Telugu News

తమిళనాడు ముఖ్యమంత్రి జానకి రామచంద్రన్ ప్రభుత్వం కుప్పకూలిన వైనం..

జానకి రామచంద్రన్ తమిళనాడు రాష్ట్ర మొదటి మహిళా ముఖ్యమంత్రి మాత్రమే కాదు, భారత గణతంత్ర చరిత్రలో ముఖ్యమంత్రి అయిన మొదటి నటి కూడా. ఆమె కేరళలోని కొట్టాయం జిల్లాలో ఉన్న వైకోమ్ పట్టణంలో నారాయణి అమ్మ, రాజగోపాల్ అయ్యర్ దంపతులకు జన్మించారు. ఆమె మొదట్లో వైకోం నారాయణి జానకి (వి.ఎన్. జానకి), కానీ ఆమె ఎం.జి.ఆర్ గా ప్రసిద్ది చెందిన మరుతూర్ గోపాలన్ రామచంద్రన్ (1977 నుంచి 1987 మధ్యకాలంలో పదేళ్లపాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు) ను వివాహం చేసుకున్న తరువాత, ఆమెను జానకి రామచంద్రన్ గా పిలవబడ్డారు.

ముఖ్యమంత్రి కాకముందే ఆమె ఒక భారతీయ నటి. ఆమె తొలినాళ్లలో “మన్మథ విజయం” (1939), సావిత్రి (1941) లాంటి చిత్రాలలో నటించారు. 1948 వ సంవత్సరంలో వచ్చిన చంద్రలేఖ ఆమెకు విపరీతమైన ప్రజాదరణ తెచ్చిపెట్టింది. యం.జి.ఆర్ (ఎం.జి. రామచంద్రన్) తో కలిసి జానకి “రాజ ముక్తి” (1948) మరియు “మోహిని” (1948) వంటి చిత్రాలలో నటించారు. అలాగే “వేలైకారి” (1949) మరియు “మరుధనట్టు ఇళవరసి” (1950) వంటి చిత్రాలతో నటనను కొనసాగించిన ఆమె తన ఇష్టానుసారం 1953 వ సంవత్సరం నాటికి సినిమా నటనను ఆపాలని నిర్ణయించుకున్నారు.

1962 వ సంవత్సరంలో యం.జి.రామచంద్రన్ రెండవ భార్య సదానంతవతి మరణించిన తరువాత, వైకోం నారాయణి జానకి (వి.ఎన్. జానకి) ని 1962 వ సంవత్సరంలో చట్టబద్ధంగా వివాహం చేసుకున్నారు. ఆయన అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం వ్యవస్థాపించి 1977 నుండి 1987లో తాను మరణించే వరకు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన రాజకీయ జీవితంలో భార్య జానకి ఎప్పుడూ చురుగ్గా లేరు. అక్టోబర్ 1984 లో యం.జి.రామచంద్రన్ కు అదుపులేని మధుమేహం కారణంగా మూత్రపిండాల వైఫల్యం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఆ తరువాత కొంత కాలానికి తేలికపాటి గుండెపోటు కూడా వచ్చింది.

చికిత్స కోసం ఆయనను అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని డౌన్‌స్టేట్ మెడికల్ సెంటర్‌కు తరలించి, కిడ్నీ మార్పిడి చేయించారు. ఈ అనారోగ్య స్థితి అర్థమైపోయిన రామచంద్రన్ తన తరువాత పార్టీని నడిపించే రాజకీయ నాయకులను సిద్ధం చేయాలనుకున్నారు. ఆ వరుసలో నటి జె.జయలలిత కూడా ఉన్నారు. 1984లో రామచంద్రన్ కు పక్షవాతం వచ్చినప్పుడు, అతనికి మరియు పార్టీకి మధ్యవర్తిగా జయలలిత ఉన్నారు. 1987 లో యం.జి.రామచంద్రన్ మరణం కారణంగా పార్టీ సభ్యులు ఆయన స్థానంలోకి భార్య జానకిని తీసుకోవాలని కోరారు.

