెందిన మద్రాసులో స్టూడియో నిర్మించి చలనచిత్రాలు రూపొందిస్తున్నారని తెలిసి అక్కడికి చేరారు రావు గారూ. అప్పటికే ఇంగ్లాండ్ వెళ్లి రఘుపతి సూర్య ప్రకాష్ గారూ అక్కడ చలనచిత్ర రూపకల్పన గురించి అభ్యసించి వచ్చారు. రావు గారి ఉత్సాహాన్ని, హుషారుని చూసి ప్రకాష్ గారూ ముచ్చట పడ్డారు. తాను రూపొందించే చిత్రాలకు దర్శకత్వ శాఖలో సహాయకుడిగా వై.వి.రావు గారికి అవకాశం కల్పించారు ప్రకాష్ గారూ. అలాగే తాను రూపొందించిన కొన్ని చిత్రాలకు రావు గారికి తగ్గ పాత్రలను కూడా ఇచ్చారు రఘుపతి ప్రకాష్ గారూ.

ప్రకాష్ గారి వద్ధనే వై.వి.రావు గారూ స్క్రిప్ట్, కూర్పు (ఎడిటింగ్),  దర్శకత్వంకు సంబంధించిన రకరకాల మెలకువలు నేర్చుకున్నారు. రఘుపతి ప్రకాష్ గారూ రూపొందించిన “గజేంద్రమోక్షం”, “రోజ్ అఫ్ రాజస్థాన్” లాంటి మూకీ చిత్రాలలో వై.వి.రావు గారూ ప్రధాన పాత్రలు పోషించారు.  అలాగే ప్రకాష్ గారూ ఛాయాగ్రహకులుగా, ఏ.నారాయణన్ గారూ రూపొందించిన “గరుడ గర్వభంగం” చిత్రంలో రావు గారూ కృష్ణుడి పాత్రను ధరించారు. కాలక్రమేణా టాకీలు వచ్చిన తర్వాత కాలంలో వై.వి.రావు గారూ స్వీయ దర్శకత్వంలో “సత్యభామ” సినిమాని రూపొందించి అందులో మరొకసారి “కృష్ణుడి”గా నటించారు వై.వి.రావు గారూ.

1931వ సంవత్సరంలో మూకీ చిత్రాలను అధిగమిస్తూ టాకీలు అడుగుపెడుతున్న సమయంలో వై.వి.రావు గారి దృష్టి కూడా టాకీల మీదకు మళ్ళింది. అయితే అప్పటికే  హెచ్.ఎం.రెడ్డి గారు తెలుగు, తమిళ భాషల్లో తొలి టాకీలైన “భక్త ప్రహ్లాద”, “కాళిదాసు” లాంటి చిత్రాలను రూపొందించి ఉండడంతో వై.వి.రావు గారూ కన్నడ భాషలో కూడా టాకీని రూపొందించాలి అనుకున్నారు. ఇలాంటి దృక్పథం కలిగి ఉన్న ఆనాటి కన్నడ రంగస్థల ప్రముఖులు ఆర్.నాగేంద్రరావు  గారూ వై.వి.రావు గారికి తోడయ్యారు. కానీ చిత్ర నిర్మాణ రంగంలో పెట్టుబడి పెట్టడానికి ఎవ్వరూ ఆసక్తి చూపకపోవడంతో మరో రెండేళ్ల తర్వాత కానీ వీరిద్దరి ప్రయత్నాలు ఓ కొలిక్కి రాలేదు.

దర్శకునిగా తొలి అడుగులు..

