CINEMATelugu Cinema

అలనాటి అద్భుతమైన జానపద హాస్య చిత్రం.. కీలుగుఱ్ఱం (1949) సినిమా..

శ్రోతలకు ఆనాటకీ, ఈనాటికీ వినోదం కలిగించేటటువంటి సినిమా కీలుగుఱ్ఱం. ఈ సినిమా 19 ఫిబ్రవరి 1949 నాడు విడుదలైంది. కీలుగుఱ్ఱం, రెక్కల గుఱ్ఱం, గండబేరుండ పక్షి మీద ఎగరడం, పుష్పకవిమానం ఇలాంటివన్నీ కూడా జానపద కథలకు, అద్భుతమైన ఊహలకు ఊపిరిపొసే వాహనాలు. జానపద కథలలో ఇవన్నీ ఉంటే తప్పనిసరిగా కథానాయకుడు వీటిని వాడుకోవాలి. కథానాయకుడు ఏమి చేయకుండానే వీరోచిత లక్షణాలు వస్తాయి. కథను ఊహకందని మలుపులు తిప్పుతూ కావాల్సినంత వినోదం వైపు మళ్ళించవచ్చు. కీలుగుఱ్ఱం కూడా ఇదే సూత్రంతో ఆధారపడి అల్లబడిన కథ. అద్భుతరసం, వీరరసం కలగలసిన చిత్రం ఈ కీలుగుఱ్ఱం.

మాయలు, మంత్రాలు, మోహినీ విన్యాసాలు, దుర్భిణీ యంత్రాలు, వీటన్నిటిని మించి ఎగిరే కీలుగుఱ్ఱం, కష్టాలు పడే మహారాణి, అనుకున్నది సాధించడానికి సాహసాలు చేసే రాజకుమారి, విజయవంతం కావడానికి కావలసిన దినుసులన్నీ పుష్కలంగా ఉన్నటువంటి చిత్రం కీలుగుఱ్ఱం. అక్కినేని నాగేశ్వరరావు గారు కథానాయకుడు. అంజలీదేవి గారిని కథానాయిక అనలేము. కానీ అంజలీదేవి గారు ప్రధానపాత్ర పోషించినటువంటి చిత్రం. ఈ కీలుగుఱ్ఱం చిత్రం తరువాత అక్కినేని నాగేశ్వరావు గారు, అంజలి దేవి గారు చక్కని జంట అని తరువాత చాలా చిత్రాలలోని ప్రేక్షకులు ఆదరించారు.

చిత్ర విశేషాలు….

దర్శకత్వం   :    శ్రీ మీర్జాపురం రాజా వారు

సహాయ దర్శకుడు :  యం.కొండయ్య

నిర్మాణం   :      శ్రీ మీర్జాపురం రాజా వారు

తారాగణం  :   అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, జి.వరలక్ష్మి, లక్ష్మీరాజ్యం, సూర్యశ్రీ, బాలామణి, కనకం, ఏ.వి.సుబ్బారావు, రేలంగి

సంగీతం    :    ఘంటసాల వెంకటేశ్వరరావు

నేపథ్య గాయకులు :  సి.కృష్ణవేణి, ఘంటసాల, పి.లీల, వి.సరళ, శ్రీదేవి

కథ, మాటలు, పాటలు  :  తాపి ధర్మారావునాయుడు

నృత్యాలు :  రాఘవయ్య, వెంపటి

ఛాయాగ్రహణం  : డి.యల్.నారాయణ

కళా దర్శకుడు  :   టి.వి.యస్.శర్మ

శబ్దగ్రహణం   :   యం.బి.వాల్‌కె, జె.సూర్యనారాయణ

అలంకరణ   :   గోపాలరావు, నాగేశ్వరరావు, హరిబాబు

కూర్పు      :   ఆర్.యం.వేణుగోపాల్‌

స్టూడియో మేనేజర్ : ఆర్.వి.చిన్నారావు, పుచ్చా విశ్వనాథం

ప్రొడక్షన్ మేనేజర్ : ఆర్.వి.చిన్నారావు, లంక

రికార్డింగు యంత్రము :  ఆర్.సి.ఏ. సౌండ్‌ సిస్టం

నిర్మాణ సంస్థ    :     శోభనాచల పిక్చర్స్

పంపిణీ సంస్థ   :    చమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్స్, యశోధర ఫిలిం కార్పరేషన్‌

నిడివి      :     173 నిమిషాలు

విడుదల తేదీ   :     19 ఫిబ్రవరి 1949

భాష     :     తెలుగు

చిత్ర కథ…

విదర్భ దేశ మహారాజు ప్రసేనుడు. ఆయన భార్య ప్రభావతీ దేవి. ప్రసేనుడు ఒకసారి వేటకి వెళ్ళినపుడు ఒక యక్షరాక్షసి అయిన గుణసుందరి (అంజలీదేవి) ఆ రాజు అందాన్ని చూసి మోహించి ఆయనతో ఆనందంగా గడపాలనుకుంటుంది. మాయమాటలతో తనను ప్రేమించేటట్లు చేసి రాజుకు రెండవ భార్యగా విదర్భ రాజ్యంలో అడుగుపెడుతుంది. ప్రభావతీ దేవి సాత్వికురాలు కాబట్టి రాజు తనకు సవతిని తీసుకువచ్చినా భర్త సుఖమే తన సుఖమని భావిస్తుంది. గుణసుందరి పేరుకి రాణి అయినా రాక్షస ప్రవర్తన వల్ల రాత్రివేళల్లో రాక్షసిగా ఏనుగుల్ని, గుర్రాల్ని చంపి తింటూ ఉంటుంది. కొద్ది రోజులకు ఆస్థాన జ్యోతిష్కులు రాజుకి పుత్రుడు జన్మిస్తాడనీ చక్రవర్తి కాగలడని తెలియబరుస్తారు.

