CINEMATelugu Cinema

తెలుగు చిత్ర అగ్రనటుల తొలి మల్టీస్టారర్ చిత్రం… పల్లెటూరి పిల్ల..

తెలుగు సినీ కళామతల్లికి రెండు కళ్ళుగా భాసిల్లిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గార్లు కలిసి నటించిన మొట్టమొదటి చిత్రం “పల్లెటూరి పిల్ల”. ఏఎన్ఆర్ గారికి ఇది 12వ చిత్రం కాగా, ఎన్టీఆర్ గారికి మాత్రం రెండో సినిమానే. అయితే ఎన్టీఆర్ గారు కెమెరా ముందు హీరోగా నిలిచిన తొలి సినిమా ఇదే. కాకపోతే ఆయనను హీరోగా ప్రేక్షకుల ముందు నిలబెట్టిన మొదటి సినిమా విజయవారి “షావుకారు”. ఒకే నెలలో 20 రోజుల తేడాతో ఈ రెండు చిత్రాలు విడుదల కావడం గమనార్హం. ఏయన్ఆర్ గారే తన సీనియర్ అయినా కూడా టైటిల్స్ లో ఎన్టీఆర్ పేరు ముందుగా వేస్తే ఆయన సినీ ప్రస్థానం మున్ముందు బాగుంటుందని దర్శక, నిర్మాత బి.ఏ.సుబ్బారావు గారికి ఏఎన్ఆర్ గారు సూచించారు. దానిని అంగీకరించని బి.ఏ.సుబ్బారావు గారు టైటిల్స్ లో ఏఎన్ఆర్ గారి పేరు ముందు వేశారు. చిత్ర పరిశ్రమలో ఆనాడు నెలకొని ఉన్న ఆరోగ్యకరమైన వాతావరణంకు ఉదాహరణగా ఇది సూచిస్తుంది. ఎంతోమంది నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ప్రోత్సాహాన్ని, హస్తాన్ని అందించిన పల్లెటూరి పిల్ల చిత్ర విశేషాలు…

ఆ రోజులలో సాధారణంగా “ఒక పురుషుని చుట్టూ ఇద్దరు స్త్రీలు తిరుగుతూ ఒకరు పాతివ్రత్యాన్ని, మరొకరు వ్యభిచారాన్ని పోషించే ఊకదంపుడు కథలు ఎక్కువగా ఉండేవి. మద్రాసు నిర్మాతలు కూడా అలాంటి కథలనే ఎన్నుకునేవారు. అలాంటి పాత్రలు పోషిస్తున్న యుగంలో “పల్లెటూరు పిల్ల” సినిమా కథలోనే ముందుగా క్రొత్తదనం చూపింది. ఒకే అమ్మాయిని ఇద్దరు యువకులు ప్రేమిస్తారు. ఒకడు తన ప్రేయసి కోసం ఆదర్శయుతమైన త్యాగాన్ని ప్రదర్శిస్తాడు. దోపిడిగాండ్లలో పరివర్తన తెప్పించి అధికాహార ఉత్పత్తికి దోహదమిస్తుంది ఈ కథ. పశుబలాన్ని మచ్చిక చేసుకొని ప్రజోపయోగకరంగా మలచుకోవచ్చునని తెలుపుతుంది ఈ కథ.

