CINEMATelugu Cinema

అలనాటి చలనచిత్ర శబ్దగ్రాహక శాఖ అధిపతి.. “వల్లభజోష్యుల శివరామ్”

ఏ సినిమా నిర్మాణం లో అయినా  24 శాఖల భాగస్వామ్యం ఉంటుంది. అంటే సినిమా చిత్రీకరణలో 24 విభాగాలు ఉంటాయి. అవి వరుసగా… 1) దర్శకత్వ విభాగం 2) ఛాయాగ్రహణం (సినిమాటోగ్రఫీ) 3) స్టంట్ దర్శకత్వం 4) నృత్య దర్శకత్వం (కొరియోగ్రఫీ), 5) కళా దర్శకత్వం 6) సంగీతం 7) కూర్పు (ఎడిటింగ్) 8) తారాగణం 9) డబ్బింగ్ కళాకారులు, 10) ఫోటోగ్రఫీ (స్టిల్) 11) స్క్రిప్ట్12) కార్యనిర్వాహక నిర్మాత (ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్), 13) అలంకరణ (మేకప్) 14) వేషధారణ రూపకల్పన (కాస్ట్యూమ్ డిజైనింగ్) 15) ప్రచార రూపకల్పన (పబ్లిసిటీ డిజైనింగ్) 16) శబ్ద గ్రహణం (ఆడియోగ్రఫీ), 17) అవుట్‌డోర్ లైట్‌మెన్ 18) స్టూడియో కార్మికులు 19) ఉత్పత్తి సహాయం (ప్రొడక్షన్ అసిస్టెంట్) 20) సినిమా డ్రైవర్లు 21) జూనియర్ కళాకారుల ఏజెంట్ 22) సాంకేతిక విభాగం 23) ప్రొడక్షన్ ఉమెన్ 24) జూనియర్ కళాకారుడు.. ఇలాంటి విభాగాలలో ఒకటి శబ్దగ్రహణం లేదా శబ్దగ్రాహక విభాగం లేదా శబ్దగ్రాహక శాఖ. సినిమాలో నటీనటులు చెప్పే సంభాషణలు, పాటల్లో వచ్చే సాహిత్యం, పోరాట సన్నివేశాలలో వచ్చే వినిపించే శబ్దాలను స్పష్టంగా రికార్డు చేసే విభాగాన్ని శబ్దగ్రాహాక శాఖ అంటారు. ఆ శాఖలో అత్యంత ప్రతిభ పాఠవాలున్న శబ్దగ్రాహక దర్శకులు “వల్లభజోష్యుల శివరామ్”.

పాటల రికార్డింగ్, మాటల రికార్డింగ్, డబ్బింగ్, నేపథ్య సంగీతం ధ్వని ముద్రణ, రీరికార్డింగ్, స్పెషల్ ఎఫెక్ట్స్ వీటన్నిటిని తగు పాళ్లలో సమ్మిళితం చేసి మిక్సింగ్ చేసేయ్యడం శబ్దగ్రాహక శాఖ లోని సిబ్బంది బాధ్యత. అరవై, డెబ్భై సంవత్సరాల క్రిందట సినిమా చిత్రీకరణ సమయంలోనే ఫిలిమ్ మీదనే శబ్దాలు రికార్డింగ్ చేసే సమయంలోనూ, మాటలు, పాటలు, సంగీతం, ఇతర ధ్వనులను అక్కడికక్కడే రికార్డింగ్ చేసేవారు. అందువలన శబ్దగ్రాహక ప్రభావం సినిమా నాణ్యత మీద ఎక్కువ ప్రభావం చూపేది. అప్పటి సినిమాలలో ధ్వని నాణ్యత ఇప్పటికీ స్పష్టంగా వినిపించడానికి కారణం శబ్దగ్రాహక శాఖ నైపుణ్యం. ఆ శాఖలో నైపుణ్యత కలిగిన వారిలో ప్రముఖులు “వల్లభజోష్యుల శివరామ్”. శబ్దగ్రాహక శాఖలో సహాయకుడిగా చేరి, కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఆ శాఖలో అధిపతియై విజయ వాహినీ వారికి దశబ్దాల పాటు ఎన్నో చలనచిత్రాలకు శబ్దగ్రాహక విభాగంలో ఎన్నో సేవలందించారు “వల్లభజోష్యుల శివరామ్”.

