
శబ్దాన్ని కాలంతో మేళవించి వినసొంపుగా మార్చే విలక్షణమైన ప్రక్రియ “సంగీతం”. సంగీతం విశ్వమంతా వ్యాపించి ఉంది. ఇదొక సుప్రసిద్ధమైన చతుషష్టి కళలలో ఒకటి. ప్రకృతిలో సంగీతం మిళితమై జీవన గమనంలో భాగమై పోయింది. సంగీత నాట్యకళలు భారతజాతి అంత ప్రాచీనమైనది. భారతీయ సంగీతానికి మూలం వేదాలు, వేదాలలోని స్వరాలు. తెలుగువారికి తెలుగు భాషకి సంగీతంతో అవినాభావ సంబంధం ఉంది. సాహిత్యం అటుంచి ఒక్కసారి చరిత్ర తరచి చూస్తే సంగీతంలో తెలుగువారి అవిరళ కృషి ప్రస్ఫుటంగా కనిపిస్తుంటుంది. కర్ణాటక సంగీత పురోగతిలో తెలుగువారి కృషి హిమాలయం. చెవులకు ఇంపైనదేదైనా కర్ణాటక సంగీతమే. కాని దక్షిణాదిలో ప్రాచుర్యం పొందిన సంగీత బాణీని కర్ణాటక సంగీతమనీ, దాక్షిణాత్య సంగీతమని అంటారు. ఇందులో శాస్త్రీయ సంగీతం పండితరంజకంగా ఉంటే, ఇతర రకారలైన సంగీత రూపాలు దేశకాల పరిస్థితుల కనుగుణంగా, పామర రంజకంగా అభివృద్ధి చెందాయి.
మొదట్లో సంగీత శాస్త్ర రచనలన్నీ సంస్కృతంలోనే ఉన్నా కూడా 13వ శతాబ్దం తరువాత తెలుగులో చాలా గ్రంథాలు వచ్చాయి. శ్రీనాధుడి కాలంనాటి పెద్దకోమటి వేమారెడ్డి గ్రంథం “సంగీత చింతామణి” ని తెలుగులో వ్రాశారు. ఆ తరువాత అన్నమయ్య నారాయణతీర్థులూ, వెంకటముఖి, క్షేత్రయ్య, రామదాసు, త్యాగరాజు ఇలా ఎందరో సంగీతాభివృద్ధికి కారణభూతులయ్యారు, తమదైన శైలిలో సంగీతాన్ని అభివృద్ధిపరిచారు. దక్షిణ భారతదేశంలో కర్ణాటక సంగీతాన్ని సశాస్త్రీయంగా మలిచి జనరంజకంగా చేయడానికి దోహదపడ్డారు. వెంకటముఖి లాంటి పురప్రముఖులు సంగీత శాస్త్రానికి ఒక రూపు ఇచ్చి కర్ణాటక సంగీతాన్ని మాత్రం యుద్ధమలుపు తిప్పిన ఘనత త్యాగరాజుకే దక్కుతుంది. అంతకుముందు క్షేత్రయ్య, రామదాసు, నారాయణతీర్థులు వారి కృషియావత్తు దక్షిణ భారతదేశంలోనూ తెలుగులోనే సంగీత రచనలకు శ్రీకారం చుట్టింది త్యాగరాజునే. సంగీతాన్ని పదిమంది వద్దకు చేర్చడమే కాదు వ్యవహారిక భాషలో రచనలు చేసి సంగీతంపై ప్రజలకు మక్కువ కలిగించింది కూడా త్యాగరాజేనని నిస్సందేహంగా చెప్పగలం.
