
ఉచితాలు మరియు సంక్షేమ పథకాల మధ్య వ్యత్యాసాన్ని నిర్దిష్టంగా నిర్వచించడం అంత సులభం కాదు. కానీ, లబ్ధిదారులు మరియు సమాజంపై వాటి యొక్క దీర్ఘకాలిక ప్రభావం ఆధారంగా వాటిని వర్గీకరించవచ్చు. సంక్షేమ పథకాలు ప్రజలు మరియు సమాజంపై సానుకూల ప్రభావాన్ని కలిగిస్తే, మరోవైపు ఉచితాలు లబ్ధిదారులలో సహజంగా శ్రమించే తత్వాన్ని తగ్గించి వారిని సోమరిపోతులుగాను మరియు పరాన్నజీవులుగాను మార్చే ప్రమాదం ఉంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2022 నాటి తన నివేదికలో “ఉచితాలు” అంటే “ఉచితంగా అందించబడే ప్రజా సంక్షేమ చర్యలు” అని నిర్వచించింది.
ఉచితాలు తరచుగా స్వల్పకాలిక ఉపశమనంపై దృష్టి సారిస్తాయి. ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఓటర్లకు ఎరగా వేసే ఉచితాలు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించే బదులు ప్రజలను తప్పుదోవ పట్టించి దేశ మరియు రాష్ట్రాభివృద్ధికి శరాఘాతాలుగా మారతాయి. సంక్షేమ పథకాలు అనేవి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచి, వనరుల లభ్యతను విరివిగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రజలను ఉద్ధరించడానికి ఉద్దేశించిన సమగ్ర కార్యక్రమాలు.
ఉచితాలు మరియు సంక్షేమ పథకాల మధ్య వ్యత్యాసం:
‘ఉచితాలు’ వినియోగదారులకు ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా ఇవ్వబడే వస్తువులు మరియు సేవలు. కాగా, ‘సంక్షేమ పథకాలు’ నిర్దిష్ట ప్రమాణాల ఆధారంగా ఎంపిక చేయబడిన పౌరులకు ప్రయోజనం చేకూర్చి, వారి జీవన ప్రమాణాలను పెంచి, వనరులను పొందే అవకాశాన్ని మెరుగుపరచేందుకు ఉద్దేశించిన ప్రణాళికలు. ఉచితాలు సాధారణంగా స్వల్పకాలంలో సమాజంలోని ఒక వర్గానికి మాత్రమే ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో రూపొందించబడతాయి. అవి తరచుగా ఓటర్లను ఆకర్షించడానికి లేదా ప్రజాకర్షక వాగ్దానాలతో వారికి లంచం ఇవ్వడానికి ఒక మార్గంగా పరిగణించబడతాయి.
ఇందుకు ఉదాహరణగా ఉచిత ల్యాప్‌టాప్‌లు, టీవీలు, సైకిళ్లు, స్కూటీలు, తులం బంగారం, ఉచిత విద్యుత్, ఉచిత మంచినీరు, ఉచిత రవాణా సదుపాయం మొదలైన వాటిని పేర్కొనవచ్చు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా అధికార పీఠం దక్కించుకునేందుకు “ఆరు గ్యారంటీల” పేరుతో పథక రచన చేసి ఓటర్ల నమ్మకం చూరగొని అధికారంలోకి వచ్చింది.
లాభాలు:
ఉచితాలు ప్రజల పట్ల ప్రభుత్వం యొక్క ప్రతిస్పందన మరియు జవాబుదారీతనాన్ని ప్రదర్శిస్తాయి కనుక అవి వారిలో విశ్వాసం మరియు సంతృప్తిని పెంచి ప్రజాస్వామ్య పటిష్టతకు దోహదమవుతాయి. సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ అధ్యయనం ప్రకారం ల్యాప్‌టాప్‌లు, సైకిళ్లు మరియు నగదు బదిలీలు వంటి ఉచితాలు ఉత్తరప్రదేశ్ మరియు తమిళనాడులలో ఓటర్ల సంఖ్య, రాజకీయ అవగాహన మరియు ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తిపై సానుకూల ప్రభావాన్ని చూపాయి.
నష్టాలు:
ఉచితాలపై ఆధారపడడం వలన లబ్ధిదారులలో కష్టించేతత్త్వం లోపించి వారు శాశ్వతంగా పరాన్నజీవులుగా మారే ప్రమాదముంది. స్వయం సమృద్ధి కోసం కృషి చేయడం అటుంచి వారు భవిష్యత్తులో మరిన్ని ఉచితాలను ఆశించవచ్చు. ఉచితాలకు అలవాటు పడిన వారు సంపాదన పట్ల నిర్లిప్తత ప్రదర్శించడంతో పన్నుల రూపేణా సంక్రమించే ఆదాయం క్షీణించడంతో పాటు అధిక ఆదాయం సంపాదించే వారు సైతం ఇతరుల కోసం తాము కష్టించి పనిచేసి ప్రభుత్వాలకు ఎందుకు పన్నులు చెల్లించాలి అని నిరుత్సాహపడవచ్చు.
మరి ఏమిటి పరిష్కారం?
పన్ను చెల్లింపుదారుల సొమ్మును ఉచిత పథకాలకు మళ్లించే ముందు ఆర్థిక కోణాన్ని పరిగణనలోకి తీసుకుని వారిలో వ్యతిరేకత ప్రబలకుండా సంక్షేమం మరియు ఉచితాల మధ్య ఒక స్పష్టమైన విభజన రేఖను గీయాలి. నిర్దిష్ట లక్ష్య సాధన కోసం అందించే సబ్సిడీలు సమర్థనీయమే. రాజకీయ పార్టీలు ఉచితాల కోసం తాము అనుసరించబోయే స్పష్టమైన ఆర్థిక ప్రణాళికలను వాటిని ప్రకటించే ముందే ఓటర్లకు మరియు ఎన్నికల సంఘానికి వెల్లడించాలి.
దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ స్వీయ ప్రయోజనాలను పక్కన పెట్టి బాధ్యతతో దేశ సమగ్రాభివృద్ధి కోసం తమ సర్వ శక్తులను ఒడ్డాలి. ఇది పేదరికం, అసమానతలను తొలగించి సామాజిక పురోగతికి బాటలు వేసి దీర్ఘకాలంలో సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుంది.
“ఒక మనిషికి ఒక చేపను ఇవ్వడం ద్వారా అతనికి కేవలం ఒక రోజు ఆహారం మాత్రమే అందించగలము. కానీ, ఒక మనిషికి చేపలు పట్టడం నేర్పడం ద్వారా అతనికి జీవితాంతం ఆహారం ఇవ్వగలము” అన్నది ఇందుకు ఒక చక్కని ఉదాహరణ.