Telugu Special Stories

విశ్వనాథ సత్యనారాయణ వేయి పడగలు నవల ఎందుకు వ్రాశారు?

20 శతాబ్దపు తెలుగు రచయిత, “కవి సమ్రాట్” బిరుదాంకితుడు విశ్వనాథ సత్యనారాయణ. ఆయన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం నందమూరు గ్రామంలో జన్మించారు. అతను అధ్యాపక వృత్తిలో జీవితాన్ని గడిపారు. విద్యార్థి దశలో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనడం, తండ్రి మరణంతో దారుణమైన పేదరికం వంటి కారణాల వల్ల తాను బి.ఎ. పూర్తికాకుండానే ఆంధ్ర జాతీయ కళాశాలలో అధ్యాపకునిగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారు. అనంతరం అతను వివిధ కళాశాలల్లో అధ్యాపక పదవులు నిర్వహించారు. వివిధ కళాశాలల్లో వివిధ హోదాల్లో పనిచేసిన విశ్వనాథ సత్యనారాయణ 1957లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులుగానూ, 1958లో శాసనమండలికి నామినేటెడ్ సభ్యులుగానూ విధులు నిర్వర్తించారు.

తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలు అందించిన విశ్వనాథ సత్యనారాయణ  6 శతకాలు, 25 పైచిలుకు కావ్యాలు, 15 నాటకాలు, 13 గేయకావ్యాలు, 10 సంస్కృత నాటకాలు, 58 నవలలు, 10 విమర్శన గ్రంథాలు, మరెన్నో వ్యాసాలు, ఉపన్యాసాలు వ్రాశారు. విశ్వనాథ రచనల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి నవల “వేయిపడగలు”. ఇది విశ్వనాథ నవలలలో అత్యంత ప్రసిద్దమైన నవలగా ప్రజాదరణ పొంది పలుమార్లు పునర్ముద్రితమైంది. 1934 వ సంవత్సరంలో సరిగ్గా 29 రోజుల్లో 999 అరటావుల మీద వ్రాసిన ఈ నవలను విశ్వనాథ సత్యనారాయణ ఆశువుగా చెబుతుండగా అతని తమ్ముడు వేంకటేశ్వర్లు వ్రాశారు. ఆనాడు ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ప్రకటించిన పోటీ కోసం వ్రాయబడిన ఈ నవల వ్రాయడానికి గల కారణాలు ఏమి? ఈ నవల వ్రాయడానికి దోహదం చేసిన అంశాలేమి? తెలుసుకుందాం..

ఏ.సి కళాశాల కు రాజీనామా ఇచ్చిన విశ్వనాథ…

1920 – 1921 సంవత్సరాలలలో బందరు లోని ఒక చారిత్రక మరియు ప్రతిష్టాత్మక కళాశాలగా పేరుగాంచిన నోబెల్ కళాశాలలో విశ్వనాథ సత్యనారాయణ డిగ్రీ చదువుకుంటూ ఉండేవారు. అయితే ఆయన ఆ సమయంలో డిగ్రీ పరీక్షలో తప్పారు. దాంతో ఆయనకు డిగ్రీ పూర్తి చేయడానికి దాదాపు ఏడు సంవత్సరాల (1921 నుండి 1928 వరకు) సమయం పట్టింది. అయితే ఆ సమయంలో ఆయన బందరులో ఉన్న ఆంధ్ర జాతీయ కళాశాలలో తెలుగు ట్యూటర్ గా పనిచేశారు. 1928 వ సంవత్సరంలో బి.ఏ చదువు పూర్తయిపోయింది. అదే సమయంలో మద్రాసు యూనివర్సిటీ నుండి సంస్కృతంలో డిగ్రీ కూడా పుచ్చుకున్నారు. ఆ తరువాత ఆయన హిందూ కళాశాల, బందరులో తెలుగు ఉపన్యాసకుడు (లెక్చరర్) గా పనిచేశారు.

ఆ తరువాత ఆయన ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల, గుంటూరులో ఉపన్యాసకుడు (లెక్చరర్) గా వెళ్లారు. అయితే ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో విశ్వనాథ సత్యనారాయణ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆ కళాశాలలో కొంతమంది ఆకతాయిలు వివేకానంద స్వామి ఫోటోను క్రిందపడేసి కాలితో తొక్కుతున్నారు. ఆ ఫోటోను చింపిపడేయడం, వివేకానందను నానా బూతులు తిట్టడం లాంటివి చేస్తున్నారు. ఆ దృశ్యాలను అదే కళాశాలలో ఉన్న మరొక విద్యార్థి బృందం వారు చూసి, ఆ ఆకృత్యాలను వారు వ్యతిరేకించారు. ఇవన్నీ గమనిస్తున్న కళాశాల యాజమాన్యం వారికి విశ్వనాథ సత్యనారాయణ మీదనే అనుమానం వచ్చింది.

