
మనసులో కలవరం, ఒత్తిడి, అశాంతి అనేవి అప్పుడప్పుడూ ఎవరికైనా వస్తాయి. కానీ ఇవే ఎక్కువ రోజులపాటు నిలిచిపోతే, మన నడవడికే మారిపోతే, అది సాధారణ భావోద్వేగం కాదు. అది డిప్రెషన్‌కు ముందు దశ కావచ్చు. డిప్రెషన్ అనేది మెదడులోని కెమికల్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవ్వడం వల్ల వచ్చే మానసిక సమస్య. ఇది మన ఆలోచనలు, భావోద్వేగాలు, ఆచరణలపై ప్రభావం చూపుతుంది. అయితే ఇది ఒక్కసారిగా వచ్చే రోగం కాదు. ముందే కొన్ని మార్పులుగా కనిపిస్తుంది. వాటిని గుర్తించి ముందే జాగ్రత్తలు తీసుకుంటే, పరిస్థితి మరింత బిగుసుకోకుండా కంట్రోల్ చేయవచ్చు.
తప్పనిసరిగా గుర్తించాల్సిన మార్పులు:
తప్పు చేసినట్లే అనిపించడం: ఏ విషయమైనా జరగకపోయినా తానే తప్పు చేసినట్టు ఫీల్ అవటం మొదలవుతుంది. చిన్న విషయాన్ని కూడా మెదడు పెద్దగా తీసుకోవడం మొదలవుతుంది.
ఉత్సాహం తగ్గిపోవడం: ఇంతకుముందు ఇష్టపడే పనులు ఇప్పుడు ఎందుకో చేయాలని అనిపించకపోవడం. సరదాగా గడిపే టైం కూడా బోరుగా అనిపించడం.
నిద్ర మారిపోవడం: కొంతమందికి నిద్ర బాగా తగ్గిపోతుంది. మరికొందరికి ఎక్కువ గంటలు పడుకున్నా అలసట వదలదు. ఉదయం నిద్రలేవడం కష్టంగా ఉంటుంది.
ఆహారంలో మార్పులు: ఆకలిగా లేకపోవడం లేదా ఎక్కువ తినడం. బరువు తగ్గిపోవడం లేదా బరువు పెరగడం అనేది ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపిస్తుంది.
ఆలోచనలు క్లియర్‌గా లేకపోవడం: ఏ పనిలోనైనా కాన్సన్ట్రేషన్ పెట్టకపోవడం. డిసిషన్ తీసుకోవడం కష్టం అనిపించడం.
చివరగా… ఎందుకు బతుకుతానన్న అసహనం కూడా కొన్ని సందర్భాల్లో వస్తూ ఉంటుంది. ఇది వచ్చిందంటే అలర్ట్ అయ్యే టైం.
ఇప్పుడు ఏం చేయాలి?
ఇలాంటివి రెండువారాల కంటే ఎక్కువ రోజులు ఉంటే, ముందు మనకు నమ్మకమైనవాళ్లతో మాట్లాడాలి. ఆ తర్వాత మానసిక ఆరోగ్య నిపుణుడి దగ్గరకి వెళ్లాలి. మెడికల్ ట్రీట్‌మెంట్‌తో డిప్రెషన్ పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు. ముందుగా లక్షణాలను గుర్తించడమే మొదటి విజయం.