జానకి రామచంద్రన్ తన భర్త గౌరవార్థం వి.పి.రామన్ సలై లోని తన ఆస్తిని ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏ.ఐ.ఏ.డి.ఎం.కె) కి బహుమతిగా ఇచ్చారు. తరువాత ఇది 1986లో ఆ పార్టీకి ప్రధాన కార్యాలయంగా మారింది. చెన్నైలో అనేక ఉచిత విద్యా సంస్థలను నిర్వహించే ది సత్య ఎడ్యుకేషనల్ & ఛారిటబుల్ సొసైటీకి జానకి రామచంద్రన్ వ్యవస్థాపక చైర్‌పర్సన్ గా ఉన్నారు. తమిళనాడులో విద్యా మరియు ధార్మిక సంస్థల స్థాపన కోసం ఆమె అనేక మిలియన్ డాలర్ల విలువైన తన ఆస్తిని విరాళంగా ఇచ్చారు. అదేవిధంగా జానకి రామచంద్రన్ ఎడ్యుకేషనల్ & ఛారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించడంలో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు.

అయితే ఇంతటి దాతృహృదయం గల జానకిని భర్త రామచంద్రన్ మరణం తరువాత ముఖ్యమంత్రిని చేయాలని అనుకున్నారు. ఏ.ఐ.ఏ.డి.ఎం.కె పార్టీని రెండు వర్గాలుగా చీల్చి వి.ఆర్.నెడుంచెజియన్ ను ముఖ్యమంత్రిని చేయాలని జయలలిత, జానకిని ముఖ్యమంత్రిని చేయాలని వీరప్పన్ ప్రయత్నిస్తున్నారు. 03 జనవరి 1988 నాడు జానకిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీచేసి, మూడు వారాలలో బలనిరూపణ చేయాలని కోరారు. 07 జనవరి 1988 నాడు తమిళనాడు తొలి మహిళా ముఖ్యమంత్రిగా జానకి రామచంద్రన్ చేత గవర్నర్ సుందర్ లాల్ ఖురానా ప్రమాణస్వీకారం చేయించారు.

రాజీవ్ గాంధీ మద్దతు జానకి కే…

07 జనవరి 1988 నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జానకి రామచంద్రన్ బలనిరూపణ కోసం మూడు వారాల గడువు ఇచ్చారు గవర్నర్ సుందర్ లాల్ ఖురానా. ఒకవైపు వి.ఆర్.నెడుంచెజియన్ ను ముఖ్యమంత్రిని చేయాలని జయలలిత వర్గం, మరోవైపు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జానకి రామచంద్రన్ బలనిరూపణ కోసం వీరప్పన్ తో కలిసి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ (ఐ) మద్దత్తు జానకి రామచంద్రన్ వైపునే ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ వారే కేలకం. తమిళనాడు రాజకీయాలను శాశిస్తూ, అక్కడ ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలనేది రాజీవ్ గాంధీ చేతులలో ఉంది. ఎం.జీ.ఆర్ తో రాజీవ్ గాంధీకి ఉన్న అనుబంధం దృష్ట్యా, యల్.టి.టి.ఇ విషయంలో రాజీవ్ గాంధీకి ఎం.జీ.ఆర్ ఇచ్చిన మద్దత్తు దృష్ట్యా యం.జి.ఆర్ మీద ప్రేమతో జానకి వర్గాన్ని బరపరచాలని, ఆమెనే ముఖ్యమంత్రిని చేయాలని రాజీవ్ గాంధీ గట్టిగా నిర్ణయం తీసుకున్నారు.