“వల్లభజోష్యుల శివరామ్” సాంకేతిక నిపుణుడు కాకముందే ఆయన ఒక సినీ నటులు, సినీ గాయకులు కూడా. ప్రసిద్ధ తెలుగు కవి పోతన జీవితం ఇతివృత్తంగా వెలువడిన “భక్త పోతన” (1943) సినిమా మొదలుకొని గుణసుందరి కథ, గులేబకావళి కథ, రంగులరాట్నం, బంగారు పంజరం (1965) వరకు పలు చిత్రాలలో నటించారు. ఒకవైపు శబ్దగ్రాహక శాఖలో కొనసాగుతూనే మరోవైపు నటుడిగా, గాయకుడిగా తన ప్రాభవాన్ని చాటారు. గుంటూరు ఏ.సి. కళాశాలలో పనిచేస్తూ ముక్కామల, ఎన్టీఆర్, జగ్గయ్య, యం. మల్లికార్జున రావు మొదలగు వారితో నాటకాలు వేయిస్తూనే, తరువాత కాలంలో ఎన్టీఆర్ తో కలిసి సినిమాలలో నటించడమే కాకుండా, ఎన్టీఆర్ నటించిన పలు చిత్రాలకు రికార్డింగ్, రీరికార్డింగ్ అందించారు. 1982లో జాతీయస్థాయి పురస్కారాల కమిటీ ఎంపికలో సభ్యుడిగా పనిచేశారు, 1988లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది పురస్కారాల కమిటీ ఎంపిక సభ్యుడిగా కూడా శివరామ్ పనిచేశారు.

నేపథ్యం..

వల్లభజోష్యుల శివరాం 01 నవంబరు 1917 నాడు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో నరసింహారావు, సూరమ్మ దంపతులకు జన్మించారు. నాన్న నరసింహారావు అప్పట్లో అంటే వందేళ్ళ క్రిందటే సబ్ – రిజిస్ట్రార్ గా ఉద్యోగం చేస్తున్నారు. నరసింహారావు, సూరమ్మ దంపతులకు తొమ్మిది మంది సంతానం. వారిలో ఆరుగురు అబ్బాయిలు (నలుగురు అన్నయ్యలు, ఒక తమ్ముడు), ముగ్గురు అమ్మాయిలు. తల్లిదండ్రులకు వల్లభజోష్యుల శివరామ్ ఐదవ సంతానం. ఆయన అసలు పేరు శివరామకృష్ణ రావు. ఆయనకు ముగ్గురు చెల్లెల్లు. తండ్రి నరసింహారావు ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలకు బదిలీ అవుతుండడంతో శివరామ్ విద్యాభ్యాసం పిడుగురాళ్ల, సత్తెనపల్లి, ఎమ్మిగన్నూరు, తిరువూరు తదితర ప్రాంతాలలో కొనసాగింది.

నరసింహారావుకు వంశపార్యపర్యంగా కళల పట్ల ఆసక్తి అబ్బింది. తాను చేసేది ప్రభుత్వ ఉద్యోగమైనా కూడా ఆయన పాటలు పాడేవారు, వీణ వాయించేవారు. నాటక పితామహుడు హరిప్రసాదరావు (గుంటూరు వాస్తవ్యులు) వీరికి సమీప బంధువు. మహావాది వెంకటప్పయ్య, ఆలి పడగ శేషయ్య (సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు) వద్ద శివరామ్ కు కొంతకాలం శాస్త్రీయ సంగీత శిక్షణ ఇప్పించారు. 1925 లో ఎమ్మిగనూరులో తాను 4వ తరగతి చదువుతుండగా “భక్త ప్రహ్లాద” అనే నాటకంలో ప్రహ్లాదుడిగా రంగస్థలం ప్రవేశం చేశారు. ఆ తరువాత పాఠశాల వారోత్సవాలలో “భక్త కబీరు”, “భీముడు” లాంటి పాత్రలలో నటించేవారు.

ఉద్యోగాన్వేషణలో మద్రాసు కు…

శివరామ్ చిన్నతనంలో నేర్చుకున్న శాస్త్రీయ సంగీత శిక్షణ తరువాత రోజులలో తనకు రంగస్థల నటనకు ఉపయోగపడింది. తాను విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే వయోలిన్, సితారు, వీణ కూడా నేర్చుకున్నారు. ఆయన చిన్నతనంలో నేర్చుకున్న సంగీతం తరువాత రోజులలో సినిమాలలో రికార్డిస్ట్ గా పనిచేస్తున్నప్పుడు ఉపయోగపడింది. ఒకవైపు చదువుకుంటూనే, మరోవైపు క్రమం తప్పకుండా నాటకాలు వేస్తూ, పాటలు పాడుతూ ఉండేవారు. ఆ క్రమంలో తాను బి.ఏ, బి.యస్సి అనే రెండు డిగ్రీలు పూర్తి చేశారు. శివరామ్ ఎప్పుడూ కూడా సినీరంగ ప్రవేశం కోసం వెంపర్లాడలేదు, కానీ తన వంతు ప్రయత్నం చేశారు. గంభీరమైన ముఖవర్చస్సు, నిండైన విగ్రహం, పాటలు బాగా పాడుతుండడంతో డిగ్రీ అయిపోయిన తరువాత సినిమాలలో చేరమని మిత్రులు ప్రోత్సహించారు.

