BOOKSTelugu Special Stories

ఆంధ్రుల కలల రాజధాని అమరావతి వివాదాలు-వాస్తవాలు

అమరావతి.. ఆంధ్రుల కలల రాజధాని

ఈ నగర నిర్మాణం.. 2015లో శంకుస్థాపనకు నోచుకుంది. కానీ ఇప్పటివరకు అమరావతి గురుంచి స్పష్టమైన వివరణ లేదు… ఈ నిర్మాణాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించారు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 

217 చ.కి.మీల విస్తీర్ణంలో అన్ని హంగులతో అభివృద్ధి చేసేందుకు ఒక స్పష్టమైన విజన్ ను తయారు చేశారు. ఇందుకుగానూ రైతులను ఒప్పించి, సుమారు 30వేల ఎకరాలకు పైగా భూసమీకరణ గావించారు.

తెలుగుదేశం ప్రభుత్వం రూపొందించిన అమరావతి నగర నమూనాలు ఔరా అనిపించాయి. దేశంలోని ఏ మహానగరానికి తీసిపోని విధంగా ప్రజారాజధాని అమరావతి రాబోతుందని రాష్ట్ర ప్రజలంతా భావించారు. ఇంతలోనే కలలసౌధం కల్లలుగా మారిపోతుందని ఊహించలేదు.

2019 ఎన్నికల తర్వాత.. జగన్ సర్కార్ అధికారంలోకి రావడం మొదలు.. అమరావతి ఊసే లేకుండాపోయింది. కొనసాగుతున్న నిర్మాణాలను సైతం ఆపేసింది. ఇది చాలదన్నట్లు..  

జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతి రాజధాని నిర్మాణం అంతటితో ఆగిపోయింది. వేల ఎకరాల భూసమీకరణ, రూ.10 వేల కోట్లతో చేసిన నిర్మాణపనులు.. వేలాదిమంది శ్రామికుల నిరంతర శ్రమ.. నిర్వీర్యమయ్యాయి. 

ఆంధ్రుల అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీక.. అయిన రాజధాని ఏర్పడే దశలో మళ్లీ జగన్ సర్కారుతో ఆటంకం ఎదురైంది. ఈ పరిణామంతో రాబోయే తరాలకూ తీరని నష్టం వాటిల్లుతుంది. ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఆంధ్రప్రదేశ్ వికసించాలంటే రాజధాని నగరం అవసరం. అశాస్త్రీయ విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు అమరావతి విషయంలో మరొక తప్పిదం చేస్తుందన్న ఆవేదనతో రాసిన పుస్తకమే.. ‘అమరావతి.. వివాదాలు- వాస్తవాలు’ దీన్ని సారాంశం ఏంటంటే…

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాస్తా.. రెండు(ఆంధ్రప్రదేశ్, తెలంగాణ)రాష్ట్రాలుగా విడిపోయింది. అశాస్త్రీయ విభజన కారణంగా రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఎన్నో పరిణామాల అనంతరం అమరావతిని రాజధానిగా చేయాలని అనుకున్న సమయంలో కూడా ఎన్నో రాజకీయ అడ్డంకులు వచ్చాయి. రాజధానిగా ఎన్నుకున్న అమరావతి ప్రాంతంలో కమ్మవారు ఎక్కువగా ఉన్నారనీ, వారి ఆధిపత్యమే ఇక్కడ ఉండబోతుందని రాజకీయవిశ్లేషకులు ఓ ప్రత్యేక చర్చకు తెరతీశారు.

అమరావతిని ఎంచుకున్నారు సరే, నాటి చంద్రబాబు సర్కారు రాజధాని నిర్మాణ పనులను చేయడంలో జాప్యం వహించింది అని కొత్త వాదన కూడా తెరపైకి వచ్చింది. 

నాడు అసెంబ్లీలో రాజధానిగా అమరావతికి మద్దతు ప్రకటించిన ప్రధాన ప్రతిపక్షం.. నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్టణం రాజధానిగా ఆలపించడం వెనుక కారణాలు ఏంటి..? వీటి వెనుక గల అసలు నిజాలు ఏంటి..? అన్న ప్రశ్నలకు సూటిగా సమాధానాలను ఇచ్చే ప్రయత్నం చేశారు.. సీనియర్ జర్నలిస్ట్ కందుల రమేష్. ఆయన రాసిన ‘అమరావతి వివాదాలు-వాస్తవాలు’ పుస్తకంలో ‘రాజధాని అమరావతి’పై జరిగిన కుట్రలు, వచ్చిన పుకార్లు, అబద్ధపు ప్రచారాలకు సంబంధించిన విషయాలపై స్పష్టత ఇచ్చేందుకు ఈ  పుస్తకాన్ని వెలుగులోకి తెచ్చినట్లు తెలుస్తుంది.