1933 వ సంవత్సరంలో రాజస్థాన్ వాసులు “చమన్ లాల్ దూంగాజీ” గారూ సినిమాలు నిర్మించడానికి తన మకాంను రాజస్థాన్ నుండి బెంగళూరుకు మార్చారు. బెంగళూరులో “చమన్ లాల్” గారూ “సౌత్ ఇండియా మూవీ టోన్” అనే సంస్థను స్థాపించారు. ఈ రావులిద్దరూ (వై.వి.రావు మరియు ఆర్. నాగేంద్రరావు) “చమన్ లాల్ దుంగాజీ” గారిని కలిసి సినిమాలు నిర్మిచడం పట్ల తమ ఆసక్తిని తెలియపరిచారు. ఎంతో తర్జనభర్జన పడి చివరికి దర్శకుడుగా వై.వి.రావు గారికి అవకాశం ఇవ్వడానికి “చమన్ లాల్” గారూ అంగీకరించారు. దాంతో తొలిసారి అవకాశం అందిపుచ్చుకున్న వై.వి.రావు మరియు నాగేంద్రరావు గార్లు రామాయణంలోని “ఇంద్రజిత్తు” భార్య “సులోచన” కథను తెరకెక్కించాలని నిర్ణయానికి వచ్చారు.

దర్శకునిగా తొలి చిత్రం సతీ సులోచన..

దాంతో “సతీ సులోచన” చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ మొదలయ్యింది. కన్నడ రంగస్థలం ప్రముఖులు “బెల్లవే నరహరి శాస్త్రి” గారూ సతీ సులోచన చిత్రానికి మాటలు, పాటలు  వ్రాశారు. ఇందులో ఆర్.నాగేంద్రరావు గారూ రావణుడిగా, ఎం.వి.సుబ్బయ్య నాయుడు గారూ ఇంద్రజిత్ గా, రావణాసురుడి భార్య మండోదరిగా లక్ష్మీబాయిగారూ, సులోచనగా ప్రముఖ గాయనీమణులు ఎం.ఎస్.త్రిపురాంబ గారూ నటించారు. వై.వి.రావు గారూ లక్ష్మణుడి పాత్రను ధరించారు. ఆ రోజులలో కొల్హాపూర్ లో చిత్ర నిర్మాణ వ్యయం తక్కువ అవుతుండడంతో అక్కడ ఛత్రపతి సినీటోన్ లో 1933 డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభించి ఎనిమిది వారాలలో పూర్తి చేశారు.

నేచురల్ లైటింగ్ ఉపయోగించుకొని ఈ చిత్రాన్ని రూపొందించిన వై.వి.రావు గారూ, ఇందులో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించడానికి మాత్రం నాలుగు కెమెరాలు ఉపయోగించడం గురించి చిత్ర పరిశ్రమలో చాలా రోజులపాటు చర్చించుకున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణ జరిగేటప్పుడు పలువురు సాంకేతిక నిపుణులు, దర్శకులు వచ్చి చిత్రీకరణను ఆసక్తిగా తిలకించేవారు. వై.వి.రావు గారే ఎడిటింగ్ చేసుకొని, యుద్ధ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్ర నిర్మాణానికి సుమారు 40 వేల రూపాయల ఖర్చు అయ్యింది. 1934 మార్చిలో బెంగుళూరు సిటీ మార్కెట్ సమీపంలో ఉన్న పారమౌంట్ సినిమా హాలులో ఈ తొలి కన్నడ టాకీ విడుదలైనప్పుడు, ఈ చిత్రాన్ని తిలకించేందుకు జనం తండోపతండాలుగా కదిలి వచ్చారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో దర్శకుడిగా వై.వి.రావు గారూ అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.

అద్భుత విజయాన్నిచిన చింతామణి..

“కృష్ణ కర్ణామృతం” రచించిన సంస్కృత కవివర్యులు బిల్వమంగళుడి జీవితం ఆధారంగా అప్పటికే మూకీ చిత్రం వచ్చింది. దానిని టాకీగా రూపొందించాలని మధురై కి చెందిన “రాయల్ టాకీస్” వారు వై.వి.రావు గారిని సంప్రదించారు. దాంతో వై.వి.రావు గారూ ఈ చిత్రాన్ని హిందీ, తమిళ భాషల్లో రూపొందించారు. తమిళంలో “చింతామణి”గా, హిందీలో “బిల్వ మంగల్” గా ఈ సినిమా విడుదలైంది. ఈ చిత్రంలో ప్రఖ్యాత తమిళ నటులు ఎం.కే.త్యాగరాజ భాగవతార్ గారూ నాయక పాత్రను పోషించారు. ఈ చిత్ర విజయం భాగవతార్ గారి దశను మార్చివేసింది. 1937లో విడుదలైన ఈ చిత్రాలు వై.వి.రావు పేరును అటు ఉత్తరాదిన, ఇటు దక్షిణాదిన మారుమ్రోగేలా చేశాయి.

