
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 241 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి నెల రోజుల తర్వాత విడుదలైన ప్రాథమిక నివేదిక అనేక ఆసక్తికర అంశాలను వెల్లడించింది. కేవలం సాంకేతిక లోపాలే కాకుండా, కాక్‌పిట్‌లో ఉన్న గందరగోళం, పైలట్ల మధ్య ఉన్న అవగాహన లోపం, విమానాన్ని కంట్రోల్ చేయలేని స్థితి వంటి అంశాలు బయటపడ్డాయి.
టేకాఫ్ సమయంలో ఇంజిన్లకు ఇంధనం ఆపేయడం, ఆ సమయంలో పైలట్లు తీసుకున్న చర్యలు ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరుగుతోంది. ఒక పైలట్ ఫ్యూయల్ కట్ ఆఫ్ స్విచ్‌లు ఎవరు ఆఫ్చేసారన్న అనుమానం వ్యక్తం చేయగా.. మరొకరు “మనం అలాంటి పని చేయలేదు” అన్నారు. ఆ సమయంలో వీరి మధ్య అయోమయం స్పష్టంగా వినిపించిందని కాక్‌పిట్ రికార్డింగ్ వెల్లడిస్తోంది.
AAIB నివేదిక ప్రకారం, విమానం టేకాఫ్ సమయంలో ఫ్లాప్ సెట్టింగ్ 5° వద్ద ఉండటం సాధారణమే అయినప్పటికీ, ల్యాండింగ్ గేర్ లివర్ ‘డౌన్’ పొజిషన్లో ఉండటం అనుమానాలకు తావిస్తోంది. విమానం గాల్లోకి లేచిన వెంటనే సాధారణంగా పైలట్లు ల్యాండింగ్ గేర్‌ను వెనక్కి తీసుకుంటారు. ఇది ఏరోడైనమిక్ డ్రాగ్‌ను తగ్గించడమే కాక, ఇంధనాన్ని కూడా ఆదా చేస్తుంది. కానీ ప్రమాద సమయంలో ల్యాండింగ్ గేర్ లివర్ డౌన్లో ఉండటం లేదా పైలట్ల గమనించకపోవడమేనా? లేక ఏదైనా సాంకేతిక లోపమా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
నిపుణుల దృష్టిలో ఇది పెద్ద అనుమానంగా మారింది. ల్యాండింగ్ గేర్ లివర్ వల్ల విమానం ఇంజిన్లు పవర్ కోల్పోయాయా? అనేది పరిశీలనలో ఉంది. ఇది పైలట్ తప్పిదమా, లేదా మెకానికల్ ఫెయిల్యూర్ ఆ అనేది ఏదైనా కారణం కావచ్చు. ప్రస్తుతం దీనిపై మరింత లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.