అది 1953నాటి కాలం. అప్పట్లో మద్రాసు ఒక మహానగరంగా రూపుదిద్దుకోవడానికి ఆంధ్రుల పాత్రే ఎంతో కీలకం. అటువంటి మద్రాసును కోల్పోయినందుకు ప్రతిగా ఎటువంటి పరిహారాన్ని పొందలేదు. అందుకోసం అప్పటి నాయకులు గట్టిగా పోరాడి, ప్రయత్నించిన దాఖలాలు లేవు. గతం నుంచి పాఠాలు నేర్చుకోని కారణంగానే, 2014లో ఆంధ్రులకు తిరిగి ఇదే పరిస్థితి ఎదురైంది.

ఇప్పటి తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సాల్లో వందలాది ఏళ్లుగా తెలుగువారిగానే కొనసాగిన ఎంతోమంది ఆంధ్రులు… 1953లో ఆంధ్ర రాష్ట్రం, 1956లో దేశవ్యాప్తంగా భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత తమ అస్తిత్వాన్ని కోల్పోవడమనేది విధి వంచితమే!

అయితే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత, దక్షిణాదిలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆంధ్రులకు కోస్తా, రాయలసీమ ఆంధ్రులతో సంబంధాలు అంతటితో తెగిపోయాయి. అయినప్పటికీ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతున్న దశలో రాజధాని మీద ఒక అవగాహనకు రాకపోతే పర్యవసానం ఎలా ఉంటుందోనని..

అన్ని విభేదాలను మరచి కర్నూలుకే అందరు మద్దతు ఇవ్వాలని ప్రకాశం పంతులు పిలుపునిచ్చారు. 

ఆ తర్వాత అన్ని సవరణ తీర్మానాలను పరిశీలించేందుకు.. ఓటింగ్ పెట్టారు. 

తిరుపతి కావాలని లచ్చన్న తీర్మానం, 

విజయవాడ కావాలని నాగిరెడ్డి తీర్మానం, విశాఖపట్నం కావాలని కె. వెంకట నారాయణ దొర తీర్మానం.. కానీ ఇవి వీగిపోయాయి. చివరగా విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఉండాలన్న వావిలాల గోపాలకృష్ణయ్య తీర్మానం కూడా ఓటమి పాలైంది. 

అప్పటి ప్రభుత్వం ఎందుకు శివరామకృష్ణన్‌ కమిటి రిపోర్టుని పట్టించుకోలేదు?, కమిటి సూచించిన విధంగా కాకుండా సరికొత్త నగరాన్ని నిర్మించాలని ఎందుకు నిర్ణయించింది? ముందుగా శివరామకృష్ణన్‌ కమిటి రిపోర్టులో ప్రధాన లోపాన్ని గమనించాలి. 

ఏ పరిస్థితుల్లో అవశేష ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భవించింది, ఏ సంక్లిష్ట సందర్భంలో రాజధాని అవసరమైందనే స్పృహ.. ఈ రిపోర్టును తయారుచేసిన వారిలో లోపించిందనే చెప్పుకోవాలి.

ప్రభుత్వ కార్యాలయాలన్నిటిని ఒకచోట కాకుండా, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నెలకొల్పాలని మాత్రమే సిఫార్సు చేసింది. అభివృద్ధి వికేంద్రీకరణ, ప్రభుత్వ కార్యాలయాల వికేంద్రీకరణ మధ్య తేడాని అర్థం చేసుకోవడంలో శివరామకృష్ణన్‌ పూర్తిగా విఫలమయ్యారు. రాష్ట్రంలో విభజనానంతర ప్రత్యేక పరిస్థితులను, అస్తిత్వానికి సంబంధించి ప్రజల్లో వస్తున్న తీవ్ర ఆక్రోశాన్ని, సాంస్కృతిక భావోద్వేగ అంశాలను కమిటి పట్టించుకోనే లేదు. రాజధానిని కొన్ని ప్రభుత్వ ఆఫీసుల సముదాయంగా ఉంచడమే తప్ప దిక్కుతోచని విధంగా మారిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని గురుంచి ఆలోచించనే లేదు.