ప్రతి పాత్రకూ తగిన ప్రాముఖ్యతనిచ్చి కథకూ సన్నివేశానికీ మంచి బిగువును కల్పించారు దర్శక, నిర్మాత బి.ఏ.సుబ్బారావు గారు. పల్లె వాతావరణమూ, వారి సంప్రదాయాలు, ఆచారాలు, మంచీ చెడూ చాలా చక్కగా చిత్రీకరించారు. తాపీ ధర్మారావు గారు అందించిన మంచి సంభాషణలను ప్రశంసింపక తప్పదు. ఆదినారాయణరావు గారి సంగీతం పల్లెటూరి వాతావరణానికీ, కథకూ, గమనానికీ, స్థాయికీ బాగా సరిపోయింది. చిత్రం యొక్క ఆఖరులో ఎడిటింగ్ కొంచెం కుంటుపడింది. ఆంజలీ దేవి గారి నటన పాత్రోచితంగా, సహజంగా ఉంది. నాగేశ్వరరావు, రామారావు తమ తమ పాత్ర నటనను సమర్ధవంతంగా నిర్వహించారు. చక్కని హాస్యంతో చిత్రానికి అడుగడుగునా ఆసక్తి కలిగించిన సీతారాం, రామ్మూర్తులను ప్రత్యేకంగా పేర్కొనక తప్పదు.

చిత్ర విశేషాలు….

  • దర్శకత్వం   :    బిఎ సుబ్బారావు
  • కథ           :          బి.ఎ.సుబ్బారావు,
  • తాపీ ధర్మారావు, పి. ఆదినారాయణరావు
  • నిర్మాణం   :     మీర్జాపురం రాజా బి.ఎ.సుబ్బారావు, రాజా సాహెబ్ (ప్రస్తుతం)
  • స్క్రీన్ ప్లే     :      బి.ఎ.సుబ్బారావు
  • తారాగణం  :   ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, అంజలీ దేవి.
  • సంగీతం    :    పి. ఆదినారాయణరావు
  • నేపథ్య గాయకులు :  ఘంటసాల వెంకటేశ్వరరావు, కృష్ణవేణి జిక్కి, పిఠాపురం నాగేశ్వరరావు
  • మాటలు  :  తాపీ ధర్మారావు (సంభాషణలు) 
  • ఛాయాగ్రహణం  :   DS కోట్నిస్
  • కూర్పు       :      కె.ఎ.శ్రీరాములు
  • నిర్మాణ సంస్థ    :    శోభనాచల & BA సుబ్బారావు జాయింట్ ప్రొడక్షన్స్
  • పంపిణీ      :     పూర్ణ సినిమాలు
  • నిడివి      :     176 నిమిషాలు
  • విడుదల తేదీ   :     27 ఏప్రిల్ 1950
  • భాష     :     తెలుగు

చిత్ర కథ సంక్షిప్తంగా…

శాంత తన బంధువు వసంత్‌తో కలిసి పెరిగిన ఒక అందమైన పల్లెటూరి అమ్మాయి. వసంత్‌ తన చిన్నప్పటి నుండి శాంతని తెలియకుండా ప్రేమిస్తుంటాడు. దుర్మార్గుడైన కంపన్న దొర, సమీపంలోని భూభాగంలోని గ్రామాలపై తరచుగా దాడులు చేసి దోచుకుంటుంటాడు. ఒకసారి వారి దాడి సమయంలో, శాంత కంపన్న దొర యొక్క ప్రధాన సహచరుడు జయంత్‌ను చెంపదెబ్బ కొడుతుంది. ఈ సంఘటన జయంత్‌ను సంస్కరిస్తుంది. దాంతో జయంత్ మరియు కంపన్నల మధ్య విభేదాలు తలెత్తుతాయి. దాంతో జయంత్ జైలు పాలవుతాడు. కానీ జయంత్ జైలలో తథా సహాయంతో పరారై శాంత గ్రామానికి చేరుకుంటాడు.

ఆ సమయంలో, గ్రామస్థులు అతనిని ఆలింగనం చేసుకుని ఆశ్రయం కల్పిస్తారు. ఒక సందర్భంలో అతను వసంత్ మరియు శాంతలను ఎద్దుల దాడి నుండి రక్షిస్తాడు. దాంతో జయంత్ ను శాంత ప్రేమించడం మొదలుపెడుతుంది. జయంత్ ఆమెలో ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందిస్తాడు. ఇది తెలిసి, కోపోద్రిక్తుడైన వసంత్ జయంత్‌ను పడగొట్టడానికి ప్రయత్నిస్తాడు, కానీ శాంత యొక్క అసలు ఉద్దేశం తెలుసుకున్న తర్వాత, అతను వారిని జంటగా చేస్తాడు. గ్రామస్థులు తథాను చితకబాదడంతో గ్రామాన్ని నాశనం చేసేందుకు వచ్చిన కంపన్న జారుకుంటాడు.