జానకి ఓడిపోయి, డీ.ఎం.కే అధికారంలోకి వస్తే కేంద్రంలో కాంగ్రెస్ (ఐ) కి కావలసిన బలం ఉండదు. అందుకే తమిళనాడులో జానకి రామచంద్రన్ ను ముఖ్యమంత్రిగా నిలబెట్టాలి అని కాంగ్రెస్ తీర్మాణించి, కేంద్ర హోం మంత్రి “బూటా సింగ్” ను 27 జనవరి 1988 తేదీ మధ్యాహ్నం మద్రాసుకు వెళ్లి తమ కాంగ్రెస్ సభ్యులంతా జానకి రామచంద్రన్ కు మద్దత్తుగా ఓటు వేయించాల్సిందిగా చూడాలని రాజీవ్ గాంధీ పంపించారు. కాంగ్రెస్ శాసనసభ్యులను కొంతమందిని డబ్బు ఇచ్చి తమవైపుకు లాక్కొనడానికి యోచిస్తున్నట్లు వార్తలందుకున్నారు రాజీవ్ గాంధీ. దాంతో మద్రాసు వెళ్ళకుండా వెనక్కి రావాల్సిందిగా బూటా సింగ్ ను రాజీవ్ గాంధీ ఆజ్ఞాపించడంతో ఆయన వెనక్కి వచ్చారు. జానకి వర్గాన్ని బలపరచాలని మనం చూస్తుంటే, జానకి మరియు వీరప్పన్ బృందం, మన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారట, దానిపై విచారణ చేసి మీరు నిర్ధారించండి అని రాజీవ్ గాంధీ, కేంద్ర హోం మంత్రి బూటా సింగ్ ను కోరారు. దాంతో జానకి రామచంద్రన్ తో మాట్లాడిన బూటా సింగ్ అది నిజమని తేల్చారు.

జానకి కి వ్యతిరేకంగా ఓటు వేయాలన్న కాంగ్రెస్…

తాను విన్నది నిజమే అని నిర్ధారణకు వచ్చిన రాజీవ్ గాంధీ బల నిరూపణలో జానకి రామచంద్రన్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆదేశాలు జారీచేసి, ఇట్టి విషయంపై కేంద్ర పరిశ్రమల సహాయ మంత్రి “అరుణాచలం” ను మద్రాసుకు పంపించారు. అరుణాచలం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుండి మద్రాసుకు జనవరి 27 అర్ధరాత్రి చేరుకున్నారు. మరోవైపు పాండిచ్చేరి ముఖ్యమంత్రి అయిన ఫరూక్ కూడా అదే సమయానికి మద్రాసుకు చేరుకున్నారు. 28 జనవరి 1988, జానకి రామచంద్రన్ రాజకీయ భవిష్యత్తు తేలిపోయే రోజు అది. అప్పటికే కాంగ్రెస్ (ఐ) తమకు వ్యతిరేకంగా ఓటు వేయబోతుందనే వార్త వీరప్పన్ – జానకి వర్గానికి తెలిసిపోయింది. సమీకరణాలను మార్చేదెలా అని వీరప్పన్ ఆలోచనలో పడిపోయాడు.

సమయం ఉదయం 9 గంటలు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు తమ ఎమ్మెల్యేలందరినీ సమావేశపరిచి, ఎట్టి పరిస్థితులలో అంతా జానకికి వ్యతిరేకంగా ఓటు వేయాలి, ఇది మన నాయకుడు రాజీవ్ గాంధీ ఆజ్ఞ అని చెబుతున్నారు. అందరూ సంసిద్దంగానే ఉన్నా, శివాజీ గణేషన్ కు చెందిన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మాత్రం ఈ ప్రతిపాదన నచ్చలేదు. నిన్నటి వరకు జానకి అనుకూలంగా ఓటు వేయమని, ఇప్పుడు ఆమెకు వ్యతిరేకంగా ఓటు వేయమంటున్నారని వాళ్ళు విసుక్కున్నారు. వారు ఐదుగురు స్పీకర్ పాండియన్ కి ఫోన్ చేసి తమ శాసనసభ సభ్యత్వానికి వారు రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.

28 జనవరి 1988 నాడు ఉదయం 9 గంటల 40 నిమిషాలు జానకి, వీరప్పన్ ల బృందం దిగాలుగా అసెంబ్లీ ఆవరణలో అడుగుపెట్టారు. పరిస్థితి అర్థమై, జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న జయలలిత బృందంలో ఆనందం తాండవిస్తోంది. జయలలిత వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఆమె ఆదేశాలను, సలహాలను, సూచనలను తీసుకున్నారు. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ మొదలైంది. వీరప్పన్ కు మిత్రుడు అయిన స్పీకర్ పాండియన్ సభను ప్రారంభించి ఐదుగురు కాంగ్రెస్ (ఐ) ఎమ్మెల్యేలు శాసనసభకు రాజీనామా చేస్తున్నట్టు తనకు చెప్పారని, ఆ సభను 12 గంటల వరకు వాయిదా వేస్తున్నానని చెప్పి సభలో నుండి వెళ్లిపోయారు.

