CINEMATelugu Cinema

బి.యన్.రెడ్డి తీసిన చిత్రాలలోకెల్లా ఉత్తమోత్తమమైన కళాఖండం.. బంగారు పాప సినిమా.

తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా రాష్ట్రపతి రజత పతకాన్ని గెలుచుకున్న చిత్రం “బంగారు పాప”. భారతీయ 3వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఈ ఘనత సాధించింది “బంగారు పాప” చిత్రం. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు, ప్రముఖ సినీ దర్శక, నిర్మాత బి.ఎన్.రెడ్డి గారు ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో యస్వీ రంగారావు గారు అద్భుతమైన నటనా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ చిత్రం ద్వారానే ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు.

రచయిత్రి జార్జ్ ఇలియట్ వ్రాసిన “సైలాస్ మర్నర్” నవలలోని కథాంశాన్ని స్వీకరించి తెలుగు వాతావరణానికి అనుగుణంగా మలచుకుని ఈ సినిమా కథను తయారుచేసుకున్నారు. “బంగారుపాప” సినిమాను వాహినీ పిక్చర్స్ పతాకంపై బి.ఎన్.రెడ్డి గారి దర్శకత్వంలో రూపొందించగా ఎస్.వి.రంగారావు, కొంగర జగ్గయ్య, కృష్ణకుమారి, జమున తదితరులు నటించిన తెలుగు సాంఘిక చలనచిత్రం. కరడుగట్టిన కసాయి గుండెను సైతం కదలించి సున్నితంగా మార్చగల శక్తి పసితనపు అమాయకత్వానికి ఉందని హృద్యంగా చెప్పిన చిత్రమది.

పాలగుమ్మి పద్మరాజు మాటలు, దేవులపల్లి కృష్ణశాస్త్రి పాటలు, ఎస్వీ రంగారావు అసమాన నటనా చాతుర్యం, మేకప్ మాన్ అద్వితీయమైన పనితనం, అన్నిటినీ మించి బి.ఎన్.రెడ్డి దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాను అపురూప కళాఖండంగా తీర్చిదిద్దాయి. ఈ చిత్రంలో నటన ఎస్వీ రంగారావును శిఖరాగ్ర స్థాయినందుకునేలా, ఆయనలోని నటనాప్రతిభకు అద్దం పట్టేలా ఈ సినిమా లోకానికి చాటిచెప్పింది. ఎస్వీ రంగారావును తన సినీప్రస్థానం లోనే గాక, యావద్భారతదేశ చలనచిత్ర చరిత్రలోనే ఎన్నదగిన మాస్టర్ పీస్ “బంగారుపాప” సినిమా. మల్లీశ్వరి 1951 కంటే మిన్నగా, తాను తీసిన చిత్రాల్లోకెల్లా ఉత్తమోత్తమమైనదిగా బి.ఎన్. రెడ్డి భావించినది కూడా “బంగారుపాప” సినిమానే. బి.ఎన్.రెడ్డి కి గురుతుల్యులైన బెంగాలీ దర్శకులు “దేవకీబోస్” బంగారుపాప సినిమాను చూసి ముచ్చటపడి అదేసినిమాను బెంగాలీలో తీశారు. కానీ ఆయన అంత అపురూపంగా అద్భుతంగా తీర్చిదిద్దిన “బంగారుపాప” బెంగాలీలో కూడా విజయవంతము కాలేదు.


చిత్ర విశేషాలు….

దర్శకత్వం   :   బి.ఎన్.రెడ్డి

రచన    :   బిఎన్ రెడ్డి, పాలగుమ్మి పద్మరాజు

తారాగణం  :   ఎస్వీ.రంగారావు, కొంగర జగ్గయ్య, డి.హేమలతాదేవి, కృష్ణకుమారి, జమున, రమణారెడ్డి

