
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న ప్రపంచమంతా అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం జరుపుకుంటారు. భూమిపై జీవరాశికి ఒక రక్షణ కవచంలా ఉండే ఓజోన్ పొరకు ఏర్పడిన రంధ్రం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
1985 మే నెలలో బ్రిటీష్ అంటార్కిటిక్ సర్వే ఒక పరిశోధన పత్రాన్ని ప్రచురించింది. దీని తర్వాత అంటార్కిటికాపై ఉన్న ఓజోన్ పొర సన్నబడటాన్ని ఓజోన్ రంధ్రంగా గుర్తించారు. ఈ పదాన్ని మొదటిసారి నోబెల్ బహుమతి పొందిన షేర్‌వుడ్ రోలాండ్ ఉపయోగించారు.
2050 నాటికి ఓజోన్ పొరను 1980 నాటి స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా, పర్యావరణ మార్పులు, ఓజోన్ పొర క్షీణతపై ప్రజల్లో అవగాహన పెంచడానికి, అలాగే మాంట్రియల్ ప్రొటోకాల్‌ను బాగా అమలు చేయడానికి శాస్త్రవేత్తలు, పరిశ్రమల యజమానులు, ప్రభుత్వ అధికారులు ఈ రోజున సమావేశాలు నిర్వహిస్తారు. ఈ దినోత్సవం ఓజోన్ పొర ఎంత ముఖ్యమో మనకు గుర్తుచేస్తుంది. భవిష్యత్ తరాల కోసం దానిని కాపాడాల్సిన బాధ్యతను కూడా తెలియజేస్తుంది.
ఓజోన్ పొర అంటే ఏమిటి?
ఓజోన్ అనేది మూడు ఆక్సిజన్ అణువుల కలయికతో ఏర్పడిన ఒక గాలి. ఇది మన వాతావరణంలో చాలా చిన్న భాగమే అయినప్పటికీ, దాని ప్రాముఖ్యత చాలా ఎక్కువ. భూమి ఉపరితలం నుంచి సుమారు 10 నుంచి 40 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న వాతావరణ పొరను స్ట్రాటో ఆవరణం అంటారు. మొత్తం ఓజోన్‌లో దాదాపు 90 శాతం ఇక్కడే ఉంటుంది.
ఈ ఓజోన్ పొర సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిపైకి రాకుండా ఒక వడపోతలా పనిచేస్తుంది. ఈ రక్షణ వలయం లేకపోతే భూమిపై జీవరాశి బతకడం అసాధ్యం. అందుకే స్ట్రాటో ఆవరణంలోని ఈ ఓజోన్‌ను “మంచి” ఓజోన్‌గా భావిస్తారు.
ఓజోన్ పొర ఎందుకు సన్నబడుతోంది?
ఓజోన్ పొర క్షీణత అనేది వాతావరణంలోని క్లోరిన్, బ్రోమిన్ అణువుల కారణంగా ఓజోన్ అణువులు నాశనం కావడం. ఈ అణువులు ఓజోన్‌తో చర్య జరిపి, దాని అణువులను విచ్ఛిన్నం చేస్తాయి. దీంతో ఓజోన్ పొర సన్నబడుతుంది. ఒక్క క్లోరిన్ అణువు లక్ష ఓజోన్ అణువులను నాశనం చేయగలదు. దీన్ని బట్టి సమస్య ఎంత తీవ్రమైందో మనం అర్థం చేసుకోవచ్చు.
రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, డ్రై క్లీనింగ్ ఏజెంట్లు, అగ్నిమాపక యంత్రాలు వంటి వాటిలో వాడే రసాయనాలలో క్లోరోఫ్లోరోకార్బన్స్, హాలోన్స్, కార్బన్ టెట్రాక్లోరైడ్స్ వంటివి ఉంటాయి. అధిక అతినీలలోహిత కాంతికి గురైనప్పుడు ఈ రసాయన సమ్మేళనాలు హానికరమైన క్లోరిన్, బ్రోమిన్ అణువులను విడుదల చేస్తాయి. వీటిని ఓజోన్ క్షీణతా పదార్థాలు అంటారు.
మాంట్రియల్ ప్రొటోకాల్
ఓజోన్ రంధ్రం ఉపగ్రహ చిత్రం ప్రపంచ పర్యావరణానికి ఒక పెద్ద ముప్పుగా మారింది. ఈ సమస్య తీవ్రతపై ప్రజల్లో భయాందోళనలు కలగడంతో మాంట్రియల్ ప్రొటోకాల్‌కు ప్రజల మద్దతు సులభంగా లభించింది. ఓజోన్ పొరను దెబ్బతీస్తున్న పదార్థాలను నియంత్రించడానికి ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు 1987 సెప్టెంబర్ 16న మాంట్రియల్ ప్రొటోకాల్‌పై సంతకాలు చేశాయి.