అదేక్రమంలో బందరులో వాహినీ వారు నిర్వహిస్తున్న “వందేమాతరం” సినిమా విజయోత్సవానికి శివరామ్ కూడా హాజరయ్యారు. ఆ సినిమాకు దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పనిచేసిన కమలాకర కామేశ్వరరావును కలుసుకున్నారు. కమలాకర కామేశ్వరరావుతో అంతకుముందే శివరామ్ కు పరిచయం ఉంది. ఆయన శివరామ్ ను వందేమాతరం సినిమా దర్శకులు బి.ఎన్.రెడ్డికి పరిచయం చేశారు. శివరాంతో కాసేపు మాట్లాడిన బి.యన్.రెడ్డి ఆయనను ఫోటోలు పంపాల్సిందిగా కోరారు. అయితే తరువాత రోజులలో శివరాం ఫోటోలు పంపించినా బదులుగా బి.యన్.రెడ్డి నుంచి ప్రత్యుత్తరం రాలేదు. దాంతో శివరాం ఉద్యోగాన్వేషణలో 1932 వ సంవత్సరంలో తన 22 సంవత్సరాల వయస్సులో మద్రాసుకు చేరుకున్నారు.

సినీరంగ ప్రవేశం…

సుమంగళి (1940) చిత్రానికి సాంకేతిక విభాగంలో పనిచేస్తున్న కే.వి.రెడ్డిని కలిసి ఆ విభాగంలో ఏదైనా పని దొరుకుతుందా అని వాకబు చేశారు. దానికి స్పందించిన కె.వి.రెడ్డి సాంకేతిక ఉద్యోగాలు స్టూడియోలో ఉంటాయి, మాది సినిమా యూనిట్ కనుక ఇక్కడ ఉద్యోగాలు వుండవు, వెళ్లి స్టూడియోలో ఉద్యోగం వెతకమని సలహా ఇచ్చారు. అయితే కమలాకర కామేశ్వరరావుతో మాట్లాడుతున్న శివరామ్ ను గమనించిన కె.వి.రెడ్డి, భక్తపోతన (1943) సినిమాలో మల్లన్న పాత్రకు నటుడిగా ఎంపిక చేశారు. ప్రసిద్ధ తెలుగు కవి పోతన జీవితం ఇతివృత్తంగా వెలువడిన ఈ సినిమాలో చిత్తూరు వి. నాగయ్య కథానాయకుడిగా నటించగా, పోతన కుమారుడు మల్లన్నగా వల్లభజోస్యుల శివరాం నటించారు. పొలంలో దుక్కి దున్నుతున్న మల్లన్న పాడే “బాల రసాల సాల నవపల్లవ కోమల” అనే పద్యం ఒకటి ఉంటుంది. ఆ పద్యాన్ని శివరామ్ స్వయంగా ఆలపించారు.

భక్తపోతన  సినిమాకు శబ్ద గ్రాహకులు, కళాదర్శకులుగా ఉన్న ఎ.కె.శేఖర్ అంత సంక్లిష్టమైన సందర్భంలో శివరామ్ నటించిన ఆ సన్నివేశాన్ని అంత స్పష్టంగా రికార్డు చేశారు. అలాంటి ప్రతిభ ఉన్న ఎ.కె.శేఖర్ ను గమనించిన శివరామ్ ఆసక్తి శబ్దగ్రాహక శాఖకు మళ్ళింది. కానీ ఆ శాఖలో ఆయన చేరడానికి సుమారు ఏడు సంవత్సరాలు పట్టింది. భక్తపోతన సినిమా చిత్రీకరణ 1941 – 42 ప్రాంతంలోనే  పూర్తయినప్పటికీ, రెండో ప్రపంచ యుద్ధం వలన సినిమా విడుదల వాయిదా పడి ఎట్టకేలకు 07 జనవరి 1943 నాడు విడుదలై అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమాలో పోతనగా చిత్తూరు నాగయ్య, శ్రీనాథునిగా జంధ్యాల గౌరీనాథశాస్త్రి నటించగా, ఈ రెండు పాత్రల తరువాత అత్యంత ప్రాధాన్యత ఉన్న పాత్ర సర్వజ్ఞ సింగభూపాల రాజు పాత్రను ధరించిన డాక్టర్ వి.ఆర్.శర్మ అనే నటులు వల్లభజోస్యుల శివరామ్ కు స్వయంగా అన్న. ఈ సినిమా విజయం శివరామ్ మరియు అన్నయ్యకు డాక్టర్ వి.ఆర్.శర్మ లకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