సంగీతం    :    అద్దేపల్లి రామారావు

గీతరచన     :    దేవులపల్లి కృష్ణశాస్త్రి

ఛాయాగ్రహణం  :   బి.ఎన్. కొండారెడ్డి

సంభాషణలు   :   పాలగుమ్మి పద్మరాజు

కళ       :      ఎ. కె. శేఖర్

నిర్మాణ సంస్థ    :    వాహిని పిక్చర్స్

నిడివి      :     183 నిమిషాలు

విడుదల తేదీ   :    19 మార్చి 1955

భాష     :     తెలుగు


చిత్ర కథ సంక్షిప్తంగా…

అమాయకుడికి అందరూ మంచివాళ్లే. కానీ ఆప్తులని నమ్మేవాళ్లే మోసం చేస్తే అతనిలో అగ్నిపర్వతాలు చెలరేగుతాయి. మానవత్వంపై నమ్మకం కోల్పోయి మనిషి పశువవుతాడు. ఈ కథలో మనోహర్ కలవారి బిడ్డ. తాను పేదింటి పిల్ల శాంతను ప్రేమిస్తాడు. పెద్దలకు నచ్చజెప్పే శక్తి లేక ఆమెని పట్టణంలో రహస్యంగా వివాహం చేసుకొని కాపురం పెడతాడు. వారిరువురికి ఒక పాప జన్మిస్తుంది. అక్కడ పల్లెలో ఉంటున్న మనోహర్ తండ్రి సుందర రామయ్యకు ఇదంతా ఏమీ తెలియదు. అదే ఊరిలో ఉంటున్న కోటయ్య గోపాలస్వామిని గురువుగా పూజించేవాడు. అతనికి “రామి” తో పెళ్లి నిశ్చయమైంది. అయితే రామి ఇతనికి తెలియకుండా గోపాలస్వామితో గ్రంథం నడుపుతోంది. వాళ్ళిద్దరూ దొంగతనం చేసి, తాము చేసిన దొంగతనాన్ని కోటయ్య మీదికి నెట్టేసి అతడిని జైలుకు పంపుతారు.

మానవత్వంపై నమ్మకం కోల్పోయిన కోటయ్య పశువులా మారిపోతాడు. పల్లెకి వచ్చిన మనోహర్ పెళ్లి నిశ్చయించినట్టు తండ్రి చెబుతాడు. అప్పుడు కూడా తనకు పెళ్లి అయ్యిందనే విషయం ఇంట్లో వాళ్లకు తెలియజేయలేకపోతాడు. భర్త రాక ఆలస్యం కావడంతో పాపను తీసుకుని తన ఊరు వస్తున్నానని తనే స్వయంగా మామగారికి అన్ని విషయాలు చెబుతానని శాంత ఉత్తరం వ్రాస్తుంది. ఏం చేయాలా అని సంకోచిస్తూ మదనపడుతున్న మనోహర్ కి శాంతే అన్ని విషయాలు చూసుకుంటుందని సంతృప్తి పడతాడు. హోరున కురుస్తున్న గాలి వానలో ఒక రాత్రి శాంతి ఆ ఊరిలో రైలు దిగుతుంది. అదే రైలుకు గోపాలస్వామి కూడా దిగుతాడనే వార్త తెలుసుకున్న కోటయ్య గోపాలస్వామిని హతమార్చేందుకు బయలుదేరుతాడు.

ఆ ప్రళయ రాత్రి “శాంత” దుర్మరణం పాలవుతుంది.  గోపాలస్వామిని మట్టుపెట్టాలని ఆవేశంగా వెళుతున్న కోటయ్య కంట పాప పడుతుంది. ఆ పసిబిడ్డ ఏడుపు ఈ కసాయివాడిని కదిలిస్తుంది. ఆ పసిబిడ్డను తీసుకువచ్చి తన ఇంట్లోనే పెంచుకుంటాడు. అక్కడ పెద్దల ఒత్తిడికి తలొగ్గిన మనోహర్ పార్వతిని వివాహమాడుతాడు.  కోటయ్య ఇంట పెరుగుతున్న పాప తన బిడ్డే అన్న విషయం మనోహర్ కు తెలుసు. కానీ చెప్పుకోలేని పరిస్థితి. ఆ పసిబిడ్డ కోటయ్యను సమూలంగా మార్చేస్తుంది. పిల్లలు లేని మనోహర్ దంపతులు తమ మేనల్లుడు శేఖర్ ని తెచ్చుకుని చదివిస్తుంటారు. పాప, శేఖర్ చిన్నప్పటినుంచి స్నేహితులు. పెద్దయ్యాక ఆ అభిమానం ప్రేమగా మారుతుంది. ఈ ప్రేమ జంట మధ్యన కూడా మళ్లీ అవే అడ్డుగోడలు. వాటిని వీళ్ళు ఎలా చేదించారన్నదే మిగతా కథ.


సైలాస్ మార్నెల్ నవల నుండి కథ సేకరణ…

1951 వ సంవత్సరంలో “మల్లీశ్వరి” సినిమా తీసిన తరువాత అదే తరహాలో మళ్లీ ఒక సాంఘికం తీయాలని బి.ఎన్.రెడ్డి గారు అనుకున్నారు. అలా తన ఆలోచనలతో తయారైన సినిమా “బంగారు పాప”. మేరి ఆన్ ఇవాన్స్ అనే బ్రిటిష్ మహిళా రచయిత్రి జార్జి ఇలియట్ అనే మగ పేరుతో వ్రాసిన సైలాస్ మార్నెల్ నవలలోని కొన్ని ఘట్టాలు బి.ఎన్.రెడ్డి గారిని అమితంగా ఆకట్టుకున్నాయి. వాటిన ఆధారంగా చేసుకుని తెలుగు వాతావరణానికి తగ్గట్టుగా కథను ఆలోచించసాగారు. బి.ఎన్.రెడ్డి గారికి చాలా కాలంగా ఈ నవల మీద మక్కువ ఉంది. దీనికి అసలైన తెలుగు రూపం కల్పించడానికి ఒక మంచి రచయిత కావాలని వెతుకుతున్నారు. అదే సమయంలో వాహినీ వారు “పెద్ద మనుషులు” అనే సినిమా కూడా తీస్తున్నారు. దానికి కె.వి.రెడ్డి గారు దర్శకులు. కె.వి.రెడ్డి గారు డి.వి.నరసరాజు గారిని ఆ సినిమా ద్వారా రచయితగా పరిచయం చేస్తున్నారు.