దాంతో ఆయనను పిలిచి, మీరే ఆ కుర్రాళ్లను ఉసిగొలిపి, వారిని రెచ్చగొట్టి ఈ పని చేయిస్తున్నారు అని అయనపై అభాండాలు వేశారు. అలాగే సంజాయిషీ కూడా అడుగుతున్నారు అని ఎవరో విశ్వనాథ సత్యనారాయణకు  వర్తమానం ఇచ్చారు. దానికి సమాధానంగా ఆయన నేనేమి చేయలేదు, నా తప్పేమీ లేదు. చేయని తప్పుకు నేను సంజాయిషీ ఇవ్వలేను అన్నారు. దానికి కళాశాల కమిటీ వారు మీరు సంజాయిషీ ఇవ్వకుంటే మిమ్ములను కళాశాల నుండి తొలగించాల్సి ఉంటుంది అన్నారు. దానికి విశ్వనాథ సత్యనారాయణ మీరు నన్ను తొలగించేదేంటి? నేనే ఈ కళాశాల ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నాను అని ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలకు రాజీనామా ఇచ్చి వచ్చేశారు.

భార్య వరలక్ష్మి వియోగం…

ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలకు రాజీనామా ఇచ్చిన సమయానికి విశ్వనాథ సత్యనారాయణ ఆర్థిక పరిస్థితి అంతగా బాగోలేదు. విశ్వనాథ సత్యనారాయణ మొదటి భార్య పేరు వరలక్ష్మి. ఆమె అపురూపమైన వ్యక్తిత్వం కల మహా మనీషిగా విశ్వనాథ తరచూ పేర్కొనేవారు. ఆమెను ఆయన తన 11 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకున్నారు. అప్పుడు భార్య వరలక్ష్మి వయస్సు 8 సంవత్సరాలు. ఆ ఇద్దరు కూడా గొప్ప ప్రేమైక జీవులు. వరలక్ష్మి సాహచర్యం తనకు వరమని, ఆమె వల్లనే తానొక కవిని కాగలిగానని పలు విధాలుగా అనేకమైన రచనల్లో ఆయన పేర్కొన్నారు. ఆమె జీవితంలోకి వచ్చాక ఆయన సాహిత్య జీవితం చాలా ఉధృతంగా సాగిందని, తనకు గొప్ప పేరు వచ్చిందని, ఆమె తనకు అనుకూలంగా మసులుకుందని ఆమెను విశ్వనాథ సత్యనారాయణ విపరీతంగా అభిమానిస్తుండేవారు. ఆమె సౌందర్యం, వాగ్మాధుర్యం, పాతివ్రత్యం, సంసారాన్ని దిద్దుకున్న తీరు వంటివి అతిలోకమైన లక్షణాలుగా వివరించారు. అయితే తాను స్వయంగా వట్టి నీరసబుద్ధి గలవాడనని, తాను గొప్ప రసవేత్తను, రసస్రష్టను కావడానికి, మహాకవిని కావడానికి కూడా మూలం ఆమేనని ఆయన పలు సందర్భాలలో పేర్కొన్నారు. వారికి అచ్యుతదేవరాయలు అనే కుమారుడు జన్మించారు. తనను రసవేత్తగా మలిచిన వ్యక్తి వరలక్ష్మి 1931-32 కాలంలో అనారోగ్యంతో మరణించారు. ఆ వియోగదు:ఖం విశ్వనాథ జీవితంపై, ఆలోచనలపై తీవ్రమైన ముద్రవేసింది. ఆయన జీవితంలో గొప్ప కుదుపు తీసుకువచ్చింది.

రెండవ భార్య కూడా మొదటి భార్య మాదిరే గుణవతి…

భార్య వరలక్ష్మి మరణించే నాటికి విశ్వనాథ సత్యనారాయణ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఆ తరువాత ఆయనకు ఆయనకు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల, గుంటూరులో ఉద్యోగం వచ్చింది. అది నిలదొక్కుకునే లోపు ఆయన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశారు. కవిగా ఆంధ్రదేశమంతటా ఆయన పేరు మార్మోగిపోయింది. ఆయన అప్పటికే అంతరాత్మ, ఏకవీర లాంటి నవలలు వ్రాయడం, పద్యాలు, కావ్యాలు వ్రాయడం, నాటకాలు వ్రాయడం ద్వారా గొప్ప పేరు తెచ్చుకుంటున్నారు. కానీ ఆర్థికంగా మాత్రం ఆయన నిలదొక్కుకోలేదు. భార్య మరణించేసరికి ఆయన బావ ఒత్తిడి చేశారు. ముందు ఒప్పుకోలేదు కానీ బావ ఒత్తిడిని కాదనలేక విశ్వనాథ సత్యనారాయణ ద్వితీయ వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నారు. పెళ్లి పీటల మీదనే రెండవ భార్య ముఖం చూశారు. 