“చింతామణి”గా ప్రముఖ కన్నడ గాయని, నటి కె.అశ్వథ్థమ్మ గారూ నటించగా, బిల్వమంగళుడి స్నేహితుడు భవాని శంకర్ పాత్రను వై.వి.రావు గారే స్వయంగా పోషించారు. కానీ వెండితెర మీద మాత్రం తన పేరును మనోహర్ గా ప్రకటించుకున్నారాయన. ఈ చిత్రాన్ని కలకత్తాలో రూపొందించారు. విడుదల తర్వాత ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను సృష్టించింది కొన్ని కేంద్రాల్లో దాదాపు 72 వారాలు ప్రదర్శింపబడింది. ఈ చిత్రం ఆర్జించిన లాభాలతో, చిత్ర నిర్మాతలు మధురై లో “చింతామణి” థియేటర్ ని నిర్మించడం గమనార్హం. అంతేకాకుండా “చింతామణి పిక్చర్స్ బ్యానర్” పై సొంతంగా సినిమాలు తీయాలని ఆలోచన వైవి రావుకు రావడానికి కూడా ఈ చిత్ర విజయం ఎంతో దోహదపడింది.

ప్రస్థానంలో ఎత్తుపల్లాలు..

చింతామణి పిక్చర్స్ లిమిటెడ్ పతాకం పై వై.వి.రావు గారూ స్వయంగా నిర్మించిన తొలి చిత్రం “భక్త మీరా”. ఇందులో మీరా పాత్రను ఆనాటి అందాల తార వసుంధర (నటి, నర్తకి వైజయంతి మాల తల్లి) తో నటింపచేయాలని అనుకున్నారు. కానీ అప్పటికే వివాహం చేసుకున్న వసుంధర గారూ, ఇకపై చిత్రాల్లో నటించకూడదని వై.వి.రావు గారూ ఇచ్చిన అవకాశాన్ని తిరస్కరించారు. దాంతో ఆ పాత్రను వేరే నటితో అభినయింపజేశారు. ఆ నటికి వసుంధర దేవి అనే పేరు పెట్టి మరీ నటింపజేయడం విశేషం. అయితే “భక్తమీరా” విడుదలయ్యాక ఘోర పరాజయాన్ని చవిచూసింది. దాంతో తన పంథాను మార్చుకుని సాంఘిక చిత్ర నిర్మాణం చేపట్టారు. 1938 వ సంవత్సరంలో ఒక వైపు స్వరాజ్య పోరాటం, మరోవైపు మద్యపానం నిషేధ ఉద్యమం ముమ్మరంగా సాగుతుండేవి. ఆ నేపథ్యానికి “స్వర్ణలత” చిత్రాన్ని రూపొందించారు.

ఇందులో తాగుడుకు బానిసలు అయిన వారిని “ఆనంద నిలయం” అనే సంస్థలో చేర్చి వారిని బాగుచేసేలా మలచిన అద్భుతమైన కథ జనాలను విపరీతంగా ఆకర్షించింది. మేధావులను సైతం ఆలోచింపజేసింది. ఆ చిత్రం తర్వాత “భామ పరిణయం”,  “సావిత్రి” వై.వి.రావు గారూ రూపొందించిన ఇతర తమిళ టాకీలు. వీటిల్లో “రాయల్ టాకీస్ సంస్థ” 1942 వ సంవత్సరంలో నిర్మించిన “సావిత్రి” చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం మధురైలో సుమారు 20 వారాలకు పైగా ప్రదర్శింపబడిన ఈ చిత్రంలో వై.వి.రావు గారూ సత్యవంతుడి గానూ, మరాఠీ నటి “శాంత ఆప్టే” గారూ సావిత్రిగా, మధుర గాయని ఎం.యస్.సుబ్బలక్ష్మి గారూ నారదుడిగా నటించారు. దర్శకుడిగా వై.వి.రావు గారిని మరో మెట్టు ఎక్కించిన సినిమా ఇది.