మాములుగానే బి.యన్.రెడ్డి గారి దృష్టి నరసరాజు గారి మీద పడింది. కొత్త రచయిత ఎలా వ్రాస్తున్నారని కె.వి.రెడ్డి గారిని అడిగారు. దానికి అద్భుతంగా వ్రాస్తున్నారని పొగిడారు. స్క్రిప్టు పని పూర్తయ్యాక నీకు రచయితతో పని ఉండదు కదా, నరసరాజు గారిని నాకు ఇవ్వు బ్రదర్. కొత్త సినిమాకు పని ప్రారంభిస్తామన్నారు బి.యన్.రెడ్డి గారు కే.వీ.రెడ్డి గారితో. ఆ మాటలు  కే.వీ.రెడ్డి గారికి చాలా ఆశ్చర్యం కలిగించాయి. ఎందుకంటే వాళ్ళిద్దరి అభిరుచులకు చాలా బేధాలు ఉన్నాయి. “ఆయనకు నచ్చింది ఈయనకు నచ్చదు, ఈయనకు నచ్చింది ఆయనకు నచ్చదు”. మల్లీశ్వరి సినిమాకు రచయితగా పింగళి నాగేంద్రరావు గారిని తీసుకోవాల్సిందిగా బి.యన్.రెడ్డి గారికి కే.వీ.రెడ్డి గారు ఎంతగానో చెప్పారు. కానీ బి.యన్.రెడ్డి గారు కే.వీ.రెడ్డి గారి మాటలు వినలేదు. అలాంటిది నరసరాజు విషయంలో తనతో ఏకీభవించడం కే.వీ.రెడ్డి గారికి ఆశ్చర్యం కలిగించింది. ఈ విషయమే నరసరాజుతో చెప్పారు కే.వీ.రెడ్డి గారు.


రచయితగా “పాలగుమ్మి పద్మరాజు” ఎంపిక…

బి.యన్.రెడ్డి గారి సినిమా అనగానే నరసరాజు గారు కూడా ఉత్సాహంగా సరే అన్నారు. నిజానికి ఆ తరువాత రోజులలో వాహినీ సంస్థతో విభేదాలు రావడంతో కె.వి.రెడ్డి గారు బయటకు వచ్చేసి అన్నపూర్ణ వారి “దొంగరాముడు” సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఇంతకుముందు నుంచి దుక్కిపాటి మధుసూదన రావు గారితో సాన్నిహిత్యం ఉన్నందువల్ల నరసరాజు గారు కూడా “దొంగరాముడు” సినిమాకు రచయితగా పనిచేయడానికి తాను అంగీకరించారు. కానీ వాస్తవానికి “పెద్ద మనుషులు” సినిమా అవ్వగానే బి.యన్.రెడ్డి గారి కొత్త చిత్రానికి పనిచేస్తానని నరసరాజు గారు బి.యన్.రెడ్డి గారికి మాట ఇచ్చారు. అయితే అనుకోకుండా పరిస్థితి మారింది. కావాలని తానే ఇదంతా చేస్తున్నానని బి.యన్.రెడ్డి గారు అనుకుంటారని కె.వి. రెడ్డి గారు బాధపడ్డారు. ఆ సమయంలో బి.యన్.రెడ్డి గారిని స్వయంగా కలిసిన నరసరాజు గారు జరిగినదంతా వివరంగా చెప్పారు.

