
శరీరం, మనసు… పరమాత్మతో ఐక్యం చేయడమే.. యోగకు అసలైన అర్థం, పరమార్ధం. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల సమీకృతికి దోహదపడే సాధనం యోగా. ఇది ఆరోగ్యకరమైన జీవనాన్ని, ఆధ్యాత్మిక ఉన్నతినీ ప్రసాదిస్తుంది. పతంజలి మహర్షి ఈ లోకానికి ఇచ్చిన జ్ఞానప్రసాదం యోగ… యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి..లతో ‘అష్టాంగ యోగం’గా యోగ ప్రక్రియను ఆయన తీసుకొచ్చారు. ఆహార విహార నియమాలు, ఇంద్రియ నిగ్రహాలతో సాగించాల్సిన సాధన ఇది. అంతరంగిక పరిశుద్ది, మనోనిర్మలత్వం, ఉత్తమ కార్యాచరణ, సాధు జీవనం, సమదర్శనం వంటి పంచగుణాలను ప్రాతిపదికగా యోగశాస్త్రం ప్రజ్వరిల్లుతుంది.
యోగ ఈనాటిది కాదు.. పూర్వం వేదాల్లోనూ, ఇతిహాసాల్లోనూ దీని గురుంచిన ప్రస్తావన ఉంది. నేడు విదేశాలకు సైతం విస్తరించి, ఎంతో ప్రాచుర్యాన్ని చూరగొంటోంది. నేడు అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్బంగా యోగా చరిత్ర, ప్రాముఖ్యత విశేషాలను ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం:
చరిత్రలో యోగ…
మనదేశంలో వేదకాలంకన్నా ముందే యోగ ఉనికిలో ఉంది. క్రీ.పూ.3000 నాటి సింధులోయ నాగరికతలో యోగా సంప్రదాయానికి సంబంధించిన తొలి ఆనవాళ్లు లభించాయని చరిత్ర చెబుతోంది. మొహంజదారో నాణేలపైన ఒక యోగ ముద్ర కనిపిస్తుంది. ఈ ముద్రను సరిగ్గా చూస్తే మోకాళ్లు ఎడంగా, పాదాలు దగ్గరగా ఉంటాయి. ఈ ముద్రా సమయంలో జంతువులన్నీ చుట్టూ చేరిన దృశ్యం.. కనిపిస్తుంది. అందులో ఉన్న వ్యక్తి పశుపతిగా భావించే శివుడే అయి ఉంటాడన్నది చరిత్రకారుల అభిప్రాయం.
అతి ప్రాచీనమైన రుగ్వేదం సైతం యోగాను ఒక సంయోగంగా పేర్కొంటుంది. యోగతత్వాన్ని సృష్టించింది రుగ్వేదంలో దైవశక్తిగా కీర్తించబడే హిరణ్యగర్భుడేనని కొందరి భావన. యోగాను ఒక యుద్ధరథంగా కూడా విశ్లేషిస్తారు.
మహాభారతంలోని భగవద్గీతలో శ్రీకృష్ణుడు.. పరమాత్మ సంబంధిత విషయాల గురించి చెబుతూ వందల సార్లైనా యోగా అనే పదాన్ని ఉపయోగించడం విశేషం. దీని బట్టి భారతం ఆ కాలం నాటిదని కొందరి భావన.
మనో నియంత్రణకు సాధనంగా.. కఠోపనిషత్తు తొలిసారి యోగా అనే మాటను ఉపయోగించింది. యోగా ఆత్మను, పరమాత్మతో సంలీనం చేస్తుందని చెబుతుంది. ప్రాణశక్తి గురించి ఉపనిషత్తులు కూడా ప్రస్తావించాయి.
పతంజలి యోగసూత్ర అనే గ్రంథం.. యోగ జ్ఞానానికి సంబంధించి పెద్ద నిధి అని చెప్పవచ్చు. ఇందులో ఎనిమిది విధానాలు ఉన్నట్లు చెబుతుంది.
అష్టాంగ యోగ పతంజలి యోగాలో భాగం. యోగాసనాలను, ప్రాణాయామాన్నీ, మంత్రాన్ని.. ఈ మూడింటి కలయిక వల్ల తంత్రం విస్తరించింది.
మహిళా దేవతల్ని, మానవ లైంగికత్వాన్నీ పూజించేందుకు ఈ తంత్రాన్ని ఉపయోగించారు. ఈ క్రియలతో దేహం దేవాలయంగా మారుతుందనేది భావన.
