Telugu News

1975 – 77 ఎమర్జెన్సీ తరువాత నాలుగవ సారి ప్రధానిగా ఇందిరాగాంధీ..

భారతదేశంలో 1975 నుండి 1977 వరకు సుమారు 21 నెలల కాలం అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించబడింది. దేశానికి అంతర్గత మరియు బాహ్య ముప్పులను పేర్కొంటూ అప్పటి భారతదేశ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ దేశమంతటా అత్యవసర పరిస్థితిని  ప్రకటించారు. దేశంలో ఉన్న “అంతర్గత గందరగోళం” కారణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 కింద అప్పటి అధ్యక్షుడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అధికారికంగా అత్యవసర పరిస్థితిని జారీ చేశారు. ఈ ఉత్తర్వు ద్వారా ప్రధానమంత్రికి డిక్రీ ద్వారా పరిపాలించే అధికారాన్ని, ఎన్నికలు రద్దు చేయడానికి మరియు పౌర స్వేచ్ఛలను నిలిపివేయడానికి వీలు కల్పించింది.

1971లో జరిగిన ఎన్నికలలో అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుండి రాజ్ నారాయణ్ పై గెలుపొందిన ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని రాజ్‌నారాయణ్ దాఖలు చేసిన పిటీషన్ ను విచారించిన అలహాబాదు ఉన్నత న్యాయస్థానం ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని, తరువాత 6 సంవత్సరాల వరకు ఇందిరాగాంధీ ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొనరాదని 1975లో తీర్పు ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం నుండి ఇందిరాగాంధీ స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. దాంతో ఆమెను విబేధించే ప్రతిపక్ష నాయకులు, ఆమె వ్యతిరేకులు అంతా కలిసి ఇందిరాగాంధీ కి వ్యతిరేకంగా ఒక పెద్ద ర్యాలీని నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సంగతిని ముందే పసిగట్టిన ఇందిరాగాంధీ దేశ భద్రత పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని ఆలోచించి, శాంతి భద్రతలు అదుపులో ఉండడం కోసం తాను ఎంతటి కఠినమైన చర్యకైనా సిద్ధమని నిరూపిస్తూ అప్పటి అధ్యక్షుడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాజ్యాంగంలోని 352 వ ఆర్టికల్ ప్రకారం 25 జూన్ 1975 నాడు దేశామంతటా అత్యయిక స్థితి (ఎమర్జెన్సీ) ని ప్రకటించారు.

అత్యయిక స్థితి (ఎమర్జెన్సీ) అనే చట్టాన్ని కఠినంగా అమలు చేశారు ఇందిరాగాంధీ. విదేశీ పత్రికలకు సంబంధించిన విలేకరులను దేశం వదిలిపెట్టి వెళ్లవలసినదిగా ఆమె ఆదేశించారు. జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్ పెద్ద పెద్ద నేతలను అరెస్టు చేసినా గృహ నిర్బంధం గావించారు, గానీ వారిని కారాగారంలో పెట్టలేదు. ఏవైతే అసాంఘిక, అరాచక శక్తులు ప్రజల శాంతి భద్రతలను భంగం చెయ్యాలని ప్రయత్నిస్తున్నాయో, అలాగే ప్రజాస్వామ్యాన్ని తమ స్వప్రయోజనాలకు వాడుకొని, ఆ ప్రజాస్వామ్యాన్నే భ్రష్టుపట్టించడానికి ప్రయత్నిస్తున్నాయో అలాంటి శక్తులను అరెస్టు చేసి కారాగారాలలో పెట్టారు. అన్ని పౌర హక్కులను రద్దు చేశారు. ఆ సమయంలో అంతర్గత భద్రతా చట్టం నిర్వహణ క్రింద 34,988 మందిని, భారత రక్షణ చట్టం మరియు భారత రక్షణ నియమాలు, 1962 క్రింద 75,818 మందిని (వేలకొలది ప్రతిపక్ష నాయకులను, విలేకరులను) చెరసాలపాలు చేశారు ఇందిరాగాంధీ. అత్యయిక స్థితిలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు సమయపాలన పాటించి సమయానికి రావడం జరిగింది. కార్యాలయాల్లో లంచగొండితనం మాయమయింది. మహిళల పట్ల అసభ్య ప్రవర్తనలు, అత్యాచారాలు జరగడం ఆగిపోయాయి. రైళ్ళు సమయానికి నడిచాయి. ప్రజలలో నేరాల పట్ల భయాందోళనలు తగ్గాయి కూడా.