సమయం గడిచిపోతుంది. శాంత ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. కంపన్న కుట్ర చేసి జయంత్‌ని పట్టుకున్నప్పుడు తాను జానపద పండుగను జరుపుకుంటున్నారు. అప్పుడు, శాంత వసంత్ తన భర్తను కాపాడాలని ధృవీకరిస్తూ కంపన్న కోట వైపు వెళ్లినప్పుడు అతన్ని ఖండిస్తుంది. ఇంతలో కంపన్న మనుషులు బిడ్డను పట్టుకున్నప్పుడు ఆత్రుతతో శాంత కూడా జయంత్ కోసం వెతుకుతుంది. చివరగా, వసంత్ తన జీవితాన్ని త్యాగం చేయడం ద్వారా వారిని రక్షిస్తాడు. కంపన్నను క్షమించి, పశ్చాత్తాపపడేలా చేస్తాడు. చివరగా, సినిమా ముగుస్తుంది మరియు వసంత్ ఆత్మ గ్రామస్తులను ఆశీర్వదిస్తుంది.

బి.ఏ. సుబ్బారావు…

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పుట్టి పెరిగిన బి.ఏ.సుబ్బారావు (బుగత వెంకట సుబ్బారావు) గారికి చిన్నతనం నుంచి నాటకాలు అంటే విపరీతమైన అభిమానం. ఆ అభిమానంతోనే “నాట్య కళా వినోదిని సభ” పేరుతో ఒక నాటక సంస్థను నెలకొల్పి అనేక ప్రదర్శనలు ఇస్తుండేవారు. నిజానికి బి.ఏ.సుబ్బారావు రైల్వే టికెట్ కలెక్టర్ గా ఉద్యోగం చేస్తుండేవారు. అలా రైల్వేలో పని చేస్తూనే ఆయన ఈ “నాట్య కళా వినోదిని సభ” సంస్థను నిర్వహించేవారు. ఈ సంస్థలో అంజలీదేవి, ఆదినారాయణరావు, కృష్ణవేణి, ఎస్వీ రంగారావు, రేలంగి తదితరులు నాటక వేషాలు వేస్తుండేవారు. “నాట్య కళా వినోదిని సభ” నాటక సంస్థకు అన్నీ తానే అయ్యి దిగ్విజయంగా బి.ఏ.సుబ్బారావు గారు నడిపిస్తున్న తరుణంలో ఆయనకు సినిమా రంగం నుంచి ఆహ్వానం వచ్చింది. అప్పుడు ఆయన తన రైల్వే ఉద్యోగానికి వీడ్కోలు పలికి ఛలో మద్రాసు అనుకున్నారు. కొన్ని రోజులు అనంతరం ఆయన మీర్జాపురం రాజావారి శోభనాచల స్టూడియోలో ప్రొడక్షన్ మేనేజర్ గా చేరారు.