“మాయా మచ్ఛీంద్ర” (1945) లో యువరాజు గా…

భక్తపోతన (1943) సినిమాలో సర్వజ్ఞ సింగభూపాల రాజుగా నటించిన డాక్టర్ వి.ఆర్.శర్మ తిరిగి గుంటూరుకు వెళ్ళిపోయి వైద్య వృత్తిని కొనసాగించి మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా రెండో ప్రపంచ యుద్ధం కారణంగా సినిమా చిత్రీకరణ ఆగిపోయి వల్లభజోష్యుల శివరామ్ కూడా గుంటూరు వెళ్ళిపోయారు. ఆ తరువాత ఫేమస్ సినీ & స్టార్ కంబైన్స్ పతాకంపై పోలుదాసు పుల్లయ్య దర్శకుడిగా “మాయా మచ్ఛీంద్ర” (1945) సినిమాను తెరకెక్కించారు. ఆయనకు దర్శకత్వ శాఖలో సహాయకుడిగా ఉన్న ముక్కామల కృష్ణమూర్తికి అనుకోకుండా ఈ చిత్రంలో “కోరక్ నాథ్” అనే ప్రధాన పాత్ర దక్కింది. ఆ సినిమాలో యువరాజు పాత్ర శివరామ్ కు దక్కగా, ఆయనకు జోడీగా మాలతి నటించారు. 

వీరిద్దరికీ ఈ సినిమాలో “ఆహా ! ప్రకృతి అనందమేగా మిల మిల కులుకే ఆ సెలయేరు” అనే ఒక యుగళగీతం, “గిరిజా ప్రియ శంభో భవ తరణా శిత భరణా” ఒక ప్రార్ధన గీతం కూడా ఉన్నాయి. ఈ రెండు పాటలను శివరామ్, మాలతీ కలిసి పాడారు. ఈ సినిమా చిత్రీకరణ 1944 లోనే పూర్తయినప్పటికీ, ఇది చాలా ఆలస్యంగా 1946 జనవరిలో విడుదలైంది. ఈ సినిమా పూర్తవగానే బొంబాయిలోనే ఉన్న తన సోదరి ఇంటికి వెళ్ళారు శివరామ్. అనుకోకుండా బొంబాయిలో ఉన్న ఎల్వీప్రసాద్ ను కలిశారు. అయితే శివరామ్ కు హిందీ భాష రాకపోవడం వలన ఆయనకు అవకాశాలు కష్టమని ఎల్వీప్రసాద్ తేల్చి చెప్పారు. అందువలన చేసేది లేక 1945 వ సంవత్సరంలో తిరిగి గుంటూరుకు వచ్చి ఏ.సీ.కళాశాలలో భౌతికశాస్త్రం విభాగంలో బోధకుడు, సహాయకుడిగా ఉద్యోగంలో చేరారు.