1977 ఎన్నికలలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఓటమి…

అత్యవసర పరిస్థితిని (ఎమర్జెన్సీ) తరువాత ఓటర్లకు తన పాలనను నిరూపించుకోవడానికి అప్పటి భారతీయ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ ఎన్నికలకు పిలుపునిచ్చారు. భారీగా సెన్సార్ చేయబడిన పత్రికలు తనకు అనుకూలంగా వ్రాసిన వార్తలను నమ్మి తనకున్న వ్యతిరేక ప్రజాదరణను అంచనా వేయకుండా ఎన్నికల నిర్వాహణకు మొగ్గుచూపారు. జనతా కూటమి మొదటి నుండి ఇందిరా పాలనను వ్యతిరేకిస్తూ ఉంది. భారతీయ జనసంఘ్ , కాంగ్రెస్ “ఓ” (భారత జాతీయ కాంగ్రెస్ ఆర్గనైజేషన్ అనేది ఇందిరా గాంధీని బహిష్కరించిన తరువాత కాంగ్రెస్ పార్టీ చీలిపోయినప్పుడు భారతదేశంలో ఏర్పడిన ఒక రాజకీయ పార్టీ), సోషలిస్ట్ పార్టీలు మరియు చరణ్ సింగ్ భారతీయ క్రాంతి దళ్‌ అన్నీ కలిసి కూటమిలా ఏర్పడ్డాయి.

నియంతృత్వ వాదన, ప్రజాస్వామ్యం అనే అంశాలను జయ ప్రకాష్ నారాయణ్ ప్రజలలోకి బలంగా తీసుకెళ్లడంతో 1977 ఎన్నికలలో జనతా పార్టీ ఘనవిజయం సాధించింది. ఇందిరాగాంధీకి అనుభవజ్ఞులైన మద్దతుదారులు జగ్జీవన్ రామ్ , హేమవతి నందన్ బహుగుణ మరియు నందిని సత్పతి వంటి  వారు కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలు మరియు సంజయ్ గాంధీ సృష్టించిన పరిస్థితుల కారణంగా విడిపోయి “కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ” అనే కొత్త రాజకీయ సంస్థను ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఇందిరా గాంధీని గద్దె దించడానికి ఆ ముగ్గురూ బలంగా నిలబడ్డారని అప్పట్లో ప్రచారంలో ఉంది. అందువలన ఇందిరాగాంధీ పార్టీ అయిన కాంగ్రెస్ (ఐ) ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది.

నేపాల్ రాజు ఆహ్వానాన్ని తిరస్కరించిన ఇందిరాగాంధీ…

ఆ ఎన్నికలలో ఇందిరా గాంధీ మరియు సంజయ్ గాంధీలు తాము పోటీ చేసిన స్థానాలలో ఓడిపోయి, తమ సీట్లను కోల్పోయారు. 1977 ఎన్నికలలో కాంగ్రెస్ 153 సీట్లకు పరిమితమైంది (అంటే అంతకుముందు ఎన్నికలలో గెలిచిన లోక్‌సభ సీట్లు 350 లతో పోలిస్తే 197 స్థానాలు తగ్గాయి). గెలిచిన 153 స్థానాలలో 92 స్థానాలు దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి. అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ఎత్తివేయబడిన తరువాత మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో జనతా కూటమి అధికారంలోకి రావడంతో, జయప్రకాష్ నారాయణ్ మార్గదర్శకత్వంలో జనతా పార్టీలో పలు చిన్నపాటి పార్టీలన్నీ విలీనం అయ్యాయి.