అయితే తనకు పెళ్ళైన తరువాత, ఆమె విశ్వనాథ జీవితంలోకి వచ్చాక తన మొదటి భార్యకు, రెండవ భార్యకు పెద్ద తేడా లేదు అని తెలిసింది. ఈవిడే ఆవిడ, ఆవిడే ఈవిడ అని,  తన పిల్లలని కూడా ఆమె సొంత బిడ్డల్లాగానే చూసుకోవడానికి గానీ, తన సాహిత్య జీవితాన్ని కొనసాగించడానికి గానీ, ఆమె నా జీవితంలోకి వచ్చిందని విశ్వనాథ సత్యనారాయణ చెప్పేవారని వాళ్ళ అబ్బాయి పావన శాస్త్రి అనేవారు. పావన శాస్రికి 14 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు కూడా వాళ్ళ అన్నయ్య అచ్యుతదేవరాయలు తన సొంత అన్నయ్య కాదు అని, ఇంకొక అమ్మకు పుట్టిన అబ్బాయి అని కూడా నాకు తెలియదు.  అంత ప్రేమగా మా అమ్మ అందరిని సొంత పిల్లల్లాగా పెంచింది. మా నాన్న సాహిత్యాన్ని వ్రాసుకోవడానికి అంతగా తోడ్పడిందని పావన శాస్త్రి గారు తన దినచర్యలో వ్రాసుకున్నారు. ఆవిడ ఎంత ప్రేమగా ఉండేవారో అని చెప్పడానికి ఇది ఉదాహరణ అని పావన శాస్త్రి చెప్పారు.

నవలా పోటీలో పాల్గొన్న విశ్వనాథ సత్యనారాయణ

విశ్వనాథ సత్యనారాయణ 1933 సంవత్సరంలో గుంటూరులో ఉన్న ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారితో పాటుగా మచిలీపట్నంలో ఉండే తమ్ముడు, తమ్ముడు పిల్లలు, భర్త చనిపోయిన చెల్లెలు, చెల్లెలు పిల్లలు, విశ్వనాథ సత్యనారాయణ ఇద్దరు తమ్ముళ్ళు ఇంతమంది కలిసి ఒకే ఇంటిలో ఉండేవారు. వాళ్ళ తమ్ముళ్ళకి ఎవ్వరికీ కూడా ఉద్యోగాలు లేవు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న వాళ్ళకి ఆ సమయంలో కూర వండుకోవడమంటే చాలా గొప్పగా ఉండేది. వాళ్ళు పచ్చళ్ళు చేసుకుంటే వాటిని పెట్టుకోడానికి జాడీలు గానీ, రాచిప్పలు గానీ లేక అమ్మ కొబ్బరి చిప్పలను గీకి వాటిల్లో పచ్చలు పెట్టేవారని, ఆ పచ్చళ్ళు కూడా లేకపోతే అన్నంలో ఏ కారమో వేసుకుని తింటూ ఉండేవారని పావన శాస్త్రి తన దినచర్యలో వ్రాశారు.

ఆ సమయంలో వారి కుటుంబం గడవడానికి ఆదాయం కావాలి. విశ్వనాథ సత్యనారాయణకు తెలిసిందల్లా సాహిత్యం, వ్యాసం మాత్రమే. సరిగ్గా అదే సమయానికి ఆంధ్ర యూనివర్సిటీ వారు నవలల పోటీని ప్రకటించారు. ఆ పోటీలో నెగ్గితే బహుమతిగా వెయ్యి నూట పదహార్లుగా ప్రకటించారు. నిజానికి ఆ రోజుల్లో పది రూపాయలు చెల్లిస్తే, రోజూ రెండు పూటలు చొప్పున నెల మొత్తం భోజనం పెట్టేవారు. అయితే విశ్వనాథ సత్యనారాయణ ఇంట్లో ఉన్న అంత మందికి పూట గడవడానికి విశ్వనాథ సత్యనారాయణకు నెలకు నూట యాభై రూపాయలు కావాలి. ఆ బహుమతి గనుక వారికి వస్తే ఆరు నెలలు కుటుంబం గడిచిపోతుంది. అందువలన ఆయన సరస్వతి ఉపాసన చేసిన తరువాత తన కుటుంబం గడవాలి కాబట్టి ఆ నవలా పోటీలో పాల్గొన్నారు.

