
ప్రతిభ, ప్రజ్ఞాపాటవాలు కలిగిన వ్యక్తులు ఏ భాషలోనైనా ఇమిడిపోగలరు, అలాగే ఏ రంగంలోనైనా రాణించగలరు అనే దానికి ఉదాహరణ తాతినేని ప్రకాశరావు. ఈయన తెలుగు చిత్రపరిశ్రమలో అగ్ర తారలతో, అగ్ర నటీనటులతో సినిమాలు తెరకెక్కించిన అగ్ర దర్శకులు. తండ్రి నుంచి రాజకీయం, విప్లవ భావాలు వారసత్వంగా అందుకున్నా కూడా, సినిమా రంగంపై ఏర్పడిన ఆసక్తితో టూరింగ్ టాకీస్‌లో ఉచితంగా సినిమాలు చూస్తూ తాను కూడా సినిమా రంగంలో రాణించాలని కలలు కన్నారు.
ఒకవైపు విద్యార్థిగా వుంటూనే, మరోవైపు రాజకీయాలలో రాణిస్తూ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు వైపు ఆకర్షితులై ప్రజానాట్యమండలిలో చేరిపోయి, ప్రజానాట్యమండలి ప్రదర్శించే కళా కార్యక్రమాలను నిర్వహించే పనిలో పడ్డారు తాతినేని ప్రకాశరావు. దర్శకులు ఎల్.వి.ప్రసాద్ పరిచయంతో చిత్ర పరిశ్రమలో సహాయ దర్శకుడిగా ప్రస్థానం మొదలుపెట్టి పీపుల్స్ ఆర్ట్స్ సంస్థ నిర్మించిన “పల్లెటూరు” (1952) చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ప్రకాశరావు సమాంతరంగా తెలుగు, తమిళ మరియు హిందీ భాషలలో చిత్రాలను తెరకెక్కిస్తూ వచ్చారు.
కృష్ణా జిల్లా కపిలేశ్వరపురంలో జన్మించిన తాతినేని ప్రకాశరావు సినిమా రంగంలో దర్శకులు యల్.వి.ప్రసాద్ వద్ద “షావుకారు” (1950) సినిమాకు, కె.వి.రెడ్డి గారి వద్ద పాతాళ భైరవి (1951) లాంటి సినిమాకు సహాయకుడిగా పనిచేశారు. పరివర్తన (1954), పల్లెటూరు (1952), జయం మనదేరా (1956) మొదలైన ఎన్నో తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు తాతినేని ప్రకాశరావు. వినోదంతో పాటు విజ్ఞానం కూడా అందించాలని, సమాజంలోని సమస్యలను కూడా చర్చించాలని, కుటుంబపరమైన సమస్యలు, సరదాలు చక్కగా చూపించాలని ప్రయత్నించి, సఫలం చెందేవారు తాతినేని ప్రకాశరావు.
అందుకే దర్శకుడుగా ఆయన తెరకెక్కించిన చిత్రాలలో కథ, కథనం నాటకీయంతో ఆకట్టుకునేలా ఉండేది. 1956 వ సంవత్సరంలో “మాతుర్కుల మాణిక్కం” సినిమాతో తమిళ చిత్ర సీమలోకి ప్రవేశించిన తాతినేని ప్రకాశరావు శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, ఎం.జి.రామచంద్రన్ మొదలైన అగ్రనటులతో ఎన్నో తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించారు. “అమరదీపం”, “ఉత్తమ పుత్రన్”, “కతిరుండ్ కనకాల్”, “నల్ల తీర్పు”, “కన్నిరైంధ కన్నవాన్”, “పదకోటై”, “ఎంగలమం ముదియం”, “ఎల్లారం ఇన్నట్టు మన్బార్”, “అన్చుమగన్” ఇలా తమిళంలో 24 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.