మీర్జాపురం రాజావారు…

మాములుగానే జమీందారు అయిన రాజా వారు రాజకీయ రంగం నుంచి సినిమాలలోకి రావడం జరిగింది. సినిమా నిర్మాత, దర్శకుడు, స్టూడియో యజమాని అయినా కూడా ఆయన తన జమీందారు పోకుడలు మర్చిపోలేదు. తాను దర్శకత్వం వహించే చిత్రాల చిత్రీకరణ జరుగుతున్న సమయంలో కూడా ఆయన సెట్ బయట తన వందిమాగధులతో  కొలువుతీరేవారు. జరగాల్సింది జరిగేతీరుతుంది అనుకునే ఆశావాది. ఆయన ఇంతకన్నా మునిగిపోయేదేమిటి అనే నిర్లక్ష్యంతో ప్రవర్తించేవారు. అటువంటి వ్యక్తి దగ్గర పనిచేస్తూ రాజావారి గౌరవానికి మర్యాదలకు లోటు రాకుండా ప్రవర్తిస్తూ ఆయన అభిమానానికి పాత్రుడయ్యారు బి.ఏ.సుబ్బారావు గారు. నీవు సినిమా తీసుకో నేను సాయం చేస్తాననే వరాన్ని రాజవారి నుంచి పొంది పూర్ణ మంగరాజు, మరి కొంతమంది చేయూతతో నిర్మాతగా మారి “శోభనాచల, బి.ఏ.ఎస్ జాయింట్ ప్రొడక్షన్స్” పతాకంపై పల్లెటూరు పిల్ల చిత్ర నిర్మాణానికి నడుం బిగించారు.

నటీనటుల ఎంపిక..

బుగత వెంకట సుబ్బారావు గారు తన మిత్రుడు ఆదినారాయణరావు, ప్రముఖ రచయిత తాపీ ధర్మారావు నాయుడు గార్ల సలహాలతో “పిజారో” అనే నాటకం ఆధారంగా ఒక కథను తయారుచేసుకున్నారు. “మన దేశం” సినిమాలో ప్రతినాయక పాత్రను పోషించిన నందమూరి తారకరామారావు గారిని “జయంత్” అనే ముఖ్య పాత్ర కోసం, “వసంత్” అనే మరో పాత్రకు ఈలపాటి రఘురామయ్యను, దుష్టుడైన “కంపన” పాత్రకు ఎస్వీ రంగారావుని అనుకొని ఆ వివరాలను తన శ్రేయోభిలాషి అయిన ఎల్.వి.ప్రసాద్ గారికి చెప్పారు బి.ఏ.సుబ్బారావు గారు కొత్త సంస్థ, కొత్త దర్శకుడు, కొత్త నటీనటులు కావడంతో సినిమా ఇబ్బందులలో పడుతుందేమో చూడు అని ఆయన సలహా ఇచ్చారు. అయినా కూడా బి.ఏ.సుబ్బారావు గారు వినిపించుకోలేదు. తన మీద తనకు ఉన్న నమ్మకంతో ఆయన అడుగు ముందుకు వేశారు.

వృద్ధపాత్రలో యస్వీ రంగారావు…

సినిమా చిత్రీకరణ మొదలైంది. చిత్రం ప్రారంభంలో అంజలీదేవి, ఈలపాటి రఘురామయ్య మీద కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. కొన్ని పోరాట సన్నివేశాలలో కూడా ఈలపాటి రఘురామయ్య గారు పాల్గొనవలసి వచ్చింది. అయితే అవి ఆయన ఒంటికి సరిపడవని ఆయన ఆ సినిమా నుండి తప్పుకొన్నాడు. అలా ఆ సినిమా నుండి ఈలపాటి రఘురామయ్య గారు తప్పుకోగానే శోభనాచల సంస్థ నిర్మించిన “కీలుగుఱ్ఱం” సినిమాలో నటించిన అక్కినేని నాగేశ్వరావు గారిని ఆ పాత్ర పోషించమని అడిగారు. త్యాగపూరితమైన వసంత్ పాత్రును పోషించడానికి అక్కినేని నాగేశ్వరావు గారు అంగీకరించడంతో ఎన్టీఆర్, ఏఎన్నార్ కలయికకు ఇలా నాంది పలికినట్లయ్యింది. ప్రతినాయక పాత్ర పోషించాల్సిన యస్వీ రంగారావు గారు సమయానికి మద్రాసు చేరుకోలేకపోవడంతో ఆ పాత్రను ఏ.వి.సుబ్బారావు గారితో వేయించారు బి.ఏ.సుబ్బారావు గారు. ఆ తరువాత యస్వీ రంగారావు గారు రావడంతో కంపన్న దగ్గరుండే వృద్ధ పాత్ర వేయించారు.