“నవజ్యోతి నాటక సమితి” స్థాపించి…

వల్లభజోష్యుల శివరామ్ తో పాటుగా “మాయా మచ్ఛీంద్ర” (1945) లో “కోరక్ నాథ్” పాత్రలో అభినయించిన ముక్కామల కూడా తిరిగి వెనక్కి వచ్చి గుంటూరులో ఉద్యోగం చేస్తున్న శివరామ్ తో కలిసి “నవజ్యోతి నాటక సమితి” అనే పేరుతో నాటక సంస్థను ప్రారంభించారు. ఆ నాటక సంస్థ తరుపున “కొండవీటి యుద్ధం”, “భక్తకబీరు” లాంటి తెలుగు నాటకాలు, శాక్రిఫైజ్ లాంటి ఆంగ్లనాటకాలు కూడా ప్రదర్శించేవారు. వారు ప్రదర్శించిన నాటకాలలో కొన్నిటికి శివరామ్ సంగీత దర్శకత్వం కూడా వహించేవారు. శివరామ్ గుంటూరులోని ఏ.సి.కళాశాలలో పని చేసే రోజులలో ఆ కళాశాలకు చెందిన విద్యార్థులు జగ్గయ్య, ఎన్టీ రామారావు, యం. మల్లికార్జున రావు (తరువాత రోజులలో గూఢచారి 116 దర్శకులు) మొదలగువారు శివరామ్ ప్రదర్శించే నాటకాలలో వేషాలు వేస్తూ ఉండేవారు. ఆ విధంగా ఒకవైపు గుంటూరు ఏ.సి కళాశాలలో ఉద్యోగం చేస్తూనే, మరోవైపు ఖాళీ సమయంలో రంగస్థలం నాటకాలు ప్రదర్శిస్తూ వచ్చారు. ఇలా మూడేళ్లు గడిచిన తరువాత భక్తపోతన సినిమాలో నటించిన శివరామమ్ ను ఆ చిత్ర దర్శకులు కే.వీ.రెడ్డి పిలిపించి వాహినీ స్టూడియోని ప్రారంభిస్తున్న విషయం చెప్పి అందులో ఆడియో రికార్డిస్ట్ గా చేరమని సలహా ఇచ్చారు. దాంతో 1947 వ సంవత్సరంలో ఏ.సి.కళాశాలలో ఉద్యోగం మానేసిన శివరామ్ మద్రాసు చేరుకుని జనవరి 1948 వ సంవత్సరంలో మద్రాసులో నిర్మించిన వాహినీ స్టూడియోలో ఉద్యోగంలో చేరిపోయారు.

సంభాషణలు రికార్డు చేసిన తొలి చిత్రం “లైలా మజ్ను” (1949)..

వాహినీ స్టూడియో ప్రారంభమైన కొత్తలో ఎన్.కృష్ణ అనే శబ్దగ్రాహక శాఖాధిపతి వద్ద వల్లభజోష్యుల శివరామ్ “శబ్ద సహాయకుడు” (సౌండ్ అసిస్టెంట్) గా తన సినిమా జీవితంలోని రెండో దశను ప్రారంభించారు. అప్పటినుండి దాదాపు మూడు దశాబ్దాల వరకు అంటే 1984 వరకు శబ్దగ్రహణమే అతనికి నిత్యకృత్యమైంది. శబ్దగ్రాహక యంత్రాలే ఆయనకు ప్రియనేస్తాలు అయ్యాయి. 1948 వ సంవత్సరంలో ప్రారంభమైన వల్లభజోష్యుల శివరామ్ సాంకేతిక సినీజీవితంలో తరువాత సంవత్సరానికి రికార్డిస్టు అయ్యారు. తరువాత ఏడు సంవత్సరాలకు 1955 లో అసిస్టెంట్ రికార్డింగ్ ఇంజనీరు అయ్యారు. 1962 లో శబ్దగ్రాహక ఇంజినీరు, ఆ తరువాత శబ్దగ్రాహక విభాగానికి అధిపతి అంటే శబ్దగ్రహణ అధ్యక్ష శాఖ అధిపతిగా అంచలంచెలుగా ఎదిగి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శివరామ్.

అయితే ఆయన సహాయకులుగా ఉండగానే మొదటగా సంభాషణలు రికార్డు చేసిన తొలి చిత్రం “లైలా మజ్ను” (1949). భరణి పిక్చర్స్ పతాకంపై పి.రామకృష్ణ తను స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం అది. అప్పటికి భరణి స్టూడియో ఇంకా ప్రారంభం అవ్వలేదు. లైలామజ్ను షూటింగ్ కొంత భాగం వాహినీ స్టూడియోలోనూ, మరి కొంతభాగం స్టార్ కంబైన్స్ స్టూడియోలోనూ జరిగింది. లైలా మజ్ను సినిమాకి శబ్దగ్రాహక దర్శకులు వి. శ్రీనివాసన్ అయినా కూడా, వాహినీ స్టూడియోలో రికార్డు చేసినప్పుడు శివరామ్ కు సంభాషణలను రికార్డు చేసే బాధ్యతను అప్పగించారు. ఆవిధంగా సాంకేతికంగా వల్లభజోష్యుల శివరామ్ పేరు వెండితెరపి కనిపించిన తొలి చిత్రం  “లైలా మజ్ను”. ఈ సినిమాలో అమీర్ సర్వర్ గా ప్రధాన పాత్ర పోషించిన ముక్కామల కృష్ణమూర్తి మంచి పేరు తెచ్చుకున్నారు. గుంటూరులో కలిసి నాటకాలు వేసిన వల్లభజోష్యుల శివరామ్, ముక్కామల కృష్ణమూర్తి లకు “లైలా మజ్ను” సినిమావారిని చిత్రరంగంలో నిలదొక్కుకుకోవడానికి మంచి పేరును తీసుకొచ్చింది.