ఈ ఒప్పందం ప్రపంచమంతా ఆమోదం పొందడం ద్వారా ఇప్పటివరకు అత్యంత విజయవంతమైన పర్యావరణ ఒప్పందాలలో ఒకటిగా నిలిచింది. ఇది ఓజోన్ క్షీణతా పదార్థాలను దశలవారీగా తొలగించడానికి ప్రపంచ దేశాలను ఏకం చేసింది. దీని అమలు ఓజోన్ పొర పునరుద్ధరణకు, వాతావరణ మార్పులను తగ్గించడానికి చాలా సహాయపడింది. ఈ అంతర్జాతీయ ప్రయత్నాల కారణంగా 2065 నాటికి ఓజోన్ పొర పూర్తిగా కోలుకుంటుందని అంచనా వేస్తున్నారు.
ఓజోన్ క్షీణత వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు
సూర్యుడి నుంచి భూమిని చేరే అతినీలలోహిత కిరణాలు మనుషుల చర్మం, కళ్లు, రోగనిరోధక శక్తిపై తీవ్రమైన చెడు ప్రభావం చూపుతాయి. ఓజోన్ పొర క్షీణత వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. UV కిరణాలు చర్మ కణాలలోని డీఎన్ఏను దెబ్బతీసి క్యాన్సర్‌కు కారణమవుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునైటెడ్ స్టేట్స్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వంటి సంస్థలు ఈ విషయాన్ని ధృవీకరించాయి.
ఎక్కువ యువి కిరణాల వల్ల కళ్లకు కూడా తీవ్రమైన నష్టం జరుగుతుంది. ముఖ్యంగా కంటిలోని లెన్స్ మసకబారి, దృష్టి మందగిస్తుంది. కార్నియా పొర దెబ్బతినడం వల్ల ఫోటోకెరాటిటిస్ అనే సమస్య వస్తుంది. దీన్నే ‘సన్ బర్న్ ఆఫ్ ది ఐ’ అని కూడా అంటారు. అంతేకాకుండా ఈ కిరణాలు రోగనిరోధక శక్తిపై కూడా ప్రభావం చూపుతాయి. దీనివల్ల శరీరానికి అంటువ్యాధులు సోకే అవకాశాలు పెరుగుతాయి.
చర్మంపై ముడతలు పడటం, త్వరగా వృద్ధాప్యం రావడం, ఎర్రటి మచ్చలు, బొబ్బలు వంటివి కూడా ఈ కిరణాల వల్ల వస్తాయి. ఓజోన్ పొర క్షీణతకు, చర్మ క్యాన్సర్ రేటుకు మధ్య ఉన్న సంబంధాన్ని వివిధ దేశాల్లో జరిగిన పరిశోధనలు స్పష్టంగా చూపించాయి. అంటార్కిటికాపై ఓజోన్ రంధ్రం ఎక్కువగా ఉన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో చర్మ క్యాన్సర్ కేసులు పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి.
కొత్త సాంకేతికతలు, అందరి ప్రయత్నాలు:
ఓజోన్ పొరను కాపాడటానికి, గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడానికి ఎన్నో కొత్త సాంకేతికతలు అందుబాటులోకి వచ్చాయి. హానికరమైన హైడ్రోఫ్లోరోకార్బన్స్ బదులుగా, పర్యావరణానికి మేలు చేసే హైడ్రోఫ్లోరో-ఓలిఫిన్స్, సహజ శీతలీకరణ పదార్థాలైన కార్బన్ డయాక్సైడ్, ప్రొపేన్, ఐసోబ్యూటేన్ వంటి వాటిని ఉపయోగిస్తున్నారు. పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యాన్ని నిల్వ చేసే కార్బన్ క్యాప్చర్, స్టోరేజ్ వంటి సాంకేతికతలను కూడా అభివృద్ధి చేస్తున్నారు.
మాంట్రియల్ ప్రోటోకాల్‌ను అమలు చేయడంలో మన భారతదేశం ముందుంది. ఈ ప్రోటోకాల్ ప్రకారం నియంత్రిత పదార్థాలను తగ్గించే లక్ష్యాలను మన దేశం షెడ్యూల్ కంటే ముందే సాధించింది. ఇది ఓజోన్ పొరను రక్షించడమే కాకుండా, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి జరుగుతున్న ప్రపంచ ప్రయత్నాలకు చాలా సహాయపడుతోంది.
అందరి సమస్య – పరిష్కారం అందరిదీ
ఓజోన్ పొర సన్నబడటం అనేది ఒక ప్రపంచ సమస్య. రిఫ్రిజిరేటర్లు, ఏసీల వాడకంతోపాటు రాకెట్ ప్రయోగాలు, పారిశ్రామిక ఉద్గారాలు, వ్యవసాయ పురుగుమందుల వాడకం వంటివి ఈ సమస్యకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. దీనివల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు మన సమాజంపై తీవ్రమైన భారాన్ని మోపుతున్నాయి. ఈ సమస్యను ఎదుర్కోవడానికి మనం వ్యక్తిగతంగా, కలిసికట్టుగా కృషి చేయాలి. అలాగే, సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన కిరణాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి.