త్యాగరాజు శిష్యగణం ఆయన అందించిన సంగీత సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ విశేష కృషి జరిపారు. వీరిలో ఎక్కువ మంది తమిళులే ఉన్నారు. త్యాగరాజు పై ఉన్న అనన్య గౌరవంతో తెలుగు రాకపోయినా తెలుగు మాతృభాష నేర్చుకుని మరీ రచనలు చేశారు. త్యాగరాజు తర్వాత అంతటి ప్రతిభా ప్రజ్ఞ ఉన్న తెలుగు వారు తక్కువే ఉన్నా ఆయన తరువాత అంతటి ప్రతిభ ఉన్న ఏకైక వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ. తన గాత్ర మాధుర్యంతో ఆపాల గోపాలన్ని పరవశింపజేసి పండిత పామరుల ప్రశంసలందుకున్న మహా విద్వాంసుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ఆయన కర్ణాటక సంగీత గాయకులు, వయొలిన్ విద్వాంసులు, వాగ్గేయకారులు, సినీ సంగీత దర్శకులు, గాయకులు. తాను ప్రపంచ వ్యాప్తంగా 25 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. తాను ఎనిమిది సంవత్సరాల అతి చిన్న వయస్సులోనే కచేరీ చేయడం ద్వారా ఆయన బాలమేధావి అనిపించుకున్నారు. 1939 నుంచీ వృత్తిపరమైన కచేరీలు చేస్తూనే ఉన్నారు. తాను వయోలిన్, మృదంగం, కంజీరా లాంటి వాయిద్యాలన్నీ బాగా వాయించగలరు.
జీవిత విశేషాలు…
జన్మ నామం : మంగళంపల్లి బాలమురళీకృష్ణ
ఇతర పేర్లు : మంగళంపల్లి
జననం : 06 జూలై 1930
స్వస్థలం : శంకరగుప్తం, రాజోలు తాలుకా, తూర్పు గోదావరి జిల్లా
నివాసం : మద్రాసు, తమిళనాడు
తండ్రి : మంగళంపల్లి పట్టాభిరామయ్య
తల్లి : సూర్యకాంతమ్మ
వృత్తి : కర్ణాటక సంగీత విద్వాంసులు
పురస్కారం : పద్మ విభూషణ
మరణ కారణం : సాధారణ మరణం
మరణం : 22 నవంబరు 2016, చెన్నై, భారతదేశం
నేపథ్యం…
మంగళంపల్లి బాలమురళీకృష్ణ 06 జూలై 1930 నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని, తూర్పు గోదావరి జిల్లా, రాజోలు తాలూకా శంకరగుప్తం లో జన్మించారు. ఆయన తండ్రి మంగళంపల్లి పట్టాభిరామయ్య, తల్లి సూర్యకాంతమ్మ. వారి కుటుంబీకులు వృత్తి రీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. తండ్రి పట్టాభిరామయ్య స్వగ్రామం సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం. మంగళంపల్లి బాలమురళీకృష్ణ మొదటి గురువు కొచ్చర్లకోట రామరాజు. ఆ తరువాత తమిళనాడులో పక్షితీర్థానికి చెందిన సుబ్రహ్మణం అయ్యర్ దగ్గర కొన్నాళ్ళు శిష్యరికం చేశారు. ఉన్నట్టుండి సుబ్రహ్మణం అయ్యర్ కనపడకుండా పోవడంతో మళ్ళీ తిరిగి పెద్దకల్లేపల్లికి వచ్చి సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి దగ్గర చేరి సంగీత శిక్షణ అభ్యసించారు. సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి తదనంతరం అతడి శిష్యుడైన పారుపల్లి రామకృష్ణయ్య పంతులు దగ్గర ఉన్నత స్థాయి సంగీతం నేర్చుకున్న తరువాత మంగళంపల్లి బాలమురళీకృష్ణ విజయవాడలో స్థిరపడ్డాడు.
