ఆమె నర్తిస్తే నాగినిలా పామే కదిలినట్టుంటుంది, ఆమె నృత్యం చేస్తే శిఖి పించం నర్తిస్తున్నట్లుంటుంది, ఆమె నాట్యం ఆడితే పడుచు గుండెలపై చెరగని ముద్ర వేసినట్లుంటుంది. ఆమె కోసం సినిమాలో సన్నివేశం లేకున్నా ప్రత్యేకంగా ఆమెకు ఒక నృత్య పాట పెట్టి ఆమెకు ఒక హోదాను కల్పిస్తారు దర్శకులు. కేవలం వాయిద్య సంగీతంతో ఆమెతో నృత్యం చేయించి సినీరంగంలో ఆమె స్థాయిని, స్థానాన్ని పెంచుతుంటారు సినీ నిర్మాతలు. అంతటి ప్రతిభ గల నృత్యకారిణి, నాట్యంను ఒక ప్యాషన్ గా మలుచుకున్న కళాకారిణి యల్.విజయలక్ష్మి (లక్ష్మణన్ విజయలక్ష్మి). ఆమె ఒక భారతీయ నటి మరియు శాస్త్రీయ నృత్యకారిణి. ఆమె మలయాళం , తమిళం , కన్నడ , తెలుగు మరియు హిందీ చిత్రాలలో నటించిన అద్భుతమైన నటి. బాల నటిగా “సిపాయి కూతురు” (1959) సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమై ఆ తరువాత “జగదేకవీరుని కథ”, “ఆరాధన”, “గుండమ్మ కథ”, “నర్తన శాల”, “పూజా ఫలం”, “బొబ్బిలి యుద్ధం”, “రాముడు బీముడు”, “భక్త ప్రహ్లాద” వంటి ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఊర్రూతలూగించి ఎన్నో అద్భుతాలు సృష్టించిన అలనాటి అందాల తార ఎల్.విజయలక్ష్మి.
యల్. విజయలక్ష్మిని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది నాట్య కళాకారులుగా ఎదిగారు. ఒకవైపు సినిమాలలో నృత్య పాత్రలలో నటిస్తూనే, మరోవైపు సినిమాలలో ప్రధాన కథనాయిక పాత్రలను ఆమె పోషించారు. పెళ్లి తరువాత సినిమాలకు స్వస్తి పలికి భర్తతో కలిసి విదేశాలకు వెళ్ళిపోయి ఉన్నత విద్యను అభ్యసించారు. బెనారస్ హిందూ మెట్రిక్యులేషన్ పరీక్ష వ్రాశారు. ఆ తరువాత ఆమె మద్రాస్ విశ్వవిద్యాలయంలో కరస్పాండెన్స్ ద్వారా బి.కామ్ పూర్తి చేశారు. ఇలా ఎన్నో ఉన్నత చదువులు చదివిన ఆమె వర్జీనియాలోని బ్లాక్స్బర్గ్లో ఉన్న వర్జీనియా పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ అండ్ స్టేట్ యూనివర్శిటీలో అకౌంటింగ్లో మాస్టర్స్ మరియు సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటింగ్ పూర్తి చేశారు. కాలిఫోర్నియాలోని డేవిస్‌లో నివాసమున్న వారికి సిలికాన్ వ్యాలీలో తన కుమారుడికి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. 1991 వ సంవత్సరంలో, ఆమె యునైటెడ్ స్టేట్స్కు వెళ్లి, ఆడిటర్‌గా మారి, వర్జీనియా పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయంలో బడ్జెటింగ్ అధికారిగా ఉద్యోగం సంపాదించారు. కేవలం నాట్య తారగానే కాకుండా దానికి ఏమాత్రం పోలికలేని వృత్తిని ఎంచుకుని, ఉన్నత విద్యను అభ్యసించి వృత్తి జీవితంలో కూడా అత్యున్నత స్థానాన్ని అధిరోహించారు యల్.విజయలక్ష్మి.