ప్రసిద్ధులైన యజ్ఞవల్క్యుడు బృహదారణ్యక ఉపనిషత్తు ద్వారా అష్టాంగ యోగ గురించి విపులీకరించి చెబుతాడు. తన భార్య గార్గీకి తనకూ మధ్య జరిగిన సంభాషణల రూపంలో సమాచారం ఉంటుంది.
ఇవన్నీ ఉపసంహారణ, ఇమిడిపోవడం, జాగృతి, శ్వాస వంటి నైపుణ్యాల ఆధారంగానే చెప్పడం జరిగింది.
ఇక యోగ అనే మాట తొలి బౌద్ధ గ్రంథాల్లో ఎక్కడా లేదు. కానీ ధ్యానం, ప్రాణాయామం, మంత్రం వంటి అంశాల గురుంచిన చర్చ మాత్రం ఉంది.
బుద్ధుని దృష్టిలో యోగ సాధన, ఒక పరిపూర్ణ మేధస్సుకు మార్గమవుతుందనేది ఉవాచ.
హైందవ సాధువు గోరక్నాథ్ గారి తంత్రం.. దీనికి సంబంధించి రెండు గ్రంథాలు అచ్చయ్యాయి.
అందులో ఒకటి 15వ శతాబ్దంలో వచ్చిన ‘హఠయోగ ప్రదీపిక’ అయితే, రెండవది 17వ శతాబ్డంలో వచ్చిన ‘ఘేరంద సంహిత’. ఈ రెండూ గురు శిష్య సంవిధానాన్ని మనకు చెబుతాయి.
యోగాతత్వం మీద మొట్టమొదటిసారిగా కోల్‌కతా రచయిత అయిన డాక్టర్ ఎన్.సి.పాల్ రాసిన గ్రంథం.. యోగా మీద వచ్చిన తొలి శాస్త్రీయ అధ్యయనంగా గుర్తింపు పొందడం విశేషం.
పాశ్చాత్య దేశాలకు యోగాను పరిచయం చేసిన తొలి వ్యక్తి స్వామి వివేకానంద. అమెరికాలోని చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో ఆయన రాజయోగ గురించిన ప్రసంగం ఇచ్చారు.
1920లో పరమహంస యోగానంద క్రియా యోగ మీద ఎన్నో ప్రసంగాలు చేశారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో స్వీయ జ్ఞానోదయం అనే వ్యవస్థను స్థాపించారు.
1936లో స్వామి విష్ణుదేవానంద హఠయోగలోని శివానంద యోగాను బాగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఇందులో మొత్తంగా 12 ఆసనాలుంటాయి. వీటి లక్ష్యం వెన్నెముకలో మృదుత్వాన్ని పెంచడం.
మహర్షి మహేశ్ యోగి ఆయన నెలకొల్పిన అతీత ధ్యానం ఎన్నో అద్భుత ఫలితాలనిచ్చింది. ఈయన వివేకానంద జ్ఞానమార్గాన్ని, హరేకృష్ణ మహా మంత్రాన్ని, భగవద్గీత అంశాల్ని కూడా యోగాలో భాగం చేయడం మరో విశేషం.
యోగా గురువు బిక్రం చౌదరి తన తొలి యోగా కళాశాలను అమెరికాలో స్థాపించారు. గదిలో అధిక ఉష్ణోగ్రతల మధ్య వేసే 26 ఆసనాలు ఆయన స్వతహాగా రూపొందించారు. అనంతరం..‘హాట్ యోగా’గా పిలవబడే ఈ యోగా శరీరంలోని మాలిన్యాలను బయటికి పంపించడంతో పాటు, శరీర బరువును నియంత్రణలో ఉంచడంలో బాగా ఉపకరిస్తుంది.
డాక్టర్ డీన్ ఆర్నిష్ అనే వ్యక్తి తన స్వీయపరిశోధనల ద్వారా కొన్ని రకాల ఔషధాలకు, యోగాను కూడా జోడిస్తే.. గుండె జబ్బులను, టైప్- 2 మధుమేహాన్ని నివారించవచ్చని రుజువు చేశారు.2000లో అమెరికాకు చెందిన వెల్నెస్ టీచర్ డాక్టర్ ఆండ్రివ్ వెల్ అనే ఒక వైద్యుడు.. ప్రాణాయామం, కొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్ ద్వారా ఎన్నో వ్యాధులను నయం చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.