పారుపల్లి రామకృష్ణయ్య పంతులు ప్రముఖ సంగీతకారులు, వేణువు, వయోలిన్, వీణ విద్వాంసులు. వయోలిన్ టీచర్ గా శంకరగుప్తంలో సంగీత తరగతులు నిర్వహించేవారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ పుట్టిన 15వ రోజునే తల్లి సూర్యకాంతం మరణించడంతో అమ్మమ్మ గారి ఊరు అయిన గుడిమెళ్ళంకలో తండ్రి ఆలనాపాలనలో పెరిగారు. చిన్నతనంలోనే అతనిలోని సంగీత ప్రతిభను గుర్తించి తన తండ్రి పట్టాభిరామయ్య ఆయనను పారుపల్లి రామకృష్ణయ్య పంతులు దగ్గరకి శిష్యరికానికి పంపారు. పట్టాభిరామయ్య కూడా పారుపల్లి రామకృష్ణయ్య దగ్గరే సంగీతం నేర్చుకోవడం విశేషం. జూలై 1938 లో ఎనిమిదేళ్ళ ప్రాయంలో విజయవాడలో తన గురువు పారుపల్లి రామకృష్ణయ్య, అతను గురువు సుసర్ల దక్షిణామూర్తి పేరున ఏర్పాటు చేసిన సద్గురు ఆరాధనోత్సవాల సందర్భంగా మొట్టమొదటి సారిగా బాలమురళీకృష్ణ కచేరి చేశారు. ఇదే కార్యక్రమంలో అతడి గానానికి ముగ్ధుడైన హరికథ విద్వాంసులు ముసునూరి సత్యనారాయణ అతడి పేరు మురళీకృష్ణకు ముందు బాల అని చేర్చి బాలమురళీకృష్ణ అని పిలిచారు. అప్పటినుండి తన పేరు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గా ప్రసిద్ధికెక్కింది.
ఎనిమిదవ యేటనే కచ్చేరీ…
ఒక కృతి లేదా పాటకి స్వరాన్ని, సాహిత్యాన్ని కూర్చడమే కాకుండా తన గాత్రాన్ని కూడా వాటికి అందించే వాడే వాగ్గేయకారుడు. వందకు పైగా కీర్తనలు, పలు వర్ణాలు, తిల్లానాలు, జావళీలు స్వరపరచి కొత్త కొత్త రాగాలను సృష్టించి తెలుగు వాగ్గేయకారులు బాలమురళీకృష్ణ తెలుగువారిగా ఉన్నందుకు ఆయనను చూసి మనమందరం గర్వపడాలి. అది చిన్న వయస్సులోనే సంగీత సారాన్ని అలవోకగా గ్రహించిన ఘనులు బాలమురళీ కృష్ణ. ఆయన తన ఎనిమిదో యేటనే కచ్చేరీ ఇచ్చి సంగీత ప్రపంచాన్ని తన వైపుకు మళ్లించుకున్నారు. ఆయన గాత్ర మాధుర్యంతో పండితుల్ని, పామరుల్ని అబ్బురపరిచి పదిహేనేళ్ళ చిరుప్రాయంలోనే వాగ్గేయకార రూపం దాల్చారు. అప్పటికే కర్ణాటక మహామహులైన జీ.ఎం.బాలసుబ్రమణ్యం, సాంబమూర్తి, పార్థసారథి వంటి దిగ్గజాలను ఎప్పుడూ పొంది ఎటువంటి రాగాన్నైనా తన గొంతులో పలికించగలరని, ఎంత క్లిష్ట సంగీత రచననైనా తన గొంతులో అతి సునాయాసంగా పాడగలడని నిరూపించుకున్నారు.
