
కొందరు చికెన్ ను స్కిన్తో పాటు వండుకొని తింటారు. మరికొందరు స్కిన్ లెస్ తింటారు. చికెన్ స్కిన్లో ఎక్కువ కొవ్వు ఉంటుందని దీన్ని పక్కన పెడతారు. నిజానికి చికెన్ స్కిన్లో 32 శాతం కొవ్వు ఉంటుంది. దీనిలో మూడింట రెండొంతులు మంచి కొవ్వు, మరో వంతు చెడు కొవ్వు ఉంటుంది. మంచికొవ్వు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపర్చడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ చికెన్ ను స్కిన్ తో పాటు కలిపి తింటే దీనిలో ఉండే కొవ్వు వల్ల ఎక్కువ క్యాలరీలు అదనంగా శరీరంలోకి చేరతాయి. ఈ అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరకూడదనుకుంటే చికెన్ నుంచి స్కిను వేరుచేసి తినడం మంచిదని సూచిస్తున్నారు. ఎలాంటి వ్యాధులు లేకుండా ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు.. వండేటప్పుడు చికెన్ స్కిన్ను అలాగే ఉంచి తినేముందు తీసేస్తే మంచిది.
వండే ముందు చికెన్ కడగకూడదా?
సాధారణంగా షాప్ నుంచి తీసుకురాగానే చికెనన్ను కడుగుతుంటాం. ఆ తర్వాతే దాన్ని వండుతాం. కానీ ఇలా క్లీన్ చేయడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశం ఉందని బ్రిటన్కు చెందిన ‘ఫుడ్ స్టాండర్స్ ఏజెన్సీ’ హెచ్చరిస్తోంది. పచ్చి మాంసాన్ని ట్యాప్ కింద కడిగేటప్పుడు దానిమీద ఉండే బ్యాక్టీరియా నీటి ద్వారా తుళ్లి ఇతర వంటపాత్రలు, మనం వేసుకున్న బట్టలు, మన చేతులపైకి చేరే అవకాశం ఉంటుంది.
అలా ఆ నీరు తుళ్లిన పాత్రల్లో ఏదైనా ఆహారం తిన్నా, మాంసాన్ని కడిగిన చేతులతో ఏదైనా తిన్నా ఆ బ్యాక్టీరియా కడుపులోకి చేరుతుంది. సాధారణంగా పచ్చిమాంసంలో ఫుడ్ పాయిజనింగ్ కు కారణమయ్యే ‘క్యాంపిలోబ్యాక్టర్’ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది కడుపులోకి చేరితే డయేరియా, పొత్తికడుపులో నొప్పి, జ్వరం, వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే షాప్ నుంచి తీసుకొచ్చిన చికెన న్ను కడగకుండా తగిన ఉష్ణోగ్రత వద్ద ఉండికించి వండుకొని తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ కడగడం తప్పనిసరి అనుకుంటే నీళ్లు తుళ్లకుండా కడగాలి. తర్వాత చేతులను బాగా శుభ్రం చేసుకున్నాకే ఇతర పాత్రలను, కూరగాయలు, ఆహార పదార్థాలను తాకాలి.