అప్పటిదాకా చిన్నరాణి సుందరితో సుఖంగా గడుపుతున్న రాజు ప్రభావతీ దేవికి సంతానం కలగబోతుందని తెలిసి ఆమెతో ఎక్కవ ప్రేమగా ఉంటాడు. ఇది చూసి సహించని సుందరి తన చెలికత్తె అయిన రాక్షసి సహాయంతో రాజ్యంలో జరుగుతున్న జంతు నష్టానికి రాక్షసియైన పెద్దరాణి కారణమని నిందవేస్తుంది. అది నమ్మిన రాజు, గర్భవతి అయిన పెద్ద రాణిని అడవులకు పంపించి చంపివేసి ఆనవాలుగా ఆమె కనుగుడ్లను తీసుకురమ్మని తలారులను పురమాయిస్తాడు. ఆ తలారులు పెద్దరాణిని గుణగణాలు ఎరిగున్నవారు కావడం వలన అడవికి తీసుకువెళ్ళి ఆమెను చంపడానికి ఇష్టపడరు. మరో పక్క చిన్నరాణికి భయపడి ఆమెను చంపకుండా కేవలం కనుగుడ్లను పెకలించి రాజుకు అందజేస్తారు.

పెద్దరాణి అడవిలో అష్టకష్టాలు పడి ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. తరువాత ఆ అడవిలోని కోయగూడెం నాయకుడు, గూడెం ప్రజలు ఆమెను, ఆమె జన్మనిచ్చిన బిడ్డ (అక్కినేని నాగేశ్వరరావు) ను చేరదీస్తారు. ఆ బిడ్డకు విక్రమసేనుడు అని పేరు పెడతారు. అతను పెరిగి అన్ని విద్యలలో ప్రవీణుడౌతాడు. ఇదిలా ఉండగా అంగరాజ్యంలో రాజు ఒక చాటింపు వేయిస్తాడు. దాని ప్రకారం అంగరాజ్య రాకుమారిని చిన్నప్పడే ఎవరో మాంత్రికురాలు అపహరించిదనీ ఆమెను కాపాడగల ధీరుడికి కుమార్తె, అర్ధ రాజ్యం దక్కుతుందనీ తెలియజేస్తారు. దీనికి ఆశపడ్డ ఇద్దరు జ్యోతిష్కులు, ఒక శిల్పి తమ బుద్ధిబలం ఉపయోగించి ఆకాశంలో ఎగరగలిగే కీలుగుర్రం తయారు చేస్తారు.

రాకుమారి ఎక్కడుందో తెలుసుకోవాలని జ్యోతిష్కుడు అంజనం వేసి ఆమె మూడు సముద్రాల అవతల ఉన్న ఒక దీవిలో ఉందని తెలుసుకుంటారు. కానీ దాన్ని అధిరోహించి రాకుమారిని రక్షించడానికి మాత్రం వారికి ధైర్యం చాలదు. దాంతో వారు ముగ్గురూ ఒక ఉపాయం ఆలోచిస్తారు. ఆ కీలుగుర్రాన్ని రాజుకు చూపించి దాని గొప్పతనాన్ని ఆయనకి వివరించి దాన్ని అధిరోహించగల ధీరుడికి కానుకలు ప్రకటించమని కోరతారు. మరోపక్క విక్రమసేనుడు తల్లి ద్వారా తన తండ్రి గురించి, తల్లికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. కీలుగుర్రాన్ని అధిరోహించి రాజు అభిమానం సంపాదించి రాజ్యానికి సేనాధిపతి అవుతాడు. ఒక పక్క రాక్షసియైన చిన్నరాణి అప్పుడప్పుడూ ఏదో జంతువును కబళిస్తూ తన సరదా తీర్చుకుంటూ ఉంటుంది. అప్పుడు రాజు ఆ ప్రమాదం అరికట్టాల్సిన బాధ్యతను సేనాధిపతి విక్రమసేనుడుకి అప్పజెపుతాడు. విక్రముడు కీలుగుర్రం మీద తిరుగుతూ అనుక్షణం కాపలా కాస్తూ ఉండడం వల్ల చిన్నరాణి ఆటలు సాగవు

అప్పుడు చిన్నరాణి ఉపాయంగా తనకు భరించలేని తలనొప్పిగా ఉందనీ నాటకమాడి, అందుకు ఔషధం మూడు సముద్రాల అవతల ఉన్న తన అక్క దగ్గర ఉందనీ, దాన్ని తేవడానికి విక్రమసేనుడిని పురమాయించమని రాజును కోరుతుంది. రాణి విక్రముడు తన దగ్గరకు రాగానే చంపి తినివేయమని రహస్యంగా ఉత్తరం వ్రాసి దానిని తన అక్కకు ఇమ్మంటుంది. విక్రముడు దాన్ని తీసుకుని కీలుగుర్రమెక్కి బయలుదేరతాడు. దారిలో ఒక మాంత్రికుని చేతిలో కాళికా దేవిని బలి అవబోతున్న ఒక రాకుమారిని రక్షించి ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆమె కోరిక మేరకు వారి రాజ్యంలో కాస్త సేదతీరుతాడు.