గురువు టీ.ఎస్.పార్థసారథి ప్రశంస…
బాలమురళీ ప్రతిభ గురించిన ఒక చిన్ననాటి సంఘటన ఉంది. సంగీత కారుడైన టీ.ఎస్.పార్థసారథి ఆకాశవాణిలో 1950 సంవత్సరంలో పనిచేసేవారు. అప్పటికి బాలమురళీకృష్ణ కి 20 యేండ్లు. టీ.ఎస్.పార్థసారథి దగ్గర సహాయకులుగా ఆకాశవాణిలో సంగీత కార్యక్రమాలు నిర్వహించేవారు. ఒకసారి పార్థసారథికి తన చేతి వ్రాతతో ఉన్న ఒక పుస్తకం ఇచ్చి దాన్ని చదివి ముందుమాట వ్రాయమని మంగళంపల్లి బాలమురళీ కృష్ణ అడిగారట. ఏమిటా పుస్తకం అని పరిశీలనగా చూస్తే పార్థసారథికి 72 రాగాల పైన స్వరాలతో సహా కొన్ని పాటలు ఉన్నాయి. ఏమిటి అని పార్థసారథి అడిగితే అవి తన స్వీయ రచనలను చెబుతూ ఆ పుస్తకాన్ని “జనకరాజ కృత మంజరి” అనే పేరు పెట్టారని బాలమురళీ కృష్ణ చెప్పారట.
అది చూసి నమ్మశక్యం కాక అందులో రెండు కృత్తులు పాడమని పార్థసారథి అడిగితే సుచరిత, రగవర్థిని రాగంలో పాడి వినిపించి ఆనందంలో ముంచేశారట. ఈ విషయాన్ని గురువు పార్థసారథి స్వయంగా వ్రాశారు. అలా ఆకాశవాణిలో పనిచేస్తున్నప్పుడు ఎన్నో పాటలకు స్వరాలను సమకూర్చారు. “ఏమి సేతుర లింగ”, “ఎక్కడి మానుష జన్మంబెత్తితి”, “అదిగో భద్రాద్రి”, “శ్రీరామ నామం మరువం” వంటి ప్రసిద్ధి చెందిన పాటలకు స్వరకర్త బాలమురళీ కృష్ణ. స్వరాలు లేని సదాశివ బ్రహ్మేంద్రస్వామి కీర్తనలు “స్వరవారం వారం”, “పిబరే రామరసం” వంటి పాటలకు ఆయన వరుసలు కట్టారు. అవి వింటే ఇవే అసలు వరుసలా అన్నంత గొప్పగా ఉంటాయి. ఈయన సంగీత సారథ్యంలో వచ్చిన “భద్రాచల రామదాసు కీర్తనలు” తెలుగునాట ప్రతీ ఇంట ఇప్పటికీ మారుమ్రోగుతూనే ఉన్నాయి.
సినీరంగం…
ఎందుకో తెలుగు సినీ పరిశ్రమ బాలమురళీ కృష్ణ లాంటి అత్యంత ప్రతిభావంతుల్ని సరిగ్గా వినియోగించుకోలేదు. సాలూరి రాజేశ్వరరావు గారి సంగీత సారథ్యంలో గతంలో చాలా సినిమాల్లో పాడినా, బాపు బాలచందర్ వంటి దర్శకులు తప్ప ఇంకెవ్వరూ కూడా ఆయన చేత పాడించలేదు. సంగీత ప్రధానంగా ఎన్నో సినిమాలు తీసిన కె విశ్వనాథ్ ఒక్క సినిమాలో కూడా బాలమురళీ కృష్ణ చేత పాడించలేదు. ఇది నిజంగా మన తెలుగు వారందరి దురదృష్టం. ఆదిశంకరాచార్య (సంస్కృతం), హంసగీతే (కన్నడ) వంటి సినిమాలకు సంగీత దర్శకత్వం వహించినా ఎందుకో తెలుగువారు మాత్రం ఆయనకి అంతగా గౌరవం ఇవ్వలేదు. వ్యక్తిగత కారణాలు కానీ, ప్రవర్తన కారణాలు కానీ చూపించేవారు ఉంటారు. కానీ నిజానికీ ఏ వ్యక్తి పరిపూర్ణం కాదు. అందరిలోనూ లోపాలుంటాయి. ప్రతిభ, సంగీత జ్ఞానం ముందు అవన్నీ వెనక్కి వెళ్తుంటే బాగుండేది.
