Telugu News

జనాభా పెరుగుదలపై చంద్రబాబు సంచలన ప్రకటన

“అభివృద్ధి అంటే కేవలం భవనాలు కాదు.. పేదవాడి కళ్లలో ఆనందం. పరిపాలన అంటే కేవలం ఆదేశాలు కాదు.. ప్రజల తలసరి ఆదాయం పెంచే ఒక నిరంతర యజ్ఞం!” సరిగ్గా ఇదే నినాదంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట గడ్డపై స్వర్ణాంధ్ర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గత ఐదేళ్ల చీకటి అరాచకాలను తుడిచిపెట్టి, వ్యర్థాల నుంచి సంపదను, పెట్టుబడుల నుంచి ఉద్యోగాలను సృష్టించే ఒక సరికొత్త ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’కు ఈరోజు శ్రీకారం చుట్టారు. ఉత్తరాంధ్ర వలసల కష్టాలను తీర్చి, లక్షల కోట్ల పెట్టుబడులతో మన బిడ్డల భవిష్యత్తును మార్చేయబోతున్న ఆయన చెప్పుకొచ్చారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని చూడటమే తన అంతిమ కోరిక అని చాటిచెప్పారు. సంపదను సృష్టించి, దానిని పేదలకు పంచడం ద్వారా ఆర్థిక అసమానతలను తొలగించవచ్చని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలోనే జనాభా పెరుగుదలపై ఆయన తన వైఖరిని మార్చుకుంటూ, “పిల్లలే అసలైన సంపద” అనే కొత్త నినాదాన్ని వినిపించారు. గతంలో కుటుంబ నియంత్రణను ప్రోత్సహించిన ఆయన, ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా మూడో బిడ్డ పుడితే రూ.30 వేలు, నాలుగో బిడ్డ పుడితే రూ.40 వేలు ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించారు. తల్లికి వందనం కింద ఇప్పటికే రూ.15 వేలు అందిస్తున్నామని, భవిష్యత్తులో ఈ మొత్తాన్ని మరింత పెంచే ఆలోచన ఉందని చెబుతూ, మానవ వనరుల అభివృద్ధికి పెద్దపీట వేశారు.

రాష్ట్రంలో పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ‘స్వచ్ఛాంధ్ర’ ద్వారా ప్రజల ఆలోచనల్లో మార్పు రావాలని, అప్పుడే స్వచ్ఛమైన సమాజం సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజుల పాటు ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ అనే భారీ పారిశుధ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వ హయాంలో భూములకు రక్షణ లేదని విమర్శిస్తూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భూ తగాదాలు లేకుండా గట్టి చర్యలు చేపట్టామని భరోసా ఇచ్చారు. వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేయడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించడం వంటి చర్యల ద్వారా పర్యావరణాన్ని కాపాడుతూనే సంపదను సృష్టించవచ్చని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగ కల్పనపై ముఖ్యమంత్రి అత్యంత ఆశాభావం వ్యక్తం చేశారు. గత 23 నెలల కాలంలో ఏపీకి సుమారు రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దీనివల్ల మన యువతకు సుమారు 24 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నంకు గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థను తీసుకురావడం ఒక మైలురాయి అని, ఉత్తరాంధ్ర నుండి ప్రజలు వలస వెళ్లే పరిస్థితి మారి, పరిశ్రమల స్థాపనతో ఇతర ప్రాంతాల వారే ఇక్కడికి వలస వచ్చేలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పరిపాలనలో అధికారుల పాత్రను కొనియాడుతూ, ప్రజల తలసరి ఆదాయం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

Show More
Back to top button