పెద్ద మనసుతో బి.యన్.రెడ్డి గారు కూడా పరిస్థితిని అర్థం చేసుకున్నారు. “మీకు దుక్కిపాటి గారికి ఉన్న స్నేహం నాకు తెలుసు, అదీగాక కే.వీ.తో మరో సినిమా కూడా చేయడం రచయితగా మీ ప్రస్థానానికి ఎంతో దోహద పడుతుంది. మన ఇద్దరం  కాలక్రమంలో ఎప్పుడైనా కలిసి పని చేద్దాం” అని నరసరాజు గారికి చెప్పి పంపించారు. అలా బి.యన్.రెడ్డి గారు కొత్త రచయిత కోసం మళ్లీ అన్వేషించడం మొదలుపెట్టారు. పాలగుమ్మి పద్మరాజు “గాలివాన” కథతో అంతర్జాతీయ పురస్కారాన్ని గ్రహించారు. దాంతో తననే రచయితగా పరిచయం చేయాలని నిర్ణయించుకున్నారు బి.యన్.రెడ్డి గారు. తాను మల్లీశ్వరి సినిమా తీసే రోజులలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ద్వారా ఆయనకు పద్మరాజు గారితో పరిచయం ఉంది. పాలగుమ్మి పద్మరాజు గారు భీమవరం కళాశాలలో రసాయన శాస్త్రం అధ్యాపకులుగా పనిచేస్తుండేవారు. తనకు సినిమాలకు పనిచేయాలనే కోరిక బలంగా ఉండేది. గతంలో ఒకసారి తన మనసులోని మాటను బి.యన్.రెడ్డి గారికి కూడా చెప్పుకున్నారు. దానితో పద్మరాజు గారికి కబురు పెట్టి మద్రాసు పిలిపించి కథా చర్చలు జరిపి స్క్రిప్టు పనులు పూర్తి చేశారు బి.యన్.రెడ్డి గారు.


దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం…

మల్లీశ్వరి సినిమాతో తెలుగు సినిమా పాటలకు ఎనలేని గౌరవం తీసుకు వచ్చిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి చేత ఈ సినిమాలోని పాటలు వ్రాయించారు బి.యన్.రెడ్డి గారు. మల్లీశ్వరి సినిమాకు ఆర్కెస్ట్రా కండక్టర్ గా వ్యవహరించిన “అద్దేపల్లి రామారావు” గారు ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు “బంగారు పాప” అని నామకరణం చేశారు. నిజానికి ఈ సినిమాల సంగీతానికి అంత ప్రత్యేకత ఉండే అవకాశం లేనే లేదు. అయినాకూడా రామారావు గారు ప్రతీ పాటకు సందర్భానికి అనుగుణంగా సంగీతం సమాకూర్చారు. “బంగారు పాప” సినిమాలోని పాటలు మల్లీశ్వరి చిత్రానికి ఎంత మాత్రం తీసిపోవు. ఈ సినిమా శృంగార ప్రధానమైనది కాకపోయినా దేవులపల్లి వారు చక్కని పాటలు వ్రాశారు అని ప్రముఖ రచయిత గొడవగంటి కుటుంబరావు గారు కితాబు ఇచ్చారు.


ఛాయాగ్రాహకుడిగా కొండారెడ్డి…

బంగారు పాప సినిమాలో ముఖ్యంగా “తాదిమి తకధిమి తోల్ బొమ్మా” పాట బాగా జనాధారణ పొందింది. ఈ పాటకు మాధవపెద్ది సత్యం గారు తన గాత్రంతో ప్రాణం పోస్తే, యస్వీ రంగారావు గారు తన నటనతో దానికి పదింత మెరుగులుదిద్దారు.  సినిమా నడి మధ్యలో వచ్చే “బండి పాట వెడలె ఈ రాజకుమారుడు బంగారు తేరు పైన” కూడా సంగీత పరంగా చిత్రీకరణ పరంగా అద్వితీయంగా ఉండి ఈనాటికీ కూడా ప్రేక్షకుల మనసులలో సజీవంగా ఉంది. బి.యన్.రెడ్డి గారి సోదరుడు కొండారెడ్డి ఈ సినిమాకు ఛాయాగ్రహకుడు. అప్పటికే తాను ఛాయాగ్రహకులు గా “పెద్ద మనుషులు” సినిమా చేసి ఉన్నారు.  కొండారెడ్డి గారు మొదట్లో మార్కస్ బార్ట్లే గారి వద్ద “స్వర్గసీమ” సినిమాకు సహాయకులుగా పనిచేశారు. ఆ తరువాత కూడా ఆయనవద్దనే “గుణసుందరి కథ”, “షావుకారు”, “పాతాళ భైరవి” సినిమాలకు పని చేశారు. ప్రసిద్ధ దర్శకుడు కే.విశ్వనాథ్ గారు ఈ సినిమాకు శబ్ద గ్రాహకునిగా పనిచేశారు. అప్పట్లో విశ్వనాథ్ గారు వాహినీ స్టూడియోలో శబ్ద గ్రాహక విభాగంలో పనిచేసేవారు.