సహనం కోల్పోయిన శాసనసభ్యులు…

కాంగ్రెస్ (ఐ) సభ్యులు ఐదుగురు రాజీనామా చేస్తున్నట్లు ఫోన్ చేసి చెప్పగానే మీరు ఎలా నమ్ముతారు అని స్పీకర్ పాండియన్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. మాత్రాన ఎలా నమ్ముతారు రాజీనామాలు ఆమోదం పొందడానికి ఒక విధానం అంటూ చేసిన నిరసనతో డి.ఎం.కె సభ్యులు కూడా జత కలిశారు. స్పీకర్ పాండియన్, ఎ.ఐ.ఎ.డి.ఎం.కె. వీరప్పన్ కు మిత్రుడు అయినందు వలన,మద్దత్తుకు కావలసిన కొంతమంది ఎమ్మెల్యేలతో బేరాలాడడానికి వీరప్పన్ కు అనుకూలంగా సభను స్పీకర్ వాయిదా వేశారని జయలలిత వర్గానికి చెందిన సభ్యులు ఆరోపణలు చేశారు. వీరప్పన్ కూడా ఆ రెండు గంటల్లో మద్దతుకు కావలసిన ఎమ్మెల్యేలను కూడగట్టుకోవడం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. మన పురట్చి తలైవర్ స్థాపించిన పార్టీని రక్షించుకోవాలి కనుక దయచేసి మీరంతా మా వర్గంలోకి రావాలి అంటూ జానకికి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు జయలలిత వర్గం.

మధ్యాహ్నం 12 గంటలు అయ్యింది. రెండవసారి శాసనసభ ప్రారంభమైంది. ఈసారి కూడా స్పీకర్ పాండియన్ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టకుండా వి.ఆర్.నెడుంచెజియన్ తో పాటు మరికొంత మంది జయలలిత వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను శాసనసభకు అనర్హులుగా ప్రకటించారు. స్పీకర్ పాండియన్ సభను మూడు గంటలకు వాయిదా వేస్తూ అని మళ్ళీ బయటకు వెళ్ళిపోయారు. జయలలిత వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా డి.ఎం.కె వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సహనం కోల్పోయారు. వారంతా కలిసి ఐక్యంగా కాంగ్రెస్ కు చెందిన శివరామన్ ను స్పీకర్ గా ఎన్నుకుంటున్నామంటూ ప్రకటించారు. స్పీకర్ పాండియన్ లేని సమయంలో, స్పీకర్ కుర్చీలో శివరామన్ కూర్చొని వీరప్పన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. 

జానకిని ముఖ్యమంత్రిగా ప్రకటించిన పాండియన్..

సాయంకాలం 3 గంటల సమయంలో స్పీకర్ పాండియన్ లోపలికి వచ్చి తన కుర్చీలో కూర్చున్న శివరామన్ ను పక్కకు పడదోసి, తన కుర్చీలో తాను కూర్చున్నారు. నీవు పాత స్పీకర్, నేను కొత్త స్పీకర్ గా ఎన్నికయ్యాను అని పాండియన్ ను కుర్చీలోంచి లేపబోయారు శివరామన్. కానీ పాండియన్ కదల్లేదు. శివరామన్ వెళ్లి పాండియన్ ఒళ్ళో కూర్చున్నారు. ఇక్కడ ఈ తతంగం జరుగుతూ ఉంటే, సభలో ఇరుపక్షాల మధ్య అంతర్యుద్ధం మొదలైంది. పేపర్లు, మైక్రోఫోన్లు, చేతికి దొరికిన ఆయుధాలను ఒకరికొకరు విసురుకున్నారు. ఆ క్రమంలో స్పీకర్ పాండియన్ కు దెబ్బలు తలిగాయి. కొంతమంది రౌడీలు బయట నుంచి సభలోకి దూసుకొచ్చారు. ఎవరిని ఎవరు కొడుతున్నారో, ఎందుకు కొడుతున్నారో, ఎవరికి దెబ్బలు తలుగుతున్నాయో అర్థం కాని పరిస్థితి. అరుపులు, కేకలు, అంతా గందరగోళం. టోపీలు ధరించిన పోలీసులు సభలోకి ప్రవేశించి దొరికిన వారిని దొరికినట్టు చితక్కొట్టి బయటకు లాక్కెళ్లారు. సభలో మిగిలి ఉన్న వారితో కాకిలెక్కలు వేసి బలనిరూపణ చేయించారు స్పీకర్ పాండియన్. 99 – 8 ఓట్ల మెజారిటీతో బలంతో జానకి నెగ్గారు. అప్పుడు జానకి రామచంద్రన్ ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తూ స్పీకర్ పాండియన్ ఆదేశాలు జారీచేశారు.