అంజలీదేవి…

పల్లెటూరు పిల్ల సినిమాలో టైటిల్ పాత్రను అంజలీదేవి గారు పోషించారు. నిజానికి అంజలీదేవి గారికి ఈ పాత్ర అగ్నిపరీక్ష అయ్యిందనే చెప్పాలి. ఎందుకంటే అప్పటివరకు సినిమాలలో అంజలీదేవి గారు వేశ్య పాత్రలు ధరిస్తూ వచ్చారు. కొన్ని సినిమాలలో దేవకన్య పాత్రలు పోషిస్తూ వచ్చారు. కానీ ఈ సినిమాలో ఆమెకు ఇది కొత్త తరహా పాత్ర. అందుకే బి.ఏ సుబ్బారావు గారు, ఆదినారాయణ రావు గారు కలిసి ప్రత్యేక శ్రద్ధ వహించి అంజలీదేవి గారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించి ఆ పాత్ర కోసం ఆమెను తయారు చేశారు. 

హాస్యానికి ప్రాధాన్యం…

అప్పుడప్పుడే హాస్యనటులుగా  పేరు తెచ్చుకుంటున్న నల్ల రామమూర్తి, సీతారాం, కనకం, సీతలతో “లప్పం”, “టప్పం”, “సుగుణ”, “జామకాయ” పాత్రలు వేయించి సినిమాలో కామెడీకి పెద్ద పీట వేశారు బి.ఏ.సుబ్బారావు గారు. కేవలం హాస్య సంభాషణలే కాకుండా వీరిపై మూడు పాటలు కూడా పెట్టారు. నల్ల రామమూర్తి, సీతారాం కలిసి ఒక పాట వ్రాయడమే కాకుండా ఆ పాటను వారే పాడారు. “ఓం ధూం” “ధాంకర్ణి” అనే ఆ పాటలోని పదాలు ప్రేక్షకులకు అర్థం కాకపోయినా కూడా వారు పాడిన విధానం థియేటర్ లో నవ్వు పుట్టించింది.

సాంకేతిక నిపుణులు కూడా పాత్రధారులే..

పల్లెటూరు పిల్ల సినిమాకు సహాయ సంగీత దర్శకుడు టీవీ రాజు, తాపీ చాణక్యత, గుర్రం కోటేశ్వరరావు, సాంకేతిక నిపుణులుగా పనిచేశారు. అలాంటి సాంకేతిక నిపుణులుగా పనిచేసిన వారి చేత కూడా బి.ఏ.సుబ్బారావు గారు వేషాలు వేయించారు. సహాయ సంగీత దర్శకుడు టీవీ రాజు అంధుడుగా నటించడమే కాకుండా తాను ఒక పాట కూడా పాడారు. అలాగే బి.ఏ.సుబ్బారావు గారి దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్న తాపీ చాణక్యతో గూఢచారి పాత్రను వేయించారు. నిర్మాణానికి సంబంధించిన ప్రొడక్షన్ వ్యవహారాలు చూస్తూ చిన్న చిన్న పాత్రలు పోషించే “కీలు గుర్రం” కోటేశ్వరరావు గారికి “మార్తాండ” అనే ప్రాధాన్యత కలిగిన పాత్ర ఇచ్చి తనను ప్రోత్సహించారు బి.ఏ.సుబ్బారావు గారు. నాట్యమణులు అయిన మిస్ జోజి, మిస్ కోజీ అనే నర్తకీ మణులతో చిత్రీకరించిన నృత్య సన్నివేశాలు పల్లెటూరు పిల్ల సినిమాకి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించిన ఆదినారాయణ రావు గారు కూడా సినిమాలో రెండు పాటలు వ్రాశారు.