“మళ్లీ పెళ్లి” చిత్రంతో తెలుగు తెరంగ్రేటం..

ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటుంటారు. కానీ వై.వి. రావు గారూ రచ్చ గెలిచి ఇంటికి వచ్చారు. 1938 వ సంవత్సరంలో వై.వి. రావు గారి దృష్టి తెలుగు చిత్ర రంగం మీదకు మళ్ళింది. జగదీష్ పిక్చర్స్ పేరిట చిత్ర నిర్మాణ సంస్థలు నెలకొల్పిన వై.వి.రావుగారూ తొలిసారిగా “మళ్లీ పెళ్లి” అనే పేరుతో చిత్రాన్ని నిర్మించారు. ఆ రోజుల్లో వితంతువుల పరిస్థితి అతి ధీనంగా ఉండేది. బాల్య వివాహాల దృష్ట్యా ముక్కు పచ్చలారకుండానే ముత్తైదువుతనాన్ని పోగొట్టుకున్న అభాగినుల గాథను తెరకెక్కించాలని “మళ్లీ పెళ్లి” చిత్రాన్ని రూపొందించారు వై.వి.రావు గారూ. అదే సమయంలో దర్శక నిర్మాత బి.ఎన్.రెడ్డి గారూ కూడా ఇదే ఇతివృత్తంతో “సుమంగళి” అనే చిత్రం తెరకెక్కించారు. ఆ సినిమా కంటే తక్కువ సమయంలో, తక్కువ డబ్బుతో “మళ్లీ పెళ్లి” (చిత్ర నిర్మాణ వ్యయం 50 వేల  రూపాయలు) సినిమా తీసి విడుదల చేశారు.

వై.వి.రావు గారూ. ఆనాటి అందాల తార కాంచనమాల గారూ ఇందులో నాయకిగా, వై.వి.రావు గారూ నాయకుడిగా నటించారు. ఈ చిత్రంలోని పాటలు, మాటలు అద్భుతంగా వచ్చాయి. ఈ సినిమాలో వై.వి.రావు గారికి ఓగిరాల గారూ నేపథ్య గానం చేశారు. ఈ చిత్రంతోనే పురుష పాత్రలకు ప్లే బ్యాక్ పద్ధతి ప్రారంభమైందని చెప్పాలి. ప్రజలను మభ్యపెడుతూ మోసం చేసే దొంగ స్వాముల మనస్తత్వాన్ని ఆ రోజులలోనే ఈ చిత్రంలో ప్రవేశపెట్టి ప్రేక్షకులను హెచ్చరించారు వై.వి.రావు గారూ. బ్రాహ్మణుడై ఉండి ఇలాంటి చిత్రం తీసిన రావు గారూ బ్రాహ్మణ్యాన్ని మంట కలిపాడని ఆ రోజులలో బ్రాహ్మణులంతా మండిపడ్డారు. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం “మళ్లీ పెళ్లి” చిత్రాన్ని ఎంతో ఆదరించారు.

“విశ్వ మోహిని”తో భిన్న ప్రయోగం..