ఆ సమయంలో రాకుమారి గుర్రంలో ఉన్న ఉత్తరం చదివి దాన్ని మరో విధంగా మార్చివేస్తుంది. ఆ ఉత్తరం తీసుకు వచ్చిన రాకుమారుడు తాను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న కొడుకుతో సమానమనీ అతను అక్కడ ఉన్నన్ని రోజులు మర్యాదలకు లోటు లేకుండా చూడవలసిందని దాని సారాంశం. విక్రముడు అక్కడికి రాగానే ఆ ఉత్తరం ప్రకారమే ఆ రాక్షసి అతనికి అన్ని మర్యాదలు చేస్తుంది. ఆమె దగ్గరే తన తల్లి కనుగుడ్లు భద్రంగా ఉన్నాయనీ, వాటిని యధాస్థానంలో అమర్చి ఒక వేరుతో తాకించితే తిరిగి చూపు వస్తుందనీ తెలుసుకుంటాడు. ఆమె విక్రముణ్ణి అంతా స్వేచ్ఛగా విహరించమని చెబుతుంది గానీ తూర్పు వైపునున్న బిల ద్వారం వైపు వెళ్ళవద్దని చెబుతుంది.

విక్రముడు అటువైపుగా వెళ్ళి అక్కడ నిర్బంధించబడి ఉన్న అంగరాజ్యపు రాకుమారిని కనుగొంటాడు. ఆమె సహాయంతో ఆ యక్షరాక్షసుల అక్క చెల్లెళ్ళ ప్రాణం అక్కడికి మూడు సముద్రాల ఆవల ఉన్న మర్రిచెట్టు తొర్రలో ఉన్న భరిణెలో ఉందని తెలుసుకుని దానిని సంపాదిస్తాడు. ఆ భరిణెలో రెండు పురుగులలో పెద్ద పురుగును చంపగానే ఆ పెద్దరాక్షసి మరణిస్తుంది. విక్రముడు రాకుమారిని తీసుకుని తిరుగు ప్రయాణమౌతాడు. ఇదిలా ఉండగా కీలుగుర్రాన్ని తయారు చేసిన మిత్రత్రయం అంజనం వేసి విక్రముడు రాకుమార్తెను తీసుకువస్తున్న విషయాన్ని గమనించి విక్రముడు కిందకు దిగగానే శిల్పి రాకుమార్తెను తనకిమ్మని, ఆమెను వివాహం చేసుకుని అంగ రాజ్యానికి రాజునవుతాననీ కోరతాడు. కానీ విక్రముడు, ఆమె తన భార్యయనీ ఆమెను దానమీయలేనని చెబుతాడు.

ఆ శిల్పి విక్రముణ్ణి వెన్నుపోటు పొడిచి రాకుమార్తెను తీసుకుని కీలుగుర్రంపై పారిపోతాడు. కానీ రాకుమార్తె తిరగబడటంతో ఆమెను బలవంతంగా లొంగదీసుకోవాలని చూసి ఆమె చేతిలోనే మరణిస్తాడు. ఆ రాకుమార్తె ఇద్దరు పురోహితుల సాయంతో విక్రముడు ముందు పెళ్ళాడిన మరో రాకుమారిని కలుసుకుంటుంది. ఇద్దరూ కలిసి కీలుగుర్రంపై విక్రముణ్ణి వెతుకుచూ కనుగుడ్లు ఉన్న పెట్టెను సంపాదిస్తారు, కానీ ఒక కోయగూడెంలో చిక్కుకుపోతారు. మరో వైపు గాయపడిన విక్రముడిని అడవిలో ఉన్న ఓ సాధువు రక్షిస్తాడు. తరువాత విక్రముడు ఆ అడవిలో శాపవశాత్తూ తిరుగుతున్న ఓ అప్సరసను రక్షించి ఆమె సహాయంతో కీలుగుర్రాన్ని, ఇద్దరు రాకుమార్తెలను కలుసుకుంటాడు. ఆమె సహాయంతో రాజ్యానికి వెళ్ళగానే తల్లిని చిన్నరాణి చెరసాలలో వేయించి ఉరిశిక్ష వేయబోతుందన్న విషయాన్ని తెలుసుకుని అక్కడికి వెళతాడు. తన తల్లికి చూపు తెప్పించి, చిన్న రాణి మోసాన్ని రాజుకు, ప్రజలకు తెలియబరిచి ఆమెను సంహరించి పట్టాభిషిక్తుడు కావడంతో కథ ముగుస్తుంది.