నేపథ్యం…
తిరునెల్వేలి అనేది భారతదేశం లోని తమిళనాడు రాష్ట్రముకు చెందిన తిరునెల్వేలి జిల్లాలోని ఒక ప్రధాన నగరం. ఇది రాష్ట్ర రాజధాని మద్రాసు నుండి నైరుతిన 624 కి.మీ దూరంలో ఉంది. ఈ తిరునల్వేలిలో నివాసం ఉంటున్న లక్ష్మణన్ (తండ్రి), కాంతిమతి (తల్లి) దంపతులకు 05 మే 1944 నాడు యల్.విజయలక్ష్మి జన్మించారు. వీరి తండ్రి లక్ష్మణన్ మిలటరీలో అకౌంట్స్ ఆఫీసర్ (ఆర్థిక వ్యవహారాలు, పద్దులు, తనిఖీ మరియు నగదు నిర్వహణను పర్యవేక్షించే అధికారిని) గా పని చేస్తూ ఉండేవారు. అందువలన ఆమె బాల్యం ఎక్కువశాతం పూనే లోనే గడిచింది. అక్కడ సౌత్ ఇండియన్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన రోటరీ క్లబ్ లో జరిగే నృత్య ప్రదర్శనలకు తన ఆరు సంవత్సరాల వయసులో అమ్మానాన్నలతో కలిసి వెళుతూ ఉండేవారు యల్. విజయలక్ష్మి. ఆ సౌత్ ఇండియన్ అసోసియేషన్ క్లబ్ లో వైజయంతిమాల, లలిత మరియు పద్మినిల నృత్య ప్రదర్శనలను తిలకించి వారి నుండి విజయలక్ష్మి ప్రేరణ పొందారు. ఆ నృత్య ప్రదర్శనలు చూసిన తరువాత ఆమె తన ఇంటి పెరట్లో నృత్యం సాధన చేయడం ప్రారంభించారు. వారిని అనుకరించి ఆమె నాట్యం చేసేవారు. ఆ విధంగా విజయలక్ష్మికి పసి వయసులోనే నృత్యం అనేది తన జీవితంలో భాగమైపోయింది. తన తల్లి కాంతిమతి కూడా గాయని. ఆమె వీణ విద్వాంసురాలు. వీణ చాలా బాగా వాయించేవారు. అమ్మ కాంతిమతి వీణ వాయిస్తూ ఉంటే విజయలక్ష్మి కాళ్లు కదుపుతూ నృత్యం చేస్తూ ఉండేవారు.
రసిక రంజని మహాసభలో అరంగేట్రం…
విజయలక్ష్మికి నాట్యంపై ఉన్న ఆసక్తిని గమనించి, పూనే లోనే ఆమె ఇంటి పక్కనే ఉంటున్న మాలిని అనే ఆమె ఎక్కడ నృత్య ప్రదర్శనలు జరిగినా కూడా విజయలక్ష్మిని తనతో పాటే తీసుకెళ్లేవారు. విజయలక్ష్మి ఆసక్తిని గమనించిన నాన్న లక్ష్మణన్ ఆమెను పూనేలో నివాసం ఉంటున్న సుకుమార్ పిళ్ళై అనే నాట్య గురువు వద్ద చేర్పించారు. తండ్రి ఉద్యోగం చేసే ప్రాంతంలో ఒకసారి ఆమె చేసిన నృత్య ప్రదర్శనను తిలకించిన గవర్నర్ బి.జీ.కేర్ ఆమెను మెచ్చుకున్నారు. ఆమె తన తొమ్మిది సంవత్సరాల వయస్సులో ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో ఉన్న యర్రగుంట్ల పట్టణ కేంద్రంలో ఒక స్వామీజీ సమక్షంలో నాట్య ప్రదర్శన ఇచ్చారు.
