Telugu News

మొంథా తుపాన్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముప్పును దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు అప్రమత్తమై, ముందస్తు జాగ్రత్త చర్యలను చేపట్టాయి. ఈ నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసింది.

* తుపాను సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు:

తుపాన్ సమయంలో అధికారిక సమాచారం మాత్రమే తెలుసుకోవాలి, పుకార్లను నమ్మవద్దు.

ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ కోసం మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసుకుని సిద్ధంగా ఉండాలి.

వాతావరణ శాఖ జారీ చేసే సందేశాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి.

భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో మీ ఇంటికి విద్యుత్ సరఫరాను నిలిపివేయండి, అన్ని ఎలక్ట్రానిక్, గ్యాస్ కనెక్షన్లను తీసివేయండి.

భద్రత, మనుగడ కోసం అవసరమైన వస్తువులతో ఎమర్జెన్సీ కిట్‌ను ఏర్పాటు చేసుకోండి.

మీ డాక్యుమెంట్స్ లేదా సర్టిఫికేట్లు లేదా విలువైన వస్తువులను సురక్షితంగా దాచుకోండి.

పాత భవనాలు, చెట్లు, విద్యుత్ వైర్లు స్తంభాల కింద నిలబడవద్దు.

ప్రభుత్వ అధికారులు సూచించిన వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లాలి.

మీ ఇళ్లు సురక్షితం కాకపోతే తుపాను ప్రారంభం కాకముందే సురక్షితమైన ఆశ్రయానికి చేరుకోవాలి.

పశువులు, పెంపుడు జంతువులకు కట్టిన తాడును విప్పి వాటిని వదిలేయాలి.

* ప్రభుత్వ చర్యలు, సహాయ కేంద్రాలు

మొంథా తుపాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందుగానే పటిష్ట చర్యలు చేపట్టింది. సహాయక చర్యల కోసం ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలను ప్రభావిత జిల్లాలకు తరలించింది. తుపాను ప్రభావిత ప్రాంతాలకు శాటిలైట్ ఫోన్లు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రత్యేక సహాయ శిబిరాలు ఏర్పాటు చేసింది. పట్టణాలలో ప్రమాదకరమైన హోర్టింగ్స్‌ను తొలగించింది, సహాయక చర్యల కోసం అన్ని శాఖల అధికారులను సిద్ధం చేసింది. వాస్తవ సమాచారం లేదా ప్రభుత్వ సాయం పొందడానికి ప్రజలు స్టేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు 112, 1070 లేదా టోల్ ఫ్రీ నంబర్ 18004250101 లను సంప్రదించవచ్చు.

Show More
Back to top button