1977 ఎన్నికలలో ఇందిరాగాంధీ అవమానకరమైన ఓటమి చెందిన తరువాత ఆమెకు ఒక మధ్యవర్తి ద్వారా నేపాల్ రాజు మధ్యవర్తిత్వం జరిపి ఆమెను మరియు ఆమె కుటుంబాన్ని నేపాల్‌కు తరలించడానికి ముందుకొచ్చాడు. కానీ ఆ సహాయాన్ని సున్నితంగా తిరస్కరించిన ఆమె నేపాల్ వెళ్ళడానికి నిరాకరించింది. కాకపోతే తన ఇద్దరు కుమారులు సంజయ్ గాంధీ మరియు రాజీవ్ గాంధీలను మాత్రం నేపాల్ పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పటి భారత ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటేరియట్‌లో కార్యదర్శి మరియు భారతదేశంలోని అగ్రశ్రేణి నిఘా అధికారులలో ఒకరుగా పనిచేసిన “రామేశ్వర్ నాథ్ కావో” ను సంప్రదించిన తర్వాత ఆమె భవిష్యత్తు రాజకీయ జీవితాన్ని దృష్టిలో ఉంచుకుని తన కుమారులను నేపాల్ పంపించే ప్రతిపాదనను కూడా పూర్తిగా తిరస్కరించారు.

కాంగ్రెస్ (ఐ) స్థాపించిన ఇందిరాగాంధీ…

1977 ఎన్నికలలో ఇందిరా గాంధీ సొంత నియోజకవర్గమైన రాయ్ బరేలీలో జనతా పార్టీకి చెందిన రాజ్ నారాయణ్ చేతిలో ఓడిపోయారు. మరో వైపు ప్రధానమంత్రి పదవీ స్వీకారానికి సరిపడా లోక్ సభ స్థానాలు దక్కకపోవడంతో ప్రధానమంత్రి పదవిని ఆమె కోల్పోయారు. పదవీచ్యుతురాలైన తరువాత ఇందిరాగాంధీలో అసహనం పెరిగిపోయింది. మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఎలా తీసుకురావాలా అని ఆమె రాత్రింబవళ్లు ఆలోచిస్తున్నారు. నిజానికి ఎమర్జెన్సీ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులకు నచ్చలేదు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఇందిరాగాంధీ అంటే నచ్చని ఒక వర్గం ఉంది. దాంతో ఆ పార్టీ నుండి బయటపడి 02 జనవరి 1978 నాడు ఇందిరాగాంధీ తన మద్దతుదారులు అందరితో కలిసి మాదే అసలైన కాంగ్రెస్ పార్టీ, వై.వి.చౌహాన్, బ్రహ్మానందరెడ్డి లాంటి వారందరినీ కాంగ్రెస్ నుంచి బహిష్కరిస్తున్నాము అని ప్రకటించారు. ప్రైవేట్ చౌహాన్ బృందం మాత్రం మమ్మల్ని బహిష్కరించడానికి ఆవిడెవరు?  అసలైన కాంగ్రెస్ పార్టీ మాదే, కాకపోతే ఆవిడది కాంగ్రెస్ (ఐ) అయి ఉండవచ్చు అన్నారు. ఈవిధమైన ఘర్షణలో నుండి పుట్టినదే కాంగ్రెస్ (ఐ), అంటే కాంగ్రెస్ ఇందిరా.