కథనం…

ఈ కథలో ప్రతి పదిహేను నిమిషాలకు, ప్రతి ఇరవై నిమిషాలకు ఒక మలుపు తిరగడం, అయ్యో కథ అయిపోతుందేమో అనుకునేంతలో కథను మరో మలుపు తిప్పడం, చివరికి ఎలా ముగుస్తుంది, ఏవిధంగా సుఖాంతం అవుతుంది అనే ఉత్కంఠత, అంతేకాకుండా రాక్షసరాణి పిశాచం అయిపోయి జంతువులను తినడం, వాళ్ళ అక్కయ్య దగ్గర గుహ రాజభవనం లాగా మారడం, శివలింగం, పూజ, మంత్రాలు, హారతి మనుషులేకుండా చేయడం, రాక్షసి గుహలో పాములు మొసళ్ళు ఉన్నటువంటి కొలను, దానిని దాటుకుంటూ రాజకుమారుడు పైకి వెళ్లడం క్రిందికి రావడం ఇవన్నీ కూడా 75 సంవత్సరాల క్రిందట కొత్తవి అయినటువంటి విషయాలు.

ఇక అప్పటి జానపద చిత్రాలతో  ఇలా ఎగిరే గుర్రం ఉండడం ఇదే మొదటిసారి. దీనికంటే ముందు విడుదలయిన “బాలరాజు” చిత్రంలో హీరో అడవుల వెంట వెళతాడు. సాహసాలు ఏమి చేయడు. కానీ ఈ సినిమాలో సాహసమంతమైన పనులు చేయడం, గుఱ్ఱం ఎగరమే కాకుండా పిశాచాలను చంపడం, దొంగలను ఎదిరించడం ఇలాంటివన్నీ చేస్తాడు. ఈ వీరరసం పట్టడమే కాకుండా మంత్రాలు తంత్రాలతో ప్రేక్షకుల నాడి పట్టడమే కాకుండా అత్యంత ఘనవిజయం సాధించడంతో బాటు నాగేశ్వరరావు గురించి మాట్లాడినా, అంజలీదేవి గురించి మాట్లాడినా ఈ కీలుగుఱ్ఱం చిత్రం లేకుండా వారి చలనచిత్ర జీవితం గురించి మాట్లాడుకోలేము.

నిర్మాత మీర్జాపురం రాజావారు..

మేక వెంకట రామయ్య అప్పారావు పేరు చెబితే ఎవ్వరికీ సరిగ్గా తెలియదు. కానీ “నూజివీడు జమీందారు” అంటే మాత్రం అందరికీ తెలుసు. 1930 ప్రాంతాల్లో నూజివీడు జమీందారును “మీర్జాపురం రాజావారు” అని కూడా అంటుండేవారు. ఆ రోజుల్లో టాకీలు మొదలైన 1932 తరువాత సినిమా నిర్మాణం కోసం ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా నుండి వెళ్ళినవారే. 1934 లో పినపాల వెంకటదాసు గారు మచిలీపట్నం నుండి మద్రాసుకు వెళ్లారు. ఆ తరువాత విజయవాడ నుంచి గూడవల్లి రామబ్రహ్మం గారు, వారి త్రోవలోనే మీర్జాపురం రాజావారు 1938 ప్రాంతాల్లో సినిమాలు తీద్దామని మద్రాసు వెళ్లారు.  వీళ్ళందరికీ సినిమా రంగం మీద, వ్యాపార రంగం మీద, మరో రకంగా కళాత్మక వ్యాపారం అనే ఆసక్తి మీద మద్రాసు వెళ్లి సినిమాలు తీయడం ప్రారంభించారు.

నటి కృష్ణవేణి తో వివాహం…

మీర్జాపురం రాజా గారు మద్రాసు వెళ్ళగానే జయ ఫిలిమ్స్ అనే పేరుతో ఒక స్టూడియో కట్టించి తాను మొట్టమొదటిసారిగా “మహానంద” అనే పేరుతో ఒక సినిమా తీశారు. ఆ తరువాత 1940లో “భోజ కాళిదాసు” అనే పేరు మీద ఇంకో సినిమా, “జీవనజ్యోతి” అనే మరో సినిమా తీశారు మొదటి రెండు మూడు సంవత్సరాలలో. “భోజ కాళిదాసు” సినిమా తీసేటప్పుడు ఆ సినిమాలో నటించిన “కృష్ణవేణి” అనే నటిని వివాహమాడారు. ఆవిడ ఆమె ఇప్పటికీ బ్రతికే ఉంది. ఆమె వయస్సు 100 సంవత్సరాలు. ఎన్టీఆర్ గారు మొట్టమొదట కనిపించిన సినిమా “మనదేశం” నిర్మించినది ఈ “కృష్ణవేణి” గారే. 1940 ప్రాంతాలలో “భోజ కాళిదాసు” సినిమా అయిపోగానే కృష్ణవేణి గారిని మీర్జాపురం రాజావారు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కూడా కృష్ణవేణి గారు కథనాయికగా సినిమాలలో కొనసాగారు. రాజా గారు కూడా సినిమా నిర్మాణాన్ని కొనసాగిస్తూ వచ్చారు.