నటీనటుల ఎంపిక…

బంగారుపాప సినిమాకు నటీనటుల ఎంపిక మొదలయ్యింది. అందులో ప్రధానమైన పాత్రపేరు కోటయ్య. ఆ పాత్రకు ఎస్వీ రంగారావు గారిని తీసుకున్నారు. యవ్వనంలో మొదలై నడివయస్సులో సాగి చివరిలో వార్ధక్యానికి వెళ్లే పాత్ర గనుక ఆయనను ముందు వివిధ భంగిమలలో ఛాయాచిత్రాలు తీయించారు కళాదర్శకులు ఏ.కే.శేఖర్. ఆ ఫోటోలను దగ్గర పెట్టుకొని మూడు దశలకు సంబంధించి ఆయన ప్రతిమలు గీసి ఇచ్చారు. అలాగే ప్రతీ చిన్న పాత్రకు గెటప్ ఎలా ఉండాలి అనే విషయాన్ని బి.యన్. రెడ్డి, శేఖర్ లు కలిసి చర్చలు జరిపి నిర్ణయించారు.   మనోహర్ పాత్రకు జగ్గయ్య, శాంతగా జమున, చిన్ననాటి పాపలుగా బేబీ సీతా కుమారి, బేబీ విజయలక్ష్మి, పెద్దయ్యాక కృష్ణకుమారి, శేఖర్ గా రామశర్మ, రామి గా జయలక్ష్మి, గోపాలస్వామిగా వంగర వెంకటసుబ్బయ్య, కోటయ్య తల్లిగా లీల, చెల్లిగా హేమలత, పార్వతిగా విద్యావతి, సుందర్రామయ్య గా శివరామకృష్ణయ్య, శేఖర్ తల్లిదండ్రులుగా కాంచన మరియు విన్నకోట రామన్న పంతులు నిర్ణయం అయ్యారు.


చిత్రీకరణ…

చిత్రీకరణ అంతా వాహినీ స్టూడియోలోనే జరిగింది. కథా చర్చలకు చాలా సమయం తీసుకుంది గానీ “బంగారు పాప” చిత్రీకరణ అంతా ఆరు నెలల్లో పూర్తయిపోయింది. దానికి గల కారణం ఇందులో పెద్ద తారలు ఎవ్వరూ లేకపోవడం. అప్పటికే యస్వీ రంగారావు, జగ్గయ్యలు ఈ సినిమాతోనే గుర్తింపు లభించిన ఆర్టిస్టులుగా ఎదిగారు. చిత్రీకరణ సమయంలో కొండారెడ్డి లైటింగ్ ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా బి.యన్.రెడ్డి గారు ఈ సినిమాలో ఒక కొత్త పద్ధతిని ఆచరించారు. ఆ దృశ్యంలో ఉన్న నటీనటులందరినీ రప్పించి మొత్తం సన్నివేశాలను అభినయింపచేసేవారు. వారి కదలికలను బట్టి కొండారెడ్డి లైటింగ్ ఏర్పాటు చేసుకునేవారు. చిత్రీకరణను బట్టి లైటింగ్ ఏర్పాటు చేస్తే యూనిఫార్మటిక్ అగుపించదు. అందుకే ఈ పద్ధతి తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటిసారిగా “బంగారు పాప” సినిమాలో ఆర్క్ ల్యాంప్స్ వాడారు. లాంగ్ షాట్స్ కి ముఖ్యంగా వర్షం సన్నివేశాలకు ఈ ఆర్క్ ల్యాంప్స్ ఎంతైనా ఉపయోగపడతాయి. “బంగారు పాప” సినిమాలో గాలివాన సన్నివేశాలు కొన్నిటినీ అవుట్ డోర్ లో తీశారు. చాలా బాగం స్టూడియోలోనే చిత్రీకరణ చేశారు. ఎక్కడ కూడా అలా కనిపించదు. శేఖర్ సెట్స్ విషయంలో తీసుకున్న జాగ్రత్త అటువంటిది.

విడుదల…

నటీనటులు, సాంకేతిక నిపుణులు “బంగారు పాప” సినిమాకు ఎంతో శ్రద్ధతో పనిచేశారు. ఏ విషయంలోనూ రాజీ పడకుండా అనుకున్నట్టుగా వచ్చే వరకు బి.ఎన్.రెడ్డి గారు చిత్రీకరించారు. అందరూ ఎంతో భక్తితో, ఓపికతో ఈ సినిమాకి పని చేశారు. 19 మార్చి 1955 నాడు “బంగారు పాప” సినిమా విడుదల అయ్యింది. ఆ సినిమా చూసిన వారంతా అద్భుతం అన్నారు. కానీ బాక్సాఫీసు వద్ద మాత్రం సినిమా బోల్తాపడింది. సినిమా పరాజయం పాలైంది. ఆర్థికంగా నష్టాన్ని మిగిల్చింది. “బంగారు పాప” సినిమా కళనయితే పండించింది గానీ కాసులు రాబట్టలేకపోయింది. వాహినీ వారికి “సుమంగళి” అనుభవం పునరావృతమయ్యింది. సామాన్య ప్రేక్షకుడు ఈ సినిమాను “మల్లీశ్వరి” స్థాయిలో ఆశించి వచ్చాడు. అలా కనిపించకపోవడంతో నిరాశ పడ్డాడు. యస్వీ రంగారావు గారికి మాత్రం మంచి పేరు వచ్చింది.

