పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అయింది. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అనగానే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అనేక వాయిదాల తర్వాత, ఉగాది కానుకగా ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ ‘ఉస్తాద్’ బాక్సాఫీస్ వద్ద తన మేజిక్‌ను రిపీట్ చేశాడా? హరీష్ శంకర్ తన అభిమాన హీరోను ఎలా చూపించారు? రివ్యూలో చూద్దాం.
కథేంటి?
ఒక గిరిజన గ్రామంలో విద్యార్థుల కోసం జీవితాన్ని అంకితం చేసిన ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు (గార్డియన్). ఆయన ఒక అనాథను చేరదీసి, ‘భగత్ సింగ్’ అని పేరు పెట్టి క్రమశిక్షణతో పెంచుతాడు. ఆ టీచర్ తన సేవలకు గానూ ప్రభుత్వం నుంచి అవార్డు అందుకోవడమే కాకుండా, ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు రాజకీయాల్లోకి వచ్చి చివరకు ఆయనే సీఎం అవుతారు. మరోవైపు, భగత్ సింగ్ (పవన్ కళ్యాణ్) పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఎదుగుతాడు. అయితే, ముఖ్యమంత్రి కుర్చీపై కన్నేసిన ఒక దుష్ట రాజకీయ నాయకుడు, బయటి శక్తులతో చేతులు కలిపి సీఎంను హతమార్చాలని ప్లాన్ చేస్తాడు. ఈ కుట్రను భగత్ సింగ్ ఎలా అడ్డుకున్నాడు? ఆ రాజకీయ నాయకుడికి, భగత్ సింగ్‌కు మధ్య ఉన్న పాత గొడవ ఏంటి? తన గురువును, రాష్ట్రాన్ని భగత్ ఎలా కాపాడుకున్నాడు? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
హరీష్ శంకర్ ఒక దర్శకుడి కంటే పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు కనిపిస్తుంది. అందుకే సినిమాలో కథ కంటే హీరో ఎలివేషన్లకే ఎక్కువ ప్రాధాన్యత లభించింది. ఒక సామాన్య ఖైదీ ఏజెంట్‌గా మారడం అనే కొత్త పాయింట్ ‘ధురంధర్’ విజయంలో కీలక పాత్ర పోషిస్తే, ‘ఉస్తాద్’లో మాత్రం పాతకాలపు కమర్షియల్ ఫార్ములానే నమ్ముకున్నారు.
సినిమా ప్రారంభం పవన్ కళ్యాణ్ మార్క్ మేనరిజమ్స్‌తో జోష్‌గా మొదలవుతుంది. హీరో ఎంట్రీ, పోలీస్ స్టేషన్ సీన్లు అభిమానులకు పూనకాలు తెప్పిస్తాయి. అయితే, కథా గమనంలో బిగువు లోపించడం ప్రధాన లోపం. సన్నివేశాలన్నీ అతుకుల బొంతలా అనిపిస్తాయి. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లలో కేవలం తుపాకుల మోత తప్ప కొత్తదనం కనిపించదు. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ కొంత ఆసక్తిని కలిగించినా, సెకండాఫ్‌లో విలన్లు ఎక్కువైపోవడం, రాజకీయాలు, మతపరమైన అంశాలు, దేశభక్తి.. ఇలా అన్నింటినీ ఒకే సినిమాలో ఇరికించాలనే ఆత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది ‘అంకుశం’ వంటి పాత సినిమాలను గుర్తుకు తెస్తుంది.
ఎవరెలా చేశారంటే..
పవన్ కళ్యాణ్: తనదైన స్టైల్, డైలాగ్ డెలివరీతో సినిమాను భుజాన వేసుకున్నారు. ఇలాంటి పవర్‌ఫుల్ పోలీస్ క్యారెక్టర్లు ఆయనకు కొట్టిన పిండి.
శ్రీలీల & రాశీ ఖన్నా: శ్రీలీలకు డాన్స్‌లతో పాటు నటనకు కొంత అవకాశం ఉన్న పాత్ర దొరికింది. రాశీ ఖన్నా పాత్ర కేవలం నామమాత్రమే.
విలన్ & ఇతరులు: మెయిన్ విలన్‌గా పార్తీపన్ తన నటనతో ఆకట్టుకున్నారు. గౌతమి ఉన్నంతలో పర్వాలేదనిపించారు.
సాంకేతిక వర్గం: థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాకు ప్రధాన బలం. కొన్ని సాధారణ సీన్లను కూడా తన సంగీతంతో ఎలివేట్ చేశారు. హరీష్ శంకర్ రాసిన పంచ్ డైలాగులు థియేటర్లలో ఈలలు వేయించేలా ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా రిచ్‌నెస్‌ను పెంచాయి.
ప్లస్ పాయింట్స్:
పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, మేనరిజమ్స్.
హరీష్ శంకర్ మార్క్ డైలాగులు.
థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.
మైనస్ పాయింట్స్:
బలం లేని పాత కథ.
సందర్భం లేని యాక్షన్ సీన్లు.
సెకండాఫ్‌లో సాగదీత.
చివరిగా: ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. కేవలం పవన్ కళ్యాణ్ వీరాభిమానుల కోసం తీసిన సినిమా. సామాన్య ప్రేక్షకులు భారీ అంచనాలతో వెళ్తే కొంత నిరాశ చెందే అవకాశం ఉంది, కానీ ఫ్యాన్స్‌కు మాత్రం ఇది విందు భోజనమే!
రేటింగ్: 2.5/5
Read more:
ఈవారం OTTల్లో విడుదలయ్యే సినిమాలు, సీరీస్లు.!
మన శంకర వరప్రసాద్ గారు సినిమా రివ్యూ అండ్ రేటింగ్
ఆరోజు యం.జి.ఆర్ సహాయం చేయకపోతే ఏమైపోయేదాన్నో.. జయలలిత..