విజయా వారి అన్ని చిత్రాలకు రికార్డిస్టుగా…

శబ్దగ్రాహక శాఖలో చేరిన వల్లభజోష్యుల శివరామ్ మొదటగా పాటలు రికార్డు చేసిన చిత్రం ప్రతిభా పిక్చర్స్ వారి “శ్రీ లక్ష్మమ్మ కథ”. ఘంటసాల బలరామయ్య నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, కస్తూరి శివరావు, జి. వరలక్ష్మి మొదలగు వారు నటించారు. శివరామ్ సాంకేతిక సినీ జీవితాన్ని ప్రారంభించిన రెండు సంవత్సరాలలోనే “పాటల రికార్డింగ్ మరియు మాటల రికార్డింగ్” రెండు విభాగాల్లోనూ  తన ప్రతిభను నిరూపించుకున్నారు.  విజయా వారి “పాతాళభైరవి” (1951) చిత్రం నుండి పెళ్లిచేసి చూడు (1952), చంద్రహారం (1953),  మొదలగు విజయా వారి చిత్రాలన్నిటికీ శివరాం రికార్డిస్టుగా వున్నారు. పాతాళభైరవి చిత్రానికి తన గురువు ఏ.కృష్ణన్ తో కలిసి రీరికార్డింగ్ లో పాల్గొన్నారు.

తొలి సంవత్సరాల్లోనే మాయా రంభ (1950), స్వప్న సుందరి (1950) లాంటి సినిమాలకు కూడా శివరామ్ రీరికార్డిస్టు గా పని చేశారు. చంద్రహారం (1953) లాంటి సినిమాలో రీరికార్డింగ్ లో కూడా తన ప్రతిభను నిరూపించుకున్నారు. విజయా వారి మిస్సమ్మ (1955), మాయాబజార్ (1957) లాంటి ప్రతిష్టాత్మకమైన చిత్రాల రీరికార్డింగ్ లలో కూడా కీలకమైన పాత్ర పోషించారు శివరామ్. సన్నివేశాలను దర్శకుడు వివరించక ముందే, సినిమా అంతా పూర్తయ్యి, దర్శకుడు తన దగ్గరకు వచ్చేదాకా వేచి చూడకుండా ముందుగానే సినిమా స్క్రిప్టు చదివి పాత్ర స్వభావం, సన్నివేశాలు అర్థం చేసుకొని రికార్డింగ్ కి, రీరికార్డింగ్ కి ముందుగానే ఆయన సిద్ధంగా ఉండేవారు. స్క్రిప్టు మీద పూర్తిగా అవగాహన ఉంటేనే రికార్డింగ్ కి, రీరికార్డింగ్ కి పూర్తి న్యాయం చేకూర్చగలమని నమ్మి ఆచరించేవారు శివరామ్. ఆవిధంగా తెలుగు సినిమా స్వర్ణయుగంలో ప్రారంభించి 1970 – 1980 లలో యాక్షన్ చిత్రాల యుగం వరకు తన ప్రస్థానాన్ని కొనసాగించారు.

అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుని…

శివరాం గారు శబ్దగ్రాహక శాఖలో వల్లభజోస్యుల శివరామ్ రికార్డింగ్ చేసిన పాటలు వేల సంఖ్యలో ఉంటే, సినిమాలు మాత్రం వందల సంఖ్యలో ఉండేవి. ఆయన శబ్దగ్రాహక శాఖలో పని చేసిన దినాలలో కేవలం స్టూడియోలకే పరిమితం కాకుండా, తాను ఎంచుకున్న రంగాలలో జాతీయం గానూ,  అంతర్జాతీయం గానూ కూడా పురస్కారాలు అందుకున్నారు, ఆ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రష్యా దేశం లోని మాస్కోలో 1976 లో జరిగిన అంతర్జాతీయ సదస్సుకు హాజరయ్యే అరుదైన అవకాశం వల్లభజోష్యుల శివరామ్ కు దక్కింది. వాహినీ స్టూడియోలో పనిచేసిన చివరి రోజులలో ఎంజీఆర్ ఫిలిం ఇన్స్టిట్యూట్, పూర్ణ ఫిలిం ఇన్స్టిట్యూట్ లాంటి విద్యాసంస్థలకు గౌరవ అధ్యాపకులుగా వెళుతుండేవారు శివరామ్. అదేవిధంగా 1981 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి “తొలికోడి కూసింది” చిత్రానికి గానూ ఉత్తమ శబ్దగ్రాహకుడిగా పురస్కారాన్ని అందుకున్నారు. వల్లభజోష్యుల శివరామ్.