ఆ తరువాత ఒక్కసారి ఆకాశవాణికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన “ఇది కేవలం “మానసిక తత్వం” మీద ఆధారపడిన పాత్ర. కోటయ్య లాంటి పాత్రను అసలు ఊహించి సృష్టించిన వారిని ఎంతైనా అభినందించాలి. ఈ పాత్రకు అభినయించడం అంటే పైకి కనిపించిన అంత తేలిక కాదు. అడుగడుగునా మార్పులు చెందే విభిన్న భావాలు గల పాత్ర ఇది. కోటయ్య గారి అభినయిస్తున్నప్పుడు నేను కూడా ఆ భావనా ప్రవాహంలో పడి కొట్టుకుపోయేవాణ్ణి. ఒక్కోసారి మానసిక బాధ ఎక్కువై ఏడ్చేసేవాడిని. అప్పుడు బి.యన్.రెడ్డి నన్ను ఓదార్చేవారు. నిజానికి ఆయన పరిస్థితి అలాగే ఉండేది” అని చెప్పారు.

అదేవిధంగా జగ్గయ్య గారి సినీ ప్రస్థానానికి ఈ సినిమా ఎనలేని ఉపకారం చేసింది. జమున గారు చేసింది చాలా చిన్న పాత్ర. అయినప్పటికీ  కూడా ఆమెకు మంచి పేరు వచ్చింది. రామశర్మ, కృష్ణ కుమారిల జంట ఆ తరువాత కూడా మరికొన్ని సినిమాలలో కనిపించింది. పార్వతిగా పాత్ర ధరించిన విద్యావతి “అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత” కు స్వయానా పిన్ని. ఆవిడకు కూడా ఈ సినిమా మంచి పేరు తెచ్చి పెట్టింది. కానీ ఎందువలననో ఆవిడ తరువాత ఎక్కువగా తెలుగు సినిమాలలో కనిపించలేదు.

రాష్ట్రపతి చేతుల మీదుగా రజత పతకం…

బంగారు పాప సినిమాకు ఆ ఏడాది రాష్ట్రపతి చేతుల మీదుగా రజత పతకం లభించింది. కొద్ది తేడాతో ఈ సినిమా స్వర్ణ పతకం కోల్పోయింది. ఆ ఏడాది “సత్యజిత్ రే” తీసిన “పథేర్ పాంచాలి” కి స్వర్ణ పతకం లభించింది. అప్పట్లో బెంగాలీ కథలను, సినిమాలను తెలుగులో నిర్మించడం ఎక్కువగా ఉండేది. అలాంటిది “బంగారు పాప” సినిమాను బెంగాలీ భాషలో పునర్నిర్మించారు. తీసింది ఎవరో కాదు ప్రముఖ బెంగాలీ దర్శకులు “దేవకీ కుమార్ బోస్”. నిజానికి బి.యన్.రెడ్డి ఆయనకు ఏకలవ్య శిష్యుడు.

“దేవకీ కుమార్ బోస్” తీసిన సీత (1934) సినిమా చూశాకనే తనకసలు సినిమా మీడియా మీద ఆసక్తి ఉదయించింది అని బి.యన్.రెడ్డి గారు ఎప్పుడూ చెబుతుండేవారు. అలాంటిది ఆయనే వచ్చి సినిమా బెంగాలీ భాషలో తన సినిమాను తీసుకుంటానంటే నివ్వెరపోవడం   బి.యన్.రెడ్డి వంతయ్యింది. తెలుగులో తన సినిమా విజయం సాధించలేదని బి.యన్.రెడ్డి గారు చెప్పినా కూడా బోస్ వినలేదు. “కానీ” కూడా తీసుకోకుండా “బంగారు పాప” పునర్నిర్మాణ హక్కులను బి.యన్.రెడ్డి గారు ఆయనకు ఇచ్చారు. “సోనార్ ఖతి” పేరుతో ఆయన ఈ సినిమాను 1958లో బెంగాలీ భాషలో తీశారు. అక్కడ కూడా ఆ సినిమా పరాజయం పాలైంది.

బి.యన్.రెడ్డి ని సన్మానించిన లాయర్ల సంఘం...

“బంగారు పాప” సినిమా విడుదల అయ్యాక ఆంధ్రప్రదేశ్ లోని ఒకానొక లాయర్ల సంఘం బి.ఎన్.రెడ్డి గారిని సన్మానించింది. అప్పట్లో రాష్ట్రమంతటా ఏ ఇద్దరు విద్యాధికులు కనిపించినా కూడా “బంగారు పాప” సినిమా గురించే మాట్లాడుకునేవారు. ఈ లాయర్ల సంఘం సభలో కూడా అంతా “బంగారు పాప” సినిమా గురించి మాట్లాడారు. చాలా గొప్ప చిత్రం అన్నారు. బి.యన్ జీనియస్ అని పొగిడారు. కొద్దిసేపటి తరువాత బి.యన్ గారు ప్రసంగిస్తూ “మనస్పూర్తిగా అభ్యర్థిస్తున్నాను, మీలో నిజంగా ఎంతమంది నా సినిమా చూశారో చెప్పండి” అని తాను సభికులను ప్రశ్నించారు.