ఈ విధంగా సుమారు సంవత్సరం పాటు కొనసాగింది. అయితే ఆమెకు నాట్యంలో మెరుగైన శిక్షణ కోసం దక్షిణ భారతదేశపు సాంస్కృతిక నగరమైన మద్రాసుకు వెళ్లారు. అక్కడ మైలాపూర్‌లోని సౌత్ మాడా వీధిలో నివాసం ఉంటూ విజయలక్ష్మిని అక్కడే వున్న రోటరీ కాన్వెంట్ లోని పాఠశాలలో చదివిస్తూ, నృత్యంలో వేయి ఆరంగేట్రంలు చేయించిన గురువు అయిన కె.జె. సరస (భరతనాట్యంలో సాంప్రదాయ ఉపాధ్యాయురాలు) వద్ద చేర్పించాలని అనుకున్నారు. కానీ ఆమె సూచన మేరకు వాళువూర్ రామయ్య పిళ్ళై వద్ద చేర్పించారు.
అయితే ఆయన కేవలం కూర్చునే నాట్యమును ఎలా చేయాలో చూపించేవారు. దానిని ప్రముఖ నర్తకి ఈవీ సరోజ అభినయించి చూపించేవారు. ఇలా రామయ్య పిళ్ళై వద్ద శిష్యురాళ్ళు నేర్చుకునేవారు. ఆయన వద్ద చేరిన కొద్ది రోజులకే గురువు దగ్గర గొప్ప శిష్యురాలిగా పేరు తెచ్చుకున్నారు. గురువు రామయ్య పిళ్ళై వద్దకు ఎవరైనా సందర్శకులు వస్తే విజయలక్ష్మి విరామం లేకుండా నాలుగు గంటల పాటు నృత్య ప్రదర్శన చేసేవారు. ఈవిధంగా ఒక సంవత్సరం గడిచింది. తొలిసారి ఆమెకు ఒకరోజు “నీతిపతి” అనే ఒక తమిళ సినిమాలో ఒక సన్నివేశంలో నృత్యం చేసే పాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఆ తరువాత ఎన్నో రోజులుగా నృత్యం చేస్తూ ఉన్న విజయలక్ష్మి, 28 అక్టోబరు 1955 నాడు సాంస్కృతిక సంస్థ అయిన రసిక రంజని మహాసభలో అరంగేట్రం చేశారు.
సినీరంగ ప్రవేశం…
విజయలక్ష్మి వాళ్ళది మొదటినుండి మధ్యతరగతి కుటుంబం. అందుకే ఆమె ఆరంగేట్రం చేసిన మొదటిరోజే ఒకే చీరలో మూడు గంటలపాటు నృత్యం చేశారు. ఆ ఆరంగేట్రానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధులు, భరతనాట్య ప్రచారకులు వి. ఆర్. కృష్ణ అయ్యర్ హాజరయ్యారు. వీరితోపాటు వి.శాంతారామ్ అనే ప్రముఖ హిందీ దర్శకులు కూడా హాజరయ్యారు. అప్పటికి ఆమె వయస్సు పదకొండు సంవత్సరాలు మాత్రమే. ఆ ఆరంగేట్రంలో ఆమె నాట్య ప్రదర్శన మొదలు మద్రాసులో ఎక్కడ నృత్య ప్రదర్శన జరిగినా కూడా యల్.విజయలక్ష్మి కి ఆహ్వానం వెళ్లాల్సిందే. ఆమె తన గురువు రామయ్య పిళ్ళై సూచన మేరకు స్వామినాథ పిళ్ళై, గౌరీ అంబానీ లాంటి గురువుల వద్ద కూడా నృత్యంలో మరింత మెరుగైన శిక్షణ తీసుకున్నారు. ఆ విధంగా నాలుగు సంవత్సరాలు నృత్యం నేర్చుకున్నాక ఎల్.విజయలక్ష్మి కి తెలుగు చిత్రసీమ నుండి పిలుపు వచ్చింది. ఆ సినిమా అవకాశం వచ్చింది తెలుగు 1959 లో వచ్చిన “సిపాయి కూతురు”. ప్రముఖ నటులు కైకాల సత్యనారాయణ ఈ సినిమాతోనే సినీ రంగ ప్రవేశం చేశారు.