శోభనాచల పిక్చర్స్…

“జయ పిక్చర్” పేరును మార్చి “శోభనాచల పిక్చర్స్” అనే పేరుతో సినిమా నిర్మాణం కొనసాగిస్తూ వచ్చారు. స్టూడియో పేరు కూడా శోభనాచల స్టూడియో అని పేరు పెట్టారు. ఈ శోభనాచల పిక్చర్ పతాకం పై దక్షయజ్ఞం సినిమా మొదటగా తీశారు. ఆ తరువాత  భక్త ప్రహ్లాద (1942), భీష్మ (1944), గొల్లభామ (1947) అనే సినిమాలు తీశారు. ఈ గొల్లభామ అనే సినిమా అంజలీదేవి గారు సినీ రంగ ప్రవేశం చేసిన మొట్టమొదటి సినిమా. ఇన్ని సినిమాలు నిర్మించాక తాను ఏదైనా జానపద సినిమా తీస్తే బాగుండు అనుకున్నారు మీర్జాపురం రాజావారు. గొల్లభామ సినిమా చక్కటి విజయం సాధించింది. అది జానపద చిత్రం.

దర్శకుడికై అన్వేషణ…

మరో కొత్త జానపద చిత్రం నిర్మిద్దామని అనుకున్నప్పుడు దర్శకుడు ఎవరా అని అన్వేషించసాగారు రాజావారు. గొల్లభామ చిత్రానికి దర్శకత్వం వహించింది పి.పుల్లయ్య గారు. తాను వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇంతకుముందు మీర్జాపురం రాజావారి చిత్రాలకు దర్శకత్వం వహించింది చిత్రపు నరసింహారావు గారు మరియు తన అన్నయ్య చిత్రపు నారాయణమూర్తి గారు. వీరిది మచిలీపట్నం. వీరిద్దరూ 1935 లో మద్రాసుకు వెళ్లి దర్శకత్వంలో కొనసాగుతూ మీర్జాపురం రాజావారు నిర్మించిన కొన్ని సినిమాలకు చిత్రపు నరసింహారావు, మరికొన్ని సినిమాలకు వాళ్ళ అన్నయ్య చిత్రపు నారాయణమూర్తి గార్లు దర్శకత్వం వహించారు.

మీర్జాపురం రాజావారే దర్శకుడిగా…

చిత్రపు నారాయణమూర్తితో సినిమా తీద్దామనుకున్నారు మీర్జాపురం రాజావారు. కానీ తాను ఇతర సినిమాలతో తీరిక లేకుండా ఉండడం వలన రాజా వారికి దర్శకత్వం చేసే వారెవరు కనిపించలేదు. కొందరేమో మీర్జాపురం రాజా గారు చెప్పినట్టే సినిమాలు తీయాలి. దర్శకులకు స్వేచ్ఛ ఉండదు. అందువలన చేసేది లేక చిత్రపు నారాయణమూర్తి వేరే సినిమా ఒప్పుకున్నారు అనుకున్నారు. ఏదేమైనా రాజా వారికి దర్శకత్వం చేసే వారు దొరకలేదు. అయితే రాజావారు మొట్టమొదటి నుంచి కూడా ఏ సినిమా తీసిన కానీ తాను అన్ని శాఖలలో కల్పించుకోవడం, ఏం జరుగుతుందో పర్యవేక్షించడం, ఇవన్నీ ఉండడంతో ఆయనకు సినిమా దర్శకత్వం వహించాలని ఎప్పటినుండో ఒక కోరిక ఉండేది. తనకు దర్శకులు ఎవ్వరూ దొరకపోవడంతో తానే సొంతంగా దర్శకత్వం చేయాలని రాజావారు పూనుకున్నారు. కాకపోతే చిత్రపు నారాయణమూర్తి గారిని స్క్రీన్ ప్లే వ్రాసి పెట్టండి అని అడిగారు. “మీరు కథ తీసుకురండి, దానికి నేను స్క్రీన్ ప్లే వ్రాస్తానని” చిత్రపు నారాయణమూర్తి గారు రాజవారితో చెప్పారు.

కాశీ మజిలీ కథలు నుండి కథా సంగ్రహం…

ఆ రోజులలో పౌరాణిక చిత్రాలు తగ్గుతూ, జానపద సాంఘిక చిత్రాలకు కొద్దికొద్దిగా ఆదరణ పెరుగుతూ వస్తున్నాయి. జానపద చిత్రం కొత్తగా ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు మీర్జాపురం రాజావారికి “కాశీ మజిలీ” కథలు గుర్తొచ్చాయి. మధిర సుబ్బన్న దీక్షితులు కాశీ మజిలీ కథలు గురించి వ్రాశారు. ఇవన్నీ కూడా కల్పించి వ్రాసినవే. కాశీకి వెళ్ళేటప్పుడు దారి మధ్యలో చేసిన మజిలీల గురించి చెప్పుకున్న కథలు. వంద సంవత్సరాల క్రిందట గానీ, నూట యాభై సంవత్సరాల క్రిందట గానీ కాశీకి వెళ్లాలంటే కొన్ని నెలలు పట్టేది. కాశీకి వెళ్లినవారు కాటికి వెళ్లినవారు ఒకటే అని ఆ రోజులలో అంటుండేవారు. అలా నడిచి కొన్ని నెలల పాటు కాశీకి వెళ్లాలి. కాబట్టి ఈ కథలో మణిసిద్ధుడు అనే బ్రహ్మచారి కాశీకి వెళ్లాలనుకున్నాడు. తనకు తోడుగా ఎవరైనా ఉంటే బాగుంటుంది అనుకొని ఆయన విచారిస్తే ఎవ్వరూ దొరకరు. చివరికి శ్రీరంగపురం అనే ఊరిలో కోటప్ప అనే ఒక పశువుల కాపరి వస్తానన్నాడు. కానీ ఒక షరతు పెట్టాడు.