  చిత్రీకరణలో ప్రమాదాలు..

పల్లెటూరు పిల్ల సినిమాలో కథానాయిక అంజలీదేవి గారిని పొడవడానికి వస్తున్న ఎద్దుని నందమూరి తారక రామారావు గారు అడ్డుకునే సన్నివేశాన్ని చిత్రీకరించడానికి ఆస్ట్రేలియన్ బుల్ ని తీసుకువచ్చారు. ఈ సన్నివేశంలో అక్కినేని నాగేశ్వరావు గారు కూడా ఉంటారు. ముందుగా ఆ ఎద్దును అక్కినేని నాగేశ్వరావు గారు అడ్డుకుంటారు. ఎద్దు ఆయనను దాటుకొని ముందుకు వెళుతుంటే నందమూరి తారక రామారావు గారు ఆపే ప్రయత్నం చేస్తారు. అంతకుముందు చాలా సినిమాలు చేసిన అనుభవం ఉన్న వారు అక్కినేని గారు. ఆ అనుభవం ఉన్న నటుడు కావడంతో ఒడుపుగా ప్రక్కకు తప్పుకున్నారు. నందమూరి తారక రామారావు గారు మాత్రం ఆ ఎద్దుతో నిజంగానే పోరాటానికి దిగారు. నిజానికి అప్పటికే ఆ ఎద్దు ఉగ్రరూపం దాల్చి ఉంది. రామారావు గారిని కొమ్ములతో పక్కకు కొట్టడంతో ఆయన చేతికి గాయమైంది. ఆ ఎద్దును అదుపుచేయలేక చిత్ర యూనిట్ సభ్యులంతా చెల్లాచెదురయ్యారు. చివరికి ఎలాగో దానిని అదుపులోకి తీసుకువచ్చారు. అలాగే చిత్ర నిర్మాణ సమయంలో నటుడు ఏ.వి.సుబ్బారావు, కళాదర్శకులు వాలి కూడా ప్రమాదాలకు గురయ్యారు.

చిత్ర నిర్మాణంలో అవాంతరాలు

పల్లెటూరు పిల్ల సినిమా ప్రారంభంలో చిత్రీకరణ సజావుగా జరిగినా చివరలో మాత్రం కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడంతో సినిమా ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. అంతకుముందే నాగేశ్వరరావు, అంజలీదేవి మేకప్ మెన్ గోపాల్ రావు కలిసి చిత్ర నిర్మాణం ప్రారంభించారు. ఆ తరుణంలో పల్లెటూరి పిల్ల చిత్రం నిర్మాణంలో బి.ఏ.సుబ్బారావు గారు పడుతున్న ఇబ్బందులు గమనించి ఒక రోజు సెట్ లో అందరి ముందు ఈ చిత్రంలో నాగేశ్వరరావు గారికి, అంజలీదేవి గారికి వాటా ఇస్తే తప్ప నటించరు అనేశారు. ఆ మాట గోపాల్ రావు అనగానే అందరూ విన్నారు. కానీ ఎవ్వరూ మాట్లాడలేదు.