హిందీలో దాదాపు పెద్ద నటులందరితోనూ సినిమాలను తెరకెక్కించిన తాతినేని ప్రకాశరావు “నన్హా ఫరిస్తా”, “కాలేజ్ గర్ల్”, “బహు భేటీ”, “సీతంఘర్”, “సూరజ్” , “దునియా”, “ఇజ్జత్”, “హమారా సంసార్”, “హమ్‌రాహి”, “ససురాల్”, “కబ్ తక్ చుప్ రహూఁగీ”, “ఘర్ ఘర్ కీ కహానీ”, “బహు రాణీ”, “రివాజ్” వంటి 25 పైగా హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన 60 కి పైగా చిత్రాలలో కొన్ని చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. వాటిలో కొన్ని తాష్కెంట్ చలన చిత్రోత్సవంలోను ప్రదర్శింపబడ్డాయి కూడా. ఉజ్ బెకిస్థాన్ లోను రెండు సార్లు తన ప్రతినిధి బృందంతో చలన చిత్రోత్సవంలో పాల్గొన్నారు.
తాతినేని ప్రకాశరావు తమ్ముడి వరుస అయిన తాతినేని రామారావు, ప్రకాశరావు వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు. కెహిందీ చిత్ర రంగాన్ని యేలిన ప్రత్యగాత్మ కూడా తాతినేని ప్రకాశరావు శిష్యుడే. వి.మధుసూదనరావు, గుత్తా రామినీడు, కె.హేమాంబరధరరావు మొదలగు వారు తాతినేని ప్రకాశరావు వద్దనే దర్శకత్వ శాఖలో శిక్షణ పొంది విజయవంతమైన చిత్రాల దర్శకులుగా రాణించారు. 50వ దశకంలో సి.ఎస్.రావు, డి.యోగానంద్, కె.బి.తిలక్, ఆదుర్తి సుబ్బారావు మొదలగు వారు తాతినేని ప్రకాశరావు సమకాలీనులే. వారంతా కూడా కొత్తతరం దర్శకులుగా, తెలుగు చిత్రసీమకు చక్కని చిత్రాలు అందించగల ప్రజ్ఞ గల దర్శకులు. చక్కని కుటుంబకథా చిత్రాలు, ప్రయోగాత్మక, ప్రయోజనాత్మక చిత్రాలను రూపొందించినవారే.
జీవిత విశేషాలు…
జన్మనామం : తాతినేని ప్రకాశరావు
ఇతర పేర్లు : టి. ప్రకాశరావు.
జననం : 24 నవంబరు 1924
స్వస్థలం : కపిలేశ్వరపురం, పమిడిముక్కల, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
వృత్తి : సుప్రసిద్ధ తెలుగు, తమిళ, హిందీ సినిమా దర్శకులు
జీవిత భాగస్వామి : అన్నపూర్ణ
తండ్రి : వీర రాఘవయ్య
మరణ కారణం : గుండెపోటు
మరణం : 01 జులై 1992
నేపథ్యం…
తాతినేని ప్రకాశరావు 24 నవంబరు 1924 నాడు కృష్ణా జిల్లా ఉయ్యూరు దగ్గరలో గల పమిడిముక్కల మండలంలోని కపిలేశ్వరపురంలో జన్మించారు. ఈయన తండ్రి తాతినేని వీర రాఘవయ్య రావు ఒక రాజకీయ నాయకులు. దత్తాత్రేయ మోటార్ సర్వీసు అను పేరు పైన ఒక ప్రైవేటు బస్సు నిర్వాహణ చేపట్టేవారు వీర రాఘవయ్య. అందువలన ఆయనను కారు వీర రాఘవయ్య అనేవారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర పోషించి 1931 సంవత్సరంలో జైలుకు కూడా వెళ్లారు. తాతినేని సుబ్బయ్య అనే వ్యక్తి ప్రకాశరావు చిన్నతాత అవుతారు. ఆయన ప్రకాశరావు చిన్నగా వున్నపుడే దత్తత తీసుకున్నారు.ఈయన కూడా మొదట్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారైనా కాలక్రమేణా జస్టిస్ పార్టీని తీర్థం పుచ్చుకుని, ఆ పార్టీనే బలపరుస్తూ వచ్చారు.