కాశీ వెళ్లేటప్పుడు దారి మధ్యలో విశ్రాంతి తీసుకున్నప్పుడల్లా నాకు ఒక కథ చెప్పాలి అనేది కోటప్ప షరతు. అది కాశీ మజిలీ కథలకు ప్రధానమైన సూత్రం. అలా బయలుదేరిన మణిసిద్ధుడు అనే బ్రహ్మచారి, కోటప్ప అనే పశువుల కాపరి కాశీకి వెళుతూ మధ్య మధ్యలో చెప్పుకున్న కథలలే ఈ కాశీ మజిలీ కథల ప్రత్యేకతలు. ఇందులో నీతి ఉంటుంది. అలాగే కొన్ని పౌరాణిక కథలు కూడా చెబుతుంటాడు. ఈ కథలన్నీ దాదాపు వంద వరకు ఉంటాయి. ఆ కాశీ మజిలీ కథలలో అక్కడక్కడ ఉన్నటువంటి కథల్లో ఒక కథ తీసుకొని “కీలుగుఱ్ఱం” అనే కథను తాపీ ధర్మారావు గారు తయారు చేశారు. తాపీ ధర్మారావు నాయుడు గారు అప్పటికే పది సంవత్సరాల నుండి మద్రాసులో ఉన్నారు. తాను చాలా పేరున్న రచయిత, పత్రికా సంపాదకులు కూడా. తాపీ ధర్మ రావు గారు గతంలో ఉపాధ్యాయునిగా పనిచేసినప్పుడు ఆయన శిష్యుడే మీర్జాపురం రాజావారు. శిష్యుడు నిర్మాతగా ఉన్న ఆ సినిమాకు గురువు కథ, మాటలు, పాటలు వ్రాశారు. దర్శకులు చిత్రపు నారాయణమూర్తి గారు స్క్రీన్ ప్లే వ్రాసి పెట్టారు. కథ అంతా సిద్ధమైపోయింది.

నటీ నటులు…

ఇక కీలుగుఱ్ఱం సినిమాలో నటీనటుల విషయానికొస్తే కథనాయకుడిగా ఈ సినిమా రావడానికి ఒక సంవత్సరం ముందే “బాలరాజు” సినిమా వచ్చింది. ఆ చిత్ర విజయంతో అక్కినేని నాగేశ్వరావు గారు జానపద చిత్ర కథానాయకులుగా మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకని ఏ ఆలోచన లేకుండా అక్కినేని నాగేశ్వరావు గారిని కీలుగుఱ్ఱం సినిమాలో కథానాయకుడుగా ఎంచుకున్నారు. ఇందులో రాజకుమార్తె పాత్ర చాలా తక్కువగా ఉంటుంది. దానికి పేరున్న నటీమణులు అవసరం లేదనుకుని కొత్తవారిని ఇద్దరిని తీసుకున్నారు. ఒకమ్మాయి పేరు సూర్యశ్రీ, మరో అమ్మాయి పేరు జూనియర్ లక్ష్మీరాజ్యం.

ఇందులో ఎక్కువగా కనిపించేది రాక్షసరాణి మోహినీ పిశాచి. దానికి అంజలీదేవి గారిని అనుకున్నారు. దానికి కూడా ఒక కారణం ఉంది. గొల్లభామ సినిమాలో ఆమె వేశ్య పాత్ర వేశారు. బాలరాజు సినిమాలో తక్కువ నిడివి ఉన్న పాత్ర అయినా నాట్యం చేసి ఆకర్షించే పాత్ర వేశారు. గొల్లభామ, బాలరాజు అన్నింటిలోనూ ఇదే తరహా పాత్ర చేశారు. కానీ అంజలీదేవి ముందుగా తాను ఒప్పుకోలేదు. రాజా వారి భార్య కృష్ణవేణి, అంజలీదేవి భర్త ఆదినారాయణ రావు కూడా చెప్పిచూశారు. అయినా కూడా వినలేదు. కృష్ణవేణి గారు తనకు నేపథ్యగానం చేస్తానంటే నేను ఒప్పుకుంటాను అని అంజలీదేవి గారు షరతు పెట్టి ఆ పిశాచి పాత్రకు ఒప్పుకున్నారు. నల్ల రామ్మూర్తి గారు నాలుగు పాత్రులు ధరించారు. కంచి నరసింహారావు గారు పూజారిగా,  ఠముకు వేసేవాడిగాను రెండు పాత్రలకు వేషం వేశారు. ఇందులో రాజుగారు సహాయకుడిగా వేసింది రేలంగి వెంకట్రామయ్య గారు. ఈ విధంగా నటీనటులు సిద్ధమైనారు.