తమ్ముడు వెంకటేశ్వర్లు ఉక్త లేఖనం…

విశ్వనాథ సత్యనారాయణకు జ్యోతిష్యం మీద ఉన్న నమ్మకంతో మచిలీపట్నంలో ఉన్న జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్లారు. అప్పుడు జ్యోతిష్యుడు ఏదేదో లెక్కలు వేసి, ఫలానా తేదీ, ఫలానా తిథి వరకు నవలను పూర్తిచేయాలి. నవలను 999 పేజీలలో మాత్రమే వ్రాయాలి అని చెప్పారు. పెద్ద తమ్ముడు వెంకటేశ్వర్లును పిలిచిన విశ్వనాథ సత్యనారాయణ వ్రాయబోయే నవల గురించి చెప్పారు. నేను చెబుతుంటాను, నీవు ఉక్త లేఖనం (చెప్పి వ్రాయించడం లేదా డిక్టేషన్)  తీసుకోవాలి. నేను వ్రాసే ఆ నవల పేరు “వేయి పడగలు”. నీవు 999 తెల్ల ఠావుల్ని కుట్టి ఒక పుస్తకం తయారుచేసేయ్. 999 పేజీలలో ఈ నవల పూర్తిచేయాలి. జ్యోతిష్యుడు చెప్పిన తిథి ప్రకారం ఇంకొక 29 రోజులు మాత్రమే ఉంది. ఆ 29 రోజులలో నేను 999 పేజీల నవల చెపుతాను. నీవు దానిని వ్రాయాలి అని తమ్ముడికి విశ్వనాథ సత్యనారాయణ చెప్పారు. అలా “వేయి పడగలు” నవలకు పునాది మొదలైంది. ఆయన చెప్పే సాహిత్య ప్రవాహం ఒక జలపాతం లాగా ఉండేది. ఆయన గబగబా చెబుతూ వెళ్లిపోయేవారు. ఆయన చెప్పింది చెప్పినట్టు తమ్ముడు వ్రాసుకునేవారు.

29 రోజుల్లో పూర్తయిన వేయి పడగలు నవల…

అయితే విశ్వనాథ సత్యనారాయణ చెప్పే వేగాన్ని అందుకుని వ్రాసేవారు ఇద్దరే ఉన్నారు. వారిలో ఒకరు ఆయన పెద్ద తమ్ముడు వెంకటేశ్వర్లు, రెండో వ్యక్తి జువ్వాడి గౌతం రావు (కరీంనగర్ లో ఉండేవారు). విశ్వనాథ సత్యనారాయణ ఉద్యోగం చేసే రోజుల్లో జువ్వాడి గౌతం రావుతో పరిచయం ఉంది. అందుకే విశ్వనాథ వేగానికి తగ్గట్టు వ్రాయగలిగే సమర్థత తమ్ముడు వెంకటేశ్వర్లుకు మాత్రమే ఉంది అని “వేయి పడగలు” నవలను వ్రాయడానికి బాధ్యతలు తమ్ముడికే అప్పగించారు. అన్నదమ్ములు ఇద్దరూ ఆలస్యంగా నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకొని, ఒక కప్పు కాఫీ త్రాగి నవలా రచన మొదలుపెట్టేవారు.

15 నుండి 20 పేజీల వరకు అలా ఏకబిగిన చెబుతూనే ఉండేవారు విశ్వనాథ సత్యనారాయణ, దానిని తమ్ముడు వెంకటేశ్వర్లు వ్రాస్తుండేవారు. మధ్యాహ్నం 12 గంటల వరకు వ్రాసి, భోజనం చేసి, కాసేపు నిద్రపోయేవారు ఇద్దరన్నదమ్ములు. ఆ తరువాత లేచి బజారుకు వెళ్లి స్నేహితులను కలుసుకొని సాయంత్రం 6 గంటలకు కూర్చుని, రాత్రి రెండు గంటల వరకు విశ్వనాథ సత్యనారాయణ అలా అనర్గళంగా చెబుతూ ఉంటే, తమ్ముడు వెంకటేశ్వర్లు వ్రాస్తూ ఉండేవారు. రోజుకి 30 నుండి 40 పేజీలలో విశ్వనాథ సత్యనారాయణ చెప్పినట్లు తమ్ముడు వ్రాసేవారు. దిద్దుబాట్లు, కొట్టివేతలు ఏమీ లేవు. చెప్పినట్లుగానే 29 రోజుల్లో 999 పేజీలున్న “వేయి పడగలు” నవల వ్రాసేశారు.

సంబందిత వార్తలు:

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అర్థంతరంగా ఆగిపోయిన చిత్ర నిర్మాణ సంగతులు..
ఇయర్ ఫోన్స్ వాడుతున్నారా..? జాగ్రత్త..!
క్రెడిట్ కార్డు పోతే ఏం చేయాలి..?

Show More
Back to top button