నటుడిగా రెండవసారి సినీరంగ ప్రవేశం…

వల్లభజోష్యుల శివరామ్ ఒకవైపు శబ్దగ్రాహక శాఖలో పనిచేస్తూనే, మరోవైపు నటనను కొనసాగించారు. ఆయన నటించిన సినిమాలు సంఖ్యాపరంగా తక్కువే, కానీ ఆయా సినిమాల్లో ఆయన ధరించిన పాత్రలు చాలా కీలకమైనవి. ఆయన రెండవసారి సినీరంగ ప్రవేశం చేశాక 1948 వ సంవత్సరంలో నటించిన తొలి చిత్రం, వరుసలో ఆయన నటించిన మూడవ చిత్రం “గుణసుందరి కథ” (1949). కదిరి వెంకటరెడ్డి (కె.వి.రెడ్డి) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 14 డిసెంబరు 1948 నాడు విడుదలైంది. ఇందులో దైవాధీనం పాత్రలో నటించిన కస్తూరి శివరావు శాప విమోచనం తరువాత కనిపించే రాజకుమారుని పాత్రలో వల్లభజోష్యుల శివరామ్ నటించారు. అందులో “ఓ ఓహొ చారుశీల లేజవరాలా సొగసు భళా” అనే గేయాన్ని ఆలపించారు. 

ఆ పాట ఎత్తుపల్లాలుగా సాగుతుంది. స్థాయిలో కూడా క్రిందికి, పైకి వెళుతుంది. ఆ పాట పాడడం శివరామ్ కు చాలా కష్టమైంది. అప్పటి శబ్దగ్రాహక శాఖాధిపతి ఏ.కృష్ణన్ ఆ పాటను రికార్డింగ్ చేశారు.   అప్పటికి ఆయన దగ్గర శివరామ్ సహాయకులుగా పనిచేస్తున్నారు. ఆ సినిమా తరువాత శివరామ్ నటించిన చిత్రం, వాహినీ స్టూడియోలో నిర్మితమైన విజయా వారి తొలిచిత్రం “షావుకారు” (1950). ఇందులో శివరామ్ నిడివి ఎక్కువ ఉన్న పాత్రను పోషించారు. నందమూరి తారకరామారావుతో కలిసి శివరామ్ నటించిన దృశ్యాలు షావుకారులో చాలా ఉన్నాయి. శివరామ్ అంతకుముందు గుంటూరు ఏ.సీ.కళాశాలలో బోధకులుగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ విద్యార్థి. ఆ తరువాత రెండేళ్లలో ఇద్దరు కలిసి సినిమాలలో నటించాల్సి వచ్చింది. అదేవిధంగా “షావుకారు” సినిమాలో శివరామ్ ధరించిన పాత్ర పేరు నారాయణ, ఆయన తండ్రిగా నటించిన వారు శ్రీవత్సవ. ఆ చిత్రంలో ఎన్టీఆర్ జైలుపాలు అయిన సందర్భంలో శివరామ్ నటన, ఎన్టీఆర్ తో సరితూగే విధంగా ఉంటుంది.

నటుడిగా చివరి చిత్రం “బంగారు పంజరం” (1965)..

షావుకారు (1950) చిత్రం తరువాత వల్లభజోష్యుల శివరామ్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం “దీక్ష” (1951). దీనిని కోవెలమూడి సూర్యప్రకాశరావు ప్రకాష్ ప్రొడక్షన్స్ పతాకంపై దర్శకత్వం వహించి నిర్మించారు. యశోద గా జి.వరలక్ష్మి నటిస్తే, ఆమె భర్త బాలయ్య గా శివరామ్ నటించగా ఆయన తమ్ముడు గోపీ గా రామగోపాల్ నటించారు. తమ్ముడు చేసే అల్లరి పనులు సహించలేని అన్నగా శివరామ్ నటన అందరినీ ఆకట్టుకుంది. భానుమతి, రామకృష్ణారావులు భరణీ పిక్చర్స్ పతాకం క్రింద నిర్మించిన చిత్రం విప్రనారాయణ (1954). ఆ సినిమాలో ఆయన చోళ రాజేంద్ర మహారాజు పాత్రలో నటించారు వల్లభజోష్యుల శివరామ్. చెప్పుకోవడానికి శివరామ్ నటించిన పాత్రలు చిన్నవే అయినా, అవి చాలా కీలకమైనవి అని చెప్పడానికి ఉదాహరణ విప్రనారాయణ చిత్రంలోని చోళ రాజు పాత్ర. 