తమిళనాడులో రాష్ట్రపతి పాలన…

జానకిని ముఖ్యమంత్రిగా ప్రకటించిన మరునాడు “తమిళనాడు అసెంబ్లీలో లాఠీచార్జి, 99 – 8 తేడాతో జానకి మంత్రివర్గం గెలుపు” అని పత్రికలలో వార్తలు వచ్చాయి. దేశమంతటా పత్రికలు తమిళనాడు అసెంబ్లీలో జరిగిన అవాంఛనీయ సంఘటనను ముక్తకంఠంతో ఖండించాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఒక రాష్ట్ర అసెంబ్లీలో దొమ్మీ జరగడం ఇదే మొదటిసారి అని దుమ్మెత్తిపోశాయి. విశ్వాస పరీక్షలో నెగ్గామనుకుంటున్న జానకి – వీరప్పన్ వర్గం యొక్క ఆనందం ఒక్కరోజే నిలిచింది.

ఆ మర్నాడు 30 జనవరి 1988 ఆంధ్ర పత్రికలో వచ్చిన వార్త ఈ విధంగా ఉంది “తమిళనాడులో రాష్ట్రపతి పాలన, అంతులేని ప్రజాభిమానంతో తమిళ సింహాసనాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిన ఎం.జీ.ఆర్ మరణం, దరిమిలా రాష్ట్రంలో హస్తగతం చేసుకోవడానికి జరిగిన కుమ్ములాటలు, అక్కడక్కడ పాలన యంత్రాంగని స్తంభింపజేశాయి. అంతేగాక సామాన్య మానవుడు కూడా చీదరించుకునే రీతిలో సాగిన రాజకీయ కీచులాటలకు, రాష్ట్రపతి పాలనతో తెరపడింది. ఇక తమిళనాడు రాజకీయ భవిష్యత్తు రానున్న ఎన్నికల్లో ప్రజల తీర్పుపై ఆధారపడి ఉంటుంది. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించిన సందర్భంగా, వీలైనంత త్వరగా ఎన్నికలు జరగాలన్నది తన అభిమతం” అని రాజీవ్ గాంధీ ఉద్ఘాటించారు.

ముఖ్యమంత్రిగా జానకి 23 రోజులు మాత్రమే…

తమిళనాడు రాష్ట్ర విధానసభను రద్దుచేసి మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కార్యదర్శిని కుమారి జయలలిత కోరారు. ఇది ఆ రోజు శాసనసభలో జరిగిన సంఘటన. కేవలం 23 రోజులు మాత్రమే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జానకి రామచంద్రన్ రికార్డు సృష్టించినట్లు అయ్యింది. మొట్టమొదటిసారి ఒక మహిళ తమిళనాడు ముఖ్యమంత్రి కావడం, అది కూడా ఒక సినిమా నటి తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఒక రికార్డు అయితే, అతి తక్కువ కాలం 23 రోజులు మాత్రమే ఆ పదవిలో ఉండటం, అది కూడా జానకి రామచంద్రన్ సొంతం చేసుకున్న రికార్డు అయ్యిందనే చెప్పవచ్చు. ఎం.జీ.ఆర్ ఎంతో పటిష్టంగా 15 సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చిన ఏఐఏడీఎంకే పార్టీ, పది సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చిన ప్రభుత్వం, కేవలం ఒక్క నెలలోనే కుప్పకూలిపోయింది. తన పార్టీలో ఎలాంటి కుమ్ములాటలు ఉండకూడదు అని ఎంజీఆర్ భావించారో, అవి కూడా కేవలం ఆ నెల రోజుల్లోనే సంభవించడం గమనార్హం.

Show More
Back to top button