1934 వ సంవత్సరంలో జరిగిన కృష్ణా జిల్లా బోర్డు ఎన్నికల్లో ప్రకాశరావు తండ్రి వీరరాఘవయ్య కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తే, తాత సుబ్బయ్య జస్టిస్ పార్టీ నుంచి ప్రచారం చేశారు. వీరరాఘవయ్య కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం ఇష్టం లేని సుబ్బయ్య దత్తతతును రద్దుచేసుకుని, ప్రకాశరావును తిరిగి వీరరాఘవయ్య ఇంటికి పంపించేశారు. ఇది జరిగిన కొన్నాళ్ళకే ప్రకాశరావు తండ్రి వీరరాఘవయ్య మరణించారు. ఆ సమయానికి ప్రకాశరావు వయస్సు పది సంవత్సరాలు మాత్రమే. తండ్రి మరణంతో ఆయన బస్సు సర్వీసు ఆగిపోయింది. తండ్రి లేని ప్రకాశరావు మాత్రం తల్లి సంరక్షణలో అలాగే తన మేనమామ చిలుకూరు శేషయ్య సంరక్షణలోనూ పెరుగుతూ, మేనమామ ఊర్లోనే 5వ తరగతి వరకు చదువుకున్నారు.
విద్యాభ్యాసం…
కపిలేశ్వరపురంకు దగ్గరలో గల వీరంకిలాకు గ్రామంలో టూరింగ్ టాకీసు ఉంది. 1934 – 35 సంవత్సరాలలో అప్పుడే తెలుగు సినిమా మాటలు నేర్చి రెండు మూడు సంవత్సరాలు మాత్రమే అయ్యింది. పల్లెటూర్లకు టూరింగ్ టాకీసులు కూడా వచ్చాయి. సినిమాలు చూడడం అలవాటైపోయిన తాతినేని ప్రకాశరావు, వీరంకిలాకు గ్రామంలో ఉన్న టూరింగ్ టాకీసుకు వెళ్లి సినిమాలు చూసేవారు. టూరింగ్ టాకీసు యజమాని గాజా వెంకట్రామయ్యను పరిచయం చేసుకున్న ప్రకాశరావు, పాఠశాల అయిపోగానే వీరంకులాకు వెళ్లి ఆపరేటర్ కు సోడా లాంటివి కొనినిపెడుతూ, ఆ టాకీసులో ప్రదర్శింపబడే చలనచిత్రాలను చూస్తూండేవారు. తండ్రి చనిపోయిన తరువాత ప్రకాశరావుకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయాయి. తండ్రి పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి చందాలు వేసుకొని ప్రకాశరావు చదువుకు సహాయం చేశారు.
తన పదమూడేళ్ల వయస్సులో కపిలేశ్వరపురంలో చదువు అయిపోయింది. అక్కడ నుండి పదవ తరగతి చదువుల కోసం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తాడంకి వెళ్లాల్సి వచ్చింది. తెలుగు, హిందీలో మంచి మార్కులు తెచ్చుకోవడంతో బాటు తెలుగు మరి హిందీ బాగా చదివే తాతినేని ప్రకాశరావు పాఠశాలలో అన్ని రంగాలలో ముందుండేవారు. ఒకవైపు చదువుకుంటూనే, చదువుతోపాటు బ్యాట్మెంటన్ లాంటి ఆటలు ఆడడం లోనూ, పద్యాలు పాడడంలోనూ విపరీతమైన ప్రావీణ్యత సంపాదించారు. వీటితో పాటు అమ్మానాన్నల నుండి పుణికిపుచ్చుకున్న రాజకీయ చైతన్యం ఎలాగూ తనకు ఉంది గనుక తండ్రి ప్రాతినిథ్యం వహించిన కాంగ్రెస్ వైపు కాకుండా, అప్పుడప్పుడే విస్తరిస్తున్న కమ్యూనిస్టు భావజాల వైపు మొగ్గుచూపుతూ కపిలేశ్వరపురంలో ఏకైక వామపక్షపాతి అయ్యారు.
ప్రజానాట్యమండలిలో చేరిక..
రాజకీయాల కార్యక్రమాలు ఎక్కువవడంతో ప్రకాశరావు చదువు దెబ్బతిన్నది. తనను ఇలాగే వదిలేస్తే రాజకీయాలకే అంకితం అవుతారని గ్రహించిన మేనమామ చిలుకూరి శేషయ్య తనను వీరంకులాకు సినిమా థియేటర్ లో ఆపరేటర్ కు సహాయకుడిగా చేర్పించారు. కొన్నాళ్ళకు కృష్ణా జిల్లాకు చివరన ఉన్న కొల్లూరులో ఉన్న సినిమా థియేటర్ లో ఆపరేటర్ కు సహాయకులుగా వెళ్లారు. అభ్యుదయవాద భావాలున్న తాతినేని ప్రకాశరావు ఆకలి యాత్ర అనే పేరుతో 1939 వ సంవత్సరంలో కొల్లూరు నుండి తెనాలికి వెళుతున్న ఒక ఊరేగింపుకు ముందు వరుసలో నిలబడి దానికి నినాదాలు ఇచ్చే బాధ్యత తీసుకున్నారు ప్రకాశరావు. అది చూసిన థియేటర్ యాజమాన్యం ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు.
ఎలాగూ తనకు ఉద్యోగం లేకపోవడంతో పూర్తిగా రాజకీయాలకే అంకితం అయిపోయారు. గరికపాటి రాజారావు స్థాపించిన ప్రజానాట్యమండలి గ్రామాలలో ఏర్పాటు చేసే క్యాంపుల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండడం వలన నాయకత్వ లక్షణాలు అలవడ్డాయి. తను పదహారు సంవత్సరాల వయసున్నప్పుడే ప్రజానాట్యమండలిలో క్రియాశీలక కార్యకర్తగా మారారు. కోడూరు అచ్చయ్య, పెరుమాళ్ళు, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, చదలవాడ కుటుంబరావు మొదలగు వారు ప్రజానాట్యమండలిలో ప్రకాశరావుతో కలిసి పనిచేశారు. తాతినేని ప్రకాశరావు 22 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు 1946 మే నెలలో మద్రాసులో అభ్యుదయ రచయితల సంఘం సభ జరిగింది. ఆ సమయంలోనే తెలుగు సినిమా ప్రముఖ దర్శకులు ఎల్వీ ప్రసాద్ తో పరిచయం ఏర్పడింది.
చిత్ర రంగ ప్రవేశం…
ఆ తరువాత కొద్ది రోజులకు సారథి ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్న “శ్రీమతి” చలనచిత్రంలో నటింపజేయడానికి నటీనటుల కోసం ఎల్వీ ప్రసాద్ విజయవాడ వచ్చారు. ఆ సమయంలో ఆయనను కలిసిన తాతనేని ప్రకాశరావు సినిమాలలో అవకాశం ఇప్పించాల్సిందిగా కోరారు. దానికి అంగీకరించి “ద్రోహి” చిత్రానికి సహాయకుడిగా ప్రకాశరావును నియమించారు. అలా జూన్ 1947లో మద్రాసులో అడుగుపెట్టిన తాతినేని ప్రకాశరావు “ద్రోహి” సినిమాకు సహాయ దర్శకుడిగా తొలిసారి తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. “ద్రోహి” సినిమాలో నటీనటులుగా దర్శకులు కె.యస్.ప్రకాశరావు, జి.వరలక్ష్మి, కోన ప్రభాకరరావు, ఎల్వీ ప్రసాద్ మొదలైనవారు నటించారు.
సహాయకుడిగా చేరిన తొలి సినిమా “ద్రోహి” చిత్రానికే దర్శకులు యల్వీ ప్రసాద్ కు విశ్వాస పాత్రుడయ్యారు తాతినేని ప్రకాశరావు. “ద్రోహి” సినిమా తరువాత 1949 వ సంవత్సరంలో “మన దేశం” చిత్రం ద్వారా ఒక చిన్న పాత్రలో, తెలుగు సినిమా ప్రఖ్యాత నటుడు ఎన్.టి.రామరావుని తన దర్శకత్వంలో పరిచయం చేశారు యల్వీ ప్రసాద్. ఈ సినిమాకు కూడా తాతనేని ప్రకాశరావు సహాయకుడిగా ఉన్నారు. ఈ సినిమా నుండి ప్రకాశరావుకి, ఎన్టీఆర్ కి మధ్య స్నేహం కుదిరింది. అదే సమయంలో ప్రకాశరావు, ఎన్టీఆర్, టీవీ రాజు, యస్వీ రంగారావు ఒకే గదిలో ఉండేవారు.
మనదేశం సినిమా తరువాత 1950 వ సంవత్సరంలో యల్వీ ప్రసాద్ దర్శకత్వంలో విజయ పిక్చర్ వారు నిర్మించిన మొదటి చిత్రం “షావుకారు” తెరకెక్కింది. ఈ సినిమాకు సహాయకుడిగా కొనసాగారు ప్రకాశరావు. ఆ తరువాత కె.వి. రెడ్డి దర్శకత్వంలో వచ్చిన “పాతాళ భైరవి” (1951), ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో “పెళ్ళి చేసి చూడు” (1952) చిత్రాలకు సహాయకుడిగా పనిచేశారు తాతినేని ప్రకాశరావు. ఆయన తొలి రోజుల్లోనే అగ్ర దర్శకులతో, అగ్ర నటీనటులతో పనిచేసే అవకాశం వచ్చినందున కాబోలు తాను త్వరగా దర్శకుడిగా అరంగేట్రంచేయడానికి మార్గం సుగమమైంది. సహాయకుడిగా ఆయన ఆఖరు చిత్రం “పెళ్ళిచేసిచూడు”.
దర్శకుడిగా తొలి సినిమా “పల్లెటూరు”…
“పెళ్లిచేసిచూడు” (1952) సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో తాతినేని ప్రకాశరావుకు దర్శకుడిగా తొలిసారి అవకాశం వచ్చింది. పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పి.శివరామయ్య నిర్మించిన ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు మరియు సావిత్రి జంటగా నటించారు. గ్రామీణ నేపథ్యాలు మరియు సామాజిక ఇతివృత్తాలతో కూడిన ధోరణితో ఈ చిత్రాన్ని తాతినేని ప్రకాశరావు అద్భుతంగా తెరకెక్కించారు. పల్లెటూరు (1952) అనే చిత్రంలో ప్రజానాట్యమండలికి చెందిన కళాకారులు చాలా మంది నటించారు. ప్రజానాట్యమండలిపై నిషేధం విధించడంతో అందులో పనిచేసే కళాకారులు సినిమా రంగంలని వివిధ చిత్రాలలో, వివిధ భాగాలలో పనిచేస్తూ ఉండేవారు. రచయితలు సుంకర, వాసిరెడ్డిలు కూడా ప్రజానాట్యమండలి నుండి వచ్చిన వారే.
గతంలో తనతో ప్రజానాట్యమండలిలో పనిచేసిన కోడూరు అచ్చయ్య, చదలవాడ, మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి, పెరుమాళ్ళు మొదలైన నటీనటులకు కూడా పల్లెటూరు చిత్రంలో అవకాశం ఇచ్చారు దర్శకులు తాతినేని ప్రకాశరావు. ఎక్కువమంది ప్రజానాట్యమండలి కళాకారులు పాల్గొన్న చిత్రం కూడా “పల్లెటూరు” నే. ఈ సినిమాలోని దృశ్యాలను విజయవాడ చుట్టుప్రక్కల చిత్రీకరించారు. పల్లెటూర్లో జరిగే సంక్రాంతి సంబరాలు, తిరుణాళ్ళ వాతావరణాన్ని అద్భుతంగా తెరకెక్కించారు దర్శకులు ప్రకాశరావు. ఇక పాటల విషయానికొస్తే “చేయెత్తి జై కొట్టు తెలుగోడా” అనే పాటను ప్రజానాట్యమండలి నుంచి వచ్చిన శ్రీకృష్ణ వ్రాశారు. అది ఎంత పెద్ద హిట్టంటే, ఆ తరువాత 30 సంవత్సరాలకు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఈ పాట ఆంధ్రదేశమంతటా మారు మ్రోగిపోయింది.
అలాగే శ్రీశ్రీ వ్రాసిన “పోలాలనన్నీ హలాలదున్నీ” అనే మహాప్రస్థానం లోని కవితను సంగీత దర్శకులు ఘంటసాల అద్భుతంగా స్వరపరిచారు. పల్లెటూరు సినిమా 16 అక్టోబరు 1952 నాడు ఆంధ్ర మరియు రాయలసీమ లోనూ, ఆ తరువాత వారం రోజులకు నైజాం లోనూ విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకులు చక్కటి విజయంతో సమాధానం ఇచ్చారు. మంచి చిత్రం అనే ప్రశంస కూడా దక్కింది. ఈ సినిమా తెరకెక్కేనాటికి తాతినేని ప్రకాశరావు వయస్సు 28 సంవత్సరాలు మాత్రమే. ఆ రోజుల్లో అతిపిన్న వయసున్న దర్శకులు తాతినేని ప్రకాశరావు మాత్రమే. పల్లెటూరు సినిమా ప్రకాశరావును విజయవంతమైన దర్శకుడుగా నిలబెట్టింది.
ఎన్టీఆర్ తో “పిచ్చి పుల్లయ్య” (1953)…
షావుకారు (1950), పాతాళభైరవి (1951), మల్లీశ్వరి (1951) వంటి విజయాలతో దూసుకెళ్తూ నట జీవితం మొదలైన నాలుగు సంవత్సరాలకే సొంతంగా సినిమాలు నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారు ఎన్టీఆర్. ఆయన బంధువైన దోనేపూడి కృష్ణమూర్తి ఆర్థికంగా దెబ్బతినడంతో ఆయనను నిర్మాణంలో భాగస్వామిగా తీసుకుని, తన తమ్ముడు నందమూరి త్రివిక్రమరావును మేనేజింగ్ పార్టనర్ గా పెట్టుకుని ఎన్టీఆర్ “నేషనల్ ఆర్ట్స్” పతాకంపై 1953 వ సంవత్సరంలో తొలిచిత్రంగా “పిచ్చి పుల్లయ్య” సినిమా నిర్మించారు. దీనికి దర్శకుడిగా తాతినేని ప్రకాశరావును ఎంచుకున్నారు.
పల్లెటూరు (1952) చిత్రం తరువాత తాతినేని ప్రకాశరావు తెరకెక్కించిన చిత్రం “పిచ్చి పుల్లయ్య”. ఓకే రకమైన పాత్రలతో మూసధోరణిలో వెళ్ళకుండా, విభిన్న పాత్రలను ఎంచుకొంటూ ప్రయోగాలు చేసి తనలోని నటుణ్ణి, సినిమా ప్రియులను సంతృప్తిపరచాలన్న ఆలోచనతో ఎన్టీఆర్ నిర్మాతగా ఎంచుకున్న తొలిచిత్రమే పిచ్చి పుల్లయ్య. తాతినేని ప్రకాశరావుకు చెప్పి కథ వ్రాయించుకున్నారు ఎన్టీఆర్. అప్పటికే పల్లెటూరు సినిమా విజయంతో దర్శకుడిగా నిరూపించుకున్నా, ప్రకాశరావు సామర్థ్యం మీద నమ్మకంతో నిర్మాతగా తన తొలిచిత్ర దర్శకత్వ బాధ్యతలను ప్రకాశరావుకు అప్పగించారు.
ఎస్వీ రంగారావును దృష్టిలో పెట్టుకొని కథ వ్రాసుకున్నా కూడా, ఎన్టీఆర్ మాట ఇచ్చి ఉండడంతో ఆ పాత్రకు గుమ్మడిని తీసుకున్నారు. చిత్ర నిర్మాణం, నేపథ్య గానం మరియు నటన లాంటి మూడు విభిన్న భాగాలలో కనిపించారు అట్లూరి పుండరీకాక్షయ్య. సొంత అక్క చెల్లెల్లు అయిన షావుకారు జానకి, కృష్ణకుమారి లు ఈ చిత్రంలో తొలిసారి కలిసి నటించారు. తరువాత రోజులలో దర్శకులైన హేమాంబరధరావు ఈ చిత్రానికి సహాయ దర్శకులుగా పనిచేశారు. 17 జూలై 1953 నాడు విడుదలైన “పిచ్చి పుల్లయ్య” సినిమా ఆర్థికంగా విజయం సాధించకపోయినా దర్శకుడుగా తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్నారు తాతినేని ప్రకాశరావు.
