
2003 వ సంవత్సరం “ఒక్కడు” సినిమా చిత్రీకరణ కోసం హైదరాబాదు శివార్లలోని గోపన్నపల్లె గ్రామంలో నిర్మాత రామానాయుడికి ఉన్న ఓ పదెకరాల ఖాళీస్థలంలో చార్మినార్ సెట్ వేసి చిత్రనిర్మాణం ప్రారంభించారు. సెట్ వేసిన చార్మినార్ ఎత్తు 176 అడుగులు, అందులో మినార్ల ఎత్తు 78 అడుగులు. కథకు అవసరమైనవి ఆ మినార్లే కాబట్టి చార్మినార్ కింది ఎత్తు బాగా తగ్గించేసి, మినార్ల ఎత్తు మాత్రం అలాగే వుంచి మొత్తంగా 120 అడుగుల ఎత్తున చార్మినార్ సెట్ నిర్మించారు. ఉన్న పదెకరాల్లోని ఓ అయిదు ఎకరాల విస్తీర్ణంలో చార్మినార్, చుట్టూ హైదరాబాదు పాతనగరం రోడ్లు లేకుండా కేవలం ఇళ్ళు, దుకాణాల సెటప్ వేశారు. మూడు నెలల సమయం పట్టిన ఆ సెట్ కోసం 300 మంది పనివాళ్ళు కృషిచేసి నిర్మించారు.
ఈ నిర్మాణానికి 2003 వ సంవత్సరంలో సుమారు కోటి డెబ్భై లక్షల రూపాయలు ఖర్చయింది. నిజానికి నిత్యం రద్దీగా ఉండే చార్మినార్ ప్రాంతంలో చిత్రీకరణ చేయడం వీలుకాదు. అందువలన సెట్ వేసి చిత్రీకరణ చేశారు. అదేవిధంగా “అర్జున్” (2004) సినిమా కోసం తోట తరణి రూపొందించిన “మధురై మీనాక్షి” ఆలయం యొక్క భారీ ప్రతిరూపం “పద్మాలయ స్టూడియోస్” లో ఆరు నెలల పాటు సెట్ వేసి చిత్రీకరించారు. ఇలా ఒక రూపాన్ని పునః నిర్మాణం చేయడం అనేది కూడా ఒక “కళ”. దానికి కావలసిన వనరులను, మనుషులను ఉపయోగించుకుని కావలసిన విధంగా మలుచుకునే వ్యక్తులను కళా దర్శకులు అంటారు. అలాంటి కళా దర్శకులలో వాలి సుబ్బారావు ఒకరు.
వాలి సుబ్బారావు, “వాలి” అనే పేరుతో కళాదర్శకుడిగా చిరపరిచితుడు. 1914లో జన్మించిన వాలి సుబ్బారావు తన తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. రంగస్థల నటుడైన తండ్రి వాలి వీరాస్వామినాయుడికి ఉన్న చిత్రకళ ఆసక్తి కొడుకు వాలి సుబ్బారావుకు కూడా అబ్బింది. తండ్రి వేసిన పెయింటింగ్స్ చూసి సుబ్బారావుకు కూడా చిత్రకళపట్ల ఆసక్తి ఏర్పడింది. 1932లో ఇతడు చిత్రకళ పరీక్షలో ఉత్తీర్ణుడై, తరువాత కొండపల్లి దగ్గరలోని విద్యానగరం ఉపాధ్యాయ శిక్షణ పాఠశాలలో చిత్రకళ ఉపాధ్యాయులుగా ఉద్యోగంలో చేరాడు. ఆ తరువాత బందరుకు తిరిగి వచ్చి అడివి బాపిరాజు వద్ద శిష్యరికం చేశారు. అటుపిమ్మట కృష్ణా పత్రికలో బొమ్మలు వేసేవారు. సినిమాలలో పని చేయాలన్న సంకల్పం బలంగా కలిగిన వాలి సుబ్బారావు తిరిగి తిరిగి అడివి బాపిరాజు వద్దకు చేరారు. అడివి బాపిరాజుకు, సినీ నిర్మాత సి. పుల్లయ్యకు ఉన్న స్నేహం మూలంగా సి.పుల్లయ్య తన “చల్ మోహనరంగా” (1937) సినిమాలో కథానాయకుడిగా అవకాశం కొట్టేశారు. ఆ విధంగా వాలి సుబ్బారావు సినిమా రంగంలో ప్రవేశించారు.