సంగీతం…

కథ ఉంది, నిర్మాత ఉన్నారు, దర్శకుడు ఉన్నారు, మాటలు, పాటలు, సిద్ధమైనాయి. నటీనటులు ఉన్నారు. ఇంకా కావాల్సింది సంగీతం. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు స్వర్గసీమ, బాలరాజు, రత్నమాల సినిమాలకు సహాయ సంగీత దర్శకులుగా పనిచేశారు. కీలుగుఱ్ఱం సినిమా మొదలు పెట్టక ముందే రెండు మూడు సినిమాలు ఉన్నాయి. “మనదేశం”, “లక్ష్మమ్మ కథ” సినిమాలకు సంగీత దర్శకుడుగా ఘంటశాల వెంకటేశ్వరరావు గారు సారథ్యం వహించారు. అనివార్య కారణాల వలన ఈ సినిమా నిర్మాణం మధ్యలో ఆగిపోవడంతో “కృష్ణవేణి” గారి సిఫారసు మేరకు కిలుగురానికి సంగీత దర్శకుడుగా ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని కీలుగుఱ్ఱం సినిమాకు సంగీత దర్శకుడిగా తీసుకున్నారు.

ఘంటశాల గారు సంగీత దర్శకత్వం వహించగా విడుదలైన మొట్టమొదటి చిత్రం “కీలుగుఱ్ఱం”. “కాదు సుమా.. కల కాదు సుమా”.. అనే పాట పాడిన వారు వక్కలంక సరళ గారు. పాడారు వక్కలంక సరళ గారి అమ్మాయి వక్కలంక పద్మ తరువాత కాలంలో గోరింటాకు సినిమాలో కథనాయికగా నటించి ఒకే ఒక్క సినిమాతో మాయమయ్యారు. వక్కలంక సరళ గారి ఇంకో అమ్మాయి వక్కలంక స్వప్నసుందరి కూచిపూడి నాట్యంలో ప్రసిద్ధి చెంది పద్మభూషణ్ పురస్కారంపొందిన నర్తకి. వక్కలంక సరళ గారి భర్త ఉద్యోగరీత్యా ఉత్తర భారతదేశం వెళ్లిపోవడం వలన సరళ గారు సినిమాలలో ఎక్కువ కాలం నేపథ్య గాయనిగా సినిమాలో కొనసాగా లేకపోయారు. వక్కలంక సరళ రావు గారు నటులు చలం గారి తమ్ముడు కుమార్తె.

కళా దర్శకులు, ఛాయాగ్రహణం...

సినిమాలో “కీలుగుఱ్ఱం” ను రూపొదించింది కళాదర్శకులు టీ.వీ.ఎస్ శర్మ గారు. దానితోబాటు వెనకాల ఉండే చెట్లు కూడా తాను రూపొందించినవే. టీ.వీ.ఎస్ శర్మ గారు ప్రమాదవశాత్తు ఎడమ చెయ్యి ఇరిగిపోయింది. కుడిచేత్తోనే తాను పని చేసేవారు. మరొక నేపథ్య కళాకారుడు ఛాయాగ్రాహకులు ఎం.ఎ.రహ్మాన్ గారు తన వైవిధ్యభరిత ఛాయాగ్రహణం కూడా ఈ సినిమా విజయానికి చాలా దోహదం చేసింది. కళాదర్శకులు టీ.వీ.ఎస్.శర్మ, ఛాయాగ్రాహకులు ఎం.ఎ.రెహమాన్ లు ఈ కీలుగుఱ్ఱమును ఎగిరేలా చేశారు.

వైర్ వర్క్ ద్వారా కరెంట్ స్విచ్ వేస్తే ఈ గుర్రం ఎగరుతుంది. వెనకాల ఆకాశం నేపథ్యం పెట్టి గుఱ్ఱం ఎగిరేలా చేశారు. ఆ రోజుల్లో అదే మొదటిసారి తీయడం. అందరూ వచ్చి ఆసక్తిగా చూస్తుండేవారు. ఒకసారి ఇలా గుర్రం ఎగురుతూ ఉండగా మధ్యలో కరెంటు పోయి గుఱ్ఱం క్రిందపడింది. ఆ గుఱ్ఱం పైన ఉన్న అక్కినేని నాగేశ్వరావు గారు క్రిందపడ్డారు. అక్కినేని గారికి ఓ మోస్తరు గాయాలయ్యాయి. దాంతో అక్కినేని నాగేశ్వరావు గారికి ప్రాణాపాయమైందని పలువురు పుకార్లు పుట్టించారు. దాంతో ఘంటసాల బలరామయ్య గారి కార్యాలయానికి, శోభనాచల స్టూడియో కు ఫోన్లు విపరీతంగా వచ్చాయి. చేసేదిలేక అక్కినేని గారు క్షేమంగానే ఉన్నారు అని మరునాడు పేపర్లో ప్రకటన ఇచ్చారు.

