HEALTH & LIFESTYLE

క్యాన్సర్‌కు కీమోథెరపీ

దీర్ఘకాలిక వ్యాధుల్లో క్యాన్సర్ చాలా భయంకరమైనది. ఒక్కసారి క్యాన్సర్ సోకితే శరీరంలో కణుతులను ఏర్పరిచి నెమ్మదిగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ క్యాన్సర్‌కు ఖచ్చితమైన చికిత్స అంటూ ఏం లేదు. కొన్ని రకాల చికిత్సలు చేయించడం వల్ల తాత్కాలికంగా నయమవుతుంది. కానీ, పూర్తిగా క్యాన్సర్‌ను తగ్గించే శక్తి ప్రస్తుతం ఏ చికిత్సకు లేదు. ఇప్పుడిప్పుడే వాటి కోసం పరిశోధనలు జరుగుతున్నాయి. క్యాన్సర్‌కు చికిత్స చేయించుకున్న తర్వాత మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువే. క్యాన్సర్ దశల వారీగా వస్తుంది. శరీరంలో క్యాన్సర్ కణాలు వేగంగా పెరగకుండా వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి ‘కీమోథెరపీ’ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం క్యాన్సర్ నుంచి బయటపడడానికి కీమోథెరపీకి చాలా ప్రాధాన్యత ఉంది. కీమోథెరపీ చేయించుకోవడం వల్ల దుష్ప్రభావాలు ఉన్నా.. కొన్ని జాగ్రత్తలతో వాటిని కూడా తగ్గించుకొని క్యాన్సర్ మళ్లీ రాకుండా చేసుకోవచ్చు.

* ఏంటీ కీమోథెరపీ
క్యాన్సర్‌ను కొన్ని రకాల మందుల(ఇంజెక్షన్, టాబ్లెట్)తో నయం చేయడాన్నే ‘కీమోథెరపీ’ అంటారు. క్యాన్సర్ రకము, దాని తీవ్రతను బట్టి అనేక డ్రగ్స్, మెడిసిన్స్ ఉంటాయి. క్యాన్సర్ నాలుగో దశలోనే కీమోథెరపీ చేస్తారని అనుకుంటారు. కానీ, అది కేవలం అపోహ మాత్రమే. రెండో దశ నుంచి కీమోథెరపీ చేయించడం వల్ల క్యాన్సర్ పూర్తిగా నయమయ్యే అవకాశాలు ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. నరాల ద్వారా కీమోథెరపీ చేస్తారు. ఆపరేషన్ చేసి క్యాన్సర్ కణాలను తొలగించిన తర్వాత మళ్లీ క్యాన్సర్ తిరగబెట్టకుండా చేసే మందుల వాడకాన్నే కీమోథెరపీ అంటారు. ఆపరేషన్‌లో క్యాన్సర్ కణుతులు ఎక్కడున్నాయో అవే తీసివేస్తారు. అప్పటికే ఇతర శరీర భాగాలకు సోకిన క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందడం మొదలవుతాయి. కీమోథెరపీలో శరీరంలో ఇతర అవయవాలకు వ్యాపించిన క్యాన్సర్ కణాలను నాశనం చేస్తారు.

కీమోథెరపీ వల్ల నష్టాలు
శరీరంలో మిగిలి ఉన్న క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి ఇచ్చే కీమోథెరపీ వల్ల సాధారణ కణాలు కూడా చనిపోతాయి. క్యాన్సర్ కణాలు మళ్లీ ఉత్పత్తి అయ్యే అవకాశం తక్కువ. కానీ, శరీర కణజాలంలో కణాలు పునరుత్పత్తి అవుతాయి. అందుకే కీమోథెరపీలో ప్రతి సెషన్‌ తర్వాత 2-3వారాల వ్యవధి ఇస్తారు. అందువల్లే క్యాన్సర్ బాధితులు కీమోథెరపీ చేయించుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. కీమోథెరపీ వల్ల వచ్చే దుష్ర్పభావాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..


శరీరంలో రక్తం తగ్గుతుంది.
ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడే తెల్ల రక్తకణాల సంఖ్య తగ్గుతుంది. దీంతో డాక్టర్ యాంటీబయోటిక్స్ సూచిస్తారు. కీమోథెరపీ తీసుకున్న వారికి అధిక జ్వరం, దగ్గు, చెమటలు పట్టడం వంటివి కనబడితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఎర్ర రక్త కణాలు కూడా తగ్గుతాయి. దీంతో బాధితులు రక్తహీనతతో బాధపడితే రక్తమార్పిడి అవసరం ఉంటుంది. ముక్కు నుంచి రక్తస్రావం కావొచ్చు. రక్త కణాల సంఖ్య తగ్గడం అంటే శరీరంలో రక్తం గడ్డకట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, కీమోథెరపీ చేయించుకున్న వారిని డాక్టర్ పరిశీలనలో ఉంచాలి.


* వాంతులు అవుతాయి. ఇది సాధారణంగా ఉండే దుష్ప్రభావం. ఈ సమస్యకు వైద్యులు కొన్ని మందులు ఇస్తారు.
* నోటి అల్సర్లు, నాలుకపై పుండ్లు ఏర్పడతాయి. నోటి పరిశుభ్రతను పాటించాలి.
* జుట్టు రాలుతుంది. ఇది బాధితుల్ని మానసికంగా నిరుత్సాహపరుస్తుంది.
* మలబద్ధకం లేదా అతిసారం కలుగవచ్చు. మలబద్ధకాన్ని నివారించడానికి కీమోథెరపీ చేసుకున్నా నీరు ఎక్కువగా తాగవచ్చు.
* అలసటగా అనిపిస్తుంది.
* వంధ్యత్వ సమస్యలు వస్తాయి. కీమోథెరపీ తీసుకునే సమయంలో గర్భాన్ని నివారించడం ఉత్తమమని వైద్యులు చెబుతారు.
* కీమోథెరపీలో ఇచ్చిన ఔషధాలతో చర్మం చిరాకు, దురదకు గురవుతుంది.
* కీమోథెరపీ చేయించుకుంటున్న వారికి ఆకలి అనిపించదు. దీంతో తక్కువ తినడంతో బరువు తగ్గుతారు. ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని చిన్న మొత్తంలో తీసుకోవడం మంచిది. బరువు తగ్గుదల ఎక్కువగా ఉంటే ఆహార నిపుణులను సంప్రదించి సలహాలు తీసుకోవాలి.

Show More
Back to top button