నిజానికి “చల్ మోహన రంగా” సినిమాతో తొలి అవకాశం కథానాయకుడిగా లభించినా కూడా “చిత్రకళ” పట్ల ఉన్న మక్కువతో “నటన” మీద కంటే “చిత్రకళ” పట్లనే ఎక్కువ ధ్యాస పెట్టి కళా దర్శకత్వం వైపు మొగ్గు చూపారు. అలా కళాదర్శకత్వ శాఖలో కృషి చేస్తూ “మీరాబాయి” సినిమాకు అడివి బాపిరాజు వద్ద సహాయకుడిగా పనిచేశారు. అటుపిమ్మట గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో ఋష్యేంద్రమణి కథానాయికగా తెరకెక్కించిన “పత్ని” (1941) సినిమాకు కళా దర్శకుడిగా ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని వాలి సుబ్బారావు తొలిసారిగా కళా దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. వాలి సుబ్బారావుకి మొదటి నుంచి దుస్తులు మరియు అలంకరణల మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉండేది. తాను కళా దర్శకత్వం చేసిన మొదటి సినిమాతోనే మంచి కాస్ట్యూమ్ లతో, మంచి నైపుణ్యం కనబరచాడన్న పేరు లభించింది. ఆ తరువాత సుబ్బారావు స్వతంత్రంగా పలుచిత్రాలకు కళా దర్శకత్వం వహించిన వాలి సుబ్బారావు, కొన్ని చిత్రాలకు ఎ.కె.శేఖర్, ఘోడ్‌గావంకర్ మొదలైన వారితో కలిసి కళా దర్శకుడిగా పనిచేశారు.
నేపథ్యం…
వాలి సుబ్బారావు కృష్ణా జిల్లాకు చెందినవారు. ఆయన 1914 వ సంవత్సరంలో జన్మించారు. ఆయన తండ్రి వాలి వీరస్వామి నాయుడు నాటకరంగంలో మంచి కళాకారుడు మరియు రంగస్థలం నటనలో అమితమైన అనుభవం ఉన్న నటుడు. భారతదేశంలో అప్పుడప్పుడే మూగ సినిమా నిర్మాణం పురుడు పోసుకుంటున్న ఆ రోజులలో సినిమా అంటే తెలియని ప్రేక్షకులు నాటకాలంటే విపరీతమైన ఆసక్తి కనబరచేవారు, విపరీతమైన అభిమానాన్ని చూపించేవారు. ఆ రోజుల్లో అమితమైన ప్రజాదరణ కలిగిన డి.వి. సుబ్బారావు (కీర్తిశేషులు) హరిశ్చంద్రుడి పాత్రలో నటిస్తుండేవారు, అదే నాటకంలో లోహితుడి పాత్రను తండ్రి వీరస్వామినాయుడు పోషించేవారు. వీరస్వామి నాయుడుకి చిత్రకళ లో కూడా ప్రావీణ్యం ఉండేది. అదే చిత్రకళ వాలి సుబ్బారావు కూడా అబ్బింది. తండ్రి వాలి వీరస్వామి నాయుడు నాటకాలలో వేషాలు వేయడం మాత్రమే కాకుండా అప్పటి నాటక రంగాలను తీర్చిదిద్దడానికి తాను ఎంతగానో కృషి చేశారు. నాటకాలు వేయడానికి అవసరమైన తెరల మీద రాజ దర్బారులు, అరణ్యాలు, పూల వనాలు, ప్రకృతి సంబంధమైన చిత్రాలతో కూడిన బొమ్మలను చిత్రించేవారు. కాలక్రమేణా వయసు పైబడి నాటకాలలో నటించడం మానేశారు, కానీ తెర మీద బొమ్మలు వేయడం మాత్రం మానుకోలేకపోయారు.
