
బంగారమంటే మన భారతీయులకు ఎంతో ఇష్టం.. పెళ్ళిళ్ళు, పండుగలు తదితర శుభ కార్యక్రమాల్లో బంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం,. అందుకు ధర ఎంత పెరిగినా.. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా కొనుగోలు చేస్తాం.. సాధారణంగా మనం ఏవైనా వస్తువులు కొంటేనే.. ఫలానా వస్తువుకు బీఎస్ఐ (బ్యూరో స్టాండర్స్డ్ ఆఫ్ ఇండియా) మార్క్ ఉందో లేదో చెక్ చేసుకుంటాం. అలాంటిది బంగారం కొనే ముందు.. హాల్‌మార్క్ ఉందో లేదో చూసుకొని కొనాలని చెబుతారు. బంగారం స్వచ్ఛతను ధ్రువీకరించడాన్నే హాల్‌మార్కింగ్ అంటారు. తీసుకున్న వస్తువు మేలిమి బంగారమో కాదో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
పాతకాలంలో ఇలాంటి నిబంధనలు ఏంలేవు. కేవలం బంగారం రంగును చూసి గుర్తించేవారు. సాధారణంగా బంగారంలో కొన్ని లోహాలను కలిపితేనే అది వస్తువుగా మారుతుంది. ఇదే అదనుగా భావించిన కొందరు వ్యాపారులు.. కాపర్ ను ఎక్కువగా వినియోగించి నకిలీ బంగారాన్ని తయారు చేస్తూ.. వినియోగదారులను మోసం చేస్తుండేవారు. దీంతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛమైన పసిడిని గుర్తించేందుకు వీలుగా ఈ హాల్‌మార్క్‌ను తీసుకొచ్చింది. ఈ గుర్తుంటే.. బంగారం స్వచ్ఛంగా ఉందని అర్థం. అలాగే ఈ హాల్‌మార్క్ గుర్తుతో పాటు బంగారం కొన్న దుకాణం పేరు, పసిడి క్యారెట్ల బరువు కూడా కచ్చితంగా ఉంటే ఆ వస్తువు సేఫ్ అని అర్థం.
ఇకపోతే ఈ హాల్‌మార్క్ గుర్తును ఇచ్చేది బీఐఎస్. హాల్‌మార్క్‌లో క్యారెట్ బీఐఎస్ స్టాంప్, హాల్‌మార్కింగ్ సెంటర్ మార్క్, ఇయర్ ఆఫ్ హాల్ మార్కింగ్, జ్యువెలరీ ఐడింటిఫికేషన్ మార్క్, ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ వంటి డీటెయిల్స్ బంగారంపై ఉంటాయి. ఈ మార్క్ బంగారం స్వచ్ఛతను సూచిస్తుంది. హాల్‌మార్క్ నగలను విక్రయించే దుకాణాల పూర్తి జాబితాను మనం బీఎస్ఐ వెబ్సైట్లో కూడా వెతికి చూడొచ్చు. ఒకవేళ మనకు బంగారు హాల్‌మార్క్ మీద ఫిర్యాదులు ఏవైనా ఉంటే నేరుగా బీఎస్ఐను సంప్రదించవచ్చు.
బంగారం కొనుగోలు చేసేటప్పుడు.. దాని స్వచ్ఛతను రెండు రకాలుగా లెక్కిస్తారు. మొదటిది గోల్డ్ క్యారెట్, మరొకటి ఫైన్సెన్స్. 24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైన బంగారంగా పరిగణిస్తారు. కానీ ప్రస్తుతం మనం కొనుగోలు చేస్తున్న బంగారు ఆభరణాలు 22 క్యారెట్లవి. 24 క్యారెట్ల బంగారాన్ని కాయిన్స్, బార్ల రూపంలో కొనుగోలు చేయవచ్చు. గోల్డ్ కాయిన్ కొనాలంటే.. స్థానిక స్వర్ణకారుడినో లేదా షోరూమ్లోనో కొనుగోలు చేస్తుంటాం. చాలా బ్యాంకులు వేర్వేరు విలువల కలిగిన 24 క్యారెట్ల గోల్డ్ కాయిన్లను విక్రయిస్తున్నాయి. మనం కొనేటప్పుడు మేకింగ్ చార్జెస్, ప్రాఫిట్ మార్జిన్, ట్యాక్స్, జీఎస్టీలను చెల్లిస్తుంటాం. కానీ విక్రయించేటప్పుడు ఇవన్నీ వర్తించవనే విషయం మనం గుర్తెరిగి ఉండాలి.
.అసలు విషయానికొస్తే…
కిలోగ్రాం పరిమాణంలో విక్రయించే వెండి దిమ్మెలు, వెండి వస్తువుల్లో వెండి నాణ్యత ఎంత ఉందో గుర్తించేందుకు ఉపయోగపడే హాల్ మార్కింగ్ ను తప్పనిసరిగా అమలు చేసే ప్రక్రియ చేపట్టాలని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్)ను కేంద్ర ఆహార, వినియోగదారు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కోరారు.
ఇప్పటికే ఈ దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని, అన్ని వర్గాలతో చర్చలు పూర్తయ్యాక, సాధ్యాసాధ్యాలను బీఐఎస్ మదింపు చేశాక, దీనిపై తుది నిర్ణయానికి వస్తామని వివరించారు. వినియోగదారులు, ఆభరణాల డీలర్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని, సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని బీఐఎస్ ను కోరినట్లు తెలిపారు.
*ప్రస్తుతం వెండి స్వచ్ఛతను నిర్ణయించే హాల్ మార్కింగ్ ప్రక్రియ పూర్తిగా స్వచ్ఛందంగా ఉంది. మరో 3- 6 నెలల్లో తప్పనిసరి హాల్ మార్కింగ్ ను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు బీఐఎస్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్‌తివారీ పేర్కొన్నారు.
*బంగారు ఆభరణాలపై ముద్రిస్తున్నట్లే, వెండిపైనా 6 అంకెలు, అక్షరాలతో కూడిన ప్రత్యేక కోడ్ (హెచ్‌ఐయూ ఐడీ)ను ముద్రించే విషయంపై చర్చలు జరుగుతున్నాయి.
*గుజరాత్, కర్ణాటక సహా కొన్ని రాష్ట్రాలు మాత్రం ఇందుకు కొంత సమయం కోరుతున్నట్లు ఆయన తెలిపారు. వినియోగదారుల డిమాండ్ మేరకే ఈ సూచన చేసినట్లు బీఐఎస్ 78వ వ్యవస్థాపక కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు.