ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా మార్చే దిశగా మరో కీలక అడుగు పడింది. దేశంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి ‘ఏఐ (Artificial Intelligence) క్యాంపస్’ను అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ప్రతిష్టాత్మక విద్యాసంస్థ బిట్స్ పిలానీ సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆ సంస్థ ప్రతినిధులు తాజాగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో సమావేశమై తమ ప్రణాళికలను వివరించారు. మందడం, వెంకటపాలెం మధ్య ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన 70 ఎకరాల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక క్యాంపస్ రూపుదిద్దుకోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతకు అనుగుణంగా, రాబోయే ఐదేళ్లలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో నెక్ట్స్ జెన్ టెక్నాలజీ కేంద్రంగా ఈ సంస్థను తీర్చిదిద్దనున్నారు.
ఈ క్యాంపస్ కేవలం ఐటీ రంగానికే పరిమితం కాకుండా వ్యవసాయం, వాతావరణం, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో కృత్రిమ మేధ వినియోగంపై ప్రత్యేక కోర్సులను అందించనుంది. ముఖ్యంగా ఏఐ, డేటా సైన్స్, రోబోటిక్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్ వంటి అత్యాధునిక సబ్జెక్టులపై ఇక్కడ పరిశోధనలు సాగుతాయి. రెండు దశల్లో సుమారు 7,000 మంది విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉన్నత విద్యను అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నిర్మాణాలు పూర్తిగా పర్యావరణ హితంగా, గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ మరియు పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంతో సాగుతుండటం విశేషం.
మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణతో కూడా భేటీ అయిన బిట్స్ ప్రతినిధులు, భవనాల డిజైన్లను ప్రదర్శించారు. మూడు దశల్లో ‘AI+’ క్యాంపస్‌గా అభివృద్ధి చెందనున్న ఈ సంస్థలో, రాబోయే రెండున్నరేళ్లలోనే మొదటి దశ అడ్మిషన్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విద్యుత్, సాంకేతిక రంగాల్లో ఏపీ దూసుకుపోతున్న తరుణంలో, బిట్స్ పిలానీ వంటి సంస్థ రాక రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి సరికొత్త ఊపునిస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా అమరావతి ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రంగా మారుతుందని బిట్స్ ప్రతినిధులు ధీమా వ్యక్తం చేశారు.