విద్యాభ్యాసం…
తండ్రి వాలి వీరస్వామి నాయుడు తెరలపై చిత్రాలను గీస్తూ ఉంటే బాల్యంలో ఉన్న వాలి సుబ్బారావు మాత్రం రంగులను వేసే కుంచె అందించడం, ఆ రంగులను కలపడం వంటివి చేస్తూ ఉండేవారు. తండ్రి లాగానే కొడుకు వాలి సుబ్బారావు కూడా అదేవిధంగా చిత్రకళ అభ్యాసం చేయసాగారు. ఆ విధంగా సుబ్బారావుకు చదువు మీద ఉన్న శ్రద్ద కంటే, చిత్రకళ మీద ఎక్కువ ఉత్సాహం ఏర్పడింది. మొదటనుండి వాళ్ళ కుటుంబం ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి రావడంతో కొద్ది కాలం మాత్రమే బడికి వెళ్లి చదువుకున్న సుబ్బారావు ఆ తరువాత తన చదువు మానేయవలసి వచ్చింది. పాఠశాలకు వెళ్లలేకపోయాడు కానీ, ఇంట్లో ఉంటూనే పుస్తకాలు, గ్రంథాలు చదవడం అలవాటు చేసుకున్నారు.
పండితులు, పెద్దలు మొదలగు వారి సాంగత్యం వలన సుబ్బారావుకు ఎన్నో గ్రంథాలు వంటబట్టాయి. వారి ప్రోత్సాహం వలననే కాబోలు వాలి సుబ్బారావు ఆ తరువాత రోజులలో ఆంధ్రజాతీయ కళాశాల, మచిలీపట్నంలో విద్యార్థిగా చేరగలిగారు. కళాశాల చదువులో సుబ్బారావు చూపిన ఉత్సాహం, అతని తెలివి, ప్రవర్తన చూసిన కళాశాల యాజమాన్యం అతడిని “రెండో ఫారం స్టాండర్డ్” గల విద్యార్థిగా గుర్తించింది. ఆ కళాశాలలో చిత్రలేఖనం, వస్త్రాలు నేయడం, సంగీతం, మోడలింగ్, తెలుగు, ఆంగ్లము, హిందీ, వడ్రంగి ఇలా అన్ని విషయాలు విడివిడిగా బోధించేవారు. అన్ని విషయాలపై (సబ్జెక్టులపై) విపరీతమైన కృషి చేస్తూ అన్నింటిలోనూ మంచి మార్కులు తెచ్చుకోసాగారు. కళాశాల తెలుగు మాస్టారుగా ఉన్న కాటూరి వెంకటేశ్వరరావుకు వాలి సుబ్బారావు ప్రియ శిష్యులు అయ్యారు. సుబ్బారావు కు చిత్రకళ మీద ప్రత్యేకమైన ఆసక్తి ఉండడం వలన 1932 వ సంవత్సరంలో చిత్రకళ పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణుడైనారు.
కృష్ణా పత్రికలో బొమ్మలు వేస్తూ…
తండ్రి వీరాస్వామి నాయుడు నుండి వంటబట్టినవే నాటకాలు కూడా. సుబ్బారావుకు నాటకాలలో వేషాలు వేయడం కూడా అలవాటయ్యింది. తెలుగుతో బాటుగా హిందీ కూడా బాగా చదవడం వలన కాబోలు హిందీ భాషలో కూడా నాటకాలలో నటిస్తూ ఉండేవారు. ఆ రోజులలో చిత్రలేఖనం పరీక్ష ఉత్తీర్ణుడవ్వడంతో చిత్రలేఖనము ఉపాధ్యాయులుగా ఉద్యోగం చేయాలనుకున్నారు. పాఠశాలలో చిత్రలేఖనము ఉపాధ్యాయులు కావాలని పేపరులో వచ్చిన ఒక ప్రకటన చూసిన సుబ్బారావు ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. డ్రాయింగ్ మాస్టర్లు లభించడం కరువుగా ఉన్న ఆ రోజులలో సుబ్బారావుకు సులభంగా ఉద్యోగం లభించింది. దాంతో కొండపల్లి దగ్గర ఉన్న విద్యానగరంలో అతను చిత్రలేఖనం ఉపాధ్యాయులుగా ఉద్యోగంలో చేరారు. కానీ అక్కడ విద్యార్థులంతా కూడా సుబ్బారావు కంటే పెద్దవాళ్లే. అందువలన వాళ్లకు చిత్రలేఖనం పాటలు చెప్పడం అతనికి చాలా ఇబ్బందికరంగా ఉండేది.
కృష్ణా పత్రిక వ్యవస్థాపకులు ముట్నూరు కృష్ణారావు, కృష్ణా పత్రికను నిర్వహిస్తున్న కాలంలో ప్రతీరోజు సాయంకాలం ఒక దర్బారు నిర్వహించేవారు. ఆ దర్బారుకు ప్రముఖ రచయితలందరూ హాజరై, కవితా చర్చలు చేస్తూ ఉండేవారు. అలా కవితా చర్చలు జరుపుతున్న సమయంలోనే మల్లాది రామకృష్ణ శాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ, ముద్దుకృష్ణ, దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటి ప్రముఖ కవులతో వాలి సుబ్బారావుకు పరిచయం ఏర్పడింది. నిజానికి కృష్ణ పత్రికలో వాలి సుబ్బారావు ప్రత్యేక సంచికలో బొమ్మలు వేస్తూ ఉండేవారు. ఆయనతో బాటుగా నేటి ప్రముఖ కళా దర్శకుల్లో ఒకరైన తోట (తోట వెంకటేశ్వర రావు) కూడా కృష్ణ పత్రికలో బొమ్మలు వేస్తూ ఉండేవారు. అడవి బాపిరాజు సలహాతో తాడంకి – మంటాడ గ్రామంలో వాలి సుబ్బారావు ఉపాధ్యాయుడిగా చేరారు. అదే సమయానికి ప్రముఖు దర్శకులు తాతినేని ప్రకాశరావు నాలుగో ఫారం చదువుతున్నారు.
చిత్రరంగ ప్రవేశం…
తెలుగు సినిమా నిశ్శబ్ద యుగం నుండి తెలుగు సినిమా పరిశ్రమతో సంబంధం కలిగి ఉన్న తొలి చిత్ర ప్రముఖులలో ఒకరు చిత్తజల్లు పుల్లయ్య. ఆయన రాజమండ్రిలో ఆంధ్రసినీ టోన్ స్థాపించి తెలుగు చిత్ర నిర్మాణం చేస్తున్నారు. అడవి బాపిరాజు, చిత్తజల్లు పుల్లయ్య మధ్య అంతకుముందే స్నేహం ఉంది. వీరిరువురు కలిసి కలకత్తాలో రెండు, మూడు చలనచిత్రాలకు పనిచేశారు. వాలి సుబ్బారావుకు సినిమాలలో చేరాలి అనే కోరిక కలిగింది. చిత్రరంగంలో రాణించాలి అనే సంకల్పం కూడా బలంగా కలిగింది. అందులోనూ తనకు పరిచయస్తుడైన అడవి బాపిరాజు ఎలాగూ చిత్రపరిశ్రమలోనే ఉన్నారు.
అడవి బాపిరాజు ఉన్నారన్న భరోసాతోనే వాలి సుబ్బారావు చేస్తున్న తన ఉద్యోగాన్ని అలాగే విడిచిపెట్టి రాజమండ్రి చేరుకున్నారు. కానీ ఒక్కమాట అయినా తనకు చెప్పకుండా ఉద్యోగం విడిచి పెట్టి రాజమండ్రికి వచ్చినందుకు అడవి బాపిరాజు ముందుగా వాలి సుబ్బారావును మందలించారు. కానీ ఆ తరువాత ఆలోచించారు. ఉద్యోగం మీద ధ్యాస లేనప్పుడు, ఉపాధ్యాయ వృత్తిపై ఉత్సాహం లేనప్పుడు చిత్రపరిశ్రమలో ఉండడమే సబబు అని భావించిన అడవి బాపిరాజు సినిమాలలో కొనసాగమంటూ చిత్తజల్లు పుల్లయ్య దగ్గర చేర్పించారు. చిత్తజల్లు పుల్లయ్య దగ్గర చేరిన వాలి సుబ్బారావు, ఆయన వద్దనే ఉంటూ సినిమా నిర్మాణంలో ఉన్న ప్రతీ విషయాన్ని కూలంకషంగా తెలుసుకుంటూ ఉండేవారు.