అంతమందిలోనూ చేతులెత్తింది కేవలం 12 మంది మాత్రమే. దాంతో బి.యన్ గారికి చాలా బాధేసింది. నా సినిమా గురించి మాట్లాడేవారే తప్ప చూసేవారు లేరన్న విషయం తెలిసి వచ్చింది. “ఉత్తమ ప్రేక్షకుల సంఖ్య ఎంతో కూడా అవగతం అయ్యింది” అని ఆయన అన్నారు. ఆ తర్వాత “బంగారు పాప” సినిమా అలా సెమినార్లకు, చిత్రోత్సవాలకు మాత్రమే పరిమితం అయ్యింది. 1989లో ఈ సినిమాను దూరదర్శన్ జాతీయ కార్యక్రమాలలో ప్రచారం చేసినప్పుడు మద్రాసులోని సినిమా వారంతా పనిగట్టుకుని ఇల్లు కదలకుండా ఈ సినిమాను చూశారు. ఆ తరువాత వారం రోజులపాటు ఎవరి నోట విన్న దీని గురించే చర్చ జరిగేది.

జమునకు చిన్న పాత్రతో పెద్దపేరు..

బంగారు పాప సినిమాలో శాంత పాత్రలో అభినయించింది జమున గారు. తనకిది నాలుగో సినిమా. కథలో శాంత మహారాష్ట్ర పిల్ల. ఆ ఛాయలున్న నటి కోసం బి.యన్ గారు ముమ్మరంగా అన్వేషించగా ఆయనకు జమున తారసపడింది. జమున గారు 1953లో పుట్టిల్లు చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన  మరుసటి ఏడాదికి వద్దంటే డబ్బు ద్విభాష చిత్రంలో రెండవ నాయకగా, అదే ఏడాది “అంతా మనవాళ్లే” లో కూడా ఉప కథనాయికగా చేశారు. నాయికగా వచ్చిన తనకు ఇలా రెండో నాయిక పాత్రలు రావడం జమున గారికి నిరాశ కలిగించింది. అదే సమయంలో బి.యన్.గారు అతిథి పాత్రకు అడిగారు. పుట్టిల్లు సినిమాలో నాయికగా ఎన్నో భావోద్వేగాలను చక్కగా అభినయించిన జమున గారు బి.యన్ గారిని బాగా ఆకట్టుకున్నారు.

17 ఏళ్ల వయస్సులోనే ఎంతో పరిపక్వత చూపించిన జమున గారు మాత్రమే శాంత పాత్రకు సంపూర్ణ న్యాయం చేయగలరని ఆయన భావించారు. ఈ సినిమాలో శాంత పాత్ర కేవలం నాలుగైదు సన్నివేశాలకు మాత్రమే పరిమితమవుతుందని ఆయన ముందే చెప్పేశారు. చిన్న వేషమని సందేహించవద్దని తన తదుపరి చిత్రంలో నాయిక వేషం ఇస్తానని కూడా వాగ్దానం చేశారు. వాహినీ కార్యాలయంలో ముందుగా మేకప్ టెస్ట్ చేశారు. జమున గారికి చీర కట్టుకోవడం అప్పటికి బాగా రాదు. సినిమాలో శాంత తొమ్మిది గజాల చీరతో కనిపించాలి. కళాదర్శకుడు ఏ.కే.శేఖర్ మహారాష్ట్రుడు. ఆయన భార్య ఆరోజు దగ్గరుండి జమునకు చీరకట్టులో సహకరించారు.

జమునకు తప్పిన ప్రమాదం

సినిమాలో అత్యంత కీలకమైన తుఫాను సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు గాలి వానలో శాంత భర్త దగ్గరకు బయలుదేరుతుంది. కానీ ఉన్నట్టుండి మధ్యలో పెనుగాలికి చెట్టు కూలి దుర్మరణం పాలవుతుంది. పాప మాత్రం బ్రతుకుతుంది. చిత్రీకరణ మొదలైంది. చేతిలో పసి బిడ్డను పట్టుకొని గాలివానిలో చీర కుచ్చెళ్లను సర్దుకుంటూ నడవడం అన్నది జమున గారికి చాలా ఇబ్బంది అయ్యింది. ఎలాగోలా ఆ సన్నివేశాన్ని ఆమె పూర్తి చేసింది. ఆ తరువాత చెట్టు కూలి శాంత మరణించడం తీస్తున్నారు. జమునను నేలపై పడుకోబెట్టి పైన చెట్టు దుంగ ఒకటి పెద్దది వేశారు.

