Telugu Politics

బీజేపీలో అంతర్గత పోరు.. కొత్తగా బీసీ నినాదం

తెలంగాణలో బీజేపీ ప్రస్తుతం తీవ్ర వివాదాలమయంగా మారింది. ఆ పార్టీలో ప్రధాన నాయకుల మధ్య విభేదాలు తారా స్ధాయికి చేరుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తాం అని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. కానీ ఆ పార్టీలో ముదురుతున్న విభేదాలు చూస్తే అధికారంలోకి వచ్చేది దేవుడు ఎరుగు.. అసలు పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. 

మొన్నటి వరకు గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నానా హంగామా చేశారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై రాజాసింగ్ భారీగా ఆశలు పెట్టుకున్నాడు. కానీ తనకు తీవ్ర నిరాశ ఎదురైంది. దీంతో  పార్టీ పదవికి రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో కూడా ఇలానే చేశాడు. అప్పట్లో అధిష్టానం బుజ్జగించింది. ఈ సారి కూడా అలాగే జరుగుతుందని అనుకున్నాడు. అయితే రాజాసింగ్‌కి ఊహించని షాక్ ఇచ్చింది. తన రాజీనామాను ఆమోదించింది. 

ఇక గతంలో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాదవీ లత రాజాసింగ్ స్థానంలో పోటీ చేస్తా అని తనకు తానే ప్రకటించుకున్నారు. అంతటితో ఆగకుండా రాజాసింగ్ పై ఏవో కామెంట్లు చేశారు. ఈ విషయం అధిష్టానంకి తెలిసింది. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగేలా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.  ఇంకా వెంటనే బీజేపీ అధిష్టానం తెలంగాణలో పార్టీ గాడి తప్పుతుందని భావించి వెంటనే దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఆలస్యం చేయకుండా ఎవరు ఊహించని విధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్ రావును ప్రకటించింది.  అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. అధ్యక్ష పదవిపై ముందు నుంచే రాజా సింగ్, ఈటల రాజేందర్, రఘునందన్  రావు ఆశలు పెట్టుకున్నారు. అందరు కూడా ఈ ముగ్గురిలో ఎవరికో ఒకరికి వస్తుందని భావించారు. కానీ అనుహ్యంగా రామచందర్ ను నియమించింది. ఇంక రాజా సింగ్ అసంతృప్తితో పార్టీకి రాజీనామ చేశారు. రఘునందన్ రావు మౌనంగా ఉండిపోయారు. అంతా సెట్ అయ్యింది అనుకున్నారు. అయితే ఈటల మాత్రం కేంద్ర మంత్రి బండి సంజయ్ తీరుతో  పరోక్షంగా తన అక్కసు వెళ్లగక్కారు.  

అసలు విబేధాలు అక్కడే మొదలు

 సంజయ్ బండి, ఈటల ఇద్దరూ బీసీ నాయకులే. కొంతకాలంగా వీరి మధ్య వర్గపోరు నడుస్తుండగా తాజాగా అది పీక్స్ కు చేరింది. దీంతో ఇద్దరు నేతలు కూడా పేర్లు ప్రస్తావించకుండానే డైలాగ్ వార్ కు దిగారు. దీంతో కమళదలం నేతల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరినట్లు అయింది.  దీంతో ఇద్దరు కీలక నేతలు కావటంతో ఎవరిస్థాయిలో వారికి అనుచరగణం ఉంది. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య విభేదాలు నడుస్తున్నాయి. అయితే రీసెంట్ గా బండి సంజయ్ హుజురాబాద్ లో పర్యటించినప్పుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ కామెంట్స్ తో విబేధాలు తారాస్థాయికి చేరాయి.

బీజేపీలో ఏ గ్రూపు లేదని, ఉన్నదల్లా మోదీ గ్రూప్‌ మాత్రమేనని అన్నాడు. గతంలో తనకు ఓట్లు పడకుండా కొందరు అడ్డుకున్నారని  ఈటలను టార్గెట్ చేస్తూ బండి మాట్లాడాడారు.  కష్టపడి పనిచేస్తూ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న నాయకులకే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిక్కెట్లు వస్తాయన్నారు.  ఇక ఈటలకు ఆయన వర్గీయులు తమ గోడు చెప్పుకున్నారు.  నియోజకవర్గంలో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, తమను లెక్క చేయడం లేదని వివరించారు. దీంతో అసలే అధ్యక్ష పదవిరాని ఈటలే తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే పార్టీ కార్యాలయంలో తమ అనుచర వర్గంతో మీటింగ్ పెట్టి పరోక్షంగా బండి సంజయ్ పై విరుచుకపడ్డారు. ఏకంగా బూతులు కూడా తిట్టారు. ఈ పరిణామంతో మళ్లీ బీజేపీలో వర్గపోరు మొదలైనట్లు అయ్యింది. బండి మాత్రం ఈటల చేసి వ్యాఖ్యలపై ఎవరు స్పందించ వద్దన్నారు. దానికి సంబంధించి అధిష్టానమే చూసుకుంటుందన్నారు.

ఈటల కొత్త పార్టీ పేరు ఇదేనా?

 గతంలో బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన మాట తీరుతో పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేశారు. ఇంకా అధిష్టానం కూడా బీసీ నాయకుడినే ముఖ్యమంత్రిగా చేస్తారని ప్రకటించింది. అయితే అనూహ్యంగా బండిని అధ్యక్ష పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించారు. దీనికి అంతటికి కారణం ఈటల రాజేందర్ అని బండి సంజయ్ భావించినట్లు అప్పట్లో తమ పార్టీ నేతలే గుసగుసలాడారు. 2021లో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల గెలిచిన తరువాత బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, కమిటీ చైర్మన్ సభ్యుడిగా నియమించింది.

ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్ బండి సంజయ్ గురించి  అధిష్టానంకి ఉన్నవి లేనివి చెప్పి తన పదవి  పోవడానికి కారణం అయ్యారని భావించారు. ఇక ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న సంజయ్  ఈటల రాజేందర్‌కు అధ్యక్ష పదవి రాకుండా చేసినట్లు ఆయన అనుచరవర్గం భావిస్తున్నారు.  అందుకే ఈటల బండిపై తీవ్రంగా విరుచుకపడ్డట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఎంపీ ఈటలపై వేటు వేస్తుందని, ఆయనపై చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నారు. ఇంకా రాజేందర్ కూడా పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతగా ‘బహుజన జనతా సమితి’ అని కొత్త పార్టీ పెట్టనున్నట్లు  ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది.  

 తెలంగాణలో కొత్తగా బీసీ నినాదం రాష్ట్రంలో బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులకు బీసీ రిజర్వేషన్లు గుర్తుకురాలేదు. కానీ ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్సీ కవిత బీసీలపై లేని పోని ప్రేమను చూపిస్తుంది. బీసీలకు రిజర్వేషన్లు కేటాయించాలని ధర్నాలు, రాస్తారోకోలు చేస్తోంది.  ఇక కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తు అసెంబ్లీలో ప్రతిపాదించింది. ఇది తన పోరాటం  వల్లే సాధ్యం అయ్యిందని కవిత గొప్పలు చెప్పుకుంటుంది. కవితకు  ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కౌంటర్ గా ఇచ్చాడు.

నీకు బీసీలకు ఏం సంబంధం.. వాళ్లతో మంచం పొత్తు ఉందా.. కంచం పొత్తు ఉందా అని తీవ్రంగా విమర్శించారు. ఇంకా ఈయన కూడా మొన్నటి వరకు బహుజనవాదం ఎత్తుకున్నాడు. బహుజన రాజ్యం రావాలి.. వారికి అధికారం ఇవ్వాలని ఓ తెగ హాడావుడి చేశాడు. మళ్లీ ఏం అయిందో ఏమో  ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకున్నాడు.  బీసీలకు రాష్ట్రంలో అన్యాయం జరిగింది. జరుగుతోందని వారికి పదవులు రాకుండా  ఓసీలు అడ్డుకుంటున్నారు.. ఇప్పుడు మొత్తం ఓసీలే పదవులు అనుభవిస్తున్నారు అని సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నాడు. ఇంకా అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ బీసీ రిజర్వేషన్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరిగిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లీంలకు ఫెవర్ గా రిజర్వేషన్లు కేటాయించిందని ఆరోపిస్తున్నారు.  బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య కూడా బీసీల రిజర్వేషన్ల గురించి తన పోరాటం ముమ్మరం చేస్తున్నాడు.

వాళ్లు ముగ్గురు కలిసి పార్టీ పెడతారా?

 ఈ పరిణామాలు అన్ని చూస్తే బీసీ రిజర్వేషన్లపై, పదవుల కోసం ఇటు తీన్మార్ మల్లన్న, అటు ఆర్ కృష్ణయ్య కలిసి కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉంది. ఇంక ఈటల రాజేందర్ కూడా మొన్న బీజేపీ నేతల పేరు చెప్పకుండా తీవ్రంగా విరుచుకపడ్డాడు. ఈ క్రమంలో ఆయనపై పార్టీ వేటు వేస్తుందని, చర్యలు తీసుకుంటుదని ముమ్మరంగ ప్రచారం జరుగుతోంది. దీంతో ఈటల పార్టీకి, పదవికి రాజీనామ చేసి కొత్తగా పార్టీ పెడతారని ‘బహుజన జనతా సమితి’అని ఇప్పటికే ఆ వర్గీయులు సోషల్ మీడియాల్లో ప్రచారం చేస్తున్నారు. లేదా ఈ ముగ్గురు కలిసి బీసీలకు సంబంధించి కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిణామాలు అన్నీ చూస్తే ఇందులో కూడా నిజం ఉందనిపిస్తోంది. 

కొత్తగా బీసీల కోసం పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ కవిత కూడా కొత్త పార్టీ పెట్టే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఈ మధ్య ఆమె బీఆర్ఎస్ పార్టీపై, తన సొంత అన్న కేటీఆర్ పై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కొత్తగా తెలంగాణ జాగృతి అని పార్టీ ఆఫీస్ ప్రారంభించింది. బీఆర్ఎస్ నాయకులు కూడా తన కాళ్ల దగ్గరకే రావాలని కూడా మాట్లాడారు.  ఇంక అటు తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై కూడా అన్న కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు కూడా స్పందించలేదు. దీంతో కవిత కూడా సొంత కుంపటి పెడుతుందని ప్రచారం జరుగుతుంది.   చూడాలి మరి వీటన్నింటికి కాలమే సమాధానం చెప్పాలి. ఏది ఏమైన తెలంగాణలో బీసీ నినాదం ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ అయ్యింది. వచ్చే ఎన్నికల్లో ఎన్ని కొత్త పార్టీలు వస్తాయో.. ఎంత మంది కలిసి పార్టీ పెడతారో.. ఎవరు అధికారంలోకి వస్తారో వేచి చూడాల్సిందే.

Show More
Back to top button