“చల్ మోహనరంగ” లో కథానాయకుడిగా…
చిత్తజల్లు పుల్లయ్య దగ్గర వాలి సుబ్బారావు సహాయకుడిగా చేరి చిత్ర నిర్మాణానికి సంబంధించిన ప్రతీ విభాగాన్ని సునిశితంగా పరిశీలన చేస్తున్న సమయంలో చల్ మోహన రంగ (1937) అనే చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేయసాగారు దర్శకులు చిత్తజల్లు పుల్లయ్య. ఆ సినిమా మొదలుపెట్టడానికి ముందే నటీనటులను కొత్త వారిని తీసుకునే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. నాయకా, నాయికలు కొత్తవారు ఉంటే బాగుంటుందని అన్వేషణ చేస్తున్నారు. “బిడ్డను ఇంట్లోనే పెట్టుకొని ఊరంతా తిరిగినట్టు” కథానాయకుడు వాలి సుబ్బారావుని ప్రక్కనే పెట్టుకొని అన్వేషణ కొనసాగించారు చిత్తజల్లు పుల్లయ్య. వాలి సుబ్బారావుకు శరీరసౌష్టవం, ఆయనకు ఉన్న నాటకానుభవం చూసి, ఆ పాత్రకు వాలి సుబ్బారావు తగినవాడు అని గ్రహించి, ఆ పాత్రకు వాలి సుబ్బారావు పనికొస్తారనే నిర్ణయానికి వచ్చారు. ఆ విధంగా వాలి సుబ్బారావుకు మొదటగా 1937 వ సంవత్సరంలో “చల్ మోహన రంగ” అనే చిత్రంలో కథానాయకుడిగా అవకాశం ఇచ్చారు చిత్తజల్లు పుల్లయ్య. వాలి సుబ్బారావు సరసన కథానాయికగా పుష్పవల్లి (నటి రేఖ తల్లి) నటించారు. వాలి సుబ్బారావు, పుష్పవల్లి పైన ఒక పాటను కూడా చిత్రీకరించారు. ఈ పాట పాడింది టేకు అనసూయ. నటి, గాయని వేర్వేరు వ్యక్తులు కావడంతో ఇదే తెలుగులో మొదటి “నేపథ్య గానం” పాట అని అనేవారున్నారు. ఈ పాట 12 నిమిషాల పాటు సాగుతుంది.
కళా దర్శకుడిగా మొదటి సినిమా అపవాదు (1941)…
తాను పనిచేసిన మొదటి సినిమాలోనే కథానాయకుడి పాత్ర ధరించిన వాలి సుబ్బారావుకు నటన మీద కంటే చిత్రకళ మీద ఉత్సాహం ఎక్కువ ఉండటం వలన కథానాయకుడి పాత్రను వదిలేసి కళా దర్శకత్వం శాఖలో కృషిచేయసాగారు. చిత్తజల్లు పుల్లయ్య దగ్గర కొన్నాళ్ళు సహాయకుడిగా పనిచేసిన వాలి సుబ్బారావు ఆ తరువాత అడవి బాపిరాజు దగ్గర “మీరాబాయి” చిత్రానికి సహాయకుడిగా పనిచేశారు. నటీనటుల పాత్రపైన, దుస్తులు, అలంకరణ మీద మొదటినుండి ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు. అనసూయ సినిమాలో వివిధ పాత్రలకు ఎలాంటి దుస్తులు ఉండాలి, ఎలాంటి ఆభరణాలు ఉండాలని ఆలోచిస్తూనే, ఆ శాఖలో ఎక్కువగా కృషి చేశారు వాలి సుబ్బారావు. సినిమాకు పరమార్థం వినోదం మాత్రమే కాదు, అంతకు మించిన సామాజిక ప్రయోజనముందని నమ్మిన ప్రఖ్యాత సినిమా దర్శకులు, సంపాదకులు “గూడవల్లి రామబ్రహ్మం” 1941 వ సంవత్సరంలో దర్శకత్వం వహించిన తెలుగు చలనచిత్రం అపవాదు (1941). ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు కోవెలమూడి సూర్యప్రకాశరావు (కె.ఎస్.ప్రకాశరావు) కథానాయకుడిగా విడుదలైన తొలి చిత్రం ఇది. ఈ చిత్రానికి కళాదర్శకత్వం వహించే బాధ్యతను వాలి సుబ్బారావుకు అప్పగించారు. కళా దర్శకుడిగా సుబ్బారావు తొలి చిత్రం అది. ఆ చిత్రంలో మంచి నైపుణ్యం కనబరచారు వాలి సుబ్బారావు.
బొంబాయి వెళ్లి హిందీ చిత్రాలకు పనిచేసి…
అపవాదు (1941) చిత్రం తరువాత 1943 వ సంవత్సరంలో జి.వరలక్ష్మి, కె.యస్. ప్రకాశరావు నాయికా, నాయకులుగా బొంబాయిలో ఒక చిత్రం నిర్మించాలని కొందరు నిర్మాతలు భావించారు. వాలి సుబ్బారావు ఆ పని మీదనే బొంబాయి వెళ్లి కొంతకాలం ఉన్నారు. అయితే ఆ చిత్ర నిర్మాణం సరిగ్గా జరగలేదు. అయినా కూడా వాలి సుబ్బారావుకు బొంబాయి కాపురం కొంత మేలు చేసిందనే చెప్పాలి. కాళిదాసు సంస్కృత నాటకం అభిజ్ఞానశాకుంతలం ఆధారంగా తీసిన నాటక చిత్రం “శకుంతల” (1943). రాజ్‌కమల్ కళామందిర్ బ్యానర్‌లో శాంతారామ్ రాజారామ్ వాంకుద్రే నిర్మించిన మొదటి చిత్రం ఇది. జయశ్రీ, చంద్ర మోహన్, వి.శాంతారామ్, అమీనా నటీనటులుగా ఉన్న ఈ చిత్రానికి వాలి సుబ్బారావు ఆ చిత్రానికి కళా దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సంబంధించిన దుస్తులు, సెట్స్, పని విధానం పరిశీలిస్తూ చాలా కొత్త విషయాలు, కొత్త పోకడలు గ్రహించగలిగారు. ఆ తరువాత మద్రాసుకు తిరిగొచ్చి వచ్చి వాల్మీకి (1945), గొల్లభామ (1947) చిత్రాలకు కళాదర్శకుడిగా పనిచేసి గొప్ప పేరు సంపాదించారు. పల్నాటి యుద్ధం (1947), పల్లెటూరి పిల్ల (1950), స్త్రీ సాహసం (1951), దేవదాసు (1953), అనార్కలి (1955) మొదలగు చిత్రాలకు శేఖర్ మరియు గోడ్ గాంవ్కర్లతో కలిసి పనిచేశారు. కొన్ని చిత్రాలకు ఇతరులతో కలిసి పనిచేసిన వాలి సుబ్బారావు చాలా చిత్రాలకు స్వతంత్ర జ్ఞానంతో పనిచేచేశారు.
నేడు లోపించిన కళా నైపుణ్యం…
ఈ రోజులలో కళా దర్శకులు నిర్మాతల చేత ఎక్కువ ఖర్చు పెట్టిస్తున్నారు. కాగితం మోల్డ్ తోనే చక్కని కిరీటాలు, కవచనాలు మొదలైన వాటిని లోహంతో చేసినవా అనిపించేటట్టు చేయవచ్చు. కానీ కిరీటాలు, కవచాలు లోహంతో ఉంటేనే బాగుంటుంది, అవే కావాలని పట్టుబట్టి మరీ తెప్పిస్తూ ఉంటారు. దానివలన విపరీతమైన ఖర్చు పెరుగుతుంది. కానీ కళా దర్శకులు వాలి సుబ్బారావు అలా కాదు. సూక్ష్మములో మోక్షం తెచ్చే కళాదర్శకుడిగా తనకు చిత్ర పరిశ్రమలో మంచి పేరుంది. తక్కువ ఖర్చుతో సెట్లు రూపొందించడంలోనూ, తక్కువ ఖరీదులో దుస్తులు తయారుచేయడంతో బాటు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం చేకూర్చేవారు.