ఫ్లోర్ పైన పెద్ద పెద్ద పైపు లైన్లను అమర్చి వర్షం జల్లు మాదిరి నీళ్లు కిందికి పడే ఏర్పాటు చేశారు.   అయితే ప్రొఫెల్లర్లు సరిగ్గా పనిచేయకపోవడంతో నీళ్లు ఒక్కసారిగా కెరటంలా తన మీదకు వచ్చి పడ్డాయి. జమున ఉక్కిరిబిక్కిరి అయ్యింది. నిజంగానే చచ్చిపోతానని భయపడింది. చేతులు పైకి ఎత్తి ఊపిరి ఆడడం లేదని సైగ చేసింది. వెంటనే యూనిటీ సభ్యులు ప్రొఫెల్లర్లు కట్టేసి పరుగున వచ్చి జమునను లేవదీశారు. ఆ సంఘటన గుర్తుకు వస్తే భయంతో ఒళ్ళు జలదరిస్తుందని జమున గారు చెప్పేవారు. బి.యన్.రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి తన తదుపరిచిత్రం “భాగ్యరేఖ” లో ఆవిడకు నాయిక వేషం ఇచ్చారు. శత దినోత్సవం జరుపుకున్న ఆ సినిమా జమున గారికి ఎనలేని పేరు తెచ్చి పెట్టింది.

కృష్ణ కుమారి జీవితంలో ఓ తీయటి జ్ఞాపకం…

“బంగారు పాప” సినిమాలో ప్రధాన పాత్ర దక్కడం తనకు సినిమా జీవితంలో పెద్ద వరమని కృష్ణకుమారి చెప్పుకొచ్చారు. సినిమా పరిశ్రమలోకి వచ్చిన నాలుగేళ్లకే “వాహినీ” లో నటించే అవకాశం తనకు వచ్చింది. ఆ పాప పాత్రకు కావలసిన అమాయకత్వం తనలో కనిపించడంతో బి.యన్.రెడ్డి గారు ఆ వేషానికి ఆమెను ఎంపిక చేశారు. పట్టుమని పది సినిమాలు అనుభవం కూడా లేకుండా ఆమెకు ఆ సినిమాలో అవకాశం వచ్చింది. వాహినీ స్టూడియోలో ఎంత పెద్ద తార అయినా విధిగా రోజు కార్యాలయంకు వచ్చి రిహార్సల్ లో పాల్గొనవలసిందే. టాన్సిల్స్ కారణంగా కృష్ణ కుమారి గారి గొంతు బాగుండేది కాదు. మద్రాసులో ఇ.యన్.టి స్పెషలిస్ట్ గా ప్రసిద్ధుడైన సత్యనారాయణకి బి.యన్ రెడ్డి గారు స్వయంగా ఫోన్ చేసి మా కథానాయికను పంపిస్తున్నాను   జాగ్రత్తగా వైద్యం చేయండి అని చెప్పారు. టాన్సిల్స్ ఆపరేషన్ అయ్యాక గొంతు చక్కగా వచ్చింది. ఆమె కాస్త ఒళ్ళు కూడా చేశారు. బంగారు పాప సినిమాలో కృష్ణ కుమారి గారు కొన్నిచోట్ల పీలగానూ, కొన్ని చోట్ల బొద్దు గానూ కనిపిస్తారు. జాగ్రత్తగా చూస్తే ఈ విషయం తెలుస్తుంది.

సినిమాలో ఆమె సన్నివేశాలాన్నీ ఎక్కువగా రంగారావు గారితో, రామ శర్మ గారితో ఉంటాయి. బంగారు పాప సినిమా వ్యాపార పరంగా విజయం సాధించి ఉంటే ఆమె సినీ ప్రస్థానం ఇంకోరకంగా ఉండేదేమో. ఆ సినిమా అపజయం తెలుగులో ఆమె కెరియర్ ను బాగా దెబ్బతీసింది. అంతకు ముందు వచ్చిన “అంతా మనవాళ్లే” సినిమా కూడా అపజయం పాలయ్యింది. దానితో తెలుగులో ఆమెకు చాలా కాలం అవకాశాలు లేకుండా పోయాయి. నిరుత్సాహం, నిర్వేదం ఆమెను చుట్టుముట్టేశాయి. సరిగ్గా అదే సమయానికి ఎల్వీ ప్రసాద్ గారు ఆమెకు “ఇలవేల్పు” సినిమాలో రేలంగి పక్కన అవకాశం ఇచ్చారు. నటిగా ఆమెకు పునర్జీవితం ప్రసాదించారు.   ఆ తరువాత విఠలాచార్య గారు తన సినిమాలలో వరుసగా అవకాశాలు ఇచ్చారు. “బంగారు పాప” చిత్రం “వ్యాపార పరంగా పెద్దగా విజయం సాధించనప్పటికీ, నటిగా నాకు ఎనలేని సంతృప్తినిచ్చి, నా సినిమా జీవితంలో ఓ తీయటి జ్ఞాపకం” గా మిగిల్చిందని కృష్ణ కుమారి గారు చెప్పుకునేవారు.





Show More
Back to top button