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లలో కాంగ్రెస్ (ఐ) ఘనవిజయం…

1977 పార్లమెంటు ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ సభ్యులలో సుమారు 60 నుండి 65 మంది ఇందిరాగాంధీ పార్టీ వైపునకు వచ్చారు. మిగిలిన 80 నుండి 85 మంది వై.వి.చౌహాన్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. విడివిడిగా ఉన్న రెండు కాంగ్రెస్ పార్టీలను మనకు అర్థం అవ్వడానికి వై.వి.చౌహాన్ బృందాన్ని పాత కాంగ్రెస్ అని, ఇందిరాగాంధీ వర్గానిది కాంగ్రెస్ ఇందిరా లేదా కాంగ్రెస్ (ఐ) అని అనుకుందాం. కేంద్ర కాంగ్రెస్ లో ఈ చీలికలు రావడమే కాదు, వివిధ రాష్ట్రాలలోని కాంగ్రెస్ వర్గాల్లో కూడా చీలికలు వచ్చాయి. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇందిరా గాంధీ కాంగ్రెస్ వర్గాలు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ (ఐ) ప్రారంభమైన నెల రోజులకు అంటే ఫిబ్రవరి 1978 లో కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఇందిరాగాంధీ కాంగ్రెస్ అత్యధిక మెజారిటీతో స్థానాలతో గెలుపొంది విజయ శంఖం పూరించింది. దాంతో ఇందిరా గాంధీ వేసిన ఎత్తుగడలకు బలం చేకూరడంతో పాటుగా, దేశమంతటా నెహ్రూ కుటుంబం యొక్క అభిమానుల సంఖ్య తగ్గలేదని, అలాగే ఉందని రుజువైపోయింది.

చిక్ మంగళూరు లో గెలిచి పార్లమెంటుకు వెళ్లిన ఇందిరా..

కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ లలో కాంగ్రెస్ (ఐ), భారీ విజయం సాధించిన తరువాత కూడా జనతా పార్టీ ఇందిరాగాంధీని వేటడం ఆపలేదు. ఆమె 1975 – 1977 మధ్య కాలంలోని 21 నెలల “భారత అత్యవసర స్థితి” (ఎమర్జెన్సీ) సమయంలో ఎన్నికలను నిలిపివేసి, పౌరహక్కులు అడ్డుకునే అధికారాన్ని ఆమె పొందినందుకు, అలాగే రాజకీయ ప్రత్యర్థులను జైలుపాలు చేసి, పత్రికలను సెన్సార్ చేసినందుకు గాను ఆమె ఆకృత్యాలపై “షా” కమిషన్ నియమించి ఇందిరాగాంధీ అరెస్టుకు సమన్లు పంపించారు. కానీ అందుకు ఇందిరాగాంధీ ససేమిరా ఒప్పుకోలేదు. నేను జైలుకు రాను పొమ్మన్నారు. 1978 మొదలు ఇందిరాగాంధీ, అలాగే అధికారంలో ఉన్న జనతా పార్టీ ఢీ అంటే ఢీ అన్నట్లు వ్యవహారిస్తున్నారు. పార్లమెంటులో అడుగు పెట్టడమే ఇందిరాగాంధీ ధ్యేయం. ఆ అవకాశం రానే వచ్చింది.

నవంబరు 1978లో కర్ణాటకలో పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి. చిక్ మంగళూరు నుండి లోక్ సభ అభ్యర్థిగా గెలిచి, పార్లమెంటుకు వెళ్లాలానేది ఇందిరాగాంధీ ప్రణాళిక. అందుకోసం చిక్ మంగళూరు లోక్ సభ నుండి కాంగ్రెస్ (ఐ) అభ్యర్థిగా బరిలోకి దిగారు. మాములుగానే ఎం.జీ.ఆర్ 1972 నుండి ఇందిరాగాంధీని సమర్థిస్తూ వస్తున్నారు. చిక్ మంగళూరు నుండి ఆమె అభ్యర్థిత్వానికి నైతికంగానూ, ఆర్థికంగాను మద్దతు ఇచ్చారు. ఇదే విషయాన్ని ఆ రోజులలోనే ఆయన పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇందిరాగాంధీని బహిరంగంగా సమర్ధించారు. చిక్ మంగళూరు నుండి ఆవిడ పోటీ చేయడంలో తప్పేముంది, అది శుభ పరిణామం అంటూ గట్టి మద్దత్తు ప్రకటించారు. ఆ ఎన్నికలలో అక్కడక్కడా చెదురుముదురు సంఘటనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ జనతా పార్టీకి చెందిన ప్రత్యర్థి వీరేంద్ర పాటిల్ ను 43 వేల ఓట్ల ఆధిక్యంతో ఓడించి పార్లమెంటులో అడుగుపెట్టారు ఇందిరాగాంధీ.