నర్తనశాలలో “సలలిత రాగ సుధారస సారం”, “వసంత యామినీ”, “మౌనమే నీ భాష ఓ మూగ మనసా”, “పలుకే బంగారమాయెనా అందాలరామ”, “ఆదియునాదిగా నీవే కాదా” పాటలు ఇప్పటికీ ఆ పాతమధురాలే. రాయదేవుల అష్టపదులు పాడినా, రామదాసు కీర్తనలు పాడినా, అన్నమయ్య అక్షర సుమాలు ఆలపించినా బాలమురళీ కృష్ణనే పాడాలనేంతగా తెలుగువారి మనసుల్లో నాటుకుపోయింది. తమ స్వీయ కృతులను సూర్యకాంతి అనే పుస్తక రూపంలో విడుదల చేశారు. ప్రతీ కృతీ తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో స్వరయుక్తంగా ఉన్నాయి. ఈ పుస్తకం మరో విశేషం ఏమిటంటే తెలుగులో మాత్రం ఆయన స్వదస్తూరితోనే వ్రాశారు. మిగతా పుస్తకంలో వేరే భాషలకు మరొకరి చేత ప్రాత కనిపిస్తుంది. ఈ విధంగా బాలమురళీ కృష్ణ తెలుగు భాష పై తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ పుస్తకం మాత్రం తమిళ సోదరుల ప్రచురించారు. వారెవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదు. పుస్తకం తెలుగు నాట దొరకదు. ఇది ఒక తెలుగు వాగ్గేయకారుడికి మన తెలుగు వాళ్ళు ఇచ్చే గౌరవం. మనం అందరం సిగ్గుపడాల్సిన విషయం.
తెలుగు వారి ఆదరణ నోచుకోని బాలమురళీ…
బాలమురళీకృష్ణ సంగీత పరంగా ఎన్నో రాగాలలో వందకు పైగా కృతులను కూర్చినా కూడా సాహిత్యానికి వచ్చేసరికి త్యాగరాజు రచనా శైలిని అనుసరించినట్లు అనిపిస్తుంది. “పందులు లేక మన సందులు బాగవునా” (నిందలు మోపు వారు కావలె కృతి) వంటి నిరసన ప్రయోగాలు, “భూమిని మోయుట మిన్న భూమిపై పన్నుల భారము మోయుట మిన్నా” (తెలుసుకొనుమన్నా స్వతంత్ర్యమన్నా కృతి) వంటి సామాజిక వేదనలు, “తను వలచినదే వనిత, తను తలచినదే కవిత” (తన హితవే తన మతము కృతి) వంటి సామెతలు, కళల వెలుగులకు భాషా భేదము, కళంకమై హాని కలిగించును (తెలుగు తమిళ సమ్మిళితమే కృతి) వంటి ఆవేదనలు స్పష్టంగా కనిపిస్తాయి. కృతిలో వాడిన పదప్రయోగ శైలి, తీరు త్యాగరాజ కీర్తనలను అనుసరిస్తున్నట్లుగానే కనిపిస్తుంది. తమిళనాడు ప్రేక్షకులు, ప్రజలు ఆదరించినంతగా, తెలుగు వారు బాలమురళీ కృష్ణను ఆదరించలేదు. ఇది మాత్రం యదార్థం. ఇదే బాధని ఆయన ఒక కృతిలో (తెలుగు వెలుగు కిరణాలు) పరోక్షంగా ఇలా చెప్పుకున్నారు
అన్నమునకు ఆంధ్రము -ఆదరణకు అరవము
కన్నతల్లి కన్నడము – మలయానిలయము మలయాళము
ఆరంభమునకు ఆంధ్రము – ఆచరణకు అరవము
కన్నడకు కన్నడము – మరులు కొలుపు మలయాళము
మనమంతా ఒక్కటైతే మహినే మనమేలగలము..