కొవ్వలి లక్ష్మీనరసింహారావు వ్రాసిన సిపాయి కూతురు అనే పేరు గల నవల ఆధారంగా నిర్మించబడిన సినిమా అది. పి.చంగయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జమున, సూర్యకాంతం, గుమ్మడితో కలిసి విజయలక్ష్మి నటించారు. డి.ఎల్.నారాయణ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో రాజనాల పక్కన రెండు నృత్యాలు చేయడానికి నృత్య కళాకారిణిగా యల్.విజయలక్ష్మిని నటింపజేయడానికి ఆమె అమ్మానాన్నలని బలవంతంగా ఒప్పించి ఆమెతో నృత్య పాత్రలో నటింపజేశారు. 11 సెప్టెంబరు 1959 లో “సిపాయి కూతురు” విడుదలైంది. ఆ తరువాత 1959 నుండి 1967 వరకు సుమారు ఎనిమిది సంవత్సరాల పాటు విజయలక్ష్మి వెండితెర జీవితం ఒక ప్రభంజనమనే చెప్పాలి. ఏ సినిమాలోనైనా సరే ఆమె శాస్త్రీయ నృత్యం కానీ, ఆమె నృత్య ప్రదర్శన కానీ ఉండాల్సిందే. ఆమె సినిమా జీవితంలో మొట్టమొదట నాలుగు సంవత్సరాలలో నలభై సినిమాలలో నటించారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ ఒకదాని తరువాత ఒకటిగా అవకాశాలు వస్తూనే ఉండేవి. మొత్తానికి ఎనిమిది సంవత్సరాలలో ఆమె 100కు పైగా చిత్రాలలో నటించారు.
“రాముడు భీముడు” లో కథానాయికగా…
నృత్య పాత్రలను ఎక్కువగా పోషించే యల్.విజయలక్ష్మి అప్పట్లో తన నాట్యంతో పడుచు గుండెలపై చెరగని ముద్ర వేశారని చెప్పవచ్చు. ఆమె నృత్యకారిణిగా కొనసాగుతున్న రోజులలో 1964 వ సంవత్సరంలో ఆమె వెండితెర జీవితం ఒక మలుపు తిరిగింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మొదలుపెట్టి అప్పుడే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు తొలిసారిగా ఎన్.టి. రామారావుతో “రాముడు భీముడు” (1964) అనే చిత్రాన్ని నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన మొదటి చిత్రం “రాముడు భీముడు” చిత్రంలో ప్రధాన కథనాయిక జమునతో పాటుగా మరొక నాయిక ఎల్.విజయలక్ష్మి ఎంపిక చేయబడ్డారు. ఈ చిత్రంలో మంచి అభినయం ప్రదర్శించిన ఆమె కేవలం నృత్యకారిణిగానే కాదు, అద్భుతమైన నటిగా, గొప్ప కళాకారిణిగా నిరూపించుకున్నారు. “మంగమ్మ శపథం” (1965), “తోటలో పిల్ల కోటలో రాణి” (964), సురేష్ పిక్చర్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన “ప్రతిజ్ఞ పాలన” (965) చిత్రంలో కాంతారావుతో కలిసి నృత్య ప్రదర్శన పాటలో నటించారు. ఒకవైపు ఆమె కథానాయికగా కొనసాగుతూనే మరోవైపు నృత్య ప్రధాన పాత్రల ఎంపికలో దృష్టి కలిగి ఉన్నారు.