ఇది కాకుండా.. రాజధానిగా నిర్ణయించిన అమరావతి చుట్టూ పక్కల గ్రామాల్లో దళితులకు చోటు లేదని, ఇక్కడ కమ్మ వారే అత్యధికమని విశ్వసిస్తున్నారు. ఈ అబద్ధాన్ని అలానే కొనసాగించడం. 

రాజధాని నిర్మాణ పనులు చేపట్టిన తర్వాత అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం.. చాలా జాప్యం చేసిందనే విషయం.. విస్తృతంగా మీడియాలోనూ జనంలోనూ ప్రచారమైంది. నిజానికి ఈ జాప్యానికి ప్రధాన కారణం ఈ ప్రాజెక్టును అడుగడుగునా అడ్డుకున్న సైంధవులే. 

ఒకవైపు అమరావతిలో పనులు జరగడం లేదని ప్రచారం చేసినవాళ్లే, మరోవైపు వెనకనుంచి న్యాయపరమైన చిక్కుల్లో పడేలా చేశాయి. 

ఈ విషయమై ఎన్జీటిలో దాదాపు రెండేళ్లపాటు కేసు నడిచింది. దీంతో అమరావతిలో పనులు వేగంగా జరగడానికి అవకాశం లేకుండాపోయింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులోనే మరో ఏడాది గడిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు డిజైన్లకు తుదిమెరుగులు ఇస్తూ, మరోవైపు కోర్టు కేసులతో కుస్తీ పట్టాల్సి వచ్చింది. 

ఇదిలా ఉంటే అమరావతి వంటి భారీ ప్రాజెక్టుల్లో పర్యావరణ అనుమతులు పొందడం చాలా కష్టం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పర్యావరణ చట్టాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది. ఆ ప్రకారం 2015 సెప్టెంబరులో, రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతిని పొందింది. ఆ తర్వాత ఈ అనుమతిని సవాలు చేస్తూ అమరావతిని వ్యతిరేకించే ఎన్జీటిలో కేసు వేస్తే తీర్పు రావడానికి దాదాపు రెండేళ్లు పట్టింది. ఆ తర్వాత ఎన్జీటిలో రివ్యూ పిటిషన్‌ వేసి, అక్కడ ఓడిపోయాక సుప్రీం కోర్టులో అప్పీలుకు అమరావతి వ్యతిరేకులు వెళ్లారు. చివరకు సుప్రీం కోర్టులో 2019 జనవరి 4న, అమరావతి నిర్మాణానికి అనుకూలంగా తుది తీర్పు వచ్చింది. అంటే పర్యావరణ అనుమతిని పొందడానికి ఏడాది పడితే, కోర్టుల్లో కేసుల నుంచి బయటపడటానికి రాష్ట్ర ప్రభుత్వానికి మరో మూడు సంవత్సరాలపైన పట్టింది.

1953లో విజయవాడ-గుంటూరు ప్రాంతాన్ని రాజధానిగా చేయకూడదని.. అప్పటి కాంగ్రెస్‌ నాయకులు విశాఖపట్నాన్ని ముందుకు తీసుకువచ్చారు. అదేవిధంగా ఇప్పుడు  అమరావతిలో కొంతదూరం ప్రయాణించిన తర్వాత.. క్యాపిటల్‌ పేరుతో విశాఖపట్నానికి తరలివెళ్లాలన్న ప్రతిపాదనను జగన్‌ మోహన్‌ రెడ్డి, ఆయన పార్టీ వర్గం తీసుకొచ్చాయి. ఆ రకంగా చూస్తే, ఆంధ్రప్రదేశ్‌లో ఆనాటి దుస్థితి పునరావృతమవుతోందని చెప్పాలి. రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఏర్పడకుండా కాంగ్రెస్‌ పార్టీ గతంలో ఏ విధంగా అయితే అడ్డుకుందో, ఇవాళ జగన్‌ మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అదే తీరును అవలంబిస్తోందన్నట్లు తెలుస్తుంది. 

ఆనాడు కమ్యూనిస్టులకు పలుకుబడి ఎక్కువ అనే ఉద్దేశంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఈనాడు తెలుగుదేశం పార్టీకి ప్రాబల్యం ఎక్కువనే దురభిప్రాయంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలు.. రాజధాని అంశాన్ని పూర్తిగా రాజకీయం చేశాయి. ఇందుకోసం అప్పుడూ ఇప్పుడూ కులాన్ని వాడుకోవడానికి ఏమాత్రం సంకోచించట్లేదు.

Show More
Back to top button