సినిమా రంగంలో ఉంటూ కూడా అక్కడ జరిగే సాధక బాధకాలను తెరకెక్కించడానికి ఇప్పటికీ ఎవరూ అంతగా సాహసించరు. కానీ వై.వి.రావు గారూ మాత్రం దాదాపు 70 ఏళ్ల క్రిందటే సినిమా వాతావరణంలో రూపొందించిన “విశ్వమోహిని” చిత్రం ఒక సంచలనమే సృష్టించింది. సినిమా రంగంలో తారల స్థితిగతులు, నిర్మాత, దర్శకుల అలవాట్లు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్లు తెరపై ఆవిష్కరించి కలకలం రేపారు వై.వి.రావు గారూ. 1940లో విడుదలైన ఈ చిత్రంలో వై.వి.రావు గారూ కథనాయకుడిగా, బళ్లారి లలిత కథనాయకిగా నటించారు. ఈ రెండు చిత్రాల తర్వాత ఆయన తెలుగులో రూపొందించిన “సత్యభామ” చిత్రంలో వై.వి.రావు గారూ కృష్ణుని పాత్రను ధరించారు. పుష్పవల్లి (నటి రేఖ తల్లి) ఈ చిత్రంలో సత్యభామగా నటించారు.

పౌరాణిక చిత్రాలకు పద్యాలే ప్రాణం. ఆనాటి పౌరాణిక సినిమాల్లో నాటకాల రీతిలోనే పదుల సంఖ్యలో పద్యాలు ఉండేవి. అయితే అతి తక్కువ పద్యాలను ఉపయోగించి రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పును పొందలేకపోయింది. దీని తర్వాత నాటి ఫెడరల్ వ్యవస్థను విమర్శిస్తూ తహసిల్దార్ చిత్రాన్ని రూపొందించారు వై.వి.రావు గారూ. కమలా కోట్నిస్ ప్రధాన పాత్రను పోషించగా,  బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భానుమతి గారూ ఓ ముఖ్య భూమిక పోషించారు. సి.హెచ్.నారాయణరావు గారూ కథనాయకులు. తొలి నేపథ్య గాయకుడిగా ప్రసిద్ధి పొందిన యం.యస్.రామారావు తో హీరో నారాయణరావు గారికి పాడించి తదనంతర కాలంలో ఆయనకు పూర్తిస్థాయి గాయకులుగా మారడానికి ఈ సినిమాతోనే ఆస్కారం కలిగించారు వై.వి.రావు గారూ.

వివాహం..

తహసీల్దార్ చిత్రం తరువాత వై.వి.రావు గారూ 1946 వ సంవత్సరంలో “లవంగి”  చిత్రాన్ని తమిళంలో రూపొందించారు. తెలుగు సాహిత్యంలో ఎంతో ఉన్నతమైన స్థానాన్ని పొందిన జగన్నాధ పండిత రాయల జీవితం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అలనాటి ప్రఖ్యాత నటి నుంగంబాకం జానకి కూతురు రుక్మిణి నాయకిగా నటించింది. ఈ చిత్రంలో వై.వి.రావు గారూ కథానాయకుడి పాత్రను పోషించారు. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే వై.వి.రావు గారూ మరియు రుక్మిణి లు ఒకరినొకరు ఇష్టపడడం, ప్రేమలో పడడం చివరికి వివాహం చేసుకోవడం జరిగాయి.

లవంగి విజయం సాధించింది. దీనిని హిందీలో జగన్నాథ్ పండిట్ పేరుతో పునర్నిర్మించారు. అయితే అది అక్కడ అంతగా విజయం సాధించలేకపోయింది. తర్వాత తమిళంలో “భద్రాచలం రామదాసు” చిత్రాన్ని రూపొందించారు. ఇందులో ప్రముఖ కర్ణాటక సంగీత విధ్వంసులు కలక్కాడ రామనారాయణ అయ్యర్ రామదాసు పాత్రను పోషించగా, వై.వి.రావు గారూ నవాబు గానూ, ఆయన భార్య రుక్మిణి బేగం గానూ నటించారు. దీనిని హిందీలోనూ రూపొందించారు. కానీ ఏ ఒక్క భాషలోనూ ఈ చిత్రం విజయవంతం కాలేదు.

రావు గారి ప్రత్యేకత..

