
హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి పండుగ.. తొలి ఏకాదశి. ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రకు ఉపక్రమిస్తారని పురాణగాథలు మనకు చెబుతున్నాయి. బుధవారం అనగా ఈరోజు నుంచి చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ఏడాది మొత్తం మీద వచ్చే 24 ఏకాదశులు ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఏకాదశి అంటే 11 అని అర్థం. మనకున్న ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతరేంద్రీయం అయిన మనసు కలిసి పదకొండు. ఇవన్నీ ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి.
తెలుగుమాసాల్లో నాలుగో మాసం ఆషాఢం. పూర్ణిమనాడు పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలకు దగ్గరగా చంద్రుడు సంచరించే కాలాన్నే ఆషాఢంగా భావిస్తాం. హిందూ సంప్రదాయం ప్రకారం, ఈ మాసంలో వివాహ శుభకార్యాలేవీ తలపెట్టరు.. పుణ్యకార్యాలకు అనుకూలం కాకపోవడంతో నిషిద్ధ మాసంగా, శూన్యమాసంగా పిలుస్తారు. కానీ ఆధ్యాత్మికంగా మంచి మాసమనే అని అంటారు.
ఆషాఢ శుద్ధ షష్ఠిని స్కంద వ్రతంగా,
శుద్ధ సప్తమి, భానుసప్తమిగా భావిస్తాం.
ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశిగా చేసుకుంటాం. శ్రీమహావిష్ణువు శయనించే రోజు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు. మఠాధిపతులు, పీఠాధిపతులు, సాధువులంతా కూడా చాతుర్మాస్య దీక్ష చేపట్టి కార్తీక శుద్ధ ఏకాదశి, అంటే నాలుగు నెలలపాటు దీక్షను భక్తిగా పాటిస్తారు. ఆఖరి రోజున ఆలయాలకు వెళ్లి, దైవదర్శనం చేసుకోవడంతో ఈ దీక్ష పూర్తవుతుంది.
ఏ మంచి పనిని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం మనకున్న సహజ అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశినే ‘తొలి ఏకాదశి’గా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు. వానకాలం మొదలైందంటే చాలు.. అనారోగ్యాలు తలెత్తడం జరుగుతుంటుంది. అసలు తొలి ఏకాదశి పర్వదినం వెనుక దాగివున్న ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం…
ప్రాశస్త్యం…
తొలి ఏకాదశి.. ఈరోజునే పూర్వం సంవత్సర ప్రారంభంగా పరిగణించేవారు మన పెద్దలు. వానాకాలం మొదలయ్యే సమయం కావున అనారోగ్య సమస్యలు ఏవో ఒకటి తలెత్తుతుంటాయి. అందుకే ‘లంఖణం’ అని పిలువబడే పరమ ఔషధం… ఉపవాస దీక్షకు నాంది పలుకుతుందని అంటుంటారు.
పురాణాల ప్రకారం ఆషాఢమాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిరోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళతాడు. స్వామి నిద్రకు ఉపక్రమించే రోజు కాబట్టి ఈరోజును ‘శయన ఏకాదశి’, ‘ప్రథమ ఏకాదశి’ అని వివిధ పేర్లతో పిలుస్తారు. ఈ పండుగనాడు రోజంతా ఉపవాస దీక్షను పాటించి, జాగరణ చేసి మర్నాడు ద్వాదశి రోజు ఉదయం విష్ణుమూర్తిని పూజిస్తారు. దీంతోపాటు తీర్థప్రసాదాలను స్వీకరించి, భోజనం చేస్తే గనుక జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందిందనీ ప్రతీతి. ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలోనే పండుగలు, ముఖ్యమైన రోజులు ఎక్కువ. అంతేకాక తొలి ఏకాదశి రోజున నిద్రపోయే స్వామివారు మరలా నాలుగు నెలల తర్వాత అంటే, కార్తీక శుద్ధ ఏకాదశి రోజునే మేల్కొంటాడు. ఈ ఏకాదశిని పద్మ ఏకాదశిగా కూడా పిలుస్తారు.
విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళతాడని పెద్దలు చెప్పగానే నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని మనకు సందేహం కలగొచ్చు.
విష్ణువు అంటే సర్వవ్యాప్తి అని అర్థం. అంటే ‘విష్ణువు’ అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట. ఇప్పటివరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణదిక్కుకు వాలుతాడు. అంటే ఈ రోజు మొదలు పెట్టి దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు. దానినే మనకు అర్ధమయ్యే రీతిలో నిద్రపోవడంగా అభివర్ణించారు.
