Telugu Special Stories

ఆంధ్ర ప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రివర్యులు… ‘నీలం సంజీవరెడ్డి’

భారతదేశానికి రాష్ట్రపతిగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా, లోక్‌సభ సభాపతిగా, ఆంధ్ర రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, సంయుక్త మద్రాసు రాష్ట్రంలోనూ మంత్రిగా, కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా.. ఇలా వివిధ పదవులను అధిరోహించి, కేంద్ర, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు నీలం సంజీవరెడ్డి

నిజాయితీ, పరిపాలన దక్షతకి నిదర్శనమయ్యారు.

ప్రజా నేత.. గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు అయిన.. నీలం సంజీవ రెడ్డి గారి జయంతి ఈ నెల(మే 19)న కావడంతో, ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవిత విశేషాలను ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం:

జననం, విద్యాభ్యాసం…

1913 మే 19న, రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం జిల్లాకు చెందిన మారుమూల గ్రామమైన ఇల్లూరులో జన్మించారు

నీలం సంజీవరెడ్డి. తల్లి, తండ్రి.

వీరిది రైతు కుటుంబం. మద్రాసు దివ్యజ్ఞాన సమాజం పాఠశాలలో స్కూల్ విద్యను, స్థానిక  ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదువు పూర్తి చేశారు. వ్యవసాయ నేపథ్యమున్న కుటుంబం కావడంతో ప్రజలకు సేవ చేయాలనుకునేవారు. తన తండ్రి పడ్డ కష్టాలు ఇతర రైతులకు రాకుండా చూడాలనుకున్నారు. 1935 జూన్ 8న నాగరత్నమ్మను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లున్నారు. 

రాజకీయ ప్రవేశం…

1929ల్లో.. విద్యార్థిగా ఉన్నప్పుడే, మహాత్మాగాంధీకి విపరీతంగా ప్రభావితులయ్యారు. ఆపై స్వాతంత్ర్య పోరాటం వైపు దృష్టి సారించారు. 1937లో ఆంధ్ర రాష్ట్ర ప్రాంతీయ కాంగ్రెసు కమిటీకి కార్యదర్శిగా నియమితులయ్యారు. దాదాపు పదేళ్లపాటు అదే పదవిలో కొనసాగడం విశేషం.

ఆ తర్వాత క్విట్ ఇండియా ఉద్యమంలోనూ క్రియాశీలంగా పాల్గొని, డిటెన్యూగా జైలుకు వెళ్ళారు. 1940-45ల మధ్య ఎక్కువకాలం ఆయన జైలులోనే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. 

1946లో మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యారు. 1947లో రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. 

1949- 51వరకు మద్రాసు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. అదే ఏడాదిలో ఆంధ్రప్రాంత కాంగ్రెసు పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు, కొనసాగుతున్న మంత్రిపదవికి రాజీనామా చేశారు. ఈయనకు పోటీగా బరిలో ఎన్.జి.రంగా ఉన్నారు. ప్రకాశం పంతులు గారి మద్దతు కలిగినప్పటికీ, రంగాను ఓడించి, గెలుపొందారు. దీని తర్వాత  రంగా, ప్రకాశంను, కాంగ్రెసును విడిచి వెళ్ళారు.

First Chief Minister of Andhra Pradesh... Neelam Sanjiva Reddy

ఇలా ఉంటుండగానే, ఆయన ఐదేళ్ళ కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ విషాదాన్ని తట్టుకోలేని సంజీవరెడ్డి.. పార్టీ పదవికి రాజీనామా చేయాలని యోచించారు. తరువాత పార్టీ పెద్దల ఒత్తిడిమేరకు రాజీనామాను సైతం ఉపసంహరించుకున్నారు.

రెండేళ్లకు 1953లో, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. సంయుక్త మద్రాసు రాష్ట్ర శాసనసభ సభ్యుల నుంచి కొత్త రాష్ట్ర కాంగ్రెసు శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకునే సమయంలో సంజీవరెడ్డి పోటీలేకుండానే  ఎన్నికయ్యారు. అంతేకాక, ముఖ్యమంత్రి పదవి ఖాయమైనా, స్వయంగా తప్పుకుని టంగుటూరి ప్రకాశం పంతులుకు నాయకత్వాన్ని అప్పగించి, సంజీవరెడ్డి ఉపముఖ్యమంత్రి అయ్యారు. 

మరలా రెండేళ్లకు, 1955లో రాజకీయాల్లో జరిగిన ఎన్నికల ఫలితంగానే, ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికీ, వదులుకున్నారు.  

అధిరోహించిన పదవులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించాక, కాంగ్రెసు శాసనసభాపక్ష నాయకుడిగా.. బెజవాడ గోపాల్ రెడ్డిని ఓడించి, ముఖ్యమంత్రి అయ్యాడు. 

తిరిగి 1960లో అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షపదవికి ఎన్నికవ్వడంతో.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

అలా కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా రెండేళ్ళు పనిచేసి, తిరిగి 1962లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. 

1964 జూన్ నెలలో.. లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వంలో ఉక్కు, గనుల శాఖ మంత్రిగా నియమితులయ్యారు.

1967లో నాలుగో లోక్‌సభకు హిందూపురం నియోజకవర్గం నుండి ఎన్నికై, లోక్‌సభకు సభాపతిగా కూడా ఎన్నికయ్యారు. 

 సభాపతి నిష్పాక్షికంగా ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెసు సభ్యత్వానికి రాజీనామా చేశారు. సభాపతిగా ఎన్నిక కాగానే, తన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మొదటి లోక్‌సభ సభాపతి.. బహుశా సంజీవరెడ్డియే అయి ఉంటారు.

1969 జూలై నెలలో.. సభాపతి పదవికి సైతం రాజీనామా చేసి, రాష్ట్రపతి పదవికి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీలో నిలబడ్డారు.  

ఈసారి ఉన్న పార్టీలోనే అంతర్గత రాజకీయాలు జరిగాయి. దీంతో ఆయన, వి.వి.గిరి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయాడు. 

దీంతో కొంతకాలం.. దాంతో సంజీవరెడ్డికి కొద్దికాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

1975లో జయప్రకాశ్ నారాయణ్ హైదరాబాదులో జరిపిన పర్యటనతో తిరిగి రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాడు. 

1977లో విధించిన ఎమర్జెన్సీ తరువాత, జనతాపార్టీ ప్రభంజనం వల్ల.. కాంగ్రెసును అధికారం నుంచి దింపివేయాలనుకున్నప్పుడు..

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కాంగ్రెసుకే పట్టం కట్టాయి. 42 స్థానాలకుగాను, 41ని కాంగ్రెసు గెలుచుకోగా, మిగతా ఒక్క స్థానమూ గెలిచింది మాత్రం జనతా పార్టీ తరపున సంజీవరెడ్డినే.. 

మరలా లోక్‌సభ సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. కొన్నాళ్ళకు రాజీనామా చేసి, ఈసారి నాలుగు నెలల్లోనే రాష్ట్రపతి పదవికి పోటీ చేశారు. 37మంది పోటీలో ఉంటే, ఒక్క సంజీవరెడ్డి నామినేషను తప్ప మరెవరిదీ చెల్లకపోవడంతో, ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఒకేఒక్క రాష్ట్రపతిగా ఆయన చరిత్రలో నిలిచారు.

1982లో రాష్ట్రపతి పదవి నుంచి దిగిపోయాక, రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుని, వ్యక్తిగత జీవితాన్ని గడిపేందుకు బెంగుళూరులో స్థిరపడ్డారు. 1996 జూన్ 1న నీలం సంజీవరెడ్డి తుదిశ్వాస విడిచారు. 

ప్రత్యేకాంశాలు…

*చాలామంది రాజ్యాంగ రచన అనగానే, అంబేడ్కర్‌  ఒకరే అనుకుంటారు. రాజ్యాంగ నిర్మాణంలో నీలం సంజీవరెడ్డి సైతం కీలక పాత్ర వహించారు. 

*ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యంగా, జిల్లా పరిషత్, పంచాయతీ సమితులు, విధాన పరిషత్‌ ఏర్పాటుకు కారకులయ్యారు. ఒకరకంగా పంచాయితీ వ్యవస్థకు పరిపూర్ణత తీసుకొచ్చారు. 

*1959లో, ఏపీ పర్యటనకు వచ్చిన నెహ్రూ… నీలం సంజీవరెడ్డి పరిపాలన విధానాలను చూసి మెచ్చుకున్నారట. జాతీయ రాజకీయాల్లోకి అడుగులు పడేలా చేసింది ఈ అనుభవమే. 

ఆపై నెహ్రూకు అత్యంత విశ్వాసపాత్రుడిగా మెలిగారు. 

*నెహ్రూ తర్వాత ప్రధాని పదవి చేపట్టిన లాల్‌బహదూర్‌ శాస్త్రి, ఇందిరాగాంధీల మంత్రివర్గాలలో నీలం సంజీవరెడ్డి పనిచేశారు. అంతేకాక ఆయన హయాంలో అనేక భారీ పరిశ్రమలను స్థాపించడం విశేషం. 

*1977లో రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మరణించడంతో, అతని స్థానంలో నీలం సంజీవరెడ్డిని ఎన్నుకునేందుకు నాటి జనతా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు విపక్షంలో ఉన్న ఇందిర కూడా సంజీవరెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతునిచ్చారు. దీంతో మొత్తంగా సంజీవరెడ్డి ఏకగ్రీవంగా రాష్ట్రపతి పదవినీ అలంకరించారు.

*విశేషమేంటంటే, ఉప రాష్ట్రపతిగా పదవి చేపట్టకుండానే రాష్ట్రపతి అయ్యారు. అతి చిన్న వయసులో(63 సంవత్సరాలు) రాష్ట్రపతిగా ఎన్నికై, ఘనత సాధించారు.

*పదవీవిరమణ అనంతరం చాలారోజులు జిల్లా కేంద్రంలోని నాగవిహార్‌లో ఉన్నారు. కొంతకాలం బెంగళూరులో నివసించారు. అక్కడే, మరణించారు. శ్రీకంఠం సర్కిల్‌లో ఆయన శిలావిగ్రహం ఉంటుంది.

1940- 1970ల వరకు కూడా రాష్ట్ర, దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన ఆయన సేవలు, నిర్విరామ కృషి మరువలేనిది. దేశానికి నిరుపమాన సేవలందించిన రాజకీయవేత్తకు జోహార్లు.

Show More
Back to top button