అలాగే ఎన్టీఆర్ ప్రధాన పాత్రలుగా వచ్చిన చిత్రాలు సీతారామ కళ్యాణం (1961), లవకుశ (1963) సినిమాలలో చిన్న పాత్రలతో అలరించారు. లవకుశ (1963) చిత్రంలో ఋష్యశృంగుడుగా నటించారు. లవకుశ సినిమా 75 వారాల పాటు ప్రదర్శింపబడి కోటి రూపాయలకు పైగా వసూలు చేసి వాణిజ్యపరంగా పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సినిమా పాటలను రికార్డింగ్ చేసినది, ఈ చిత్రానికి రీరికార్డింగ్ చేసింది కూడా శివరామ్ కావడం విశేషం. ఎన్టీఆర్ కథానాయకుడిగా వచ్చిన చిత్రాలు “గులేబకావళి కథ” (1962), “మంచి చెడు” (1963) లలో కూడా శివరామ్ నటించారు. బి.యన్.రెడ్డి దర్శకత్వం వహించిన చివరి చిత్రాలు “బంగారు పంజరం” ( 1965), “రంగులరాట్నం” (1966)  సినిమాలలో నటించడమే కాకుండా, ఆ రెండు చిత్రాలకు శబ్దగ్రహణం కూడా శివరామ్ చేయడం విశేషం. కాగా ఆయన నటుడిగా కనిపించిన చిట్టచివరి చిత్రం “బంగారు పంజరం” (1965). ఈవిధంగా ఆయన తన సినీ జీవితాన్ని 1984 వరకు కొనసాగించారు.

నిష్క్రమణం…

వల్లభజోష్యుల శివరామ్ 1951 వ సంవత్సరంలో గుంటూరు జిల్లా చేబ్రోలు మండలానికి చెందిన మంచాల గ్రామ వాస్తవ్యురాలు అయిన జ్ఞానాంబతో వివాహం అయ్యింది. వల్లభజోష్యుల శివరామ్, జ్ఞానాంబ దంపతులకు ఒక కుమార్తె జన్మించారు. ఆమె పేరు ఇందిరా రమాదేవి. ఆమె భర్త డాక్టర్ స్వామినాథన్. ఈ దంపతులకు (ఇందిరా రమాదేవి, స్వామినాథన్) ఒక పాప సంతానం. ఆమె పేరు తార. వీరంతా అమెరికాలోనే స్థిరపడ్డారు. ఇందిరా రమాదేవి 1958 లో బాలనటిగా “శోభ” అనే చిత్రంలో చిన్నప్పటి అంజలీదేవిగా వెండితెరపై కనిపించారు. శివరామ్ దంపతులకు చెన్నయ్ లోని కోడంబాకంలో పెద్ద ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో మనుషులకంటే ఎక్కువగా కుక్కలు, పిల్లులు, పక్షులు ఉండేవి. వీధుల్లో గాయపడ్డ కుక్కలు తెచ్చి శివరామ్ కట్టుకట్టి మందులు ఇప్పించి, పాలు పోసి పెంచేవారు.

కుక్కల్ని, పిల్లుల్ని ఒకచోట చేర్చి సహజీవనం సాగింపజేశారు. ఆయన సతీమణి జ్ఞానాంబ 1983 లో కాలం చేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత శివరామ్ ను నియమించిన ఎస్.ఐ.ఈ.టి పదవి ముగిసిన తరువాత తరచూ అమెరికాకు వెళుతూ ఉండేవారు. ఆరు నెలల పాటు అమెరికాలో కూతురు వద్ద ఉండే శివరామ్, మరో ఆరు నెలలు హైదరాబాదులోనే ఉండేవారు. 2002 వ సంవత్సరంలో అమెరికాలో కూతురు వద్ద ఉండగానే ఆయనకు లింఫోమా అనే వ్యాధి ఉన్నదని నిర్ధారణ అయ్యింది. అక్కడ ఆయనకు చేసిన వైద్యంతో కోలుకున్నట్లు అనిపించినా, చివరికి పరిస్థితి విషమించి తన 85 సంవత్సరాల వయస్సులో 10 ఫిబ్రవరి 2003   తేదీన అమెరికాలోనే కన్నుమూశారు. అయితే ఆయన మరణించిన తేదీ ప్రకారం భారతదేశంలో ఆరోజు 11 ఫిబ్రవరి 2003. ఆయన అభిమాన గాయకులు ఘంటసాల మరణించడం కూడా అదే తేదీ కావడం విశేషం.

Show More
Back to top button