భారతరత్న కు నోచుకోని బాలమురళీ…
బాలమురళీకృష్ణకి ఉన్న సంగీతం ప్రతిభకి తమిళనాడు లాంటి రాష్ట్రంలో పుట్టి ఉంటే ఆయనకు “భారతరత్న” వచ్చి వుండేది. తెలుగువారికి సంగీతంపై అభిమానం తక్కువ. సినిమాల కన్నా రాజకీయాలపై ఎక్కువ మక్కువ. సంగీత సాహిత్యాలపై మక్కువ లేదు. ఇది మన దౌర్భాగ్యం. పండిట్ భీమ్ సేన్ జోషి, పండిట్ రవిశంకర్ వంటి సంగీత విద్వాంసులు స్థాయి ఉన్న ఏకైక దక్షిణ భారత సంగీత వాగ్గేయకారుడు బాలమురళీ కృష్ణ. పండిట్ రవిశంకర్ కి ప్రచారం ఎక్కువగా ఉండటం వలన విదేశాల్లో కూడా మరింత పేరు వచ్చింది.
బాలమురళీకృష్ణ విషయంలో ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఆదరణ కొరవడింది. ఆయన ప్రతిభకి ప్రపంచవ్యాప్తంగా రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఆయనకు సంగీత కళానిధి అని బిరుదుచ్చి బాలమురళీ కృష్ణను అవమానపరిచారని అనిపిపిస్తుంది. నిజంగా ఆయన ఇంటి పేరు, ఆయన విశేష సంగీత ప్రతిభ ముందు “భారతరత్న” లు కూడా వెలవెల బోవాల్సిందే. ప్రతిభ ముందు పురస్కారాలు, రివార్డులు దిగదుడుపే. ముఖ్యంగా సంగీతానికి. మనిషి మరణించినా కవులు, గాయకులు కలకాలం బ్రతుకుతారు. సంగీతమున్నంత కాలము త్యాగరాజు, బాలమురళీకృష్ణ తరతరాలకి గుర్తుండే తీరుతారు. తెలుగు వాళ్ళుగా పుట్టడం మన అదృష్టం, కానీ తెలుగువారిగా పుట్టడం వారి దురదృష్టం.
నటరాజ సాయుజ్యం…
కర్ణాటక సంగీతంలో తనకు తానే సాటి అనిపించుకున్న మంగళంపల్లి బాలమురళీకృష్ణ సొంతగా అనేక రాగాలను ఆవిష్కరించారు. కళలు అన్నా, కళాకారులు అన్నా బాలమురళి కృష్ణకి ఎనలేని అభిమానం, గౌరవం కూడా. నందమూరి తారకరామారావు తన అభిమాన నటులుగా చెప్పుకునే బలమురళీ కృష్ణ సంగీతానికి పీటవేస్తూ ఎన్టీఆర్ నటించిన చిత్రాలను కాకుండా, ఆయన నటించిన యాక్షన్ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడేవారు. యన్టీఆర్ కు “శ్రీకాకుళాంధ్రమహావిష్ణు కథ”, “నర్తనశాల”, , “శ్రీమద్విరాటపర్వము” చిత్రాలలో నేపథ్యగానం చేశారు బాలమురళీ కృష్ణ. 1983లో నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన రాష్ట్రంలోని లలిత కళా అకాడమీలను రద్దు చేశారు.