పాత్రకు తగిన విధంగా దుస్తులు తయారు చేస్తే ఇప్పుడున్న నటీనటులు ఒప్పుకోరు. ఫలానా దుస్తులు కావాలి, ఫలానా వస్త్రాలు ఉంటేనే మేము నటిస్తాము అని నిర్మాతను, కళా దర్శకులను శాసిస్తున్నారు. అందువలన దర్శకుడు అనుకున్న విధంగా ఆహార్యం నటనలో, పాత్రల్లో కనిపించదు. బీదతనంలో ఉండవలసిన మహిళ టెరిలిన్ చీరలు కట్టుకున్నదేమి అని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నపుడు వాటికి దర్శకులు, నిర్మాతలు ఏమి చెప్పగలరు? నిజానికి చలనచిత్ర నిర్మాతకు మంచి అభిరుచి ఉంటే సెట్స్ తాను అనుకున్న విధంగా ఉండడానికి, వాస్తవంగా కనిపించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ రోజులలో నిర్మాత, దర్శకులు, కళా దర్శకులకు అందరికీ ఆలోచించడానికి చాలా వ్యవధి ఉండేది. ఇవాళ అంత వ్యవధి లేదు, అంతగా వారు ఆలోచించడం లేదు. అందువలన కళా నైపుణ్యం అనేది కనిపించకుండా పోతోంది.
పలు చిత్రాలకు కళా దర్శకత్వం…
పెద్ద పెద్ద సెట్లు, ఖరీదైన దుస్తులు కనిపించనంత మాత్రాన కళా దర్శకత్వం అద్భుతంగా ఉన్నట్టు కాదు. అతి పేదరికంలో బ్రతికే పాత్ర యొక్క పరిసరాలు, ఇల్లు సహజంగా, ఎంతో దీనంగా కనిపిస్తే అది కళా దర్శకత్వం అనిపించుకుంటుంది. పెద్దపెద్ద సెట్లు ఉన్న చిత్రాలను చూసి ప్రేక్షకులు కళా దర్శకత్వం అద్భుతంగా ఉందంటూ కితాబిస్తుంటారు. కానీ నిజానికి కళాదర్శకత్వం అంటే అదే కాదు. పేదరికం గల చిత్రంలో ఉన్న సెట్స్ దానికి తగ్గట్టు వాతావరణం, కథలో ఉన్న స్థితిగతులను కూడా పరిగణలోకి తీసుకుని కళా దర్శకులు వాటికి తగ్గ సెట్స్, దుస్తులు రూపొందిస్తారు. కళా దర్శకులు వాలి సుబ్బారావు అదే కోవకు చెందుతారు.
పత్ని (1942), గొల్లభామ (1947), పల్నాటి యుద్ధం (1947), పల్లెటూరి పిల్ల (1950), స్త్రీ సాహసము (1951), దేవదాసు (1953), రాజు – పేద (1954), అనార్కలి (1955), జయం మనదే (1956), సువర్ణసుందరి (1957), భట్టి విక్రమార్క (1960), రాణి రత్నప్రభ (1960), భీష్మ (1962), పరమానందయ్య శిష్యుల కథ (1966), బంగారుతల్లి (1971), రైతుబిడ్డ (1971), అమ్మమాట (1972) లాంటి చిత్రాలకు కళా దర్శకులుగా మరియు శ్రీకృష్ణదేవరాయలు (1971), సంపూర్ణ రామాయణం (1971) లాంటి చిత్రాలకు కాస్ట్యూమ్ డైరెక్టర్ గా, అలా కథకు తగ్గట్టుగా, కథనానికి సరిపోయేలా, సందర్భానికి తగ్గట్టుగా సవ్యంగా కనిపించేలా చేయడమే కళా దర్శకులు వాలి సుబ్బారావుకు తెలిసిన ఉత్తమ కళా దర్శకత్వం. అలాంటి ఉత్తమ కళా దర్శకత్వం చేయడంలో వాలి సుబ్బారావు ఘనాపాటి.