తెలుగు, తమిళంలో సమాంతరంగా చిత్రాలు…
స్థిరమైన వేగంతో నాణ్యత గల చిత్రాలతో దర్శకత్వ జీవితాన్ని ముందుకు సాగిస్తూ వెళుతున్న తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో వచ్చిన మూడవ చిత్రం “నిరుపేదలు”. గోకుల్ పిక్చర్స్ నిర్మాణంలో దోనేపూడి కృష్ణమూర్తి నిర్మించిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, జమున, ఆర్.నాగేశ్వరరావు, రమణారెడ్డి తదితరులు నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకులు ప్రత్యగాత్మ రచయితగా చిత్రరంగ ప్రవేశం చేశారు. 1954 వ సంవత్సరం మార్చి నెలలో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరు విజయం దక్కించుకుంది. సి.డి. వీరసింహ నిర్మాణంలో జనతా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రకాశరావు తెరకెక్కించిన నాలుగవ చిత్రం పరివర్తన (1954). అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు, సావిత్రి, దొరస్వామి, రమణారెడ్డి, చదలవాడ, మిక్కిలినేని మొదలగు తారాగణంతో నిర్మితమైన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరావు, సావిత్రిలు అన్నాచెల్లెలుగా నటించారు. సెప్టెంబర్ 1954 లో విడుదలైన ఈ చిత్రం జనరంగజకంగా మెప్పుపొందింది.
1956 వ సంవత్సరంలో తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో నాలుగు సినిమాలు తెరకెక్కాయి. అదే సంవత్సరంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన తొలి తమిళచిత్రం అమరదీపం. శివాజీ గణేశన్, సావిత్రి, పద్మిని తదితరులు నటించిన ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. అదే చిత్రాన్ని హిందీలో అమర్దీప్ (1958) గా పునర్నిర్మించగా అక్కడ కూడా విజయవంతమైంది. రవీంద్రనాథ్ ఠాగూర్ వ్రాసిన “పడవ మునక” నవల ఆధారంగా
లలిత ఫిల్మ్స్ పతాకంపై ఎన్టీఆర్, అక్కినేని, అంజలీ దేవి, ఎస్.వి. రంగారావు, రేలంగి, సావిత్రి మొదలగు తారాగణంతో తెలుగు, జెమినీ గణేషన్, అక్కినేని, సావిత్రి, అంజలీదేవిలు ప్రధానపాత్రధారులుగా తమిళంలో ఒకేసారి సమాంతరంగా తెరకెక్కిన ద్విభాషా చిత్రం చరణదాసి (1956). తెలుగు, తమిళంలో ఒకేసారి 20 డిసెంబరు 1956 లో విడుదలై, రెండు భాషల్లోనూ ఈ రెండు చిత్రాలు విజయవంతం అయ్యాయి.
అయిదు భాషలలో విజయవంతమైన “ఇల్లరికం”..
అలాగే తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో అయిదు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో తెరకెక్కించబడి అద్భుతమైన విజయం సాధించిన చిత్రం “ఇల్లరికం”. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై అక్కినేని నాగేశ్వరావు, జమున నాయకా, నాయికలుగా నటించారు. ఇల్లరికపు అల్లుళ్ళకు తప్పని అగచాట్లు, వారి వల్ల అత్తమామలకు ఎదురయ్యే ఇబ్బందులు నేపథ్యంలో నడచే కథతో తెరకెక్కిన ఈ చిత్రం 01 మే 1959 నాడు విడుదలై అద్భుతమైన విజయం సాధించింది. హిందీలో “ససురాల్” పేరుతో తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో ఎల్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆ రోజులలోనే హైదరాబాదులో నేరుగా 50 రోజులు ప్రదర్శించబడిన అతికొద్ద చిత్రాలలో ఇల్లరికం ఒకటి.