విడుదల…

చిత్రీకరణ ఎక్కువగా రాత్రి సమయంలో జరిగింది. ఈ సినిమాను 98% స్టూడియోలోనే నిర్మించారు. రాజుగారు గుఱ్ఱంతో అడవులలోకి వెళ్లడం తప్ప అంతా స్టూడియోలోనే తీశారు. ఈ సినిమా ఎక్కడా కూడా ఇండోర్ లో తీసినట్టు అనిపించదు, అవుట్ డోర్ లో తీసినట్లే అనిపిస్తుంది. ఇదంతా కళాదర్శకులు టీ.వీ.ఎస్.శర్మ, ఛాయాగ్రకులు రెహమాన్ గార్ల నైపుణ్యం. ఈ చిత్ర చిత్రీకరణ ఆరు నెలల్లో పూర్తయ్యాక ఈ సినిమాని ముందుగా సంక్రాంతికి విడుదల చేస్తామన్నారు. ఆ తరువాత 11 ఫిబ్రవరి నాడు విడుదల చేస్తామని ప్రకటించారు. చివరగా 19 ఫిబ్రవరి 1949 నాడు 11 కేంద్రాలలో విడుదల చేశారు. దానికి సరిగ్గా ఒక్కరోజు ముందు 18 ఫిబ్రవరి 1949 నాడు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గర దెందులూరులో అక్కినేని నాగేశ్వరావు గారికి అన్నపూర్ణ గారితో వివాహం జరిగింది. అక్కినేని నాగేశ్వరరావు గారి వివాహం మరుసటి రోజునే ఈ సినిమా విడుదలైంది. సినిమా విడుదల అవ్వడంతోనే ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకుంది.

శత దినోత్సవం…

విజయవాడలోని మారుతి థియేటర్లో 148 రోజులు ఆడింది. మచిలీపట్నంలోని బృందావన్ టాకీస్ లో వంద రోజులు ఆడింది. 11 ప్రింట్ లతో విడుదలైనా ఆ తర్వాత కొన్ని ప్రింట్లతో కరీంనగర్, కర్నూలు లో కూడా విడుదల చేశారు. 9 కేంద్రాల్లో నేరుగా 100 రోజులు, ఆలస్యంగా విడుదల అయిన 4 కేంద్రాల్లోనూ 100 రోజులు, మొత్తంగా 13 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకున్న సినిమా కీలుగుఱ్ఱం. ఇలా చక్కటి విజయాన్ని నమోదు చేసింది కీలుగుఱ్ఱం సినిమా. దర్శకుడికి ఇది తొలి చిత్రమే అయినా చక్కగా తీసారని ప్రేక్షకులు ఒప్పుకున్నారు. కొన్ని పత్రికలు ప్రతికూల సమీక్షలు వ్రాశాయి. కానీ సమీక్షలు చదివి సినిమాకి వెళ్లే రోజులు అవి కావు. కాబట్టి ఈ సినిమాను ప్రేక్షకులు విజయవంతం చేశారు. లంక సత్యం గారు ఈ సినిమాను తమిళంలో తీస్తానంటే  కీలుగుఱ్ఱం సినిమా స్క్రిప్ట్ హక్కులు ఇచ్చారు మీర్జాపురం రాజావారు. తమిళంలో ఎం.జీ.ఆర్, జానకి లతో కీలుగుఱ్ఱం సినిమాను “మోహినీ” గా తీశారు. ఈ సినిమాను తెలుగు కీలుగుఱ్ఱం  కంటే ముందుగానే తమిళంలో విడుదల చేశారు. కాకపోతే మోహినీ సినిమా తమిళంలో సరిగ్గా ఆడలేదు.

తమిళంలోకి అనువాదం…

తెలుగులో “కీలుగుఱ్ఱం” మంచిగా ఆడే సరికి దానిని తమిళంలోకి డబ్బింగ్ చేశారు. తెలుగు నుంచి తమిళంలోకి డబ్బింగ్ చేయబడిన మొట్టమొదటి తెలుగు చిత్రం “కీలుగుఱ్ఱం”. దానికి “మాయ కుదురై” అని పేరు పెట్టారు.  ఈ సినిమా తమిళంలోనే కాకుండా శ్రీలంకలో కూడా ఎక్కువ రోజులు ఆడింది. 1949లో కీలుగుఱ్ఱం సినిమా విడుదల జరిగితే, తమిళంలోకి 1950లో డబ్బింగ్ చేయడం జరిగింది. ఈ సినిమా తరువాత అక్కినేని నాగేశ్వరావు గారు జానపద చిత్రాలలో నటించడం తగ్గించారు. నందమూరి తారక రామారావు గారి “పాతాళభైరవి” వచ్చాక అక్కినేని నాగేశ్వరావు గారు జానపద చిత్రాలలో కొనసాగించడం తగ్గించుకున్నారు. మీర్జాపురం రాజాగారు కీలుగుఱ్ఱం సినిమా తరువాత కూడా తిలోత్తమ,  సాహసం అనే కొన్ని సినిమాలు తీశారు. మొత్తానికి ఈ చిత్రం అత్యంత ఘనవిజయం సాధించింది. ఆరోజులలో అక్కినేని నాగేశ్వరావు గారు, అంజలీదేవి గారు హిట్ ఫెయిర్ అనే పేరును తెచ్చుకోవడమే కాకుండా, ఆ తరువాత రోజులలో కూడా వారిని విజయవంతమైన జంటగా కొనసాగడానికి పునాది వేసింది కీలుగుఱ్ఱం సినిమా.

Show More
Back to top button