ఓ కళాకారుడై ఉండి కూడా ఎన్టీఆర్ లలిత కళా అకాడమీలను రద్దు చేయడం మంగళంపల్లి బాలమురళీకృష్ణకు నచ్చలేదు. దాంతో తాను హైదరాబాదులో పాడనని భీష్మించుకున్నారు. 1989లో నందమూరి తారకరామారావు పార్టీ ఓటమి చవిచూసిన తరువాత అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి అభ్యర్థనతో మళ్ళీ హైదరాబాదులో బాలమురళీ కృష్ణ తన గళం వినిపించారు. 1994లో రామారావు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన ఆహ్వానం మేరకు కూడా వచ్చి పాడారు బాలమురళీకృష్ణ. ఇలా తన గానమాధుర్యంతో సంగీతాభిమానులను ఆనందసాగరంలో మునకలేయించిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ 22 నవంబరు 2016 నాడు నటరాజ సాయుజ్యం పొందారు. బాలమురళీ కృష్ణ భౌతికంగా దూరమైనా ఆయన గానం ఈ నాటికీ సంగీతప్రియులకు అమృతం పంచుతోంది.
ఆత్రేయ స్మారక కళా పీఠం పురస్కారం…
విజయనగరంలో స్థాపించబడిన ఆత్రేయ స్మారక కళా పీఠం తరపున ప్రతీ ఏడాది కళాకారులకు సన్మానం చేయడం పరిపాటి. అందులో భాగంగానే బాలమురళీకృష్ణకు సన్మానం చేయాలని వారు సంకల్పించారు. బాలమురళీకృష్ణ పాడిన సినిమా పాటలలో ఎక్కువ భాగం ఆత్రేయ వ్రాసినవే కావడం విశేషం. ఈ పురస్కారం ఇవ్వాలనుకుంటున్నామని ఆత్రేయ స్మారక కళా పీఠం వారు ఆహ్వానించగానే ఆయన సంతోషంగా అంగీకరించారు. విజయనగరం తప్పక వస్తానని బాలమురళీ కృష్ణ మాట ఇచ్చారు. 2008లో ఆయనకు పురస్కారం ఇచ్చారు. కళలకు పుట్టినిల్లు అయిన విజయనగరంలో 07 మే 2008 నాడు కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో సంగీత కళాశాల ప్రాంగణం నుంచి ముత్యాలతో అలంకరించిన పల్లకిలో ఆయనను ఒక గంట పాటు ఊరేగించారు. కళాశాలలో సంగీతం అభ్యసిస్తున్న బాలికలు, యువతులు కూడా ఈ పల్లకి మోయడం విశేషం.
వేల సంఖ్యలో అభిమానులు హాజరైన ఈ కార్యక్రమానికి శ్రీ బొత్స సత్యనారాయణ ముఖ్యఅతిథిగా వచ్చారు. బాలమురళీ కృష్ణ తన జీవితంలో ఈ సన్మానం మరుపురాని ఘటనగా మిగిలిపోతుందన్నారు. సీతాకోక చిలుకలల్లే ఆడపిల్లలు కూడా ముందుకు వచ్చి పల్లకి మోయడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతీ నిమిషాన్ని మనస్ఫూర్తిగా సంపూర్ణంగా ఆనందించారు బాలమురళీ కృష్ణ. ఆయనది చాలా సరళ స్వభావం. చిన్నపిల్లల మనసుతో అమరికలు లేకుండా మాట్లాడతారు. అభిమానంతో ఆత్మీయంగా ప్రవర్తిస్తారు. చక్కటి హాస్యస్ఫోరకత ఆయనకు పెట్టని ఆభరణం. సంగీతంలో హిమవన్నగమంత స్థాయికి చేరినా కూడా గర్వం, అహంకారం మచ్చుకైనా ఆయనలో కనపడేవి కావు. తెలుగుజాతి గర్వించదగిన ఒక మహాద్భుత వ్యక్తి సాక్షాత్ సరస్వతీ స్వరూపం అయిన శ్రీ బాలమురళీ కృష్ణ “నాకు సంగీతం తెలియదు, సంగీతానికి నేనెవరో తెలుసు” అని చెప్పుకున్నారంటే అంతకుమించిన గౌరవం సంగీతనికి ఇంకేముంటుంది?