
ప్రస్తుత కాలంలో చాలామంది ఉదయం లేచిన వెంటనే రెండు స్లైస్‌ల బ్రెడ్‌తో రోజును ప్రారంభిస్తున్నారు. మధ్యాహ్నం సమయాల్లోనూ, సాయంత్రం టీ తాగేటప్పుడు స్నాక్స్‌గా కూడా బ్రెడ్‌నే ఎంచుకుంటున్నారు. ఇక రాత్రి సమయాల్లో పిజ్జాలు, బర్గర్ల రూపంలో బ్రెడ్ మన ఆహారంలో అంతర్భాగమైపోయింది. అయితే, ఇలా ప్రతి పూట బ్రెడ్‌ను ఒక బహుమతిలా భావించి తినడం వల్ల భవిష్యత్తులో తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మీకు తెలుసా? ప్రారంభంలో రెండు స్లైస్‌లతో మొదలైన ఈ అలవాటు, కొద్దిరోజుల తర్వాత శరీరంలో ఎసిడిటీ, బ్లోటింగ్ (కడుపు ఉబ్బరం), మరియు గ్యాస్ వంటి సమస్యలను సృష్టిస్తుంది.
మనం అధిక బరువు పెరిగిపోవడానికి కూడా ఈ బ్రెడ్ వినియోగమే ప్రధాన కారణం. మన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని ఇబ్బందులు పడే వరకు, ఈ సమస్యలన్నీ బ్రెడ్ వల్లే వచ్చాయన్న నిజాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. బ్రెడ్‌తో ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే.. అది చాలా తక్కువ కాలం మాత్రమే నిల్వ ఉంటుంది. దీనిని ఎక్కువ రోజులు పాడవకుండా ఉంచేందుకు తయారీదారులు ఎన్నో రకాల కెమికల్ ప్రిజర్వేటివ్స్‌ను ఉపయోగిస్తారు. ఇవి మన జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అంతేకాకుండా, బ్రెడ్ తయారీలో రిఫైన్డ్ ఫ్లోర్ అంటే మైదాను ఉపయోగిస్తారు. ఈ మైదాలో పీచు పదార్థం (ఫైబర్) అనేది అసలు ఉండదు. పీచు పదార్థం లేని ఈ మైదాను తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు (Blood Sugar Levels) ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఇది క్రమంగా శరీరంలో ఇన్సులిన్ నిరోధకతకు (Insulin Resistance) దారితీస్తుంది.
అలాగే, బ్రెడ్‌లో ఉండే గ్లూటెన్ అనే ప్రోటీన్ కూడా చాలా మందిలో తీవ్రమైన జీర్ణక్రియ లోపాలను కలిగిస్తుంది. బ్రెడ్ వాడకం వల్ల కలిగే మరికొన్ని మేజర్ రిస్కులు ఏమిటంటే.. విపరీతంగా బరువు పెరగడం, ఫ్యాటీ లివర్ సమస్య రావడం మరియు డయాబెటిస్ (మధుమేహం) వచ్చే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. ఈ కారణాల వల్ల బ్రెడ్‌ను ‘వైట్ పాయిజన్’ (White Poison) నిపుణులు చెబుతున్నారు. అయితే బ్రెడ్ అసలు తీసుకోకూడదా అంటే.. వారంలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే అది కూడా మైదా బ్రెడ్ కాకుండా ‘హోల్ వీట్ బ్రెడ్’ (Whole Wheat Bread) తీసుకోవడం మంచిదని న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు.