యోగా వల్ల లాభాలెన్నో…
అష్టాంగ యోగ విధానంలోని.. యమనియమాల ద్వారా చెడు ఆలోచనలు, ప్రేరణలను నియంత్రించడమే కాక మంచి ఆలోచనలను, అలవాట్లను అలవరచుకోవడం సాధ్యమవుతుంది. ఆసన, ప్రాణాయామాల ద్వారా దీర్ఘకాల ధ్యానానికి కావాల్సిన భంగిమలు, లయబద్ధమైన శ్వాసక్రియను అలవర్చుకోవచ్చు. ప్రత్యాహార ధారణల ద్వారా ఇంద్రియాలను మరల్చి ఏకాగ్రతను పెంచుకోవచ్చు. ధ్యాన సమాధి స్థితుల ద్వారా నిరంతరం ధ్యానం చేయడం, దాని ఫలితంగా మనసును పూర్తిగా ఆత్మలో లయం చేయవచ్చు.
మనలోని అంతర్గతశక్తి స్రవంతులను, అతీంద్రియ కేంద్రాలను తెరవగలిగే శరీర భంగిమలనే ఆసనాలు అంటాం. మన దేహం, శ్వాసక్రియ ఇంకా మనసు..
వీటికి వెలుపల ఉన్న విషయాల గురించి తెలుసుకునేందుకు కావలసిన ఉపకరణాలుగా భావిస్తాం.
వీటివల్ల మనసుపై అదుపు సాధించడంతో.. జీవితంలో ఎదురయ్యే బాధలను, ఆందోళనలను, ఒత్తిళ్లను అధిగమించవచ్చు. మనసును సైతం శాంతపరుస్తుంది.
ఈ యోగ సాధనతో మనిషికి శాశ్వతమైన శారీరక, మానసిక స్వస్థత చేకూరుతుందనడంలో సందేహం లేదు.
శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేసే 200 పైచిలుకు ఆసనాలు, భంగిమలు, శ్వాసక్రియలు యోగశాస్త్రంలో పతంజలి మహర్షి పేర్కొన్నారు.
ముఖ్యంగా యోగాసనాలు ఎన్నో రుగ్మతలను రూపుమాపుతాయని నిపుణులు అభ్యసనల ద్వారా అభిప్రాయపడుతున్నారు.
వీటిలో మచ్చుకు కొన్ని…సుఖాసనం, స్వస్తికాసనం, పద్మాసనం, సిద్ధాసనాలు వంటివి ఆధ్యాత్మిక సాధనకు ఉపకరిస్తాయి.
ఎన్నో దీర్ఘకాల వ్యాధులను నియంత్రించడంలోనూ ఇవి ముఖ్యపాత్రను పోషిస్తున్నాయి. మత్స్యేంద్రాసనం, సుప్తమత్స్యేంద్రియాసనంతో మధుమేహ వ్యాధిని నియంత్రించవచ్చట.
అలాగే మత్య్సాసనం, సర్వాంగాసనంతో థైరాయిడ్ గ్రంథి వాపు తగ్గుతుందిట. యోగాభ్యాసంతో విద్యార్థుల్లో ఆరోగ్యం, చురుకుదనంతోపాటు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి.
యువతీయువకుల్లో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదురయ్యే ఎన్నో మానసిక, శారీరక సమస్యలకు చక్కని పరిష్కారంగా చెప్పవచ్చు.
యోగాసనలో భాగంగా ఆసనాలు వేయడమే యోగాభ్యాసమని అనుకుంటారు కొందరు.
నిజానికి యమనియమాలను పాటిస్తూ ప్రాణాయామాన్ని కొనసాగిస్తూ ప్రత్యాహారం, ధారణ, ధ్యానంతో చేసిన సాధనే యోగాభ్యాసమవుతుంది. అప్పుడు మన మనసు అత్యున్నతమైన ‘సమాధి’ స్థితికి చేరుకుంటుంది.
*‘ఊపిరి ఉన్నంత వరకూ శరీరం, మనసూ దృఢంగా, శక్తిమంతంగా ఉండాలి’ – స్వామి వివేకానంద.
‘శరీరం, మెదడు, ఆత్మలకు అదనపు శక్తినీ, సౌందర్యాన్నీ ఇస్తుంది యోగా’- అమిత్ రే.
అనేక రుగ్మతలకు అపర సంజీవనిగా ఉపకరించే యోగాను ఆచరిద్దాం. ఆరోగ్యంగా ఉందాం.