చిత్ర నిర్మాణ రంగంలోని అన్ని శాఖలలోనూ వై.వి.రావు గారికి అనుభవం ఉండడంతో కథను ఎన్నుకున్న తర్వాత దానిని సినిమాగా మలచడానికి రావు గారికి ఎక్కువ సమయం పట్టేది కాదు. తక్కువ బడ్జెట్లో చిత్రాలను నిర్మించి ఎక్కువ లాభాలు గడించే ధ్యేయంతో రావు గారూ పని చేసేవారు. తాను నిర్మించిన చాలా చిత్రాలలో రావు గారే కథనాయకుడిగా నటించేవారు.  కొన్ని చిత్రాలలో కొత్త వారికి అవకాశం కల్పించేవారు. మాస్ సైకాలజీని అర్థం చేసుకున్న రావు గారూ తన చిత్రాలను వ్యాపార ధోరణిలో నిర్మించేవారు. జీవితాన్ని ప్రాక్టికల్ గా ఆలోచించే వ్యక్తి రావు గారూ అని వారిని ఎరిగినవారు చెప్పేవారు.

1942 వ సంవత్సరంలో యుద్ధ భయంతో మద్రాసు నుండి అంతా వెళ్ళిపోతుండడంతో చిత్ర నిర్మాణం ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. అటువంటి తరుణంలో వై.వి.రావు గారూ అందరిలా వెళ్లిపోకుండా మద్రాసులోనే ఉండిపోయి, ఒక చిన్న హోటల్ పెట్టుకున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన గొప్ప దర్శకులు ఇలా సాధారణ జీవితాన్ని గడపటం రావు గారి లోని ప్రాక్టికాలిటీకి నిదర్శనం. తన సమకాలీకులైన దర్శకులతో పోటీ పడుతూ ఇతర దర్శకులు రూపొందించే చిత్రాలకు పేరడీ అన్నట్లుగా సినిమాలు తీసే వై.వి.రావు గారి ధోరణి కూడా చిత్ర పరిశ్రమలో ఆయనకు శత్రువులను పెంచి వారిని ఏకాకిగా చేసింది.

ఇతర తెలుగు చిత్రాలు

శంకర రెడ్డి (లవ కుశ ఫేమ్) 1952లో నిర్మించిన “మానవతి” చిత్రానికి దర్శకుడు వై.వి.రావు గారే. ఈ సినిమాలో సి.హెచ్.నారాయణరావు గారూ, జి.వరలక్ష్మి జూనియర్ గారూ హీరో, హీరోయిన్లు. హాస్య నటుడు రమణారెడ్డికి ఇదే తొలి సినిమా. అలాగే వై.వి.రావు గారూ నారాయణరావుతో కలిసి నిర్మించిన జానపద చిత్రం “మంజరి” (1953) విజయవంతం కాలేదు. 1958 వ సంవత్సరంలో వచ్చిన “శ్రీకృష్ణ గారడీ” రావు గారి చివరి చిత్రం. ఈ చిత్రంలో  జగ్గయ్య గారూ అర్జునుడిగా, అమరనాథ్ కృష్ణుడిగా నటించిన ఈ చిత్రం తర్వాత రావు గారూ చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు.

మరణం..

తెలుగుతోపాటు తమిళ కన్నడ మలయాళ హిందీ మరాఠీ కొంకని భాషలలో విజయవంతమైన చిత్రాల రూపొందించిన వైవి రావు జీవిత చరమాంకం దయనీయంగానే గడిచిందని చెప్పాలి. డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా జీవనం సాగించిన ఆయనకు చివరి దశలో ఆర్థిక ఇబ్బందులు విపరీతంగా చుట్టుముట్టాయి. వై.వి.రావు గారి భార్య రుక్మిణి గారూ, కూతురు లక్ష్మీ పుట్టిన కొద్ది రోజులకు విడాకులు తీసుకున్నారు. కోర్టు వ్యవహారాల వల్ల ఆస్తి మొత్తం హరించుకుపోయింది. దాంతో ఆయన తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఎంతో వైభవాన్ని చదివి చూసిన వై.వి.రావు గారూ 14 ఫిబ్రవరి 1972 నాడు ఈ లోకాన్ని వదిలి వెళ్లారు.

Show More
Back to top button