వాయిద్య సంగీతంతో గుండమ్మ కథ (1962) లో పాట…
“శ్రీకృష్ణ తులాభారం” (1966) లో “కొనుమిదే కుసుమాంజలి అమరుల ప్రణయాంజలి”, భక్త ప్రహ్లాదలో “రారా ప్రియా సుందరా”, “భామా విజయం” (1967) ఎన్టీఆర్ తో ఒక కథానాయికగా (రారా సుందరా ఇటు రారా సుందరా రసతీరాల తేలింతు ఈ రేయి పాటలో) మొదలగు చిత్రాలలో నటించారు. ఇవే కాకుండా “ఉమ్మడి కుటుంబం” (1967), “నిండు మనసులు” (1967) లాంటి సాంఘిక చిత్రాలలో కూడా ఎల్.విజయలక్ష్మి నటిగా కొనసాగారు. అప్పుడప్పుడు కొన్ని చిత్రాలలో నృత్య పాటలలో కూడా నర్తించారు. గుండమ్మ కథ (1962) సినిమాలో సన్నివేశం లేకపోయినా కూడా కేవలం వాయిద్య సంగీతంతో ఎల్.విజయలక్ష్మి కి ఒక పాట పెట్టారు. నిర్మాతలు, దర్శకులు ఎల్.విజయలక్ష్మిని ఎంతగా అభిమానించేవారనేందుకు ఉదాహరణ అది. రాముడు భీముడు చిత్రాన్ని తమిళంలో “ఎంగా వీట్టు పిళ్ళై” (1965) లో పునర్నిర్మించేటప్పుడు సహజంగానే నటిగా విజయలక్ష్మిని ఎంపిక చేయాలి. కానీ జి.వరలక్ష్మీ అక్కయ్య గారి అమ్మాయి రత్నను ఎంపిక చేశారు. దాంతో యల్.విజయలక్ష్మి కోసం నిర్మాత నాగిరెడ్డి ప్రత్యేకమైన దృశ్యాన్ని కల్పించి ఆమె నృత్యానికి పాట పెట్టారు. అంతగా ఆమె నృత్యానికి ప్రతిభకు గుర్తింపు ఇస్తూ ఉండేవారు దర్శకనిర్మాతలు. అలాగే ఆమె ఎంజీఆర్ తో కలిసి ఒక తమిళ సినిమాలో బాంగ్రా నృత్యం చేశారు. ఆమె మలయాళం లో జ్ఞాన సుందరి, లైలా మజ్ను తదితర చిత్రాల్లో నటించారు.
సురజిత్ కుమార్ దే దత్తాతో వివాహం…
యల్.విజయలక్ష్మి నటించిన తొలి హిందీ చిత్రం షబ్నం (1964) లో ఆమె ద్విపాత్రాభినయం చేశారు. అలాగే ఆమె సంజీవ్ కుమార్ తో కలిసి మూడు, నాలుగు చిత్రాలలో నటించారు. ఇలా ఆమె సినీ జీవితం తెలుగు, తమిళ మలయాళ చిత్రాలలో కొనసాగుతూ ఉండగానే ఆమెకు బెంగాల్ నుండి అవకాశం వచ్చింది. పండిట్ రవిశంకర్ తమ్ముడు దర్శకుడుగా సినిమా తీయాలి అనుకున్నారు. కానీ కుదరలేదు, ఆ సినిమా మొదలవ్వలేదు. అయితే ఆ సినిమా కోసం ఆవిడ బెంగాలీ నేర్చుకున్నారు. అదే తరువాత రోజులలో తను యాదృశ్చికంగా బెంగాలీ కోడలుగా స్థిరపడేలా చేసింది. ఫిలిప్పీన్స్ లోని మనీలాలో ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో శాస్త్రవేత్త సురజిత్ కుమార్ దే దత్తాను వివాహం చేసుకున్నారు. ఆయన అక్కడ రిసర్చ్ సైంటిస్ట్ గా ఉన్నారు. తన తల్లిదండ్రులు బ్రిటీషు వారి వద్ద ఉద్యోగం చేస్తూ బర్మాలో ఉండేవారు. వాళ్ళ నాన్నగారికి ఏడుగురు పిల్లలలో ఈయన ఒకరు. ఆ తరువాత వారు బర్మా నుండి కలకత్తా వచ్చారు. ఉద్యోగరీత్యా కలకత్తాలోనే ఉన్నారు.
