
దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. నెలకు సుమారు రూ. 1.5 లక్షల కోట్లపైనే ఖజానాకు జమ అవుతోంది. ఈ రాబడిలో వృద్ధి ఆశాజనకంగా ఉన్నప్పటికీ, జీఎస్టీలో అధిక భాగాన్ని సమకూరుస్తున్నది పేద, మధ్యతరగతి ప్రజలేనన్న విషయాన్ని ప్రభుత్వాలు విస్మరించకూడదు. ఇటీవల కేంద్రం జీఎస్టీలో సంస్కరణలు తెచ్చినా, ప్రజలకు పూర్తి ప్రయోజనాలు అందడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 2017లో వస్తు సేవల పన్ను ప్రవేశపెట్టినప్పటి నుండి, సామాన్య ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు విషయంలో కేంద్రం మొండిచేయి చూపిందనే చెప్పాలి.
ఈ ఇంధనాలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే విషయం వివాదాస్పదంగానే నడుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నెపం వేసుకుంటూ కాలయాపన చేస్తుండగా, సామాన్య ప్రజలు ప్రతి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తరువాత నిరాశకు గురవడం పరిపాటిగా మారింది. ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్, కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు చైర్మన్ కూడా ఆదాయ వనరులపై చిక్కులను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీలో పరిధిలోకి తీసుకురావడం సాధ్యంకాదని తేల్చి చెప్పారు.
పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి రాకపోవడానికి అతిపెద్ద కారణం ప్రభుత్వాల భారీ ఆదాయమే. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్ సుంకం విధిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వాలు విలువ ఆధారిత పన్ను (వ్యాట్) రూపంలో వసూలు చేస్తున్నాయి. ఈ రెండు పన్నుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏటా సుమారు రూ. 5 లక్షల కోట్లపైగా భారీ ఆదాయం సమకూరుతోంది. గత ఐదేళ్లలో కేంద్రానికి రూ. 23 లక్షల కోట్లు, రాష్ట్రాలకు రూ. 15 లక్షల కోట్లు ఇంధనాలపై పన్నుల రూపంలోనే వచ్చాయి.
ఇంత భారీ స్థాయిలో వచ్చే రాబడిని కోల్పోయే ప్రమాదం ఉన్నందున, ఇప్పట్లో పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోనికి తీసుకురావడం సాధ్యం కాదని, ఇది అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం అని కూడా అధికారులు తేల్చి చెప్పారు. రాష్ట్రాలకు పెట్రోల్, డీజిల్పై విధించే వ్యాట్ ఆధారిత పన్ను అతి ముఖ్యమైన ఆదాయ వనరుగా ఉంది. దీంతో రాష్ట్రాలు తమకు ఆదాయ వనరుగా ఉన్న ఈ విధానాన్ని వదులుకోవడానికి అంగీకరించలేకపోతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుతున్నా మన దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం లేదు. దీనికి ప్రధాన కారణం, వినియోగదారులు చెల్లిస్తున్న మొత్తంలో పన్నులు, సుంకాల భారమే వంద శాతం కన్నా ఎక్కువగానే ఉండటం. ఉదాహరణకు, 2008 జూలైలో ముడి చమురు బ్యారెల్ ధర గరిష్టంగా $147.50 ఉన్నప్పుడు లీటర్ పెట్రోల్ ధర రూ. 54 మాత్రమే ఉంది. కానీ, అప్పటితో పోలిస్తే ముడి చమురు ధర సగానికి పైగా తగ్గినా వినియోగదారులకు మాత్రం ఊరట కలగలేదు.
దీనికి కారణం పన్నుల భారమే. ఈ ఇంధనాలను జీఎస్టీ పరిధిలోకి తెస్తే, ప్రస్తుతం ఉన్న గరిష్ట స్లాబుల ప్రకారం కూడా డీజిల్, పెట్రోల్ ధరలు కనీసం రూ. 40 వరకు తగ్గే అవకాశం ఉంది. ప్రపంచంలో అన్ని దేశాల కన్నా మన దేశంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. అనేక దేశాలు ఇంధన వనరులపై సబ్సిడీ ఇస్తుండగా, మన దేశంలో మాత్రం దొరికిన కాడికి పన్నులు పిండుతున్నారని విమర్శలు ఉన్నాయి.
పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి చేర్చకపోవడం వల్ల “ఒకే దేశం ఒకే పన్ను” అనే జీఎస్టీ లక్ష్యం పూర్తిగా నెరవేరడం లేదు. వీటిపై ఇప్పటికీ పన్నుపై పన్ను విధానం కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్పై రాష్ట్రాలు తమకు తోచిన విధంగా పన్నులు విధిస్తున్నాయి. ఈ విషయంలో రాష్ట్రాల మధ్య ఏకరూపత లేకపోవడం వల్ల సరిహద్దు జిల్లాల్లో అక్రమ రవాణాకు అవకాశం ఏర్పడింది, ఇది కొన్ని రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలను అదుపు చేయకపోతే ఈ ప్రభావం అన్ని రకాల వస్తువుల పైపడి, రవాణా చార్జీలతో పాటుగా వస్తువుల ధరలు కూడా బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి.
పెట్రో ఉత్పత్తులను ఇంకా జీఎస్టీ పరిధిలోకి చేర్చకపోవడం వల్ల వస్తు, సేవల పన్ను లక్ష్యం పూర్తిగా నెరవేరలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం అనేది ఒక సాకు మాత్రమేనని విమర్శిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహనకు వచ్చి, పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగిస్తేనే జీఎస్టీ సంస్కరణలకు సార్థకత ఏర్పడుతుంది.