ఈ చిత్రంతోనే తాతినేని ప్రకాశరావుకు వరుసకు తమ్ముడు అయిన తాతినేని రామారావు సహాయ దర్శకుడిగా సినీరంగ ప్రవేశం చేశారు. దర్శకుడిగా ప్రకాశరావు 1960 నుంచి 1965 దాకా హిందీ మరియు తమిళ చిత్రాలలో కొనసాగితే, 1965 నుండి 1973 దాకా పూర్తిగా హిందీ చిత్ర రంగానికి పరిమితమై 15 చిత్రాలకు దర్శకత్వం వహించారు ప్రకాశరావు. సుదీర్ఘ విరామం తరువాత శోభన్ బాబుతో 1973 వ సంవత్సరంలో “మైనర్ బాబు” అనే తెలుగు చిత్రం తెరకెక్కించారు ప్రకాశరావు. ఆయన దర్శకత్వంలో తెలుగులో దర్శకత్వం చేసిన చిట్టచివరి చిత్రం చిరంజీవి రాంబాబు (1972), అలాగే తమిళంలో చివరి చిత్రం “ఎంగలలుమ్ ముడియుమ్” (1982), హిందీలో చివరి చిత్రం కబ్ తక్ చుప్ రహూంగీ (1988).
కుటుంబం…
తాతినేని ప్రకాశరావు సినిమా పరిశ్రమలో చేరడానికి మద్రాసుకు వెళ్లడానికి ముందే ఇందుపల్లికి చెందిన అన్నపూర్ణతో వివాహం అయ్యింది. వారికి ఒక పాప “లీలా”మరియు బాబు టి.ఎల్.వి.ప్రసాద్. 1974లో డిగ్రీ పాసైన టి.ఎల్.వి.ప్రసాద్ ను తన శిక్షణలో కాకుండా వేరే దర్శకుడి వద్ద దర్శకత్వ శాఖలో చేర్పించారు. 70 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు టి.ఎల్.వి.ప్రసాద్. ఇందులో అధికంగా హిందీ చిత్రాలే కావడం, అందులోనూ మిథున్ చక్రవర్తి ఒక్కడితోనే 35 చిత్రాలు తెరకెక్కించడం చెరిగిపోని రికార్డు. తాతినేని ప్రకాశరావు మనవడు సత్య తాతినేని నేను కూడా సినిమా రంగంలోనే కొనసాగారు.
నిష్క్రమణ…
తన 23 సంవత్సరాల వయస్సులో మద్రాసుకు వచ్చి, యల్.వీ.ప్రసాద్ వద్ద సహాయ దర్శకుడిగా చేరి, ఇరవై ఎనిమిది సంవత్సరాలకే దర్శకుడై 35 సంవత్సరాల పాటు నిర్విరామంగా చిత్రాలను రూపొందించిన తాతినేని ప్రకాశరావు తన స్నేహానికి ప్రతిరూపంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆ పార్టీకి మద్దతుగా సినిమా రంగం నుంచి వచ్చారు. తెలుగుదేశం పార్టీలో కోశాధికారిగా కీలక బాధ్యతలు చేపట్టారు తాతినేని ప్రకాశరావు. కానీ నిజానికి రాజకీయం అనేది ఒక చదరంగం. అందులో బద్ద శత్రువులు ఆప్తమిత్రులవుతారు, అలాగే ఆప్తమిత్రులు బద్ద శత్రువులవుతారు.
ఎన్టీఆర్ ఐదేళ్ల రాజకీయ ప్రస్థానంలో దురదృష్టకరంగా తాతినేని ప్రకాశరావుతో విభేదాలు తలెత్తాయి. అందువలన ఆ తరువాత రోజులలో తాతినేని ప్రకాశరావు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు. చివరి రోజులలో దూరదర్శన్ కు బాలల సీరియల్ తీసే ప్రయత్నం చేశారు. అలా చేస్తున్న క్రమంలోనే తాతినేని ప్రకాశరావు 01 జులై 1992 నాడు నిద్రలోనే గుండెపోటుతో కన్నుమూశారు. స్థిరమైన వేగంతో, అద్భుతమైన చిత్రాలతో 35 ఏళ్ళ సినీ జీవితంలో ఎన్నో విజయాలను అందించిన తాతినేని ప్రకాశరావు 68 సంవత్సరాలకే తన ప్రస్థానాన్ని ముగించి ఈ లోకం నుండి నిష్క్రమించారు. తనతో ఉన్న విభేదాలను పక్కనపెట్టిన ఎన్టీఆర్, తన చినకాల మిత్రుడు తాతినేని ప్రకాశరావు భౌతికకాయానికి ఘనమైన నివాళులర్పించారు.