ఇది విన్న సుబ్బారావు గారికి బాధనిపించింది. అన్య మనస్కంగానే ఆ రోజు చిత్రీకరణ పూర్తిచేశారు. నాగేశ్వరరావు గారు ఆ రోజు సాయంత్రం బీచ్ కి అంజలీదేవి, గోపాలరావు గార్లను తీసుకుకెళ్లారు.  ఏమయ్యా గోపాలరావు నువ్వు సెట్ లో మాట్లాడిన విధానం బాగోలేదు. సుబ్బారావు గారు ఏదో కష్టాల్లో ఉన్నాడని దానిని ఆసరాగా తీసుకుని అలా మాట్లాడటం చాలా తప్పు. అయినా నేను, అంజలిదేవి గారు నటించమని నొక్కి చెప్పడానికి నువ్వు ఎవరివి? మేమిద్దరం నటించమంటే ఆయన వేరే వాళ్ళని పెట్టుకుని సినిమా పూర్తిచేస్తారు. ఇకపై ఇలా నోరు పారేసుకోవడం మంచిది కాదు అంటూ గోపాలరావుకి చివాట్లు పెట్టారు. ఆ తరువాత అంజలిదేవి గారికి కూడా నచ్చజెప్పారు. ఆ తరువాత వాళ్ళిద్దరూ కలిసి సుబ్బారావు గారి దగ్గరికి వెళ్లి పారితోషికం తీసుకోకుండా ఉచితంగా నటిస్తామని చెప్పి అభయమిచ్చారు.

ఆ తరువాత వేదాంతం రాఘవయ్య, తాపీ ధర్మారావు, కే.శ్రీరాములు తదితరుల సహాయ సహకారాలతో చిత్రాన్ని పూర్తి చేసి 27 ఏప్రిల్ 1950న సినిమాని విడుదల చేశారు సుబ్బారావు గారు. తెలుగులో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని దిలీప్ కుమార్, దేవానంద్ లతో హిందీలో నిర్మించారు జెమినీ వాసన్ గారు. తెలుగులో హాస్య పాత్రల జోడిని విడదీసి ఆ రోజుల్లోనే లక్ష రూపాయలు ఇచ్చి హాలీవుడ్ నుంచి జిప్సి అనే ఒక కోతిని తీసుకువచ్చారు ఆగాఖాన్. ఆయన ఈ కోతి కలిసి పండించిన హాస్యం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

విశేషాలు…

★ మహానటులు నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు గార్లు కలిసి నటించిన తొలి చిత్రం “పల్లెటూరి పిల్ల”. ఈ చిత్రంతో ప్రారంభమైన వీరి కలయిక తదనంతరకాలంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు రావడానికి కారణమైంది.

★ ప్రపంచ సినిమా చరిత్రలోనే సమాన స్థాయి కలిగిన ఏ ఇద్దరు కథనాయకులకు లేని రికార్డ్‌ను 14 చిత్రాల్లో వీరిద్దరు కలిసి నటించి నెలకొల్పారు.

★ అలాగే హీరోగా ఎన్.టి.ఆర్. గారు కెమేరా ముందుకు వచ్చిన మొదటి సినిమా కూడా ఇదే. ఈ సినిమా చిత్రీకరణ ముందే మొదలయినప్పటికీ ఆయన సోలో హీరోగా నటించిన “షావుకారు” సినిమా ముందుగా విడుదలయ్యింది.

★ ఎన్.టి.ఆర్. గారికి ఎల్.వి.ప్రసాద్ గారి ఆధ్వర్యంలో  మేకప్ టెస్ట్ జరిగినప్పుడు తీసిన స్టిల్స్ చూసి బి.ఎ.సుబ్బారావు గారు హీరోగా తన సినిమాలో అవకాశం ఇచ్చారు.

★ శోభనాచల స్టూడియోలో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేస్తున్న బి.ఎ.సుబ్బారావు గారు ఆ స్టూడియో అధినేత మీర్జాపురం రాజా వారి ఆశీస్సులతో సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి “పల్లెటూరి పిల్ల” చిత్రాన్ని నిర్మించారు.

★ బి.ఎ.సుబ్బారావు గారికి అంతకుముందు ఏ దర్శకుడి దగ్గరా పనిచేసిన అనుభవం లేదు. అయినా కూడా ఆయన తనకున్న అవగాహనతో దర్శకుడిగా మారి ఈ చిత్రాన్ని తీశారు.