సురజిత్ కుమార్ దే దత్తా మెడిసిన్ చదవాలనుకున్నారు. కానీ కుటుంబ పరిస్థితులు అనుకూలించక అగ్రికల్చరల్ రీసెర్చ్ మీద ఆసక్తితో వ్యవసాయ సంబంధమైన శాస్త్రం చదవాలని తొలుత బెనారస్ యూనివర్సిటీలో ఆ తరువాత న్యూఢిల్లీలో చదువుకున్నారు. ఆ తరువాత 1922 లో హవాయ్ యూనివర్సిటీలో ఆయన పరిశోధన చేశారు. అక్కడ పరిశోధన చేసి డాక్టరేటు తెచ్చుకున్నాక, ఒహయో స్టేట్ యూనివర్సిటీ కొలంబస్ లో కొంతకాలం పనిచేసి 1925 – 1926 సంవత్సరంలో మనీలాలోని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ప్రొఫెసర్ గా పనిచేశారు. ఐ.ఆర్.8 అనే వరి వంగడం కనిపెట్టడంలో కీలకపాత్ర పోషించారు. 1965 – 1966 సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా విరివిగా వరి పండడానికి ముఖ్య కారణం ఐ.ఆర్. 8 అనే వరి వంగడం. దానిని కనిపెట్టి శాస్త్రజ్ఞుల బృందానికి సురజిత్ కుమార్ దే దత్తా నాయకుడిగా ఉన్నారు. ఆ తరువాత రోజులలో 22 దేశాల నుంచి సుమారు 77 మంది శాస్త్రవేత్తలు ఆయన దగ్గర రీసెర్చ్ చేసి డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు.
ఆఖరు సినిమా “అగ్ని పరీక్ష” (1974)…
సురజిత్ కుమార్ దే దత్తా 350 కి పైగా సైంటిఫిక్ పేపర్లను ఆయన ప్రచురణ చేశారు. అంత ఘనత ఉన్న తన సొంతం. ఆయనకు మిత్రుడుగా ఉన్న మరో శాస్త్రవేత్త రామకృష్ణ స్వయాన ఎల్.విజయలక్ష్మికి పెద్దన్నయ్య. ఆయన ద్వారా యల్.విజయలక్ష్మి ఫోటోను తొలిసారిగా చూశారు. ఆయన మద్రాసు వచ్చినప్పుడు ఆమె సినిమా చిత్రీకరణ జరుగుతుండగా ఆమెను కలిసి పరిచయం చేసుకున్నారు సురజిత్ కుమార్ దే దత్తా. ఆ తరువాత పలుమార్లు ఒకరినొకరు మాట్లాడుకోవడం, ఒకరినొకరు కలుసుకోవడం , ఒకరి అభిరుచులను మరొకరు తెలుసుకోవడం అలా దాదాపు సంవత్సరం పాటు కొనసాగింది. ఆమె గురించి సురజిత్ కుమార్ దే దత్తా వ్రాసిన ఉత్తరం చదివిన యల్.విజయలక్ష్మి అమ్మానాన్నలు ఆలోచించుకొని వివాహానికి సముఖత వ్యక్తం చేశారు. అలా 20 ఏప్రిల్ 1927 నాడు కలకత్తాలో బెంగాలీ సంప్రదాయం మరియు దక్షిణ భారతదేశ సంప్రదాయ ప్రకారం వారి వివాహం జరిపించారు. ఆ తరువాత నాలుగు రోజులకు మద్రాసు లోని వుడ్ ల్యాండ్ లో విందు ఏర్పాటు చేశారు. 1927 వ సంవత్సరంలో ఆమె భర్తతో కలిసి మనీలా వెళ్లిపోయారు. అయితే ఆమె సెలవుల్లో వెనక్కి తిరిగి వచ్చినప్పుడు ఒకటి, రెండు సినిమాలలో ఆవిడ నటించాల్సి వచ్చింది. అవి 1969 లో విడుదలైన “సిపాయి చిన్నయ్య”, అలాగే సూపర్ స్టార్ కృష్ణ సొంత సినిమా “అగ్ని పరీక్ష”. జూలై 1974 విడుదలైన “అగ్నిపరీక్ష” ఆమె నటించిన ఆఖరి సినిమా. ఆ తరువాత ఆమె ఎన్నడూ సినిమాలలో నటించలేదు.
