
ఇటీవల మాజీ సీఎం జగన్ మెడికల్ కాలేజ్ టేండర్లుపై చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తప్పుపట్టారు. జగన్ మెడికల్ కాలేజీలు కట్టకపోయినా, కట్టేశామని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. వైద్య విద్యార్థులు, వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడడం ప్రభుత్వ బాధ్యతేనని స్పష్టం చేశారు.
చంద్రబాబు మాట్లాడుతూ, “తాము ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం లేదు. పీపీపీ విధానంలోనే మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం. నిర్వహణ మాత్రం ప్రభుత్వానిదే. ఎవరూ అన్యాయం జరిగిందని అనుకోరాదు” అని తెలిపారు. బెదిరిస్తే వెనక్కి తగ్గే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.
రాయలసీమ పరిస్థితులపై మాట్లాడుతూ, ఒకప్పుడు ఆ ప్రాంతంలో పదేళ్లలో ఎనిమిదేళ్లు కరవు ఉండేదని గుర్తు చేశారు. దేశంలో అతి తక్కువ వర్షపాతం ఉన్న జిల్లా అనంతపురం అని, కానీ నీటిని సమర్ధవంతంగా వినియోగించడంతో పరిస్థితి మారిందని వివరించారు. ప్రస్తుతం అనంతపురం జిల్లానే జీఎస్‌డీపీలో గోదావరి జిల్లాల కంటే అగ్రస్థానంలో ఉందని తెలిపారు. హార్టికల్చర్ సాగు విస్తృతం కావడంతో ఈ మార్పు సాధ్యమైందని చెప్పారు.
అలాగే వృథా జలాలను మాత్రమే బనకచర్లకు వినియోగిస్తామని స్పష్టం చేశారు. “మా ప్రభుత్వం లక్ష్యం ప్రజలకు ప్రయోజనం చేకూర్చడమే. వైద్య విద్య, ఆరోగ్య రంగంలో ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటాం” అని చంద్రబాబు హామీ ఇచ్చారు.