★ 27 ఏప్రిల్ 1950 నాడు విడుదలై  నేటికీ 74 సంవత్సరాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రంలో అంజలీదేవి గారు టైటిల్ పాత్రను పోషించారు.

★ 09 ఫిబ్రవరి 1949 నాడు శోభనాచల స్టూడియోలో ప్రారంభమైన “పల్లెటూరి పిల్ల” చిత్రానికి రిజక్ట్ షెరిటన్ రాసిన “ఫిజారో” ఆంగ్ల నాటకం ఆధారం. అయితే ఈ నాటకాన్ని తెలుగు వాతావరణానికి అనుగుణంగా మార్చి ఈ చిత్రకథను పి.ఆదినారాయణరావు గారు తయారు చేశారు. సుబ్బారావు స్నేహితుడైన ఆయన ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడమే కాకుండా ఇందులో ఒక పాట కూడా వ్రాశారు.

★ ఈ చిత్రంలో వసంత్ పాత్రను ముందుగా ఆనాటి ప్రముఖ కథనాయకుడు కె.రఘురామయ్య గారు పోషించారు. అంజలీదేవి గారితో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన తర్వాత ఆయన ఈ సినిమా నుండి తప్పుకోవడంతో ఆ పాత్రను అక్కినేని నాగేశ్వరావు గారు పోషించారు. అక్కినేని గారికి సుబ్బారావు గారితో ఉన్న సన్నిహిత సంబంధం కారణంగా తక్కువ పారితోషికం తీసుకుని త్యాగపూరితమైన వసంత్ పాత్రను పోషించారు.

★ ఈ చిత్రంలో ఎద్దుతో పోరాడే ఒక సన్నివేశంలో ఎన్.టి.ఆర్. గారి కుడిచేయి విరిగింది. డూప్‌ని పెట్టి ఆ సన్నివేశం తీద్దామని సుబ్బారావు గారు ఎంత చెప్పినా వినని ఎన్టీఆర్ గారు సహజత్వం ఉండదని భావించి తానే ఎద్దుతో పోరాటానికి దిగారు. ఈ పోరాటంలో ఎన్టీఆర్ గారిని ఎద్దు ఒక కుమ్ము కుమ్మి అవతలకి విసిరెయ్యడంతో ఆయన చెయ్యి విరిగింది.

★ ఈ చిత్రంలో కథానాయికగా నటించిన అంజలీదేవి గారు అప్పటికే పేరుగాంచిన కథానాయిక. అయినా కొత్తగా వచ్చిన కథానాయకుడి ప్రక్కన నటించడానికి ఆమె అస్సలు అభ్యంతరం చెప్పలేదు.

★ ఈ చిత్రంలో ప్రతినాయకుడు కంపన దొర పాత్రను తన స్నేహితుడు ఎస్.వి.రంగారావుతో వేయించాలని బి.ఏ.సుబ్బారావు గారు అనుకున్నారు. కానీ ఆయన మద్రాసు చేరుకోవడం ఆలస్యం కావడంతో ఆ పాత్రను ఏ.వి.సుబ్బారావుతో వేయించారు. అయినా ఈ చిత్రంలో తాత పాత్రను రంగారావు గారు పోషించారు.

★ ఈ చిత్రంలో ముఖ్యమైన కథనాయకుడు రామారావు గనుక ఆయన పేరే మొదట తెరమీద వెయ్యమని అక్కినేని గారు సూచించినా కూడా సీనియారిటినీ గౌరవిస్తూ టైటిల్స్‌లో ఎ.ఎన్.ఆర్. గారి పేరునే మొదట వేశారు బి.ఏ.సుబ్బారావు గారు.

★ 27 ఏప్రిల్  1950న విడుదలైన “పల్లెటూరి పిల్ల” చిత్రం విజయం సాధించి హీరోగా ఎన్.టి.ఆర్. గారి భవిష్యత్‌కు బంగారు బాట ఏర్పరచింది.

Show More
Back to top button