తీహార్ జైలుకు ఇందిరాగాంధీ…

ఆమె లోక్ సభలో అడుగుపెట్టిన నెల రోజులకే 19 డిసెంబర్ 1978 నాడు ఇందిరాగాంధీని పార్లమెంటు అభ్యర్థిత్వానికి అనర్హురాలిగా ప్రకటిస్తూ జనతా ప్రభుత్వం ఆమెను తీహార్ జైలుకు పంపించింది. భారత అత్యవసర స్థితి (ఎమర్జెన్సీ) సమయంలో ఇందిరాగాంధీ పార్లమెంటు హక్కులను కాలరాయడం, అలాగే ప్రత్యర్థుల హత్య కోసం కుట్ర చేయడం వంటి అభియోగాలను ఆమెపై మోపి ఇందిరా గాంధీని జైలుకు పంపించడంతో దేశమంతా అల్లర్లు చెలరేగాయి. కలకత్తా నుండి న్యూఢిల్లీ ప్రయాణిస్తున్న బోయింగ్ విమానాన్ని కొంతమంది హైజాకర్లు హైజాక్ చేసి, ఇందిరాగాంధీని జైలు నుండి విడుదల చేయమని వారు డిమాండ్ చేశారు. హైజాకర్లు అందరూ కూడా యూత్ కాంగ్రెస్ వాళ్లు అని తరువాత విచారణలో తెలిసింది. వారం రోజులు హై డ్రామా తరువాత ఇందిరా గాంధీని తీహార్ జైలు నుండి విడుదల చేశారు. కానీ ఆ తరువాత ఆమె పార్లమెంటు సభ్యురాలుగా కొనసాగలేకపోయారు.

నాలుగవ సారి ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ..

జైలు నుండి విడుదలైన తరువాత ఆమె చెయ్యవలసిన ప్రణాళికను తయారుచేశారు. జనతా పార్టీ పరిపాలనలో ధరలు ఆకాశాన్నంటాయి, నేరాలు పెరిగాయి. అదును చూసి ఇందిరాగాంధీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అందులో నెగ్గలేకపోయిన మొరార్జీ దేశాయ్ ప్రధాని పదవికి రాజీనామా చేసారు. ఆ తరువాత ఇందిరా కాంగ్రెస్ మద్దతుతో చరణ్ సింగ్ ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టారు. నెలలోపే అతను తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. కానీ ప్రధానిగా ప్రజల సమస్యల గురించి అతను ఏ మాత్రం పట్టించుకోలేదు. 23 రోజులు అతని పాలనను దగ్గరుండి గమనించిన ఇందిరాగాంధీ అతనికి తన మద్దతును ఉపసంహరించుకున్నారు. గత్యంతరం లేని పరిస్థితులలో అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి లోక్‌సభను రద్దుపరిచారు. అదే సమయంలో ప్రజలలో సుడిగాలివలె తిరుగుతూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చెస్తానని ఇందిరాగాంధీ వారికి మాట ఇచ్చారు. దాంతో ఇందిరపై ప్రజలకు మరొకసారి నమ్మకం ఏర్పడింది. ఆ లోక్‌సభ ఎన్నికలలో 529 స్థానలకు గాను ఇందిరాగాంధీ 351 స్థానాలు గెలుచుకుని, తమ సత్తాను నిరూపించుకుని జనవరి 1980 లో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Show More
Back to top button