తిథి ఎలా వచ్చిందంటే…
ఏకాదశి తిథి పేరు ఎలా వచ్చిందంటే, కృతయుగంలో మురాసురుడని పిలువబడే ఓ రాక్షసుడు.. బ్రహ్మ ఇచ్చిన వరంతో దేవతలను, రుషులను హింసించాడు. ఆ రాక్షసుడితో శ్రీ మహావిష్ణువు దాదాపు వెయ్యేళ్లు పోరాడి, అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా… ఆ సమయంలో శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి, ఆ రాక్షసుణ్ని అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను సైతం వరం కోరుకోమని అడగ్గా, తాను విష్ణుప్రియగా భూలోకంలో పూజలు అందుకోవాలని కోరుకుందట. అప్పటి నుంచి ‘ఏకాదశి’ తిథిగా వ్యవహారంలోకి వచ్చిందని పండితులు చెబుతారు.
ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకంటే.. ఏకాదశి అంటే ‘పదకొండు’. అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనసు కలిపితే మొత్తం పదకొండు. వీటిని మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి వాటన్నిటినీ ఒకటిగా చేసి, అప్పుడు దేవునికి నివేదన చేయాలి. దీనివల్ల మనిషికి సహజంగా అలవడే బద్దకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఉవాచ.
చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగునెలలపాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను సైతం వదిలేస్తారు. ఆహారం విషయంలోనూ కొన్ని నియమాలు పాటిస్తారు.
ఈ నెలలోనే ప్రకృతిలో, పర్యావరణంలో కొన్ని మార్పులు వస్తాయి. తద్వారా శరీరానికి జడత్వం వచ్చి అనేక రోగాలు చుట్టుముడతాయి. ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై శరీరం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది. భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు అనేవి అనాదిగా ఏర్పడ్డాయట.
ఈరోజున ఏం చేయాలి..
ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున, సూర్యోదయానికి ముందే లేచి, ఇల్లంతా శుద్ధి చేసుకుని శ్రీహరిని నియమ నిష్ఠలతో పూజించాలి. విష్ణుమూర్తి పటాన్ని శుభ్రం చేసి, పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరించాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి.
ఈ పండుగకు పేల పిండిని తినే ఆచారం ఉంది. పేలాల్లో బెల్లం, యాలకులను చేర్చి దంచి ప్రత్యేకంగా ఈ పిండిని తయారుచేస్తారు. ఆరోగ్యానికి కూడా ఈ పిండి చాలా మంచిది. ఈ కాలంలో బయటి ఉష్ణోగ్రతలకు తగ్గట్టుగా శరీరం తరచుగా మార్పు చెందుతుంది. గ్రీష్మ రుతువు ముగిసి వర్షరుతువు ప్రారంభమయ్యే సమయం కాబట్టి, శరీరానికి ఈ పిండి వేడి కలిగించి, వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుందిట.
ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు మాంసాహారం, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములతో చేసినవి అలాగే వండిన ఆహార పదార్థాలను తినకూడదు. అలాగే మంచంపై కూడా పడుకోకూడదు. ఈరోజున ఉపవాసం ఉండి, రాత్రంతా జాగరణ చేసే క్రమంలో రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం, విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి.. మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి.. తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించాలి.
మోక్షం…
ఈ ఏకాదశి విశిష్టతను పద్మ పురాణంలోనూ, త్రిమూర్తులలో ఒకరైన శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్య్మం గురించి అనేక కథలు కూడా మన పురాణాలలో చోటు చేసుకున్నాయి.
మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్తు శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందడమే కాదు, మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటారని పద్మ పురాణంలో చెప్పడమైంది.
పండుగ ఆంతర్యం…
ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాకలాగే తొలి ఏకాదశిని వేడుకగా చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఎలాంటి తెగుళ్లు సోకకూడదని, ఏ ఆంటకాలు ఎదురవకూడదని ఈరోజున ఆ స్వామివారిని వేడుకుంటారు. తొలి ఏకాదశినాడు మొక్కజొన్న పేలాలను పొడి చేసి, అందులో బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ఆ తరువాత ప్రసాదంగా తీసుకుంటారు. ఈరోజున రైతులు పూజ పూర్తిచేసి పొలానికి వెళ్లి పని చేసుకుంటారు. ఈరోజు తప్పనిసరిగా పని చేయాలనే నమ్మకం ఉంది. కొత్త కూలీలను మాట్లాడటం, కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడం మంచిదని నమ్మి, అలా చేస్తారు, నేటికీ అదే కొనసాగుతోంది కూడా.