ఫైనాన్స్ డైరెక్టరుగా ఉద్యోగం…
సురజిత్ కుమార్ దే దత్తా, ఎల్.విజయలక్ష్మి దంపతులకు 30 మార్చి 1975 నాడు ఒక అబ్బాయి జన్మించాడు. అతని పేరు రాజ్ కుమార్ దేవదత్త. అతను సిలికాన్ వ్యాలీ లో ఒక ప్రముఖ సంస్థను ప్రారంభించారు. యల్.విజయలక్ష్మి ఒకవైపు సినిమాలు మానేసినా కూడా తన రక్తంలో భాగమైన నృత్యం ఆమెకు గుర్తొస్తూనే ఉంది. పెళ్లి తరువాత సినిమాలు మానేశారు, నాట్యం లేదు, కానీ ఆమె చదువుకోవాలని అనుకున్నారు. మనీలా వదిలి మద్రాసు వచ్చి మెట్రిక్యూలోషన్ పాస్ అయ్యారు. 1985 వ సంవత్సరం నాటికి ఆమె బీకాం పూర్తి చేశారు. 1990 వ సంవత్సరంలో తన భర్త సహకారంతో ఆమె మనీలాలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. అప్పటికే ఆమె అబ్బాయి వయస్సు 15 సంవత్సరాలు. భర్త సురజిత్ కుమార్ దే దత్తాకు 1991 వ సంవత్సరంలో వర్జినియాటెక్ ఆఫీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ రీసర్చ్ ఎడ్యుకేషనల్ డెవలప్ మెంట్ డైరెక్టరుగా అవకాశం వచ్చింది. తరువాత రోజులలో అదే యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ ఎఫైర్స్ డైరెక్టరుగా పనిచేశారు.
యల్.విజయలక్ష్మి 16 సంవత్సరాల కొడుకుని తీసుకుని 1991 వ సంవత్సరంలో వర్జినియాటెక్ వచ్చేసారు. అమెరికాకు వచ్చాక కూడా ఆమె ఆర్థిక శాస్త్రంలో మాస్టరు డిగ్రీ చేశారు. 1994 వ సంవత్సరంలో భారతదేశంలో చార్టెడ్ అకౌంటెంట్ పూర్తి చేశారు. ఖాళీగా ఉండడం ఇష్టం లేని ఆమె అక్కడ కళాశాలలో చదువు చెప్పేవారు. ఆ క్రమంలో ఆమెకు వర్జినయ టెక్ లో ఫైనాన్స్ బడ్జెట్ ఆఫీస్ లో ఫైనాన్స్ డైరెక్టరుగా ఉద్యోగం వచ్చింది. నాట్య తారగానే కాదు దానితో ఏమాత్రం పోలికలేని వృత్తిని ఎంచుకొని వృత్తి జీవితంలో అత్యున్నత స్థానాన్ని అధిరోహించినందుకు ఎల్.విజయలక్ష్మిలో ఆదర్శ మహిళను చూడవచ్చు. ఆ విధంగా వర్జినయ టెక్ లో దాదాపు 17 సంవత్సరాలు ఆమె పనిచేశారు. 2011లో సురజిత్ కుమార్ దే దత్తా పదవీ విరమణ చేశాక సిలికాన్ వాలికి వచ్చేసారు. ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా నిత్య విద్యార్థిగా యల్.విజయలక్ష్మి కొనసాగుతున్నారు. వెబ్ డిజైనింగ్ నేర్చుకున్నారు. నృత్యం ఆమె అభిరుచి, సంగీతం నా ప్యాషన్, అంకెలు ఫైనాన్స్ నా కల, ఉద్యోగం కుటుంబం నా బలం అని ఆమె అంటుండేవారు.
ఇతర కథనాలు:
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం.. 24 ఏళ్లకే ఉరికంబం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి… నందమూరి తారకరామారావు.
‘ముఖ్యమంత్రి’గా అసాధారణ శకం: చంద్రబాబు నాయుడు..!









